ఉమా మహేశ్వరి నూతక్కి
జీసస్ క్రీస్ట్ పేరుతో ఒక శకం మొదలయిందని మనకు తెలుసు. చరిత్రకారులు జీసస్ ముందు కాలాన్ని క్రీస్తు పూర్వమనీ తరవాత కాలాన్ని క్రీస్తు శకమనీ అన్నారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ముఖ్యంగా కథా సాహిత్యానికి సంబంధించి యుగ విభజన చెయ్యవలసి వస్తే ఎవరి పేరు చెప్పుకోవాలి మనం? బాలారిష్టాలను దాటి, తెలుగు కథను చేయి పట్టి నడిపించి తన సమకాలీన రచయితలకు మార్గదర్శకంగా మాత్రమే కాదు, భవిష్యత్ తరాల రచయితలకు దిశా నిర్దేశం చేసిన వ్యక్తి ఒకరున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన తెలుగు కథకు పర్యాయపదం. కథకులకే కథకుడు. ఆయనే చాసోగా సుపరిచితులయిన చాగంటి సోమయజులు.
తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టం ఏమిటంటే మన కథలకు ఒరవడి దిద్దిన వాళ్లందరూ దూర దృష్టి ఉన్నవాళ్ళే. అలాగే కేవలం తన సమకాలీన పాఠకులకు మాత్రమే కాదు, రాబోయే తరాలను కూడా దృష్టిలో పెట్టుకుని కథలు వ్రాసారు. ఆయన ఎంచుకున్న ఇతివృత్తాలన్నీ కూడా కాలాతీతాలని మనం చెప్పవచ్చు.. ఇక కథల శైలి అయితే కదన కుతూహలమే. గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి… లాంటి కధకుల ఒరవడిలో, వీళ్ళ వారసత్వంగా కథా రచనను అందిపుచ్చుకున్న రచయిత చాసో. ఇప్పటికీ వంద సంవత్సరాల క్రితం జన్మించి, 74 యేళ్ళకు పూర్వం కలం పట్టిన రచయిత ఆయన.. ఈయన రాసిన కథల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గడిచిన గడచిన 50-60 యేళ్ళ కాలం నుంచీ వస్తున్న కథలలో అధిక శాతం కథల వెనుక చాసో స్ఫూర్తి ఉంది. ఈ కథలలో చాసో సృష్టించిన ఒరవడి ఉంది. 1915 సంవత్సరంలో శ్రీకాకుళంలో జన్మించిన చాగంటి సోమయాజులు విజయనగరం దత్తత వచ్చి అక్కడే స్థిరపడ్డారు. చాసో హవేలీగా పేరు పడ్డ ఆయన నివాసం ఒకప్పుడు ఎన్నో సాహిత్య సమావేశాలకు కేంద్రం. సాహితీ ప్రియులకు ఇప్పటికీ దర్శనీయ స్తలమది. మరి ఇంతటి చాసో ఎలాంటి కథలు వ్రాసారు? ఆ కథలలో ఇతివృత్తాలు ఎలాంటివి? అసలు కథలు వ్రాయడంలో చాసో శైలి ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే చాసో వ్రాసిన కథలు చదివి తీరాల్సిందే.
