నేను భుజ్‌లో ఆగిపోయాను. తక్కిన వాళ్ళందరు వెళ్ళిపోయారు. మాండవి జైలు నుండి వచ్చాక జార్జి చుట్టుపక్కల ఉన్న బస్తీల వాళ్ళందరిని జమ చేయమన్నారు. నేను, జార్జి, లాడలీ చివరిరోజు సత్యాగ్రహం చేయడానికి భుజ్ బయట ప్రచారం చేయడానికి వెళ్తు ఉండేవాళ్ళం. రాత్రి మేమందరం ఈ భుజ్ వాస్తవ్యుల ఇంట్లోనే నిద్రపోయేవాళ్ళం. అందరం మేడపైన పడుకునేవాళ్ళం అక్కడ చాలా చోటు ఉంది. చల్లగాలి వీచేది. చర్చలు జరిపేవాళ్ళం. లాడలీకి నాకు మధ్య స్నేహం పెరిగింది. మేమందరం ఛాడ్‌కోట్ సీమ దాకా మిలట్రీ వాళ్ళతో వెళ్ళాము. ఎడారిలో ఎండమావిని చూసాము. కర్నల్ రాజ్ మమ్మల్ని తీసుకువెళ్ళారు. లోక్‌సభ మెంబరు కావడం వలన జార్జిని ఎస్కార్డ్‌తో తీసుకువెళ్ళారు. నేను వెళ్ళాను. మేం ఎవరి ఇంట్లో అయితే ఉండేవాళ్ళమో ఆ ఇంటి ఇద్దరు ఆడపిల్లలు కూడా మాతో వచ్చారు. తరువాత కఛ్ జనపద్ పరిషత్‌కి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు లోక్‌సభలో ఈ ఇద్దరు యువతులు లోక్‌సభలో చెప్పులు విసిరారు.
చివరిరోజు చాలామంది భుజ్ నుండి బయటకి వచ్చారు. ఖావడాకి కాలి నడకన వెళ్ళాలి. అక్కడి నుండి చాలా కిలోమీటర్ల దూరంలో
ఉంది. అందువలన 48 గంటల ముందే యాత్ర మొదలు పెట్టాము. రాత్రిపూట రోడ్ల మీదా పడుకునే వాళ్ళం. అక్కడే అన్నం వండుకునే వాళ్ళం. నేను లేఖానంద్ ఇంకా మరికొందరు జార్జ్ గ్రూపులో ఎప్పుడు ముందు ఉండేవాళ్ళం. కర్పూరీగారు ఇంకా తక్కిన బిహారీ నేతలు కూడా ఉన్నారు. ఎస్.కె.పాటిల్‌ని ఓడించడం వలన బొంబాయి ప్రజలందరు జార్జ్‌వైపు ఆకర్షితులయ్యారు. ఆయన దళం చాలా పెద్దది. మహారాష్ట్ర నుండి చాలా మంది ఆడపిల్లలు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. జనసంఘ్ వాళ్ళు కూడా ఉన్నారు. చివరిరోజున ఖావడాలో ఊరేగింపు బయలు దేరినప్పుడు నేను, సుధ, జనసంఘంలోని ఒక మహిళానేత ముందు జెండాలు పట్టుకుని బయలుదేరాము. భుజ్‌లో ఏ సత్యాగ్రహాల కొత్తగ్రూపు వచ్చినా వాళ్ళని ఖావడా రోడ్డుకి పంపించేవారు. మూడు వరుసలలో మైళ్ళు – మైళ్ళు మేం నడిచే వాళ్ళం. ఉత్సాహంగా ఊరేగింపు నడిచేది. ఖావడా సీమ రాగానే ఊరేగింపును ఆపేసారు. జార్జ్ ఆయన తోటివారు రోడ్డు మీదే కూర్చున్నారు. నేనూ బిహార్ వాళ్ళతో అక్కడే కూర్చున్నాను. పైన మండుటెండ రోడ్డు పొడుగునా పొగలు-సెగలు. చాలా వేడిగా ఉంది. అయినా ఎవరూ లేశమాత్రం కూడా అలసట చెందలేదు. అయ్యో ఇంత వేడిగా ఉందే అని అనుకోలేదు.
