పూర్వపు రోజుల్లో వృద్ధాశ్రమాల పేరు వింటే చాలా చిన్నతనంగానూ, లోకువ భావంతో ఉండేవారు. పిల్లలు ఉన్న వాళ్ళు వృద్ధాశ్రమాల్లో చేరటం ఏమిటి? ఏం? పిల్లలు తల్లిదండ్రులను చూడని కసాయి వాళ్ళా అన్న చేదు భావాలు కూడా ఉండేవి. కాని, కాలం మారుతున్న కొద్దీ పిల్లల్లోనూ, పెద్దల్లోనూ, ఎదుగుదలనేది ప్రారంభం అయింది. కాలగమనంలో ఎన్నో మార్పులు. పిల్లలు అమెరికాలో ఉండటం, ఇండియాలో తల్లిదండ్రులు వంటరిగా ఉండటం. పైగా వారూ ఏభై ఏళ్ళు పైబడిన వారవటం, ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు బాధ్యతలు తీరక చాలా బిజీగా ఉండటం. ఈ పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు డెబ్భై, ఎనభై ఏళ్ళవాళ్ళూ, వారి సంరక్షణ బాధ్యత అనేవి చాలా కష్టతరమే. పనివాళ్ళని పెట్టినా వాళ్ళ సమస్యలు వాళ్ళవి.
అందుకే చాలా మంది పెద్ద వాళ్ళు వృద్ధాశ్రమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఎంతో సంస్కారవంతమైన చర్యే. తమ బాధ్యతలు అన్నీ పూర్తయి, పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడి సుఖంగా ఉంటున్నప్పుడు మమకారపు సంకెళ్ళు సడలించుకుని, ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించి, కొంత రక్షణ, బాధ్యత, ప్రేమ, దయ ఉన్న మంచి వృద్ధాశ్రమాలు చూసుకుని వాటిలో చేరటం వృద్ధులకు ఏమాత్రం నామోషి కాదు సరికదా తమలాంటి వారితో సంతోషంగా కాలక్షేపం చెయ్యటం ఆరోగ్య హేతువుకూడా! పిల్లలు వచ్చి చూసి వెడుతుంటారు. అత్యవసర పరిస్థితులలో తమ వద్దకే తీసుకు వెడతారు. అంతేకాదు. ఏమాత్రం ఒంట్లో శక్తి ఉన్నా పిల్లలకు అవసరమైనప్పుడు వెళ్ళి వాళ్ళకి సహాయపడి సంతోషపెట్టి రావడం వల్ల సత్సంబంధాలు వృద్ధి చెందుతాయి.
అయితే వృద్ధాశ్రమాలు కూడా కొన్ని విషయాలు తీవ్రంగా ఆలోచించాలి. తప్పని సరియైన పరిస్థితులలో రోగగ్రస్తులైన వృద్ధులకు తగిన వైద్య సౌకర్యాలు వారి డబ్బుతోనే జరిపించే కనీసపు సౌకర్యాలు ఉన్న చిన్న ఆసుపత్రికూడా ఆశ్రమానికి అనుబంధ సంస్థగా ఏర్పరిస్తే ఆశ్రమంలోని వృద్ధులకు ఎంతో మనో ధైర్యం కలుగుతుంది.
ఇక వృద్ధాశ్రమాల్లో ఉండే వృద్ధులు కూడా తెలుసుకుని ఆచరించవలసిన విషయాలు ఆకళింపు చేసుకుని గడపగలిగితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలామందికి ఆహార విషయాల్లో తేడాగా అనిపించవచ్చు. సాధారణంగా ఆశ్రమం వారు కూడా వృద్ధుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్ధాలు తయారు చేయిస్తారు. చేయించాలి కూడా. అయితే అందరి అలవాట్లు, రుచులు ఒకేలా ఉండవు. కాని ఆశ్రమవాసులు కూడా కొంతవరకూ సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది. తమకు నచ్చిన పదార్ధాలను కొంత ఎక్కువ మోతాదు తీసుకుని తృప్తి పడవచ్చు. తమ శరీరానికి పడే పళ్ళు, డ్రైప్రూట్స్, స్నాక్స్, స్వీట్సు వగైరాలు తెచ్చుకునో, తెప్పించుకునో, తమకు కేటాయించిన, నివాసంలో ఉంచుకొని ఆకలనిపించినప్పుడో, నీరసంగా ఉన్నప్పుడో తినవచ్చు.
పిల్లల దగ్గరయినా కొన్ని విషయాలలో సర్దుబాటు చేసుకోవలసి వస్తుంది కదా! అదేదో ఆశ్రమాల్లోనే గడుపుకుంటూ నలుగురితో ఆనందంగా కాల క్షేపం చెయ్యటం, పుస్తకాలు చదువుకోవటం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, వీలున్నప్పుడు ఇండోర్‌గేమ్స్ అడుకోవడం లాంటివి చేస్తుంటే చివరి దశ సుఖంగా గడుస్తుంది.
ఒక వృద్ధాశ్రమం నడపాలంటే ఆ సంస్థ కూడా ఎన్నో ఆటో పోట్లు ఎదుర్కొంటూ సంయమనం పాటించాలి. అలాగే ఆశ్రమ వాసులు కూడా సంస్థకి సహకరిస్తూ సంయమనం పాటించాలి. ఆశ్రమంలో ఇంతగా సర్దుబాటు చేసుకుంటూ ఉన్నప్పుడు పిల్లల దగ్గరకూడా సర్దుకుంటూ గడపవచ్చు కదా అనిపించవచ్చు. కాని వెనకటి తరం వాళ్ళలా మనం లేము. మనలాగా మన ముందు తరం వాళ్ళుండలేరు. కాలానుగుణంగా పరిస్థితుల ప్రభావం వల్ల మార్పులు, ఆలోచనా విధానాలు ఉంటాయి. ఆశ్రమంలో అయితే అందరూ ఇంచు మించు ఒకే వయసు వారు కావటం, తొంభై పాళ్ళు ఒకే ఆలోచనా విధానాలు కావటం వల్ల మనసుకేదో కొత్త వ్యక్తిత్వం, స్వేచ్ఛ వచ్చినట్లు అనిపించి వృద్ధాప్యం ప్రశాంతంగా గడుస్తుంది.
ఈ రోజుల్లో వృద్ధాశ్రమాల సంఖ్య ఎంతగా పెరుగుతున్నదో, అంతగా వ్యాపార సంస్థల్లా కూడా మారుతున్నాయి. అలాకాకుండా కరుణ, దయ, సుహృద్భావాలు కలిగి ఉండాలంటే ప్రభుత్వంకూడా ఆర్ధిక సహాయ సహకారాలు ఎంతగానో అందించి ప్రోత్సహిస్తే వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉండటం చాలా మంచిదే.