– కృపాకర్ మాదిగ
ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర రాసిన కథల సంపుటి ‘రాయక్క మాన్యమ్’ను 12-5-2014 సాయంత్రం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఆజమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జోగినీ వ్యవస్థ నిర్మూలనా ఉద్యమ నాయకురాలు ఆజమ్మ మాట్లాడుతూ అనాదిగా అంటరానితనం, అణచివేతలకు గురౌతున్న దళిత మహిళల జీవితానుభవాలను కథలుగా రాసినందుకు జూపాక సుభద్ర అభినందనీయురాలు అన్నారు. ఈ పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షత వహించిన ద్రావిడ విశ్వవిద్యాలయం ఆచార్యులు పులికొండ సుబ్బాచారి మాట్లాడుతూ ఈ కథల ద్వారా తెలంగాణ మట్టిమనుషుల సాంస్కృతిక సౌందర్యం, యాస, భాషల పరిమళాలను రచయిత్రి సుభద్ర మనముందు ఉంచా రన్నారు. ఎస్వీ విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్. మునిరత్నమ్మ మాట్లాడుతూ ఈ కథాసంకలనంలో 17 కథలున్నాయని, దళిత మహిళల కష్టాలను, వారి జీవన వైవిధ్యాలను గతంలో ఎవ్వరూ రాయలేనంత లోతుగా, సవివరంగా రచయిత్రి ఈ కథల్లో ఆవిష్కరించారని అన్నారు.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క మాట్లాడుతూ ‘గద్దెత్కపోయిన బత్కమ్మ’ కథ దళిత మహిళల జీవితాలకు అద్దం పడుతున్నదని, తెలంగాణ నవ నిర్మాణంలో దళిత బహుజన మహిళలకు మానవ గౌరవం, సమాన హక్కులు దక్కాలని ఆకాంక్షించారు. గత ఏడాది మాదిగవాడలోనే తొలుత బతకమ్మ ఆడామని తెలిపారు. తెలంగాణలో ఇకపై వెలివాడలే ఊరి బతకమ్మలాడాలని కోరారు. రుంజ పూర్వ అధ్యక్షురాలు, మట్టిపూల రచయిత్రి జ్వలిత మాట్లాడుతూ దళిత మహిళలపై నేటికీ కొనసాగుతున్న తీవ్రమైన దోపిడీ వివక్షలు, అణచివేతలకు సుభద్ర కథలు అద్దం పడుతున్నాయన్నారు. మట్టిపూల కవయిత్రి డాక్టర్ షాజహానా మాట్లాడుతూ దేశంలో గాయాలు లేని దళిత స్త్రీ లేదని, కులవివక్ష రూపాలు మార్చుకుంటున్నదిగానీ, సమసిపోలేదన్నారు. సుభద్ర కథల్లోని పాత్రలన్నీ సజీవమైనవేనని అన్నారు.
మరో మట్టిపూల రచయిత్రి, ఉపాధ్యాయురాలు గంధం విజయలక్ష్మి మాట్లాడుతూ సుభద్ర కథల్లో తెలంగాణ మట్టిమనుషుల భాషా మాధుర్యం, నానుడులు, చాటువులు, పలుకుబడులు, జాతీయాలు కళ్ళకుకట్టినట్టు కన్పిస్తాయని, వినిపిస్తాయని తెలిపారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సీనియర్ అధ్యాపకులు డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచీకరణకు మూలసూత్రమైన సాంస్కృతిక ఏకీకరణను తిప్పికొట్టగల సామర్థ్యం ఈ కథల్లోనే ఉన్నదన్నారు. నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు డాక్టర్ జి.వి. రత్నాకర్ మాట్లాడుతూ దళిత సాహిత్యంలో జూపాక సుభద్ర రచనలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అట్టడుగు మహిళాసమాజాలను ఉద్యమస్థాయిలో అక్షరబద్ధం చేస్తున్న జూపాక సుభద్ర రచనలపై వివరమైన పరిశోధన జరగాలన్నారు. మాదిగ మహాశక్తి జాతీయ కన్వీనర్, రచయిత కృపాకర్ మాదిగ మాట్లాడుతూ రచయిత్రి సుభద్ర రచనలు, ఇతర మట్టిపూల రచయిత్రుల సాహిత్యాల వెనకనున్న సామాజిక, జెండర్, సాహిత్య వస్తుతత్వాలపై సమగ్రమైన విశ్లేషణ, అధ్యయనం, పరిశోధన, ప్రచారం జరగాలన్నారు. బహుజనులైన మట్టిపూల రచయిత్రుల రచనలే ఇకపై ప్రధాన స్రవంతి సాహిత్యం అవుతుందన్నారు. చివరగా ఈ ‘రాయక్క మాన్యం’ కథాసంకలనం రచయత్రి జూపాక సుభద్ర మాట్లాడుతూ తన కథల పుస్తకం ఆవిష్కరణ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. తన చుట్టూ ఉన్న అట్టడుగు దళిత సమాజాల మహిళల జీవితాలే తన కథలకు మూలం, స్ఫూర్తి అని తెలిపారు.
ఇంకా ఈ సభలో ఇఫ్లూ ప్రొఫెసర్ సూసీతారు, హెచ్.సి.యు. ప్రొఫెసర్లు ఉమ, శ్రీధర్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ మద్దులేటి, ప్రొఫెసర్ ఆర్. స్వరూపరాణి, పి.వో.డబ్ల్యు. నాయకులు సంధ్య, ఝాన్సీ, రచయిత్రులు బండారు విజయ, సజయ, దిగుమర్తి ముక్త విమల, రత్నమాల, మెర్సీ మార్గరెట్, మేరీ మాదిగ, బి.పి. కరుణాకర్, రావినూతల ప్రేమ కిషోర్, డాక్టర్ బద్దిపూడి జయరావు, షరీన్, స్కైబాబ, డాక్టర్ పసునూరి రవీందర్, మున్నంగి మధుబాబు, తులసి, సంపత్‌కుమార్, యలవర్తి రాజేంద్రప్రసాద్, రామగోపాల్, సంజీవ్‌కుమార్, సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు నిర్మల, కృష్ణవేణి, లలిత, డాక్టర్ కిషన్‌లాల్ మొదలగువారితోపాటు వందలాదిమంది బహుజన సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.