ఆధునిక సావిత్రిబాయి ఫూలే మన విజయభారతిగారు! – డా.గోగు శ్యామల

పచ్చదనంపై జరుగుతున్న వేట కనపడినంత స్పష్టంగా దానిని కాపాడే తపన కనపడదుగా! ప్రపంచంలో అణు యుద్ధాలు, వైరస్‌ దాడులు కనబడుతున్నంత స్పష్టంగా కుల వైరస్‌ చేసే విథ్వంసం కనపడదేమో! అది కనబడాలన్నా, దానిని చూడాలన్నా కళ్ళు మాత్రమే ఉంటె సరిపోదు. వాటికి తమని తాము వంచించుకోలేని కాస్త నిజాయితి, కాస్త సున్నితత్వం ఉండాల్సిందే.

కాలం మారుడే కాదు కథలూ మారుతున్నయి. శరీరంలో భాగమైన చెవుల్లో సీసం పోయబడిన కథలు ఒకప్పటివి. మొత్తం మెదడు, మనసు ఘనీభవింప చేసిన కథలు ఆధునికంలో కోకొల్లలు. ‘‘పడవెల్లిపాయేర జాలరన్నో… హై లేస్సో…! హైలెస్సా’’ అని పాడుకుంటున్న పాటలు మెదడు ఎండిపాయరా వెంకన్న అని పాడుకోవాలేమో? కనపడని యుద్ధాలను, మెదడుకు పడిన సంకెళ్లను గుర్తించి చెప్పాలనే తపన కూడా ఒక యుద్ధమే అయిన చోట… ! ఆ యుద్దానికి ఒక నేపథ్యం, ఓ ప్రణాళిక, ఓ దృక్కోణం, ఓ తాత్వికత కావాలి. అంతా కలిసి ఒక్కమాటలో చెప్పాలంటే ఒక స్కూల్‌ కావాలి. ఇవన్నీ కలిగిన వారె డా. బి.విజయభారతిగారు.
కారంచేడు తర్వాత నల్లపొద్దుకు ముందు విజయభారతి, బొజ్జాతారకం గార్ల ఇల్లు దళిత ఉద్యమానికి, సాహిత్యానికి దాదాపు కేంద్రంగా కొనసాగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి దళిత రచయితలు, ఉద్యమకారులు వస్తూవుండేవారు. అభ్యుదయ, విప్లవ సాహిత్యాల కాలం తరువాత తెలుగు రాష్ట్రాలను దిగ్బ్రాంతికి గురిచేసినవి కారంచేడు, చుండూరు ఊచకోతలు. వీటికి తోడు 1980లో విడుదలైన మండల్‌ కమీషన్‌ నివేదిక. దీనికి అనుకూలమైన, వ్యతిరేకమైన ఆందోళనల్లో విద్యార్థిలోకం రెండుగా చీలిపోయినప్పుడు బహిర్గతమైనకుల రాజకీయాలు వివిధ రంగాలను, దృక్కోణాలను పునరు నిర్వచింప చేశాయి. ఆ తరువాత వచ్చిన సాహిత్యం ఎంతో పరిపక్వతను పొందడానికి ఈ దంపతుల కృషి ఎంతో ఉంది.
