– సుజాత పట్వారి
రేఖా మాత్రంగా కనిపంచే
బల్లట్టుపై
వేకువ చలిలో
గజగజలాడే
పొగమంచుకు
చుట్టకాలుస్తూ
వెచ్చదనాన్నిస్తున్న
అతను
ప్రాతః స్నానాన్ని,
ఫలహారాన్ని ముగించి
ఎండిన సూర్యకాంత
పూతల్పం రంగులో
తలపాగాపై
వాలిన కొంగ!
భూమ్యాకాశాల కలయికే
పరివృత్తంగా
నట్టనడుమ నిల్చుని
సహనాన్నే వలగా విసిరి
దిగంతాలను
తదేకంగా ధ్యానిస్తూ
బాహ్యాన్ని, అంతరాన్ని
సమస్థితిలో వుంచే
గరిమనాభిలా
అతను
అవునూ,
భారంగా కదిలే నీటిపై
నిర్వికల్పంగా తేలియాడే
విద్యేదో అతనికి తెలిసుండాలి!
సూర్యుడు ప్రౌఢిమనందుకునే లోపు
సన్నని అలల శృంగాలు
పెదవులు విప్పి
తళుక్కున రువ్విన
నవ్వులు
అతని దేహంపై
ప్రతి ఫలిస్తుంటే
ఒడ్డున చూపై
ద్వైతముయిన నేను
దృశ్యంలోకి ప్రవహించి
ఎప్పుడద్వయితమయ్యానో
ఏమో…!
(ఆదిలాబాద్ అడవుల్ని, నిజామాబాద్ నిరంతర చైతన్యాన్ని ఆత్మీయ ఆధిత్యంతో, అత్యంత అభిమానంతో వెన్నంటి వుండి చూపించిన మా ‘అమృత బళ్ళి’ అమృతలత గారికి బోల్డంత ప్రేమతో….)