– కాత్యాయనీ విద్మహే
ఐదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో (1974-79) ఎస్సీల, బిసిల, మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పరచిన ప్రభుత్వం ఆరు (1980-85) ఏడు (1985-90) ప్రణాళికా కాలాలలో సామాజిక సేవా పథకాలకు ప్రాధాన్యత నియ్యటం పెద్ద వైరుధ్యం. ఇది దళితులకు, వెనకబడిన వర్గాలను, మహిళలకు అభివృద్ధి చట్రం వెలుపల తారట్లాడే తాత్కాలిక ఉపశమనాలనే చూపిస్తుంది. 1987లో స్త్రీల కొరకు స్వీయ పొదుపే మదుపుగా స్త్రీలే నడుపుకొనే డ్వాక్రా బృందాలను ఏర్పరచటం ఈ క్రమంలో జరిగిందే. ఈ విధమైన నిర్మాణాల రూపకల్పనలో కుటుంబాన్నే ఒక అభివృద్ధి యూనిట్‌గా భావించటం కనిపిస్తుంది. స్త్రీల అభివృద్ధిని పిల్లల అభివృద్ధిలో కలిపి చూడటం కనిపిస్తుంది. ఏ కుటుంబాన్నయితే అభివృద్ధి యూనిట్‌గా భావించటం జరిగిందో ఆ కుటుంబంలోనే స్త్రీల అభివృద్ధికి అవరోధమైన అసమానతలున్నాయన్న విషయాన్ని పూర్తిగా విస్మరించటం కనిపిస్తుంది. మహిళా ఉద్యమం దీనిపై వెలుగును ప్రసరింపచేసింది.
అలాగే స్త్రీల శ్రమకు వెలకట్టి జాతీయ గణాంకాలలో చేర్చాలన్న డిమాండును కూడా మహిళా ఉద్యమం ముందుకు తెచ్చింది. పితృస్వామ్యం, కుటుంబం స్త్రీల పనిని తక్కువ చేసి, చూచే సంస్కృతిని పెంచి పోషించగా స్త్రీల శ్రమశక్తిని పరిగణనలోకీ తీసుకొనని గణాంకాలు దానికి కొనసాగింపే అవుతున్నాయి. 1988లో శ్రమశక్తి నివేదిక అసంఘటిత రంగాలలో, అనియత రంగాలలో స్త్రీల శ్రమ గురించి, స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి సమగ్ర సమాచారాన్నిచ్చి, ఉత్పాదక రంగాలలో వున్న తొంబై శాతం శ్రామిక మహిళల గురించి పనిచేయాల్సినది ఎంత వుందో మహిళా సంఘాలకు సూచించింది. స్త్రీలందరికి వుండే సాధారణ సమస్యలకంటే శ్రామిక మహిళల సమస్యలు మరింత సంక్లిష్టమైనవని అర్థమయింది. వాళ్ళ సమస్యను సంబోధించి పనిచేయకుండా మహిళా ఉద్యమం, సమగ్రం కాదని స్పష్టమైంది.
ఈ దశకంలోనే స్త్రీ సమస్య అవగాహనను మరింత విస్తృతీకరించే దళిత దృక్పథం అభివృద్ధి చెందింది. కారంచేడు (1985 జులై 17), నీరుకొండ (1986 జులై 15) ఘటనలు దళితుల ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసాయి. భారత రాజ్యాంగం వల్ల లభించిన ప్రాథమిక హక్కులు – జీవించే హక్కు, ఆత్మగౌరవంతో జీవించే హక్కు, పౌరులందరితో కలిసి సమానంగా తిరగ గలిగిన హక్కు, తమకు కష్టం నష్టం కలిగే అంశాలను ప్రశ్నించే హక్కు – ఇవన్నీ మాల మాదిగలు కావటం వల్ల తిరస్కరింపబడిన వాళ్ళు, అణగ దొక్కబడిన వాళ్ళు వ్యక్తం చేసిన ఆక్రోశం నుండి, ధర్మాగ్రహం నుండి దళిత అస్తిత్వ చైతన్యం పెల్లుబికింది. సంపన్న వర్గ అగ్రకుల ఆధిపత్యం కారంచేడులోనూ, నీరుకొండల్లోనూ దళితులను మీద పడి కొట్టి వెంటాడి వేటాడి వధించే వరకు వదలలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, రక్షక వ్యవస్థ పెత్తందారీ పక్షపాతం కారణంగా మూలవాసులైన దళితులు ఆవాసాలు వదిలి ప్రాణాలు అరచేత పట్టుకొని శరణార్థులవలె స్వదేశంలోనే ప్రత్యేక శిబిరాలలో తలదాచుకోవలసిన వాళ్ళయినారు. ప్రధానంగా కారంచేడు ఘటనలో ప్రశ్న, ప్రతిఘటన ముందుగా దళిత స్త్రీల నుండి ప్రారంభమైంది. అందుకు పెత్తందార్ల లైంగిక అత్యాచారాలకు గురయి ముగ్గురు స్త్రీలు మూల్యం చెల్లించ వలసి వచ్చింది. ఈ పరిస్థితుల నుండి పెల్లుబికిన దళిత ఉద్యమం కారణంగానే ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం 1989లో వచ్చింది.
