చాప్టర్ – 16
స్త్రీలపై అత్యాచారాలకు కుల మత రాజకీయాలు, తత్ఫలితమైన సంఘర్షణలు రాజ్యాధికార ప్రయోగాలు, కారణం కావటం మరొక వాస్తవం. గుజరాత్లో 2002 ఫిబ్రవరి 27న గోదా రైల్వే స్టేషన్ దగ్గర సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌ను స్థానిక ముస్లిం గుంపు తగలబెట్టి 58 మంది సజీవ దహనానికి పాల్పడ్డదన్న నెపంతో ఫిబ్రవరి 28 నుండి గుజరాత్‌లోని 18 జిల్లాలలో అనేకచోట్ల ముస్లిం ప్రజానీకంపై జరిగిన మూకుమ్మడి దాడులలో విశృంఖల హింస, హత్యా కాండ చోటుచేసుకొన్నాయి. ఈ క్రమంలో స్త్రీలు అనేకమంది వివస్త్రలు చేయబడ్డారు. మూకుమ్మడి అత్యాచారాలకు గురయ్యారు. మూడు సంవత్సరాల పసిపాప నుండి యాభై ఏళ్లు పై బడ్డ వాళ్ళవరకూ ఎవ్వరూ వదిలిపెట్టబడలేదు. గర్భిణులపై కూడా అత్యాచారాలు జరిగాయి. గర్భిణి స్త్రీ కడుపు చీల్చి బిడ్డను మంటల్లో పడేశారు. ముస్లింలను పెళ్ళిచేసుకొన్న హిందూ స్త్రీలు కూడా అత్యాచారాలకు హత్యాకాండకు గురయ్యారు. ఈ గుజరాత్ ఘటన ప్రజా స్వామిక వాదులందరినీ కలవర పరిచింది. హిందూత్వ దురహంకారం, క్రూరత్వం గుజరాత్ ప్రభుత్వ మద్దతుతో సృష్టించిన భీభత్సం నిరసించబడింది. ఈ సందర్భంలో ఈ మొత్తం హింసాకాండకు, ప్రత్యేకించి స్త్రీలపై జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకం గా ఆంధ్రదేశంలోని పౌరహక్కుల సంఘా లు, మహిళా సంఘాలు ప్రతిస్పందించాయి.
స్త్రీలను మధ్య యుగాలకు తీసు కువెళ్ళే విశ్వహిందూ పరిషత్ సంస్క ృతిని, ముస్లిం మత ద్వేషంతో ముస్లిం స్త్రీలపై అత్యాచారాలు జరిపిన తీరును నిరసిస్తూ 2003 మార్చి 8 ని జరుపుకొనాలని ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమాఖ్య పిలుపునిచ్చింది. గుజరాత్లో ముస్లిం ప్రజలమీద హత్యాకాండను, ముస్లిం స్త్రీలమీద పాశవిక దాడులను ఖండిస్తూ కరపత్రం వేసింది. ఆ సందర్భంగా సంస్థ బాధ్యులు పోలీసు కేసులను ఎదుర్కొనవలసి వచ్చింది. అయితే హిందూ మతోన్మాద రాజకీయాలకు తరతరాలుగా బాధితులుగా వున్న స్త్రీలు గుజరాత్ బాధిత మహిళలతో సహానుభూతి సంఘీభావాన్ని ప్రకటించటం సహజ ప్రతిచర్యగా భావించబడింది. ఆ రకంగా ఆంధ్రదేశ మహిళా ఉద్యమాన్ని అత్యంత ప్రభావితం చేసింది ఈ ఘటన. మైనారిటీ స్త్రీ వాదం అనేది ప్రత్యేకంగా ఆంధ్రదేశంలో బలపడటానికి ఇది కారణమైంది.
ఈ వరుసలోనే ఈ దశకంలో జరిగిన మరొక ఘటన భైర్లాంజీలో దళిత కుటుంబంపై దాడి. మహారాష్ట్రలోని భండారా జిల్లాలోని ఒక గ్రామం భైర్లాంజి. ఆ గ్రామంలో స్వంత వ్యవసాయం చేసుకొంటూ పిల్లలను చదివించుకొం టున్న సురేఖ కుటుంబం తమ భూమిని ఆక్రమించు కొనటానికి ఆధిపత్య కులాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటిస్తూ వచ్చింది. అది భరించలేని ఆధిపత్య కులాల వాళ్లు సురేఖ ఇంటిపై దాడిచేసి ఇద్దరు కొడుకులు, ఒక కూతురితో సహా ఆమెను బయటకు లాగి కొడుకులను చిత్రహింసలు పెట్టి చంపి ఆమెను కూతురిని వివస్త్రలను చేసి ఊరంతా తిప్పి అత్యాచారం చేసి హత్య చేశారు. దేశాన్నంతా కలవర పరచిన ఈ ఘటన ఆంధ్రదేశంలో మహిళా ఉద్యమంలో స్త్రీలందరూ స్త్రీలు కావటంవల్ల ఒకటి కాదు, దళిత స్త్రీల సమస్యలు ప్రత్యేకం, ఆధిపత్య కులాల స్త్రీలు ప్రయోజనాల రీత్యా తమ వర్గం పురుషులతోనే మమేకమవుతారు కానీ దళిత స్త్రీల పక్షం వహించరు అన్న ఆలోచన బలపడటానికి కారణమైంది.
2012 జూన్ 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని లక్ష్మింపేటలో జరిగింది కూడా దళితులు సాగుచేసుకొంటున్న వ్యవసాయ భూముల ఆక్రమణ కొరకే. ఇందులోనూ స్త్రీలమీద పిల్లలమీద దాడి తీవ్రంగానే వుంది. దాడికి పాల్పడిన కాపులలో భర్తలకు సహకరిస్తూ భార్యలు కూడా పాల్గొనటం స్త్రీలు ఆయా సామాజిక వర్గాల్లో భాగంగా దళిత బిసి ఆధిపత్య వర్గాలుగా విడిపోయి వున్నారన్న వాస్తవాన్ని గుర్తు చేసింది.
దళితుల ఆత్మగౌరవం ప్రధాన ఎజండాగా నడుస్తున్న పదిహేను సంవత్స రాల చరిత్రగల (1985-2000) దళిత ఉద్యమంలో దళిత స్త్రీల క్రియాశీలక భాగస్వామ్యం పెరుగుతూ మహిళా ఉద్యమాన్ని ప్రభావితం చేయగల దళిత దృక్పథం ఈ దశకంలో అభివృద్ధి చెందింది. దళిత స్త్రీశక్తి వంటి సంస్థలు దళిత స్త్రీల హక్కుల చైతన్యవ్యాప్తికి కృషి చేశాయి.
(ఇంకావుంది)