చాసో కథలపై సమీక్ష వ్రాయడమంటే అది పెద్ద సాహసమే అవుతుంది. ఎందుకంటే ఒక పరిశోధనా గ్రంధానికి సరిపడే విషయం ఉంది వాటిల్లో. ఐతే కొన్ని కథలను మీకు పరిచయం చేయాలనే ప్రయత్నమే ఈ సమీక్ష.. ”కవలలు”. ఇది చాసో గారి ఒక కథ పేరు. ఇద్దరు కవల అమ్మాయిలలో చిన్న పిల్ల ఈ కథ మనకు చెబుతుంది. కథ వాళ్ళ అక్కది. తల్లీ, తండ్రీ పిల్లలకు చాలా స్వేచ్ఛని ఇస్తారు. ఎక్కడా దేనికీ అడ్డు చెప్పరు. వీళ్ళకి ఒక డాక్టర్ కుటుంబంతో గాఢమైన స్నేహం ఉంటుంది. ఆ డాక్టర్ అభ్యుదయవాది. ఆయనకు ఒకే ఒక కొడుకు. పేరు రెడ్డి. మన కవలలో పెద్ద పిల్ల ఇతనితో స్నేహం మొదలు పెడుతుంది. ఎప్పుడూ పిల్లలకి ఏ విషయంలోనూ అడ్డు చెప్పని తండ్రి ఈ విషయం మాత్రం ఒప్పుకోడు. ఉన్నట్టుండి ఆ పిల్లవాడూ రావడం మానేస్తాడు. ఎందుకంటే అతనింట్లోనూ ఆంక్షలు మొదలవుతాయి. ఇంతలో ఒక ఉత్తరం రాసి పెద్ద పిల్ల మాయమైపోతుంది. తరవాత ఆ పిల్లవాడికి ఉద్యోగం వచ్చి నెమ్మదిగా అతనూ వెళ్ళిపోతాడు. వీళ్ళ కుటుంబం వేరే వూరు వెళ్ళిపోతుంది. అక్కడ కవలల తండ్రి జబ్బు పడతాడు. జీవితం మీద ఆశ పోయాక ఒక రహస్యం చిన్న కూతురుతో పంచుకుంటాడు. ఆ రహస్యం ఏమిటి? అని మనం ఊహించే ప్రయత్నం మొదలుపెడతాము. చాసో శైలిలో అంత ఉత్కంఠ ఉంటుంది మరి. ఈ డాక్టర్ కొడుకు ఉన్నాడు కదా. అతను నిజానికి కవలల తండ్రి వల్ల పుట్టినవాడు. అందుకే అతని చెల్లి వరస అవుతుంది కాబట్టి పెళ్ళికి ఒప్పుకోడు. అయితే ఇక్కడితో కథని ఆపేస్తే ఆ రచయిత సాధారణ రచయితలలో ఒకడిగా మిగిలిపోతాడు. కానీ చాసో కథలకు కథకుడు కదా అందుకే కథను ఊహించని మలుపు తిప్పి కథకు అద్భుతమైన ముగింపునిస్తాడు. ముగింపు ఏమిటంటే ఈ కవలలో పెద్దది ఆ డాక్టర్ కొడుకుని పెళ్ళి చేసుకుని తండ్రి చనిపోయిన తరువాత వస్తుంది. ముగింపులో కూడా డాక్టర్ భార్య వలవలా ఏడుస్తుంది తప్ప నిజం మాత్రం బయటికి చెప్పదు. మనుష్యుల విలువలు వీటన్నిటికన్న పరువు ప్రతిష్ఠలకు మనుషులు ఎంత విలువ ఇస్తారో అర్థం అవుతుంది. ముగింపు, నిర్ణయం ఇవేవీ చాసో మనకు చెప్పడు. కథంతా చదివిన తరువాత, పుస్తకం మూసేదాకా ఈ ఆలోచనలు అన్నీ మనని వెంటాడి మనకే నేర్పిస్తాయి.
