– రచ్చ సుమతి
జనవరి మూడవ వారంలో ‘భూమిక’ రచయిత్రులతో నేను చేసిన రెండు జిల్లాల పర్యటన నన్ను నా మూలాల వరకు తీసుకెళ్ళింది.
కొండవీటి సత్యవతి నిర్వహించే రచయిత్రుల యాత్రలు నిస్సందేహంగా వైవిధ్యంగా ఉంటాయి. నాలుగేళ్ళ క్రితం విశాఖపట్నం, భల్లుగుడ యాత్రకి నేను కూడా వెళ్ళాను. తెలుగు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ మనకు తెలిసినవే, చూసినవే అని అనుకుంటూ ఉంటాం. కాని మనకు తెలియని ప్రకృతి సౌందర్యం, జీవితాలు, జీవన విధానం, సమస్యలు ఉండకుండా ఎలా ఉంటాయి? నిజానికి ప్రతి 20 కిలోమీటర్ల దూరానికి అన్నీ మారిపోతూ ఉంటాయి కదా! ఇలాంటి మనకు తెలియని, చూడని ప్రకృతిని, జీవితాలను, జీవన విధానాలను, ఆనందాలను, సమస్యలను, ఆయా ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు చేస్తున్న సేవాకార్యక్రమాలను, కృషిని ‘భూమిక’ మనకి పట్టి చూపిస్తుంది.
నా బాల్యంలో నేను చూసిన వ్యక్తులు, పరిసరాలు, పంటపొలాలు, సేద్యం, దేశవాళీ ఆవులు, గోధూళి, మంచెలు, పల్లెలోని ఆతిథ్యం, పలుకరించే విధానం, సొంతమైన ఆహ్వానపు పద్ధతి, ఎడ్లబండిలో కూర్చుని వాగుల్ని దాటినట్లు ట్రాక్టర్లో కూర్చుని ఓ… అంటూ గోల చేస్తూ దాటడం, గుండ్రని బండరాళ్ళపై నుండి ఎడ్లబండి గుర్‌గుర్‌మని చప్పుడు చేస్తూ అతినెమ్మదిగా పోయినట్లుగా ట్రాక్టర్‌లో ప్రయాణం, ఇళ్ళపై కప్పులు కనపడకుండా చిక్కగా పరచుకుని విరగగాసిన చిక్కుడు, బీర, సొర, నేతిబీర తీగలు… ఓహ్ ఎన్ని జ్ఞాపకాలో… నా మనసు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైనవన్నీ మళ్ళీ నిద్రలేచాయి.
అదిలాబాద్ అడవిలో బస్సు ప్రయాణం నిజంగా మరపురానిది. ఆకురాలుగాలం… నిలువెత్తుగా నిలబడి మీకోసం మేమున్నామంటూ పలకరించే సాలవృక్షాలు, గుబురుగా పెరిగిన ఇప్పచెట్లు, పసుపుపచ్చగా ఎండిపోయి సన్నని పిండి జల్లెడలా మారిపోయిన టేకు ఆకులు… ఇంకా నాలుగుకళ్ళుంటే బాగుండేది…
నగర జీవితంలో ఎన్నడో మరిచిపోయిన గూడు మంచెలు మళ్ళీ చూడగలిగాను. తెల్లని, గోధుమ రంగుల్లో దేశీ ఆవులు మందలుమందులుగా కనువిందు… మా ఊళ్ళో. అన్నీ జెర్సీ ఆవులే కనపడతాయి, అంతగా ప్రపంచీకరణ!
అడవిబిడ్డల ఆతిథ్యం… ఆకలిగొ ని వచ్చిన మాకు వేడి భోజనం! అంతకంటె మురిపెం అనిపించిన విషయమేమిటంటే… బంతిపూలు, పట్టుకుచ్చుల పూలు, చిక్కుడుకాయలతో అల్లిన పూలదండలేసి, బొట్లుపెట్టి మేళతాళాలతో బస్సునుండి ఊళ్లోకి ఊరేగింపుగా తోడ్కొని వెళ్ళిన సరదోహం, సందడి… నా ఏడేళ్ళ వయసులో జరిగిన మా మేనమామ పెళ్ళి ఊరేగింపు కళ్ళకు గట్టింది… అంతటి ప్రేమ మళ్ళీ ఎవరు పంచగలరు?
