హైకూలు, నానీలు, నానోలు, ఫెంటోలు, రెక్కలు, చాంద్‌తారలు, అలవోకలు, చిట్టిముత్యాలు ఇవన్నీ ఏకజాతి పక్షులే. పిట్టకొంచెం కూత ఘనాలే. ఈ మధ్యకాలంలో ‘మణిమాలికలు’ పేరుతో ఫేస్‌బుక్‌లో రాస్తున్నారు. పుస్తకరూపంలో 20 మంది కవులతో వచ్చింది. అందులో 11 మంది పురుషులు, 9 మంది స్త్రీల కవితలున్నాయి.
ముఖంలేని ముఖపుస్తకాల కవితలివి. భావస్వేచ్ఛా ప్రకటనలివి. ప్రేమరాహిత్యంలో, ఊహల వంతెనను నిర్మించుకున్న కలలలోగిళ్ళు ఈ కవితలు.
బాల్యం, కౌమారంలోని క్రొంగొత్త కాంక్షలు, దూరమైపోయిన జీవననేపథ్యాలు, ప్రేమ చేజారిన క్షణాలు, ఉన్నాయి. విరహమే ప్రధానమైన అంశం. మనస్సుకు వయస్సు లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలే. శరీరాన్ని విదిల్చి, మానసిక ప్రపంచాల్ని తెరిచి, మధురోహల చిగుళ్ళతో, తమ భావాల సందడిని వినిపించిన ప్రేమగీతికలివి.
నిశ్శబ్ద ప్రేమలు, రహస్య ప్రేమలు, ప్రేమిస్తున్నామన్న భావనను ప్రేమిస్తున్న ప్రేమలు. ఆ కాలంలో ప్రేమించుకోవడానికి, తీరికా, ఓపికా, కోరికా లేని వాళ్ళు, పోగొట్టుకున్న క్షణాల్ని పోది చేసుకుందామన్న తపన కనబడుతోంది.
నిజానికి కవిత్వమంతా వ్యక్తిగతమే కానక్కరల్లేదు. సామాజికాంశము, కదిలించిన, పెనునిద్దరను వదిలించినదేదైనా కవిత్వమే అవుతుంది. మధ్యవయస్సు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. తీవ్రమైన ఒక అశాంతి, అద్భుతమైన ప్రేమను పొందాలనే ఆర్తి, ప్రేమే జీవన మాధుర్యమనుకునే తపనలే ఎక్కువగా కనబడ్డాయి.
మామూలుగా పెద్ద కవితల్లో వెతికితే అక్కడక్కడా తటిల్లతలు కన్పించేవి. ఈ ‘మణిమాలికలు’ ప్రక్రియవల్ల వాటిని వెతుక్కునే అవసరం లేకుండానే వెంటనే కన్పిస్తున్నాయి.
వేగవంతమైన నేటి ప్రవాహ జీవితంలో నీటి బిందువులివి. రెండు లైన్లలోనే చెప్పదలచుకున్న భావాన్ని చెప్పెయ్యడం. ‘ద్విపద’ను గుర్తు తెచ్చేదిలా వుంది. ద్విపదలో ఏకసూత్రత ఉంటుంది. వీటిల్లో అది లేదు. వేటికవి వేర్వేరు భావప్రకటనలు. పాదాలలో పోలిక ఉందంతే. రూపాన్నిబట్టి వీటిని ‘మెసేజ్’ కవిత్వంగా కూడా భావించొచ్చు. గృహిణులు రాసిన కవిత్వంలో పెయిన్ ఎక్కువగా కన్పించింది.
మాధవి ప్రసాద్.కె.:
‘నీకన్నా అద్దమే ఎంతో నయం
నేను ఏడిస్తే అది ఎప్పుడు నవ్వదు’-
ఎంతో లోతైన భావాన్ని క్లుప్తంగా చెప్పారు.
జానకి పాదుక
‘కోరి వలచిన నాడు అనుకోలేదు
కొరివితో తలగోక్కుంటానని’-
భారతీరాయన్న కాట్రగడ్డ
‘నీ జ్ఞాపకాల గాయాలే
నా కవితలకి సిరాచుక్కలయ్యాయి’-
దేవరాజుల దయానందరావ్
‘నీకంటే మృత్యువే నయం
వేలసార్లు వేధించి వధించదు’-
ప్రసాద్ అట్లూరి
‘ఏమన్నా పొగొట్టుకుంటే తెగబాధపడి పోతుంటాం
మరి మనసు పారేసుకుని మురిసిపోతామేంటి?
పద్మకుమారి వంగర
ప్రేమంటే
ఒక నువ్వు ఒక నేనూ.. కానేకాదు ఒక ‘మనం’.
సాయి కామేష్ గంటి
స్కూలుకెళుతూ కనిపించింది పసితనం
పుస్తకాల శిలువను మోస్తూ
శ్రీ వెంకటేష్ గ్రంథి
ఆరు పలకల దేహం
తినకపోవడంవల్ల కాదు, తినడానికి లేకపోవడం వల్ల.
అందరి కవితల్ని పరిచయం చేయడం సాధ్యం కాదు కాబట్టి, మీరు స్వయంగా ఈ మణిమాలికల ద్వారాన్ని తెరుచుకొని వెళితే కొన్ని అద్భుతమైన తటిల్లతలు కన్పిస్తాయి.
మణిమాలికల్లో వస్తు విస్తృతిని సామాజిక బాధ్యతను పెంచే క్రమంలో కవిత్వం రచిస్తే మరింత బాగుంటుంది.
నిజానికి కవిత్వ ఉద్దేశ్యం కూడా అదే. దానివల్ల సమాజానికి మేలు జరగాలని, ఆనందమేకాక, ఆదర్శమూ నిండి వుండాలన్నదే పలువురి ఆకాంక్ష కూడా! ‘గుడిపాటి’ గారన్నట్లుగా, క్లుప్తత, గుప్తత, సంక్షిప్తత, భావసాంద్రతలు కలగలిసివున్న కవిత్వమిది
బావు0ది