ఇంకో కథ ”దమ్ములగొండి”. మనిషిలో భయం ఎలా పుడుతుంది? మనిషిలో భయం అన్నది పుట్టిన తరువాత దానిని పారద్రోలటం సాధ్యమా? అసలు భయం పుట్టిన తరువాత మామూలప్పుడు ఎంతో ధైర్యంగా ఉండే మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? వీటిని కళ్ళకు కట్టినట్టు చెపుతారు చాసో. ఒక అర్థరాత్రి ముగ్గురు యువకులు అడవికి షికారుకి వెళతారు. వెన్నెల రాత్రి అడవి చివరకంటా వెళ్ళి అక్కడ కూచొని కోనాడ సముద్రతీరం దాకా కనపడే విశాల దృశ్యాన్ని వెన్నెల వెలుతురులో చూడాలని వాళ్ళ కోరిక. భయంకరమైన ఏకాంత సీమలో సుందరమైన జాగారం – మరి వీళ్ళ షికారు ఏ కంచికి చేరింది? ఈ కథని అసాధారణంగా నిలబెట్టిన అంశమేమిటి? ఇవన్నీ తెలియాలంటే దుమ్ముల గొండి చదవాల్సిందే.
చాసో విజయనగరంలో నాలుగు దిక్కులా విపరీతంగా నడిచేవారుట. ”నా నడకే నాకు కథా వస్తువుని ఇస్తుంది” అనే వారుట చాసో. ఆయన చుట్టూ కనిపించే పాత్రలే ఆయన కథా వస్తువులు. ”మాతృ ధర్మం” అనే ఒక కథ చదివితే ఆయన నిశిత దృష్టి మనకు అర్థమవుతుంది. ఇందులో కత్తెర పిట్టలు వర్షం పడినప్పుడు వాటి గ్రుడ్లను కాపాడుకోవడానికి ప్రయాస పడటం, పాము వాటిని తినడానికి చేసే ప్రయత్నం ఆ పిట్ట పాముతో పోరాడటం, ఇవన్నీ ఆయన ప్రకృతిని ఎంతో నిశితంగా గమనిస్తేగానీ రాయలేనివి. కథనం కోసం, శైలి కోసం ఎక్కడా ప్రయాస పడినట్టు అనిపించదు మనకి. అపరిచితమైన ఏ వస్తువునీ కథలో పరిచయం చేయలేదాయన.
చాసో కథలలో కనిపించే ఏ పాత్రనూ మనం ఒకంతట మరిచిపోలేము. స్త్రీ పాత్రలైతే మరీనూ.. సన్నివేశాన్ని అయినా, వ్యక్తిత్వాన్ని అయినా కళ్ళ ముందు నిలిపే కథనం ఆయనది. ఇలాంటి వాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోతాం మనం. ఇలాంటి వాళ్ళు మనకు తారసపడితే మనమైతే ఏం చేస్తాం అని ఆలోచిస్తాం. అంత శక్తివంతమైన పాత్రలను మనకు అందిస్తారు చాసో. మనందరినీ బాగా ఆలోచింపచేసే కథలలో ”లేడీ కరుణాకరం” కథ ఒకటి. కరుణాకరం మాటలలో కథ మనకు చెప్పబడుతుంది. భార్య ప్రవర్తననూ, విశృంఖలత్వాన్నీ కరుణాకరం ఎలా సమాధనపరుచుకున్నాడు. అందమైన పల్లెటూరి శారద లేడీ కరుణాకరంగా ఎలా ఎదిగింది? తెలుసుకోవాలంటే చాసో గారి లేడీ కరుణాకరం చదివి తీరాల్సిందే. జీవితంలో ఎదగడానికి లేడీ కరుణాకరం ఎంచుకున్న దారి అదయితే జీవన గమనంలో తాను తీసుకున్న నిర్ణయం మాణిక్యాంబ గారికి ఎలా ఆదరువు అయిందీ చెపుతారు ”ఏలూరెళ్ళాలి” కథలో చాసో. ఆ రోజుల్లో స్త్రీకి ఆస్తి హక్కులో ఉన్న పరిమితులూ, ఆస్తి నిలబెట్టుకోవటం కోసం తప్పని తెలిసీ మాణిక్యాంబ గారు తీసుకున్న నిర్ణయం మనని ఆలోచనలో పడేస్తుంది. ఒక చీకటి తప్పు ఒక జీవితాన్ని ఎలా వెలిగించింది అసలు అది తప్పా కాదా అనే మీమాంస మనని ఒక పట్టాన వదిలిపెట్టదు.