తెల్లవారుతూనే చలిలో కెరిమెరికి ప్రయాణం. ఘాట్‌రోడ్డు ప్రయాణం ఎప్పుడు చేసినా సరికొత్తగానే ఉంటుంది. ఝరి గ్రామంలో కృషివిజ్ఞాన కేంద్రం. రసాయన ఎరువుల వాడకం వల్ల గత 4, 5 దశాబ్దాలుగా నేల ప్రతి ప్రాంతంలోనూ కాలుష్యానికి గురవుతూనే ఉంది. కాలుష్యానికి దూరంగా ఉండాల్సిన ఏజన్సీ ప్రాంతానికి కూడా ఈ బెడద తప్పడం లేదు. కెరిమెరి ప్రాంతంలో కొందరు రైతులు తక్కువ దిగుబడికి, ఆర్జనకు సిద్ధపడి సేంద్రీయ ఎరువుల్ని ఉపయోగించి పంటలు పండించే విధానం ఎంతో ఆసక్తిని కలిగించింది. ఝరి గ్రామం పేరు ఎంత మధురంగా ఉంది కదా! అక్కడి అడవి బిడ్డల ఆదరణ కూడా అంతే!
ఈ యాత్రలో మొదటినుండి చివరి వరకు అమృతమనస్కులే ఎదుర య్యారు. ఆర్మూరు అమృతలత గారిని గురించి – ఆవిడ ఆతిథ్యం, మాటతీరు, నిర్వహణాసామర్థ్యం – ఎంతని, ఏమని చెప్పగలం, కృతజ్ఞతలు తప్ప.
జోడేఘాట్‌లో బస్సు దిగేటప్పటికి అక్కడి ఆశ్రమ పాఠశాల పిల్లలందరూ చలికాలపు ఉదయపు ఎండల్లో కూర్చుని అల్పాహారం తింటున్నారు. మేం కొమురం భీం స్మారకం దగ్గరకు పోయి, జోహార్లు అర్పించి సక్రుబాయి వివరించిన విషయాలు విని అటు తిరిగేసరికి కొద్దిదూరం నుండి పిల్లలు వందేమాతరం ప్రార్థన చేస్తున్నారు. ఒక విద్యార్థి ఒక్కొక్క పదమే చెప్తుంటే మిగతా పిల్లలు పలుకుతున్నారు. వందేమాతరం తర్వాత ఆ విద్యార్థులందరూ ఏకకంఠంతో జయజయహే తెలంగాణ అంటూ పాడటం మొదలుపెట్టారు. ఆ కొండల మధ్య, కొమురం భీం స్మారక స్థూపానికి రెండు వందల అడుగుల దూరంలో, పార్లమెంటులో తెలంగాణపై వాడి, వేడిగా మాటలయుద్ధం జరుగుతున్న తరుణంలో రాగయుక్తంగా, వీనులవిందుగా గోండు బాలల గొంతుల నుండి ఆ పాట వినడం… ముక్తకంఠంతో తమంతతాము పదేళ్ళు కూడా లేని ఆ పసివాళ్ళు మొత్తం గేయాన్ని తడుము కోకుండా పాడటం… ముచ్చట కలిగింది.
చింతలు లేని సత్య గురించి కొత్తగా చెప్పడానికేమీ మిగలలేదు. కాని ‘ప్రశాంతి’ ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఆదిలాబాదు కొండలంత ప్రేమానురాగాలను మాత్రం మూట కట్టుకుంటున్నారు. జోడేఘాట్ తర్వాత ప్రశాంతిని కొత్తగా చూసే అవకాశం కలిగింది. ఝరి, మోడి, ఉషేగాఁవ్, వర్ని – ఈ ప్రాంతాల్లోని పిల్లలు, స్త్రీలు ప్రశాంతి కొరకు చూసిన ఎదురుచూపులు, వారిపట్ల ఆమెకుగల శ్రద్ధ, ప్రతి స్త్రీతో, అమ్మాయిలతో, అబ్బాయిలతో ఆమెకున్న వృత్తిని మించిన వ్యక్తిగత అనుబంధ చూస్తుంటే – ప్రశాంతిలోకి పరకాయ ప్రవేశం చేయగలిగితే ఎంత బావుండు కదా!!!
పొచ్చెర జలపాతం దగ్గర అందరం చిన్న పిల్లలమై చేసిన అల్లరి ఇంతా, అంతా కాదు. నెల్లుట్ల రమాదేవి చెప్పిన జోక్స్ మరిచిపోలేం. అమృతలత వారింటి దగ్గర, జలపాతం దగ్గర మమ్మల్నందరినీ స్కూలు పిల్లల్ని చేసేసి క్రమశిక్షణతో కూచోబెట్టి పోటీలు నిర్వహించి, బహుమతులిచ్చి ప్రేమను పంచి ఆప్యాయత చూపి… మరి నా బాల్యం గుర్తుకు రాకుండా ఉంటుందా!
ప్రపంచమంతా ఇట్లా మంచి వాళ్ళతో నిండిపోతే ఎంత బాగుంటుంది!
మళ్ళీ భూమిక యాత్ర వచ్చే ఏడాదిలో చేసేవరకు ప్రతిరోజూ పదిలంగా ఈ అనుభూతులు తాజాగానే ఉంటాయి!