డాక్టర్ విజయభారతి అమ్మకి ముందుగా నా తరపున, తెలంగాణ జన సమితి తరఫున నివాళులు అర్పిస్తున్నా. తారకంగారితో, విజయభారతిగారితో, ఆ ఇంటితో ఉన్న చాలా అనుబంధాలు ఈ సందర్భంగా గుర్తొస్తా ఉన్నాయ్. విజయభారతి అమ్మకి హైదరాబాదులో ఉద్యోగం రావడంతో తారకంగారు కూడా నిజామాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్టయిన్రు.
నిజామాబాద్ వెళితే పుంఖానుపుంఖాలుగా చెప్తారు అప్పట్లో తారకంగారు చేసిన కార్యక్రమాల గురించి. అటు దళిత ఉద్యమంలోను, ఇటు వామపక్ష ఉద్యమంలోను తాను భాగస్వామిగా అక్కడ ప్రజాస్వామిక స్ఫూర్తిని నింపడానికి తారకంగారు చేసిన కృషి రికార్డు కాలేదు. చాలా గొప్పది అది. భాస్కర్ గారని ఉంటారు ఆయన్ని అడిగితే చెప్తారు. ‘ఇద్దరం అప్పట్లో సైకిళ్ల మీద తిరిగినం సార్. ఎడ్లబండ్లపై తిరిగినం. ఒక్కోసారి కాలి నడకన గంటల తరబడి నడిచినం. ఊళ్లకు చేరుకున్నాం. అణగారిన వర్గాలకు స్ఫూర్తిగా నిలిచినం’ అని. ఇన్ని కార్యక్రమాల వెనుక నిలిచిందీ, స్ఫుర్తినిచ్చిందీ విజయభారతి అమ్మగారే. వారితో మాకు అనుబంధం పౌరహక్కుల సంఘంలోకి వచ్చిన్నప్పటి నుంచే. పౌరహక్కుల సంఘంలో ఆయన ఉపాధ్యక్షులుగా ఉండేది. దళిత మహాసభ వచ్చే వరకు కూడా పౌరహక్కుల సంఘంలో ఆయన ఉపాధ్యక్షులుగానే వ్యవహరించారు. ఆ క్రమంలోనే దాదాపు పదిహేను సంవత్సరాలు అనుకుంటా నిరంతరం వారి ఇంటికి మేము వెళ్తూ ఉండేది. మేము కూర్చున్నప్పుడు విజయభారతి అమ్మ కూడా వచ్చేది. వారూ మాట్లాడేది. చాలా విషయాలు ‘ఇది రాయవలసి ఉంది. ఇది ఇంకా చేస్తే బాగుండు’ అని తన అభిప్రాయాలు స్పష్టంగా వ్యక్తంచేస్తూ ఉండేది. తను చాలా అంశాల మీద రాసేది. పుస్తకాలు రాసేది. చర్చలు చేసేది. సమావేశాలకు వచ్చి కూర్చున్నా, ఆ ఉద్యమాల్లోకి రాలేకపోయినా వాటికి కావాల్సిన భావజాలాన్ని తయారుచేసే పనిలో క్రియాశీలకంగా వ్యవహరించేది. చిరునవ్వుతో, అందరికి ఛాయ్ పోసి చాలా విషయాలు చర్చ చేసేది. దళిత ఉద్యమం రావడంతో నిజంగా తారకంగారి ఆగ్రహం అనేది కట్టలు తెంచుకుని బయటకు ప్రవహించింది. ఆ సమావేశాల్లో ఆయనతో పాటుగా ఆగ్రహాన్ని సమానంగా పంచుకున్నది విజయభారతి అమ్మగారే. ఈ మొత్తం సందర్భంలో వచ్ఛినటువంటి విలువలను వ్యక్తీకరించడానికి చేసిన ప్రయత్నం చాలా గొప్పది.
నేనెప్పుడూ వివరంగా విజయభారతి ఆమ్మతో మాట్లాడలేదు. కానీ అన్ని కార్యక్రమాల్లో వారక్కడ ఉండేవారు. చెప్పేవారు. తన అభిప్రాయాలు వ్యక్తంచేసేవారు. అనుబంధం ఆ రకంగా ఏర్పడిపోయింది. ఇవాళిటికి తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఒక ప్రజాస్వామిక విలువలు నిలబడి ఉన్నాయంటే దాని వెనకాల ఈ దంపతుల పాత్ర లేకుండా అది సాధ్యమయ్యేది కాదని మనం చెప్పగలం. తారకంగారు రాసిన కరపత్రాలన్నీ భారతదేశంలోనే నినాదాలైపోయాయి. అంతటి ఒక అద్భుతమైన స్ఫూర్తి అది. ఇవాళ గుర్తుచేసుకుంటే చాలా పెద్ద గ్యాప్ ఏర్పడిపోయిందని మనకు అర్ధమవుతా ఉంది. ఎవరు ఈ గ్యాప్‌ని పూరించగలరు? ఇవాళ ఇక్కడ కూర్చుంటే మనకు అర్ధమవుతున్నటు వంటి వాస్తవమిది. తప్పని సరిగా విజయభారతి అమ్మ జీవిత చరిత్రను తీసుకురావాలి. అదే విధంగా వారి స్ఫూర్తిని నిలబెట్టడానికి, ఆయా రంగాల్లో వారు చేసిన కృషిని విశదీకరించడానికి మనందరం కూడా పూనుకోవాల్సి ఉంది. ఆ విలువలను నిలబెట్టాలి. చాలా సందర్భాల్లో తారకంగారితో ఫ్యాక్ట్ ఫైండిరగ్ కమిటీస్‌గా వెళ్ళినప్పుడు లోతైనటువంటి విషయాలను అలవోకగా చెప్పేవారు. వెనకాల ఈ విషయాలన్నిటిపై చర్చ చేసినటువంటి విజయభారతి అమ్మ కనబడుతూనే ఉండేవారు.
విజయభారతి అమ్మ లేకుండా తారకంగారిని ఊహించజాలం. అలాగే విజయభారతి అమ్మ ప్రతి అడుగులోను తారకంగారు కనిపిస్తారు. నా దృష్టిలో విడదీయడానికి వీల్లేనటువంటి అనుబంధం వారి మధ్య కనబడతా ఉంటది. ఆ పోరాటంలో వారు ఒకే ఆలోచనతో, ఒకే స్ఫూర్తితో ఎవరి పాత్ర వాళ్లు నిర్వహిస్తూ కదిలినటువంటి స్థితి అది. అశోక్ నగర్‌లో వారున్నప్పుడు కాటంరాజుగారితో పాటు మేమందరం అక్కడే తరచూ కలుసుకునేది కూడా. ఒక జ్ఞానజ్యోతి ఆరిపోయింది. భావజాల రంగంలో తనదంటూ ఒక శైలిలో ఒక పోరాటాన్ని కలాన్ని కత్తిగా రaుళిపించి నడిపించినటువంటి వీరనారి మనకు లేకపోవడం అనేదే పెద్ద లోటు. ఆ స్ఫూర్తిని స్వీకరిద్దాం. దాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్న. జోహార్ విజయభారతి అమ్మ!