పోలీసులు మమ్మల్ని ఏ విధంగా నైనా బస్సు ఎక్కించాలని ప్రయత్నించారు కాని నేను, లేఖానంద్ ఝా బస్సులోకి సులభంగా ఎక్కకూడదని ముందే నిర్ణయించుకున్నాము. జనసంఘ్ వాళ్ళు పోలీసులు రాగానే భూమాతను స్పర్శించి దండం పెట్టుకునే వాళ్ళు. నినాదాలు చేసేవాళ్ళు. పోలీసుల చేయి పడకుండానే బస్సు ఎక్కేవాళ్ళు. మేం అందరం ఏ మాత్రం లొంగకూడదని అనుకున్నాము. జార్జ్ కూడా పట్టుపట్టారు.
పోలీసు డి.ఐ.జి. (బహుశ అతడు పంజాబీవాడు) ‘మిమ్మల్ని అరెస్ట్ చేసాము. మీరు బస్సులో కూర్చోండి’ అని చాలా సార్లు మాకు చెప్పారు.
కాని మేము కూర్చోలేదు. పోలీసులు మమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్ళసాగారు. నన్ను ముట్టుకోవద్దని వాళ్ళకి చెప్పాను. మహిళా పోలీసులను తీసుకు రమ్మనమని చెప్పాను. ఒక గంట గడిచిపోయింది. నేను లేఖానంద్, షరీఫ్ ఆలమ్ త్రికోణంలో ఒకరిచేతులు ఒకరు పట్టుకున్నాము. ఇప్పుడు పోలీసులు మా ముగ్గురిని ఎట్లా ఎత్తుకెళ్ళారు? నా కోసం మహిళా పోలీసుని పిలిచారు. మమ్మల్ని సంచులను పడేసినట్లు పడేసారు. నేను కిటికీని ఉన్న చువ్వలని వంచాను. దాంట్లోంచి దూకడానికి ప్రయత్నించాను. పోలీసులు నన్ను కొట్టడం మొదలు పెట్టారు. నేను స్పృహ రాగానే మమ్మల్నందరిని బస్సులో కూర్చోపెట్టి భుజ్‌కి తీసుకువచ్చారు. సాయంత్రం అయింది. ఇంకా అంతగా చీకటి పడలేదు. మేము బస్సులో ఉన్న వాళ్ళందరితో మాట్లాడాము. వీళ్ళు మమ్మల్ని జైలు కైనా తీసుకువెళ్ళాలని లేకపోతే జార్జ్ ఎక్కడ ఉన్నారో అక్కడికైనా తీసుకువెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చాము. మా వెనక ఎన్నో బస్సులు వచ్చాయి. వాటితో సత్యాగ్రహం చేసేవాళ్ళు ఉన్నారు. మేం దిగటం లేదని చూసి వాళ్ళు మళ్ళీ బస్సుల్లో కూర్చున్నారు. సోషలిస్టు పార్టీ అహమదాబాద్‌కి చెందిన శ్రీబారోట్ నన్ను కలవడానికి వచ్చారు. (శ్రీ బారోట్ తరువాత కాంగ్రెస్ పరిపాలనా కాలంలో సెంట్రల్ ఫైనాన్‌షియల్ మినిష్టర్ అయ్యారు) ఏమయింది రమణికా గుప్తాగారు! అని ఆయన గుజరాతీలో అడిగారు.
నేను జరిగిందంతా చెప్పాను. ”మమ్మల్ని వదిలేసామని వీళ్ళు అంటున్నారు. అప్పుడు ఖావడాలో మమ్మల్ని అరెస్ట్ చేసామని చెప్పారు. ఇప్పుడు జార్జ్‌ని కూడా అరెస్ట్ చేసారు కదా! మరి ఆయన ఏరి? ఆయనని జైలుకి పంపిస్తే మమ్మల్నిందరిని పంపిచండి. మేం కూడా చట్టాన్ని ఉల్లంఘించాం కదా! ఒకవేళ మమ్మల్ని అరెస్ట్ చేస్తే విచారణ జరపకుండా మమ్మల్ని ఎట్లా వదిలేస్తారు? వీళ్ళు రాతపూర్వకంగా అసలు సత్యం ఏదో చెప్పాలి. లేకపోతే మేము బస్సు నుండి చస్తే దిగము”.