నా దృష్టిలో ఈ కుటుంబం ప్రత్యేకమైంది. నా కార్యాచరణలో వీరింటికి వెళ్లడం నాకిష్టమైందిగా అనిపించేది. విజయభారతిగారు మనసునిండా మాట్లాడేవారు, తల్లిలా ఆదరించేవారు. తారకంగారు ఆప్యాయంగా పలుకరించే వారు. విలువైన పుస్తకాలూ ఇచ్చేవారు. విలువైన చర్చలు, విషయం అందరికి తెలిసిందే అయినా ఊహకందని దృక్కోణం విశ్లేషణ. చరిత్రలో కులవ్యతిరేక పోరాటాలు ఎన్ని రూపాల్లో జరిగినవి, వర్తమానంలో ఎలా జరుగుతున్నాయని వారు ప్రస్తావించే విషయాలు నాకు తెలిసి తెలుగు దళిత చరిత్రలో ఎక్కడా రాయబడి ఉన్నట్లు అనిపించలేదు. డర్బన్‌ కాన్ఫరెన్స్‌ సన్నాహాల సందర్భంలో తరచుగా కలిసిన సందర్భంలో ‘‘సార్‌ ఇది ఏ పుస్తకంలో దొరకొచ్చు’’ అని అడిగాను. ఈ కోణంలో ఇంకా ఎవరూ రాయలేదు. రాయాల్సి ఉంది అన్నారు. నీరు మానవ హక్కు. నీటి కోసం చరిత్రలో పోరాటాలు చాలానే జరిగాయి. అన్నది ఆ చర్చల సారాంశం. కొంత కాలానికి మహద్‌ చెరువు తాగు నీటి పోరాటం మాట్లాడుతున్నప్పుడు అనిపించింది అందరికీ ఉప్పు సత్యాగ్రహమే తెలుసు కానీ దానికి సమాంతరంగా అంబేడ్కర్‌ జరిపిన మహద్‌ నీటి సత్యాగ్రహం ను దేశం తెలుసుకోవాల్సి ఉందని. కొంత కాలానికి మహద్‌ సత్యాగ్రహం అని పుస్తకం రాయడం చూసాం. వీటితో పాటు వలస కాలంనుండి దళిత ఉద్యమ చరిత్ర, సాహిత్యం వీరింటిలో నిక్షిప్తమై ఉన్నట్టు అనిపించేది. నల్లపొద్దు దళిత స్త్రీల సాహిత్య సంకలనం కోసం నేను పని చేస్తున్నపుడు వీరి కుటుంబం నాకు ఒక గనిలా కనిపించింది. కోస్తాతో పాటు ఇతర ప్రాంతాల్లోని రచయితల పేర్లు ఇవ్వడంలో గనుమల జ్ఞానేశ్వరూ ఉన్నారు. 1943 సం.లోనే చీకటిలో మిణుగురులు పోకడలను వర్ణిస్తూ మిణుగురా ఓ మిణుగురా అని కవిత రాసిన గొప్ప కవయిత్రి బోయి ద్రౌపది ఈమె మేనత్త.
వీరి తల్లి నాగరత్నమ్మ రాసుకున్న చేతిరాతను మా అమ్మ అని పుస్తకం ప్రచురించడం ఒకటైతే ఈమె ఆత్మాభిమానపు సంఘటన ఒకటి పురుషాహాకారాన్ని బోనులో నిలబెట్టేదిగా ఉంటుంది. స్త్రీ జాతికి స్ఫూర్తిగా నిలుస్తుంది. దళిత సాహిత్యం, ఉద్యమం యొక్క చరిత్ర, వర్తమానం, భవిష్యత్‌ అన్నీ కలగలిసి లభ్యమైనయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే విజయభారతిగారు ప్రాచీన సాహిత్యంలోని అణిచివేతను చూపించడంలో నిష్ణాతురాలుగా, తారకంగారు వర్తమానంలో దళితులపై, అది గ్రామాల్లో నుండి పట్టణ కేంద్రాలు, కోర్టుల దాక జరుగుతున్న అణిచివేతను చూపించడంలో నిష్ణాతుడు అన్నట్లుండేది. ఒక కుటుంబం రెండు నేపథ్యాలు అన్నట్లు ఈ దంపతుల ఇద్దరికీ ప్రత్యేకమైన కుటుంబ నేపథ్యాలుండడం ఆసక్తికరం. ఈమె తాతగారు, తల్లి నాగరత్నమ్మ, తండ్రి గొల్ల చంద్రయ్య. బ్రిటీష్‌ కాలంలోనే దళిత పిల్లల కోసం పాఠశాలలు నిర్వహించి దళితుల విద్యావికాసానికి బాసటగా వున్నారు. ఎంతగానో కృషి చేసి ‘సంఘోద్ధారక’ అనే బిరుదు పొందిండు. ఒకే ఇంటిలో భిన్నధృవాలు అన్నట్లు ఈ వియ్యంకులు ఈమె మామగారు బొజ్జా అప్పలస్వామి గారిది వినూతన చరిత్ర. అంబేద్కర్‌ గారు స్థాపించిన షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ పార్టీ తరపున రెండు మూడు పర్యాయాలు శాసన సభ్యులుగా పనిచేసిన అంబేడ్కర్‌ వాది. ఇక పాలేరు నాటకంతో ఎంతోమంది యువతను ప్రభావితం చేసిన డాక్టర్‌ బోయి భీమన్న ఈమె తండ్రి, గాంధేయవాది. వీరి ద్వారా మాకొద్దీ నల్లదొరతనం అని జయభేరి వేసిన కుసుమ ధర్మన్న కవి, ఆ తరువాత ‘‘నిచ్చెన మెట్లు’’ నాటక రచయిత మోదుకూరి జాన్సన్‌ గారు వీరి ద్వారానే కనిపిస్తారు.
