నాకు పాకి పని గురించి విన్నా, పాకి పనోల్లను చూసినా మా మేనత్తే యాదొస్తది. మా మేనత్తపేరు మల్లక్క. వాల్లూర్లె సఫాయూడుస్తది. అయితే పంచాయితాఫీసుల పంజేసే ఒక నౌకరిదారి యింట్ల కక్కోసెత్తిపోసే పాకామెకు జెరమొచ్చి రాలేదని బజార్లూడిసే మా అత్తను చేయమ న్నడట. సెయ్యనంటె వూడిసే పని పోతదో ఏమో! ఎట్ల బత్కాలె, పాకామె గూడనా అసోంటి ఆడమనిషే గద ఆమె జేసినపుడు నేంగూడ జేత్తనుకున్నది. ముక్కుకుబట్ట గట్టుకొని పది రోజులు మలమెత్తిపోసి మనిషిల మనిషిగాలే.. ఆ పదిరోజులు యింటికాడికొస్తే పీతివాసనొస్తందని గిన్నె, చెంబు ముట్టనియ్యలే, బువ్వ వండనియ్యలే ఆమె పెనిమిటి పిల్లలు.
‘గీ పది రోజులకే నన్ను గిట్లంటం డ్రు, సీ…. సీ…. అని దూరం బెడ్తండ్రు గీ పాకిపని యెల్లకాలంజేసేటోల్ల గోసెంతుం టదో! యింట్ల బైట, గీ బతుకు ఎవ్వలికి రావద్దు, గీ పని పాడువడ గా వాసనకు కడుపుల పేగులు నోట్లె కత్తయి, వాళ్లేరిగింది వాల్లే ఎత్తిపోసుకోవచ్చు గదా! వాల్లది వాల్లకే రోతత్తె వేరే వాల్లకెంత రోత రావాలె. తక్కువ కులమాడోల్లంటె అగ్గువకు దొర్కుతమని, యివ్వ లేకుంటున్నమని, గిసోంటి గలీజు పని జేయిస్తరు వాల్లకు గత్తర్రాను, అన్న మాటలు నాకు బాగా యాది.
ఈ మధ్య భాషాసింగ్ అనే ఒక జర్నలిస్టు భారతదేశ రాష్ట్రాలన్ని తిరిగి మనిషి మలమూత్రాల్ని ఎత్తిమోసి సాఫ్ జేసే పాకి వృత్తిమీద ‘అన్ సీన్’ ఒక పుస్తకం రాస్తే హైద్రాబాద్‌లో సఫాయి కర్మచారి ఆందోళన కన్వీనర్ బెజవాడ విల్సన్ వాల్లు ఆవిష్కరిం చిండ్రు. భారతదేశ అన్ని రాష్ట్రాల్లో పాకి వృత్తివుందని ఏ రాష్ట్రం మినహాయింపుగా లేదని చెప్పింది. సమన్యాయ సమాజాలు అని చెప్పే కమ్యూనిస్టు పార్టీ ఏలుబడిలో వున్న కేరళ, పశ్చిమ బెంగాల్ నుంచి సస్య విప్లవా లొచ్చిన పంజాబ్ దాకా పాకి తిరిగి పాకి మహి ళల అనుభవాల్ని, వ్యతిరేకతల్ని, కులం కార ణంగా గోసలు అక్షరీకరించింది భాషాసింగ్.