రమణికాగుప్తా బస్సు దిగడం లేదు అన్న వార్త భుజ్ నగరం అంతా అడవిలో నిప్పులా వ్యాపించింది. అందరిలోని కోపం కట్టలు తెంచుకుంది. బస్సుస్టాండ్ దగ్గర వెల్లవలా అందరు విరుచుకుపడ్డారు. డిప్యూటి కమీషనర్ వచ్చారు. అందరు ఆయన్ని చుట్టుముట్టారు రాళ్ళు రువ్వారు. లాఠీఛార్జ్ అయింది. మందుగుండ్లు దూసుకువెళ్ళాయి. మమ్మల్ని బస్సుల్లోంచి బలవంతంగా లాగడానికి ప్రయత్నించారు. కాని ఎవరిని దింపలేకపోయారు. చివరికి ఇక ఏం చేయలేక అధికారులకు రాసి ఇవ్వాల్సి వచ్చింది. మమ్మల్ని చట్ట విరుద్ధంగా ఎందుకు ఆపారు? మళ్ళీ విడిచిపెట్టారు. మరి జార్జ్ ఇంకా తక్కిన కొందరు కూడా మేం చేసిన అపరాధమే చేసారు. మరి ఆయననే జైలు కెందుకు పంపించారు? ప్రభుత్వం రాసిందంతా నేను జార్జ్‌కి పంపించాను. జార్జ్ కేసు విషయంలో డిప్యూటీ కమీషనరు రాసి ఇచ్చిన స్టేట్‌మెంటు మీద చర్చ జరిగింది. తులసిగారు, సుధగారు మరి ఇంకా కొందరు సోషలిస్టు పార్టీ నేతలు ఉద్యమాన్ని మానేద్దాం అని అనుకున్నారు. జార్జి ఉన్న జైలుకి వెళ్ళి ఆయనకి అంతా చెప్పాము. ఆయన సలహా మేరకు ఏడు రోజులు వరకు ఎవరి నేతృత్వం లేకుండానే మేము ఉద్యమాన్ని సాగించాం.
ఉద్యమం ముగిసాక జార్జి జైల్లో ఉన్నప్పుడు ఆయన నన్ను మొత్తం భుజ్ సౌరాష్ట్ర, అహమదాబాద్‌లలో యాత్ర చేసి ప్రజల మద్దత్తు కోసం ప్రయత్నం చేయమని ఆయన కేసును చూడటానికి ఒక కమిటిని తయారు చేయడానికి తన స్నేహితుడి గురించి చెప్పి బాధ్యత అంతా నా మీద వేసారు. ప్రణాళిక ప్రకారం మేం అందరం ఒక నిర్ణయానికి వచ్చి లాయర్లను పిలిచి ఒక సభ చేసాము. జార్జి కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఈ కమిటీ ఎంతో పనిచేసింది. జార్జ్, లాడ్‌లీలకు ఎన్నో రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఈ లోపల నేను అహమదాబాద్‌లోని బారోట్ దగ్గరికి వెళ్ళాను. ఎన్నో సభలు జరిపాను. మళ్ళీ సుందరగఢ్ వెళ్ళాను. సభ సమావేశాలు జరిపాను. అక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలను చూసాను. సూర్య దేవాలయాన్ని కూడా చూసాను. పాలితానాకి కూడా వెళ్ళాను. అక్కడ నరేంద్రగారు ఒకసారి 500 మంది ప్రజలతో సోషలిస్ట్ పార్టీ సమావేశాన్ని జరిపారు. ఇక్కడ కొండ లోపల ఒక పెద్ద శిలను పగలగొట్టి ఒక పెద్ద సభాగృహాన్ని తయారు చేసారు. ఇందులో ఒక స్తంభం కూడా లేదు. దీనికింద రెండు పెద్ద గదులు ఉన్నాయి. అక్క పెద్ద పెద్ద కళాయిలలో నూనె మరగించేవాళ్ళు. శిక్ష అనుభవిస్తున్న వారికి ఆకళాయిలలోని వేడి వేడి నూనె మీద తోసేసేవారు. పాలితానా గురించిన ఎన్నో కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ క్షేత్రం పత్తిని పండించే రైతులది. అంతా నల్లరేగటి మట్టి. ఇక్కడ రైతులు కమర్షియల్ పంటనే పండిస్తారు.