దళిత స్త్రీలకు సంబంధించిన మరొక సమస్య ‘జోగిని’. బసివిని, మాతమ్మ మొదలైన పేర్లతో ఆంధ్రదేశంలో వేరు వేరు ప్రాంతాలలో అమలవుతున్న మతాచార వ్యవస్థ ఇది. దళిత స్త్రీలను లైంగిక బానిసలుగా మార్చే విధానమిది. ఇంటి ఆడ పిల్లను దేవుడికి సమర్పిస్తామని మొక్కుకోవటం, పది పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి ఆ పెళ్ళిని ఊరి పండగగా జరపటం ఈడేరిన ఆ పిల్ల గ్రామ పెద్దల భోగవస్తువుగా జీవితకాలం గడపాల్సి రావటం జరుగుతుంది. దళితుల పేదరికాన్ని, అబానత్వా ఆసరాగా చేసుకొని వారించి ఆడపిల్లలను జోగినులుగా మార్చేందుకు ఒత్తిడి తేవటం కూడా వుంటుంది. ప్రజాస్వామ్య యుగంలోనూ భూస్వామ్య విధాన అవశేషంగా కొనసాగుతున్న జోగిని వ్యవస్థ పైన మతం ముసుగులో జరిగే లైంగిక పీడన మీద 80వ దశకంలో దృష్టి కేంద్రీకరింపబడింది. 1980లలో సాంఘిక సంక్షేమ ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్. శంకరన్ ఈ విషయం మీద సమాచారం సేకరించారు. కరీంనగర్, నిజామాబాదులలో సర్వే జరిగింది. జిల్లాల వారీ సమాచారం ప్రకారం 1986 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 16,287 మంది జోగినులు వున్నట్లు తేలింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్‌బెన్ జోషీ చొరవతో జోగిని వ్యవస్థ నిర్మూలనకు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రయత్నాలు జరిగాయి. ‘సంస్కార్’ (1983) వంటి సంస్థలు హేమలతా లవణం వంటి వారు నిబద్ధతతో కృషి చేశారు. జోగిని బసివిని దురాచారాలను మాన్పి దళిత స్త్రీలకు పునరావాసం కల్పించటంలో విద్య ఉపాధి అవకాశాలు కల్పించటంలో, వివాహాలు జరిపించటంలో ఈ సంస్థలు కృషి చేశాయి. 1987లో జోగిని అర్పణ నిరోధక బిల్లు శాసనసభలో ప్రవేశ పెట్టబడి 1988లో చట్టమైంది. ఈ చట్టాన్ని ప్రజలలో వ్యాపింప చేయటానికి చైతన్యపరచటానికి ఆంధ్రప్రదేశ్ జోగినీ వ్యవస్థ వ్యతిరేక సంఘటన ఏర్పడి పనిచేసింది. డ్యూటీస్, రైస్, స్త్రీ సంఘటన శక్తి మొదలైన సంస్థలు ఈ కృషిలో పాలుపంచుకొన్నాయి.
ప్రభావాల గురించి వైద్యుల నివేదికలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బాధితులకు నష్టపరిహారం కొరకు కోర్టు కేసు నడిచింది. అమెరికాలో దాఖలైన కేసు భారతదేశానికి బదలాయించబడింది. 1989 ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు 715 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా ప్రకటించింది. ఈ అతితక్కువ మొత్తం నష్ట పరిహారానికి భారత ప్రభుత్వం అంగీకరించింది కానీ బాధితులమైన తాము అంగీకరించేది లేదని భోపాల్ ప్రజలు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. గ్యాస్ పీడిత మహిళా ఉద్యోగ సంఘటన ముందుండి ఉద్యమాన్ని నడిపించింది. ఢిల్లీ పార్లమెంటు ముందర, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ముందర, ముఖ్యమంత్రి ఇంటి ముందర, ఢిల్లీ పురవీధులలో నిరసన ప్రదర్శనలు ఇస్తూ పోరాటాన్ని నిరంతరం కొనసాగించింది. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా 1989 ఏప్రిల్ 15, 16 తేదీలలో జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ పోరాటానికి నైతిక మద్ధతు ఇచ్చేందుకు దేశమంతటా ప్రజలను కూడగట్టటానికి ప్రచార కార్యక్రమం చేపట్టాలని భోపాల్ సదస్సు తీర్మానించింది.
