– హిమజ
అడివి తల్లీబిడ్ల పండుగకు
గిరి పుత్రలే పెద్దలు
కొండా కోనలే విడిది సెలవులు
వేద మంత్రోచ్చారణలు యజ్ఞయాగాదులు
మత గ్రంథ ప్రబోధాలు
ఇసుమంతైనా లేని
అచ్చమైన అడివి బిడ్డల పండుగ
రాచరికపు అరాచకంపైన
అన్యాయపు పెత్తనం పైన
కత్తి దూసి కదం తొక్కి
జాతికోసం నెత్తురోడిన ధీరవనితలు
సమ్మక్క సారలమ్మలకు
అడివి బిడ్డలు చేసే అమర వందనం
కోయ వనితలు కొండ దేవతలైన
ఏడు…. ఏడు శతాబ్దాల వీరగాధా వారథి
మేడారం జాతర
గోండులు కోయలు లంబాడాలు
భిల్లులు గ్రవరలు బంజారాలు
దండకారణ్యమంతా దండోరాయై
జనపద ఘట్టనల్లో మారుమోగే
గిరిజనోత్సవం
మాషు శుద్ధ పౌర్ణమి వెన్నెల్లో
నాగరికతకు సుదూరంగా
అనాది అడివి ఒడిలో వినిపించే
ఆదివాసీ జీవన సంగీతం
గోండు బిడ్డల పురాద్రంస్కృతీ
సంప్రదాయాల కొండమల్లె సౌరభం
మేడారం జాతర
ఇక్కడ కోడి పుంజులు కొబ్బరి కాయలే ముడుపులు
బెల్లమే నిలువెత్తు బంగారం
పూజలు ఎదుర్కోళ్ళు / కంక బియ్యం సమర్పణం
శివస్రత్తుల పూనకాలు / వన మూలికల వగరు వాదనలు
ఇప్పసారా పరిమళాలు / పుట్టతేనె తీపిదనాలు
తలనీలాలిచ్చి జంపన్న వాగులో
జనసముద్రం చేసే జలకాలు ఒకెత్తయితే
దిక్కులు పిక్కటిల్లే జన నినాదాల స్రడుమ
తల్లీబిడ్డలను గద్దెల దరికి తీసుకొచ్చే దృశ్యం
హృదయోద్విగ్నం – మహాదానందం
రెండేండ్లకోసారి తల్లులిద్దర్ని తలచుకొని
ఇంటికి పిలుచుకొని
అడివి అడివంతా పులకించిపోయే స్మృతి పండుగ
మేడారం జాతర!
– 2014 ఫిబ్రవరి – 11,12,13 తేదీల్లో మేడారం జాతర జరగనుంది.
సావితీబ్రాయి పూలే !
– లకుమ
నువ్వే మా మొదటి ఆధునిక కవయిత్రివనీ –
నువ్వే మా మొదటి ఉపాధ్యాయురాలివనీ –
నువ్వే మా మొదటి సామాజిక విప్లవకారిణివనీ –
ఇంతదాకా మాకు తెలియనందుకు సిగ్గుపడుతున్నాం !
వెనుకబాటుతనం మాకు తెలియంది కాదు – యింత
వెనుకబాటుతనమా, తల్లీ !
ఈ ‘కావ్యప్యూలే’ నీ తొలికవితా సంపుటినీ-
ఈ ‘సావిత్రీబాయి భాషణేవాగనీ’నీ తొలి గద్య రచనమనీ –
ఈ ‘జ్యోతిబా భాషణే’ నీ సంపాదకత్వ సంపుటాలనీ –
ఇంతదాకా మాకు తెలియనందుకు సిగ్గుపడుతున్నాం !
వెనుకబాటుతనం మాకు తెలియంది కాదు – యింత
వెనుకబాటు తనమా, తల్లీ !