జైలు నుండి విడుదల అయ్యాక జార్జ్ కఛ్ జన పరిషద్ అన్న పేరున ఒక గ్రూపును తయారు చేసారు. నేను ఇందులో ఎంతో ఇంటరెస్ట్‌గా పాల్గొన్నాను. కఛ్‌కి చెందిన కొందరు యువకులను తీసుకుని బిహారు యాత్ర చేసాను. నేను వాళ్ళను తీసుకుని పాట్నా, ధన్‌బాద్, రాంచీ వెళ్ళాను. ఇందోర్ కూడా వెళ్ళాను. తిరిగి భుజ్‌కి వచ్చాము. ఒక లక్ష మందితో హస్తాక్షరాలు చేయించే కార్యక్రమాన్ని చేపట్టాము. ఇదే సమయంలో నేను దక్షిణ్ భారత్‌లోని బెంగుళూరు, కేరళకి కూడా వెళ్ళాను. కర్నాటకలో అప్పుడు శ్రీపాటిల్ సోషలిస్టు పార్టీకి ప్రముఖనేతగా ఉన్నారు. వారు తరువాత కర్నాటక స్టేట్‌కి ముఖ్యమంత్రి అయ్యారు. కేరళలో వీరేంద్రకుమార్ సభా సమావేశాలను ఏర్పాటు చేసారు. మైసూర్‌లో పెద్ద మైదానంలో జరిగిన మొదటి సభలో కఛ్ ఉద్యమం గురించి ఉపన్యాసం ఇచ్చాను. ఈ యాత్రలో నేను మద్రాసు చేరగానే రైలులో నా బట్టలు, డైరీలు, రచనలు, లాడలీకి నేను రాసిన ఉత్తరాలు, ఆయన నాకు రాసిన ఉత్తరాలు పోయాయి. కర్నాటకలోని మా వాళ్ళందరు అక్కడికి వచ్చారు. నేను ధరించిన దుస్తులు, నా దగ్గర ఒక నైటీ మాత్రమే మిగిలాయి. మావాళ్ళు ఖాదీభండార్‌లో నా కోసం బట్టలుకొన్నారు. నన్ను మద్రాసు నుండి బెంగుళూరు తీసుకువెళ్ళారు.
నేను లాడలీ మాంట్ ఆబూ నుండి బిహారుకి వెనక్కి వెళ్ళిపోయాము. ఢిల్లీలో నేను రమామిత్రా గారిని కలిసాను. అప్పుడు నా మనస్సు బాగా లేదు.
ఈ లోపల భుజ్-కఛ్‌ల నుండి ఒక అర్జీ వచ్చింది. దాంట్లో అందరి సైన్‌లు ఉన్నాయి. ఆ రోజు లోక్‌సభలో దీనిని ప్రవేశపెట్టాలి. జార్జ్ పాటిల్‌ని ఓడించి గెలవడం వలన దేశం నలుమూలల నుండి ఎందరో ఆయనని ఇష్టపడసాగారు. ముఖ్యంగా బొంబాయి, గుజరాత్‌ల నుండి వారు స్వీచ్ కూడా బాగా ఇస్తారు. ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొంటారు.
ఆ ఇద్దరు యువతులని లోక్‌సభలోని గాలరీకి తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత నాపై ఉంది. జార్జ్ కింద ఆర్జీ చదువుతున్నప్పుడు చ్ఛ్ వికాస పరిషత్ వైపు నుండిపైన ఉన్న ఆ ఇద్దరు యువతులు నినాదాలు చేయాలి, చెప్పులు విసరాలి అన్న నిర్ణయం జరిగింది.