ఇంకో కథ ”వయొలిన్”. సంగీతం పట్ల ఎంతో ప్రేమ ఉన్న రాజ్యం పెళ్ళి తరువాత సంసార బాధ్యతలో పడిపోతుంది. జబ్బు పడిన రాజ్యం వైద్యం కోసం ఆమె వయొలిన్‌ని 250 రూపాయలకు అమ్మేస్తాడు ఆమ భర్త. మిగిలిన డబ్బుతో ఆమెకి పట్టుచీర తెస్తాడు. ప్రాణానికి ప్రాణమైన వయొలిన్‌ని భర్త అమ్మినందుకు బాధ పడాలా? తన వైద్యం కోసం భర్త పడిన తపన చూసి సంతోషపడాలో తెలియని రాజ్యం నిర్లిప్తత, పుస్తకం మూసేదాకా కూడా మన మనసుల్ని మెలి తిప్పేస్తుంది. భార్యా-భర్తల అనుబంధం, అభిరుచులకూ అవసరాలకూ మధ్య జరిగే పోటీలో గెలుపు వేటిదన్నది ”వయొలిన్” కథాంశం.
ఇంకో కథ ”గున్నమ్మ కథ”. అరవై యేళ్ళు వచ్చినా గువ్వలా ఉండే గున్నమ్మ ఒక వ్యభిచారి. సంపాదించిన డబ్బంతా ఒక బట్టల షాపుకే పోస్టూంటుంది. ఎప్పుడు చూసినా ఆ బట్టల షాపులో బట్టలు కొంటూనే ఉంటుంది. కొన్న ప్రతీ సారీ బిల్లు తగ్గించకపోతే ”తగ్గించవా, పోనీ తిను” అంటూ ఉంటుంది. తీరా ఒక రోజు ఆ బట్టల షాపు ముందే చనిపోతుందామె. ”ఎక్కడా చోటు లేనట్టు తన షాపు ముందే చనిపోవాలా” అని విసుక్కుంటాడు ఆ షాపు ఓనర్ జగన్నాధ స్వామి. అప్పుడు గున్నమ్మ స్నేహితురాలైన ఇంకో ముసలమ్మ జగన్నాధ స్వామి దగ్గరికి వచ్చి అసలు విషయం చెపుతుంది. గున్నమ్మ కొడుకే ఈ జగన్నాధ స్వామి అనీ – తన కొడుకని తెలిస్తే సమాజంలో అతను పడే అవమానాలు భరించలేక ఆమె అతనిని వేరే వాళ్ళకు ఇచ్చేస్తుందని పేగు బంధంలోని భ్రమ తీరక ఆమె రోజు అతని షాపుకి వచ్చి తన కొడుకుని చూసుకుంటూ ఉంటుందని తెలిసి జగన్నాధ స్వామి అల్లాడిపోతాడు.