బురద చిమ్మిన సమాజానికి వరద హస్తాన్నందించిన నీ ఔదార్యమూ –
సంచిలో ఓ మంచి చీర నుంచుకుని మరీ సాగిన నీ సహనమూ –
‘గుడిబాట కాదు మనది, బడి బాట పట్టండ’న్న నీ మరో ప్రపంచపు పిలుపూ –
ఇంతదాకా మాకు తెలియనందుకు సిగ్గుపడుతున్నాం !
వెనుకబాటుతనం మాకు తెలియంది కాదు – యింత
వెనుకబాటుతనమా, తల్లీ !
ప్లేగు రోగార్తులను పేగుబంధం కన్నా మిన్నగా అక్కున చేర్చుకున్న నీ సేవాభావమూ –
అస్పృశ్యులకు తాగునీరునందించి సేద దీర్చిన నీ గంగా భాగీరధీ సమాన స్వభావమూ –
వాక్కువెంట అర్థంలా జ్యోతిబాతో జీవితమంతా నడచిన నీ ఆదర్శ సతీ ధర్మమా –
ఇంతదాకా మాకు తెలియనందుకు సిగ్గుపడుతున్నాం !
వెనుకబాటుతనం మాకు తెలియంది కాదు – యింత
వెనుకబాటుతనమా, తల్లీ !
నీ సంస్కరణా పథమూ –
నీ సామాజిక విప్లవ చింతనమూ –
నీ చిరదీక్షా తపస్సమీక్షణమూ –
ఇంతదాకా మాకు ఓ నూరోవంతూ, అలవడనందుకు సిగ్గుపడుతున్నాం !
వెనుకబాటుతనం మాకు తెలియంది కాదు – మరీ యింత
వెనుకబాటుతనమా, ‘
తల్లీ ! నిన్ను దలంచి…’
అమ్మా ! మమ్మల్ని క్షమిస్తావు కదూ !
ఎంతైనా మేం నీ బిడ్డలం కదమ్మా !!
అమ్మా! మమ్మల్ని సహిస్తావు కదూ?
ఎంతైనా మనది పేగుబంధం కదమ్మా !!
నేనే – శైలజామిత్ర
ఒకానొక నిర్లక్ష్యం చాటున
కొన్ని నవ్వుల్నీ
మరికొంత దుఃఖాన్ని దాచుకుని
ఆకలిగా చూసే చూపులకు
నిర్లిప్తత చప్పుడుతో నిరసన తెలియజేస్తూ
ఆకాశంలో అర్థమై
నేలపై నిరర్థకమై
ఇంత జరిగిన తన జన్మకు
సాక్ష్యమెందుకు అనుకుందేమో
ఒకచోట ఉరికొయ్యను ఆశ్రయించింది.
ఒకానొక ఏకాంత భాషణలో
అపనిందల రెక్కలు దాటి వెళుతూ
నిర్వేదమైన సమయంలో
విచ్చు కత్తుల కరచాలనం నుండి
తప్పించుకుని, విదిలించుకుని
ఆమె జాతీయ జెండాని చుట్టుకుంటే
అదనుగా చూసుకుని
దేశం చూపుల్లో బందీ అయిందొకచోట
ఆమె భార్య అయ్యేదాకా తెలియదు
ఒకరికి భారమవుతుందని
ఆమె అమ్మయ్యేదాకా తెలియదు
అన్నిటికి అస్త్రమవుతుందని
ఉద్యోగం చేసేదాకా తెలియదు
ఆమె యంత్రమవుతుందని
అధికారి అయ్యేదాకా తెలియదు
రూపాయినోటుగా మారుతుందని
ఆమె నాయకురాలు అయ్యేదాకా తెలియదు
అటు కుటుంబానికి, ఇటు సమాజానికి
రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది…!
ఒక్క మాట అడుగుతా
ఉదయాన్ని స్వాగతించడానికైనా
అమ్మ ఉండాలి కదా?
ఆకాశాన్ని భరించడానికి
భూమి ఉండాలి కదా?
అమ్మేయడానికి, చంపేయడానికి
మీరెవరు?
అమ్మ కనకపోతే బిడ్డ ఎక్కడిదీ?
బిడ్డే వద్దనుకుంటే అమ్మ ఎక్కడిదీ?