కాంగ్రెస్ మెంబర్లు ఆ ఇద్దరికి పాస్ చేయించారు. నిర్ణయించిన ప్రకారం నేను ఏమీ తెలియనిదానిలా పైకి వెళ్ళి కూర్చున్నాను. చెప్పులు విసిరేసారు. అంతటా గందరగోళం మొదలయింది. ప్రణాళిక ప్రకారంనేను కిందికి వెళ్ళాను. వాళ్ళిద్దరిని అరెస్టు చేసారు. రోజంతా వాళ్ళని అక్కడే ఉంచారు. తరువాత విడుదల చేసారు. కాని యావత్తు దేశం దృష్టి కచ్ఛ్‌వైపు మరలింది. ‘కచ్ఛ్ జనపరిషత్’ కోసం దాదాపు మూడు నెలలు ‘సత్యాగ్రహం’ తరువాత భుజ్, సౌరాష్ట్ర, అహమదాబాద్ వెళ్ళాను. అక్కడే నేను కొంత గుజరాతీని నెర్చుకొన్నాను. జార్జ్, లాడ్‌లీల స్నేహం వలన ప్రాణాలకు సైతం తెగించి ఉద్యమాన్ని నడపడం నేర్చుకొన్నాము. నేను మంచి ఆరేటర్‌ని కావడానికి కూడా వీళ్ళిద్దరే కారణం. ముఖ్యంగా లాడరీకి నాకు మధ్య ఎప్పుడు చర్చలు జరుగుతూ ఉండేవి. అప్పుడప్పుడు వాడిగా వేడిగా సాగేవి. ఇద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగేవి. అప్పుడు జార్జ్ మా ఇద్దరిని శాంతింపచేసేవారు.
స్త్రీలలో న్యూనతా భావం
సంఘటనలు ఎన్నో జరిగాయి. దుర్ఘటనలు కూడా చాలా జరిగాయి. నేను వీటిని గురించిన వివరాలే ఇస్తాను. నేను ప్రవాహానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు, ఉద్యమానికి కొత్త దృష్టినిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను ఏనాడో అగ్నిదీక్షను తీసుకున్నాను. అందువలన అగ్ని పరీక్షలన్నింటిని అధిగమించాను. అసలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని నాకనిపించింది. అసలు ఆ అగ్నిపరీక్షలకు నిలవాలన్న ఆలోచన కూడా లేదు. నేను నా చరిత్ర గురించి ఎప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఈయలేదు. నేను ఒక తెరిచిన పుస్తకంలా మీ అందరి ఎదుట ఉన్నాను. నా జీవితంలో ఏ చిదంబరరహస్యాలు లేవు. ఏ పరదాలు లేవు. నా అస్తిత్వం ఉంది, ఇంకా ఉంటుంది అన్న నమ్మకంతో నేను అగ్ని పథంలో నడిచాను. అందుకే నా మీద ఎవరు ఎంత బురద చల్లినా, కత్తులు కఠారులు దూసినా అన్నింటినీ ఎదిరించాను. ముందడుగు వేసాను.
సాధారణంగా స్త్రీలు, ముఖ్యంగా భారతీయ సమాజంలోకి స్త్రీలు అపరాధ భావంతో, న్యూనతా భావంతో బాధపడుతూఉంటారు. పురుషులకన్నా తాము తక్కువేఅన్న కాంప్లెక్స్ వాళ్ళల్లో ఉంటుంది. బహుశ స్త్రీలందరు సమాజం గీసిన గీటు దాటాలనుకున్నా ఆచారాలు మూఢ నమ్మకాలకు విదర్ధుంగా ఆలోచించినా ఏ పని అయినా చేసినా తామేదో అపరాధం చేసారు అన్న బాధ వాళ్ళ మనస్సులో ఉంటుంది. వాళ్ళు తాము చేసిన పని తప్పని అనుకుని తమని తాము దోషులుగా అనుకుంటారు. ఈ అపరాధ భావనే వాళ్ళని అసురక్షితులుగా చేస్తుంది. పైగా ఎప్పుడు భయంతో క్షణక్షణం చస్తూ క్షణక్షణం బతుకుతూ ఉంటారు. ఒక్కొక్కోసారి వాళ్ళు విశృంఖలతను సెక్స్ స్వేచ్ఛ లైసెన్స్ అని అనుకుని అన్ని బంధాలను తెంచుకుంటూ ఉంటారు. కాని స్త్రీ పరిపూర్ణంగా అన్నింటి నుండి విముక్తి పొందలేదు. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ వెనక్కి తిరుగుతారు. మనలోని న్యూనతా భావం తనని తాను త్యాగమూర్తిగా అనుకుతే చేస్తుంది. తరువాత త్యాగం చేయడానికి కూడా ప్రేరేపిస్తుంది. ఏ వ్యక్తినైతే ప్రేమిస్తుందో, ఎవరినుండైతే ఆశిస్తుందో ఆ వ్యక్తి గురించే ఆమె ఆలోచిస్తూ
ఉంటుంది. న్యూనతా భావం వలన ఓటమి కలిగినప్పుడు ఏడ్చే పరిస్థితి ఆమెకి వస్తుంది.
