ఈ – తరం నినాదం వై – తరుణి ???
– బి. కళాగోపాల్
చీకటి రాత్రులలో తొమ్మిది నెలల ధ్యానముద్ర.
ఒక చైతన్యపు మొలక ఊపిరి పోసుకుంది
జిగురు ప్రపంచంలో.
అదో ఆడనలుసని వెక్కిరించింది
పురుషాహంకార స్వరం.
అడుగడుగునా అవమానాలే,
ఛీత్కార చూపులే బాకుల్లా చేతులు చాపి,
ఛిద్రం చేయాలని చూశాయి నా ఆకృతిని.
ఐతేనేం? నా పురిటికేకనే సింహనాదమై ప్రతిధ్వనించింది!
ఓహ్ ! గట్టి పిండమే అనుకుందీ ఆధిపత్య లోకం.
ద్వితీయ పౌరురాలి ముసుగు తెరలలో స్వేచ్ఛను కబ్జా చేసి,
ఎదగనీక ఎదిగితే చూసి ఓర్వలేక,
నాలుక కొరడాతో నాలుగు దెబ్బలు వివక్ష పోరులో,
ఐతేనేం? నేను అనంతాన్ని,
నేను తెరచిన ఆకాశాన్ని,
అవకాశాల్లో మాకేదీ సగం? అని ఎలుగెత్తి నినదించే ఉద్యమ స్వరాన్ని.
శాడిజం, బాసిజం రంగులు పులుముకొన్న
వికృత ముఖాల చెంప ఛెళ్ళుమనిపించే హక్కుల చట్టాన్ని,
నిర్భయ నిజాన్ని.
తలమీద ఎన్ని ఆంక్షల కుళ్ళును గుమ్మరించినా,
తలమునక నీళ్ళలో ఈదులాడే తెరువరిని నేను.
సడలని స్వాభిమానంతో ఏడుకట్ల పాడె మీద
చివరి మజిలీ చేసే ఆడతనాన్ని, అమ్మతనాన్ని నేను !
మీ కడసారి జాలి చూపులు, సానుభూతులు, ఓదార్పులు
అఖ్ఖర్లేదు నాకు.
అపనిందలు, అవమనాల కళంకిత సమాజపు
కట్టుబాట్ల ‘వైతరణి’ లో…
పిడికెడు స్వాభిమానం, చిటికెడు చైతన్యం
గుండెల నిండా పొదవుకొన్న ధైర్యమే రక్షణ కవచంగా
ఎదుగుతున్న కొత్త ఊపిరిని నేను!
వీర ఝాన్సీలా చట్టాల కరవాలాన్ని ఝళిపిస్తూ,
ప్రశ్నల పరంపరను సంధిస్తూ,
ఫత్వాలు, షరియత్‌లు, జుర్మానాలు, ఏపేరైతేనేం? ఏ దేశమైతేనేం?
మొక్కజొన్న పువ్వులా ఒక మలాలా,
స్ఫూర్తిని నింపుతూ ఒక ఇంద్రనూయి,
రేకులు విప్పుకొంటున్న మహిళా సాధికారతా చిరునామాగా,
ఆడదంటే అబల కాదు రెబల్ అంటూ
పురుషాధిక్య ప్రపంచంలో ప్రశ్నల పిడికిలెత్తి
వై – తరుణి ??? అని నిగ్గదీసే ఈ – తరాన్ని నేను !!!