1984లో భోపాల్ దుర్ఘటన సంభవించిన నాటినుండి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేక ప్రచారం వరకు ఈ భోపాల్ గ్యాస్ పీడిత ప్రజాఉద్యమాన్ని గ్యాస్ పీడిత మహిళలు ముందుండి నడుపుతున్న ఉద్యమాన్ని ఆంధ్రదేశంలో మహిళా ఉద్యమం తనదిగా చేసుకొనటం విశేషం. బహుళజాతి కంపెనీల అసహ్యకరమైన ముఖం బట్టబయలు అయిన ఈ సందర్భాన్ని, బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు కొమ్ముకాసే ప్రభుత్వ స్వభావం తెలిసి వచ్చిన ఈ సందర్భాన్ని ఆంధ్రదేశంలో మహిళా సంఘాలు సరిగానే గుర్తించి విమర్శ పెట్టాయి. గ్యాస్ పీడిత భోపాల్ ప్రజల పక్షాన న్యాయం కోసం ఇక్కడ నినదించాయి.
ఈ విధమైన సందర్భాలు మహిళాఉద్యమాలు సంబోధిస్తున్న స్త్రీ సమస్యకన్నా దళిత స్త్రీ సమస్య భిన్నమైనదని, జటిలమైనదని తెలియపరిచింది. స్త్రీలు సాధారణంగా ఎదుర్కొనే పితృస్వామిక పీడనకు అదనంగా శ్రామిక స్త్రీలు ఆర్థిక పీడనకు గురవుతుండగా దళిత స్త్రీ ఈ రెండింటితో పాటు కుల మత అణచివేతను ఎదుర్కొంటున్నదని స్పష్టమైంది. మహిళా ఉద్యమం ఈ పార్శ్యంలో విస్తరించాల్సి వుందన్న అవగాహన పెరిగింది.
ఎనభయ్యవ దశకంలో దేశాన్నంతా కదిలించిన ఘటనలు, మహిళలను ఉద్యమింప చేసిన ఘటనలు ప్రధానంగా మూడు వున్నాయి. ఒకటి – 1984 డిసెంబరులో భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి విషవాయువు లీక్ అయిన ఘటన. హరిత విప్లవం అవసరాలలో భాగంగా 1969లో ఏర్పడిన క్రిమిసంహారక మందు తయారీ ఫ్యాక్టరీ ఇది. దీని మాతృ సంస్థ అమెరికాలో వుంది. యూనియన్ కార్బైడ్ దేశీయ సంస్థగా నమోదయినా అధికశాతం వాటా అమెరికా మాతృసంస్థ అధీనంలోనే వుండటం వలన దేశీయ లాభాలలో దానికి సింహభాగం వెళ్తుంటుంది. కానీ అది ఉత్పత్తి చేసే సెలిన్ మందు కారణంగా విడుదలయ్యే విషవాయువు ప్రభావాలు అనుభవించవలసింది స్థానిక ప్రజలు. భోపాల్ విషవాయు దుర్ఘటనలో మూడువేల నుండి ఇరవైవేల వరకు మరణించి వుంటారని అంచనా. విషవాయువులో చిక్కి బతికి బయట పడ్డవాళ్ళ కళ్ళు, కడుపు, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. స్త్రీల గర్భకోశం మీద దాని విపరీత తల్లులుగా తమ పిల్లలకు తిండిపెట్టి బతికించుకొనటం కోసం అనివార్యమైన జీవితావసరంగా ‘భోపాల్ గ్యాస్ పీడిత మహిళా ఉద్యోగ సంఘటన’ నిర్మించి నిర్వహిస్తున్న ఉద్యమం – శ్రామిక మహిళా జన విముక్తితో ముడిపడి ఉన్న అంశంగా స్త్రీ విముక్తిని అర్థం చేసుకొనటానికి సరియైన దృక్పథాన్నిచ్చింది. స్త్రీలను స్త్రీలుగా తయారుచేసిన సామాజిక రాజకీయార్థిక విధానంతో సంఘర్షిస్తూ విముక్తికి ఉద్యమించటమేకాక మొత్తంమీద వ్యత్యాసాలకు కారణమైన ఉత్పత్తి విధానాలమీద, ప్రభుత్వ సంస్థల మీద, విధానాల మీద పురుషులతో కలిసి పోరాడాల్సిన అవసరాన్ని గుర్తించేలా చేసింది. ఆ రకంగా మధ్య తరగతికి పరిమితమైన బూర్జువా మహిళా ఉద్యమాల స్వరూపాన్ని సమగ్రం చేసుకొనటానికి స్వభావాన్ని మరింత ప్రజాస్వామికీకరించుకొనటానికి భోపాల్ గ్యాస్ పీడిత మహిళా ఉద్యోగ సంఘటన కృషి ప్రేరకమైంది. వరంగల్లులో స్త్రీ జనాభ్యుదయం అధ్యయన సంస్థ, ‘మహిళా మార్గం’ పత్రిక వంటివి ఈ ప్రేరణతో చైతన్య సదస్సులు నిర్వహించాయి. మహిళామార్గం ‘పిడికిలెత్తిన భోపాల్ మహిళ’ అనే పుస్తకాన్ని ప్రచురించి (1989 ఆగస్టు) విశాఖపట్టణంలో సదస్సును నిర్వహించింది.