నేను కూడా ఈ రెండు కాంప్లెక్స్ (అపరాధ భావన, న్యూనతా భావం)ల నుండి పూర్తిగా విముక్తి పొందలేదు. బహుశ భూస్వామ్య సాంప్రదాయ కుటుంబాలలోంచి వచ్చిన మహిళలు ఒక్కసారిగా జీవితంలో యదార్ధస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు సెంటెమెంటల్‌గా ఆమె ఎంతో బాధపడాల్సి వస్తుంది. చిన్నప్పటి నుండి ఉగ్గుపాలతో రంగరించి పోసిన భావాల ప్రభావం స్త్రీలపై ఎంతో ఉంటుంది. అందువలన వాళ్ళు ఈ కాంప్లెక్స్‌లతో బాధపడతారు. ఇది సహజం. వాళ్ళ మనస్సుకి ఏ కొంచెం దెబ్బతగిలినా తట్టుకోలేరు. ఏ మాత్రం ఆవేశం కలిగినా ఒక్క క్షణంలో దారి తప్పుతారు. ఒక్కొక్కసారి అవతలివాళ్ళు ఇచ్చే సలహావైపు ఆకర్షితులవుతారు. నా వ్యక్తిత్వంలో కూడా ఈ రెండు కాంప్లెక్స్‌లు ఉన్నాయి. నేను కూడా ఎన్నోసార్లు కొంత అటూ – ఇటూ ఊగుతూనే ఉన్నాను. కాని ఇదంతా నా వ్యక్తిగత జీవితం వరకే పరిమితం. అందరితో కలిసిఉన్నప్పుడు మాత్రం నా పట్టుదల, నా నిర్ణయాలు ఈ కాంప్లెక్స్‌ను ఎప్పుడు అణచిపెడుతూనే ఉన్నాయి. బాహ్యజీవితం అంతరంగ జీవితం ఈ రెండు పరస్పర విరుద్ధాలు. ఈ విరోధీ తత్వాల వలన ఎన్నోసార్లు నా వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లకు గురి అవుతునే ఉన్నాను. ఎన్నోసార్లు పరాజితనయ్యాను. అయినా నా ఆత్మబలం నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తూనే ఉంది. బలహీన పడకుండా శక్తిని ఇస్తూనే ఉంది.
1968 సం||లో కచ్ఛ్ నుండి వెనక్కి వచ్చాక రాజకీయ రంగంలో ప్రవేశం పెద్ద ఎత్తున రాష్ట్రీయ విషయాలలో పాల్గొనడం, పలు రాజకీయ నాయకులతో, మిత్రులతో రాత్రింబవళ్ళు సమావేశాలు, స్నేహాసంబంధాలు పెరగడం, వీటన్నింటి మూలంగా కొంత నా కుటుంబానికి దూరమయ్యాను. నా స్నేహసంబంధాలను తప్పుడుగా అర్ధం చేసుకోవడం, ఆనైతిక సంబంధాలను అంట గట్టడం వలన నేను తీవ్రంగా ప్రతిస్పందించడం ప్రకాష్‌కి ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రకాష్ నా వంక అనుమానంగా చూడడం కూడా నేను సహించలేను. అందువలన నేను విడాకులు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. నిజానికి విడాకుల కోసం నా కుటుంబ సామాజిక రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టాల్సి వచ్చింది. నేను బలిపీఠం ఎక్కడానికి కూడా సిద్ధ పడ్డాను. ఈ సమయంలోనే కీ||శే|| సత్స్‌వ్రత బేదీ నాతో మాట్లాడారు. నిజాకి ఆయన నాకు ఉపదేశాలు ఇవ్వలేదు. నీతి-న్యాయం అంటూ అరవలేదు. మామూలుగా