పాకి ఆడవాల్లు లేనికాడ మాదిగ ఆడవాల్లే పాకి వృత్తిలో వున్నారని మా మేనత్త సంఘటనే కాక, రైల్లల్ల కక్కోసులు కడిగేది రైల్ పట్టాల మధ్య మలం ఎత్తి పోసేది, శుభ్రం జేసేది యీ ఆడవాళ్లే. మా కులాల మహిళలకే ఎందుకీ నికృష్ట వృత్తి. మా అత్తన్నట్లు వేరే బతికే దారి లేకనా, ఆకలి యింతకన్నా కౄరంగుంటదనా! యీ కౄర త్వాలు, నీచాలు నికృష్టాలు మా కులాల ఆడవాల్లకే ఎందుకంట గట్టిండ్రని కడుపు కత్తి కోతైతది. చాలా వృత్తుల్లోకి యాంత్రీకర ణొచ్చినట్లు పాకి వృత్తిలోకెందుకు రావట్లేదు! ‘యీ వృత్తి తల్లి పిల్లలకు జేసే పవిత్రమనీ, సమాజానికి తల్లిలాంటి వృత్తి అని గ్లోరిఫై జేసిండు గాంధి. కాని అంతగా పవిత్రమను కుంటే తల్లిలాంటి వృత్తే అనుకుంటే కులరహితంగా మిగతా కులాలు ఎందుకు చేయట్లేదనే దానికి సమాధానముండదు. అంటరాని కులాలైన పాకి, మాదిగ ఆడవాల్ల చేతనే మలమూత్రాలెత్తించే యీ వ్యవస్థీకృత దుర్మార్గాన్ని మాట్లాడకు. అంబేద్కర్ ఆనాడే గాంధీ పవిత్రతల్ని ప్రశ్నిస్తూ పవిత్రము పాకీ వృత్తనుకుంటే మీ కులాలు ఎందుకు చేయవంటే జవాబుల్లేవు.
నిత్యం అంటరానితనాల్ని ఆచరి స్తూ.. కులగోడలు దాటని అగ్రకుల సమాజ ము కులమా ఎక్కడుంది? అంటరు, జోగినీ లా వాళ్లెక్కడున్నరు అంటరు కాని కులహిం సలు, కులహత్యలు, అగాయిత్యాలు నిత్యం జరుగుతూనే వుంటయి. బోనాల ఉత్సవాల్లో, బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాల్లో లక్షలమంది జోగినీలున్నా కనిపించరు. ఆడ మగ తేడాలే అంతా సమానంగానే వున్నాంగదా అని వాదిస్తరు కాని రోజు జరిగే హత్యలు, హింసలు, అత్యాచారాలు ఎందుకు కారకులు ఎవరు? యిట్లా మసిబూసేపని పాకి వృత్తికి కూడా ఎదురైంది. 2012 లో అనుకుంట. జాతీయ మానవహక్కుల కమీషన్ అన్ని రాష్ట్రాలనుంచి పాకి పనికి సంబంధించిన నివేదికలతో మీటింగు పెడితే అన్ని రాష్ట్రాలు నిల్ రిపోర్టు యిచ్చినయి ఏపీతో సహా. అట్లా అబద్ధపు రిపోర్టులిచ్చి చేతులు దులుపు కున్నది. పాకి వృత్తి లేనే లేదని చెప్పిన వాల్లకు ‘సఫాయి కర్మచారి ఆందోళన్’ వాల్లు చూయించినా కళ్లు మూసుకునే వ్యవస్థలనేం చేయాలె. లేదనుడు సౌకర్యవంతంగా తప్పించుకునే ఒక వ్యవస్థీకృత కుట్ర. ఆ కుట్రలుండడం వల్లా లేవన్న యీ దుర్మార్గా లన్నీ కొనసాగించడానికే. యీ కుట్రల కౄరత్వాలు పాకీ పనిచేసే కులాల్లో ఆడవాల్లు గా పుడితే గాని ఆ గోస, బాధ అర్తంగాదేమో!
సఫాయి కర్మచారి ఆందోళన్ వాల్లు 20 సంవత్సరాలు పోరాడి, పాకీ వృత్తి రద్దు చట్టం తెచ్చినా, పునరావాసం చట్టం తెచ్చినా 2014లో వచ్చిన సుప్రింకోర్టు జడ్జిమెంటు ప్రకారం పది లక్షల ఎక్స్‌గ్రేషి యాలున్నా వారికి చేరే యంత్రాంగం నిజాయితీగా లేదు.
”అంటరాని కులాలు పాకీ వృత్తిని దైవాజ్ఞగా దైవకార్యంగా… తరతరాలుగా చేస్తున్నారు లేకుంటె యిన్ని తరాలుగా యీ వృత్తి కొనసాగడం అసాధ్యం” అనేవాల్లు రాజ్యం చేస్తున్న దేశంలో వుండడం ఒక తీరని విషాదం.