ప్రాచీన సాహిత్యంలో తాటక, ఆధునికంలో సావిత్రిబాయిల పాఠశాలల అంశ దృక్కోణాలను భావజాలాన్ని విస్తరింప చేశారు. ఆమె సుప్రసిద్ధ భారతీయ రచయిత్రి, పరిశోధకురాలు. తన సాహిత్య వ్యవసాయ సాగుతో తెలుగు సాహిత్యానికి కొత్త వెలుగునిచ్చారు. ఆమె సాహిత్య రచనలు ఎక్కువగా పురాణాలు వాటితాత్విక భావనలను హేతుబద్ద దృక్కోణంతో సాంస్కృతిక ఇతివృత్తాలను విశ్లేషించారు. హిందూ గ్రంథాల పట్ల ఆమెకున్న లోతైన అవగాహన వల్ల సమకాలీన పాఠకులతో ప్రతిధ్వనించే సంక్లిష్టమైన ఆలోచింపజేసే కథనాలను నేయగల సమర్ధురాలు. విజయభారతిగారు తన పుస్తకంలో తాటక యొక్క అన్వేషణలో ఆమెను వెయ్యేనుగుల సైన్యపు సేనానిగా మాత్రమే కాక ఆమెను అందమైన ప్రౌఢత్వం గల స్త్రీ అస్తిత్వ, శౌర్య సామర్ద్యపు సంఘర్షణకు ప్రాతినిధ్యం వహించిందన్నారు. దీనితో ఎప్పటి నుండో రామాయణంలో తాటక చిత్రణ గమనం మారిపోయింది. పిల్లలు దడుసుకునేవిధంగా, స్త్రీలు ఈసడిరచుకునే విధంగా తాటకను చూపించిన, వర్ణించిన తీరు ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యం నుండే తాటకను రాణిగా చిత్రిస్తూ నవల, సైన్యపు నాయకురాలిగా పాటలు, తాటక మళ్ళీ గెలిచింది అనే కథలు రావడంలో ఆమె విజయ వంతమయ్యారు..
‘అంబేడ్కర్‌ జీవిత చరిత్ర’ ధనంజయ్‌ కీర్‌ రాసిన మహాత్మ జ్యోతిరావు ఫులే జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించి, తొలి పుస్తకంగా తెలుగు సమాజానికి అందించి ఫూలే భావజాలవ్యాప్తికి విజయభారతి తోడ్పడ్డారు. ఆ తరువాత నరమేధాలు` నియోగాలు వంటి కులాన్ని కూకటి వేళ్ళతో పెకిలించే పుస్తకాలూ అందించి స్త్రీల భావజాల సాధికారతకు తోడ్పాటు నిచ్చారు. ‘‘అధిపత్య వర్గాలకు అధికారాలను కట్టబెట్టడానికి కొన్ని నరమేధాలు జరిగాయి’’ అని కరాకండిగా చెప్పారు.
విజయభారతిగారు వర్ణ కుల ధర్మ రక్షణ పురాణాలను అదే కులం, జెండరు, వర్గం అనే దృక్కోణాలతో విశ్లేషించారు అనేకంటే అదే పనిముట్లతో, శస్త్ర చికిత్స చేశారని చెప్పాలి. తాటక, శూర్పనఖ, ఇడిరబిలను పురాణాలలో వ్యాకరణీకరించారు. కీలక స్థానంలో నిలబెట్టారు. విప్ర వర్ణ ధర్మ కారు మేఘాలను దాటుకొని తాజా పొద్దు సమతా కిరణాలను వెదజల్లుతూ నవీన తరపు సాహిత్య సృజనకు వాగ్దానమిచ్చారు.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.