మాట్లాడారు. (ఆ సమయంలో నేను భావుకురాలినయ్యాను. నా మనస్సుంతా అశాంతిగా ఉండేది)- ”నీవు ఎట్లా కావాలనుకుంటే అట్లా చెయ్యి. నీ ఇష్టం, ఏ నిర్ణయం అయినా తీసుకో. కాని నీవు అయ్యో తప్పు చేసానే అని ఎప్పుడు బాధపడకూడదు. తప్పుడు నిర్ణయం తీసుకున్నాన ససేమిరా అనుకోకూడదు. నీవు చేసేది తప్పుకాదు అని నీ అంతరాత్మ చెబుతున్నప్పుడు అడుగు ముందుకు వెయ్యి. లోకం దృష్టిలో తప్పు అయినా అది చేయగల శక్తి ఉందని, లోకం దుమ్మెత్తిపోసినా, తట్టుకునే శక్తి ఉందని నిరూపించడానికి మాత్రమే ఏ పని చేయకు. నీవు ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయవద్దు. నువ్వు చేసే త్యాగం వేరెవరు చేయరని ఎంత మాత్రం అనుకోవద్దు ఎంతోమంది నీకన్నా త్యాగాలు చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నారు ఈనాడు ఉన్నారు. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని, నువ్వు త్యాగం అనో, గొప్పతనం అనో అనుకుంటే లోకం దృష్టిలో నీవు ఎప్పుడు ఉన్నతురాలు కాలేవు’. ఆ రోజు నాకు జ్ఞానోదయం అయింది. నాకు నేను త్యాగమయినని అనుకుంటూ నా మీద నేనే దయ చూసిస్తూ అవతలి వాళ్ళ పొగడ్తలను విన్నింతనే ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నానని ఆ రోజు నాకనిపించింది. ఆ రోజు నుండి నేను నిజాన్ని తెలుసుకుని ప్రవర్తించాలని నిర్ణయించుకున్నాను. ప్రశంసల వలన మనస్సులో పొంగిపోవడం నీవీపుని నీవే చరుచుకోవడం మూర్ఖత్వం అని ఆరోజు అర్ధం అయింది. ఏదైనా పని చేసి ‘నేను కాబట్టి ఇంతపెద్ద పని చేసాను’ అని అనుకోవడం, నాకు ఇష్టమైన పని నేను చేయలేకపోతే కుంగిపోవడం ఆ రోజు నుండి మానేసాను. అసలు అట్లా చేయడం జీవితం నుండి పలాయనం చేయడం అని తెలుసుకున్నాను.
పార్టీలోకూడా మా వాళ్ళు మా కుటుంబ కలహం, విడాకులపై చర్చలు జరపడం మొదలుపెట్టారు. రమామిత్ర గారితో నేను మాట్లాడాను. ఎంతోమంది నేతలు లోహియా ఉదాహరణ చూపించి నాకు నచ్చ చెప్పారు- ”కుటుంబంతో సంబంధాలు తెంచుకోకుండా మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా మిత్రులలాగా జీవించవచ్చు. వివాహం చేసుకున్నంత మాత్రాన ఒకరి దగ్గర ఒకళ్ళు ఉండాలన్న నియమంలేదు. అట్లాగే విడాకులు అవసరంలేదు. సంబంధాలను మెరుగుపరుచుకోవడం, నిలుపుకోవడం ముఖ్యం భావుకురాలు కాకు, లోకంకపోవడ తెలుసుకో, నీవు మార్పును కోరుకుంటే విడాకులు, మరోపెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు”.