అదేవిధంగా 1985-86 సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన షాబానో బేగం మనోవర్తి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు (1985 ఏప్రిల్ 23) వివాదాలకు దారితీసినపుడు ఆంధ్రదేశ మహిళా ఉద్యమం ముస్లిం మహిళల సమస్యపై తీవ్రంగా స్పందించింది. ముస్లిం మతఛాందసుల డిమాండ్లకు తలవొగ్గి వోటు బ్యాంకును కాపాడుకొనటం కోసం సుప్రీం కోర్టు తీర్పును. షాబానో కేసును తుడిచిపెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మహిళల విడాకుల హక్కు రక్షణ చట్టం 1986ను రూపొందించటాన్ని విస్తృతంగా విమర్శకు పెట్టింది.
ఇక మూడవది – 1987లో రాజస్థాన్‌లో జరిగిన రూప్‌కన్వర్ సహగమనం. పురాణకాలపు అరుదైన ఆచారాన్ని ఆధునిక ప్రజాస్వామ్య సమాజాలలో అమలు చెయ్యటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్త్రీ జీవితం మీద పురుషుడి అధికారాన్ని స్థిరీకరించే అత్యంత దారుణమైన, హేయమైన హింస సహగమనమని అనేక సభలు, సమావేశాలు పెట్టే ఆంధ్రదేశంలో మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సతి పూర్వాపరాలు, అందులోని లైంగిక రాజకీయాలు విస్తృతంగా చర్చించాయి. సతి స్వచ్ఛందమైనప్పుడు ఎవరూ దానిని అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదని అది ఆ స్త్రీ హక్కు అన్న స్థాయిలో వచ్చిన వాదనలను ఆంధ్రదేశ మహిళా ఉద్యమం తిప్పికొట్టింది. స్వచ్చందంగా పైకి కనిపించే వాటి వెనక వుండే నిర్భంధపు తీవ్రత, ఒత్తిడి పరిగణనలోకి తీసుకొనవలసినవని, స్వచ్ఛందంగా ఏ స్త్రీ సజీవదహనానికి సిద్దం కాదని అలా సిద్ధమయ్యే వాతావరణం సంస్కృతి పేర సృష్టించబడుతుందని అది ప్రజాస్వామిక హక్కులకు భంగకరమైనదని స్పష్టం చేసింది. ఈ సందర్భం స్త్రీలను నిర్దేశించే పితృస్వామిక అధికార రాజకీయాల నగ్నత్వాన్ని బయట పెట్టింది.
ఈ దశకంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని యన్‌టి రామారావు ప్రభుత్వం కొడుకులతో పాటు కూతుళ్ళకు సమాన వారసత్వ హక్కును కల్పిస్తూ చేసిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యమ చరిత్రలో పెద్ద చర్చను లేవనెత్తింది. మహిళా సంఘాలు ఈ విషయంపై సభలు సమావేశాలు, సెమినార్లు నిర్వహించాయి. అస్తిత్వంలో వున్న వివాహ వ్యవస్థ విధానాలు, కుటుంబ నిర్మాణం స్థిరాస్థిలో ఆడపిల్లల హక్కు అమలుకు ఎంతగా అవరోధంగా వుంటాయో, వాస్తవాచరణ ఎంతగా అసాధ్యమవుతుందో నిశితంగా చర్చించాయి. ఆస్తులే లేని వాళ్ళ విషయంలో ఇందువల్ల ఆడపిల్లలకు ఒరిగేదేమున్నదన్న ప్రశ్న కూడా వచ్చింది. పితృస్వామ్య కుటుంబం, పురుషుడి ఆధిక్యత, స్త్రీ అధీనత, వరకట్నం వంటి సమస్యలు మరింత జటిలమవుతాయన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఏమైనా ఆ చట్టం వల్ల ఆ తరువాత ఆంధ్రదేశ స్త్రీల పరిస్థితులలో వచ్చిన మార్పేమీ కనబడదు.
(ఇంకావుంది)