చాసో కథలు నేల విడిచి ఊహాలోకాల్లోకి వెళ్ళలేదు. సామ్యవాదాన్ని కోరుకున్నాడాయన. తన కథలలో వామపక్ష గళం వినిపించాడు. అంతే కానీ పేజీలకు పేజీలు ఉపన్యాస ధోరణిలో సాగవు అవి. క్లుప్తంగా, నిశితంగా తను చెప్పదలుచుకున్నది మనచేత చెప్పించే నేర్పు ఉన్న ఆయన కథలకి. చాసో అనగానే గుర్తొచ్చే కథలలో ఒకటి ”కుంకుడాకు”. ఒక మోతుబరి కూతురు, కూలివాడి కూతురు స్నేహితులు. సరదాకోసం చేసే మోతుబరి కూతురు దొంగతనం చిలిపి అల్లరిగా తీసుకునే జనం కుటుంబం ఆకలి తీర్చడం కోసం ఎంగిలి ఆకులేరుకునే గౌరిని ఎలా దొంగని చేసిందీ చదువుతుంటే మన మనసు బరువెక్కిపోతుంది. సమాజంలో స్పష్టంగా కనిపించే ఆర్థిక అసమానతలు, ఏ అసమానతా లేకుండా అన్ని వర్గాలకూ ఉండే ఆకలి – వీటికి ఏనాటికయినా సమాధానం దొరుకుతుందా? అనే ప్రశ్న మనలో రగిలించే కథ ఇది.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని వింటూ ఉంటాం. మనం అంటూ ఉంటాం కూడా. ఇదే విషయాలను తనదైన శైలిలో ”బండపాటు” కథలో చెపుతారు చాసో. మనస్తత్వ చిత్రణ, మెరుపు ముగింపు – ఈ కథను ఒకంతట మరిచిపోనివ్వవు. బండలుకొట్టే రాముడి మరణానంతరం వచ్చిన డబ్బుకోసం అతని తల్లి ఏం చేసింది? అవి కాపాడుకోవడంకోసం అతని భార్య ఏం చేసింది? ఆర్థిక సంబంధాలు ఎంత విచిత్రంగా ఉంటాయి. వీటిన్నిటినీ అద్భుతంగా చిత్రీకరిస్తారు చాసో.
శవ రాజకీయాలు ఇలా ఉంటే బిక్షాటనతో పొట్టపోసు కునేవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చెపుతుంది ”ఎంపు” కథ. మనవి కాని జీవితాల గురించి కథ అల్లాలంటే ఎంత నిశితమైన పరిశీలన ఉండాలి? ఈ విషయంలో నిజంగానే గురజాడ వారసుడు చాసో. ఎన్నో సాహితీచర్చలకు కేంద్రమైనది ఈ ”ఎంపు” కథ. కేవలం మానవ సంబంధాలే కాదు రాజకీయాలను కూడా ఇతివృత్తంగా చేసుకుని చక్కని కథలు వ్రాసారు చాసో. వర్తమాన రాజకీయాల గురించి మనం ఎన్ని వ్యాఖ్యలు వింటున్నాం? కాలం మారిపోయింది అని బాధపడేవాళ్ళను రోజూ చూస్తూనే ఉంటాం. అయితే రాజకీయా లు ఇప్పుడే కాదు, 50 యేళ్ళ క్రితం కూడా ఇలాగే ఉండేవని చెపుతుంది ”జంక్షన్‌లో జడ్డీ” కథ. కథాస్థలం, కథకుడూ అన్నీ ఆ బడ్డీనే.
”A short story deals with a single situation”” అ ఆనే వారట చాసో. 40 యేళ్ళ రచనా ప్రస్థానంలో చాసో రాసిన మొత్తం కథలు 50 లోపే అంటే ఆశ్చర్యం కలుగదు మనకి. ఎందుకంటే ఈయన రాసిన కథలన్నీ గంగిగోవుపాలే. కథను క్లుప్తంగా చెప్పటం చాసో ప్రత్యేకత. ఇక ఆయన కథలలో చదివించే గుణాన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఏ ఒక్క కథనీ కేవలం ఒక్కసారి చదివేసి పక్కన పెట్టలేము, మళ్ళీమళ్ళీ చదివించడమే కాదు, చదివిన ప్రతీసారీ మునుపు మన దృష్టికి రాని కొత్త విషయమేదో ఒకటి ఆ కథలలో కనిపిస్తుంది. చాసో రాసిన 40 కథల సంపుటి విశాలాంధ్ర వారి ద్వారా ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. అచ్చులోలేని మిగతా కథలు కూడా చాసో శతజయంతి సందర్భంగా వెలుగులోకి రావాలనీ, చాసో స్ఫూర్తి భావితరాలకు అందాలనీ మనసారా కోరుకుందాం.