విడాకులు తీసుకోవాలి, నా మిత్రుడిని పెళ్ళి చేసుకోవాలి అన్న పట్టుదలను వదిలేసాను. నా ఆలోచనలో మార్పు వచ్చింది. నా వ్యక్తిగత విషయంలో కూడా తొందర పడకుండా నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నాను. ఇదివరకయితే నేను పూర్తిగా వాటి గురించే ఆలోచిస్తూ కలత చెందేదాన్ని ఇప్పుడు ఈ స్థితినుండి బయటపడాలని ప్రయత్నం చేసాను. కాని ఇది చాలా కష్టం ముందుగా నేను అపరాధ భావన నుండి బయట పడాలనుకున్నాను. ఏదైతే అదే అయింది. అయిందా అయింది. కాకపోతే కాకపోయింది. వీలున్నంత వరకు ఆనందంగా ఉండాలి. లేకపోయినా బాధపడకు. నావైఖరి ఈ విధంగా మారిపోయింది. ఈ కొత్త వైఖరి వలన ముళ్ళు, రాళ్ళు-రప్పల నుండి నాకు విముక్తి లభించింది. నా మీద నాకు ఒక్కొక్కసారి ఎంతో దయగలుగుతుంది. అసలు జరగని సంఘటనలను ఊహించుకుని కూడా బాధపడుతుంటాను. మెల్లి-మెల్లిగా ఈ అలవాటు తగ్గిపోయింది. రాజకీయాలలో చాలామంది నేతలతో నా వ్యక్తిగత సంబంధాల గురించి గోవ పడ్డాను. నేను ఆ పరిస్థితులను ఎదిరించాను. సెక్స్ సంబంధాల విషయంలో నేరం ఎప్పుడు అవతలి వాళ్ళ మీద రుద్దలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో నేను ఇష్టపడ్డాను. నా కిష్టం లేకపోతే నేను ససేమిరా ఒప్పుకోలేదు. ఒకవేళ జరిగినా అయ్యో ఇట్లా జరిగిందే అని దిగులుపడలేదు. ఇక ముందు అర్ధం చేసుకుంటూ దుష్టుల పని చూస్తా అన్న వైఖరితో ముందుకు నడిచాను. కొన్ని పరిస్థితులలో రాజీ పడ్డాను కాని నిస్సమాయ స్థితిలో కాదు, ఏమీ చేయలేను అన్న పరిస్థితిలో కాదు. రణనీతిని దృష్టిలో పెట్టుకుని అట్లా చేయాల్సి వచ్చింది. రాజకీయాలలో నేను పెద్ద-పెద్ద నిర్ణయాలు తీసుకునేదాన్ని. చాలా మంది నన్ను విరోధించేవాళ్ళు. అయినా అన్నింటిని సహించాను. ఎప్పుడూ ఆత్మ విశ్వాసాన్ని మాత్రం నేను కోల్పోలేదు. నేను అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించాను. దీనివలన వ్యక్తిగతంగా నాకు ఎంతో నష్టం కలిగింది. రాజకీయాలలో కాని, సమాజసేవలోకాని ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల ఉండి తీరాలి. నిజానికి ఆడది ముందడుగు వేయాలంటే మనస్సుకన్నా మైండ్ ఎక్కువ పని చేయాలి. అంతా ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. ఇట్లా చెబుతున్నానంటే స్త్రీలో సంవేదన ఉండకూదు. ప్రేమమయి, కరుణామయి త్యాగమయి కాకూడదు అని ఎంతమాత్రం అర్ధం కాదు. సంవేదన ఉండితీరాలి కాని ప్రవాహానికి ఈదే సాహసం కూడా ఉండాలి. ఎవరైనా బురద చల్లినా, చరిత్రహీనురాలు అని ముద్రవేసినా, దుర్ఘటనలు ఎదరైనా స్త్రీ తన దారిలో తాను నడవాలి. సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తిని పెంపొందించుకోవాలి. అంటే ఒకవిధంగా తనవాళ్ళే గుండెలలో గునపాలు గుచ్చినా సహించాలి, అవమానపరిచే కుత్సితమైన నవ్వులు, ద్వి అర్ధాలను స్వీకరించి మనస్సును బాధపెట్టుకోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. అప్పుడప్పుడు అవతలివాళ్ళు అవమానిస్తే వాళ్ళ ఆయుధాలను వాళ్ళమీదే ప్రయోగించాలి. నీవుతట్టి ఎంతో ప్రశంసించే వాళ్ళు కూడా ఈ రాజకీయ రంగంలో ఉంటారు. కాని వాళ్ళ చూపులని ఒకింత కనిపెట్టాలి. వాళ్ళ రెండో ముఖాన్ని గుర్తు పట్టాలి. వాళ్ళు చెప్పే నీతులను వినాలి. కాని మననిర్ణయాలని మనం తీసుకోవాలి. ఇట్లు చేయడం కుత్సితం అని అన్నా ఫరవాలేదు. స్త్రీల విషయంలో ఇది తప్పు ఎంత మాత్రం కాదు.
‘లోకం మాటవిను కాని నీకు నచ్చింది చేయి’ అన్న సామెతని పదహారణాల చరితార్ధం. చేయాలి. (ఇంకావుంది)