భూమిక పత్రిక చాలా విషయాలను అందిస్తోంది. ఇందులో మేము కూడా భాగస్వామ్యులు కావాలని ఆశిస్తున్నాము. – నాగశేషు
***
”అందరికీ వెలుగునిస్తూ… తాము మాత్రం అంధకారంలోకి – కవిని ఆలూరి” చాలా మంచి విశ్లేషణ కవిని గారూ. – దేవరకొండ సుబ్రమణ్యం, ఇమెయిల్.
***
క్రియా రూపం దాల్చని నా మనసులో కోరికలన్నీ మీ అనుభవంలో చూసుకున్నాను. ముందుగా ప్రశాంతి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందరో పిల్లల పట్ల ఆమె చూపే కరుణ, ప్రేమతో పాటు వారి భవిష్యత్ పట్ల ఉన్న శ్రద్ధతో… ఒక మార్గం వేసిన తీరు నాకు అద్భుతం అనిపించాయి.
సత్యవతి గారూ మీ మాటలలో అక్కడి దృశ్యాలు అలా కదలాడి మనసు తడిపేసాయి. రవి ఫోన్ చేసినప్పటి సమయంలో మీరెలా ఫీల్ అయ్యారో అలాగే నేను ఫీల్ అయ్యాను. అభిమానానికి, ప్రేమకి మనం ఏం బదులివ్వగలం? వాటినే రెట్టింపు ఇవ్వడం తప్ప. మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవించాలి. మీరు వేసే ముందడుగులో మాలాంటి వాళ్ళు కలవాలి. బలహీనుల పట్ల, అండదండ లేనివాళ్ళ పట్ల, అనాధ బాలల పట్ల మన ప్రేమ రెట్టింపు కావాలి. మాటల్లో కాదు చేతలలో కూడా చూపించే ఆదర్శం అవసరం అనిపిస్తుంది. మనసారా మీకు అభినందనలు. – వనజ తాతినేని
ఎడిటర్ గారికి,
ఫిబ్రవరికి నెలలో అచ్చయిన రత్నమాలగారి ”బూదెమ్మను పెట్టడానికి భూమి మిగల్లేదు” కథలో చర్చించిన అంశం మీద తెలుగు రచయితలు బాగా దృష్టి పెట్టారు అన్న విషయం అర్థమవుతోంది. కొడుకుల పట్ల ప్రేమో యింకొకటో మొత్తానికి కొడుకుల కబందహస్తాలకు చిక్కిన తల్లుల కథలను మాత్రం మన తెలుగు రచయితలు వివిధ కోణాల నుండి రాస్తున్నారు. సమాజంలో కనపడే, దొరికే అన్ని సుఖాలను సొంతం చేసుకోవాలి, వాటిని జీవితంలో సంతృప్తిగా అనుభవించాలి అని అనుకుంటూ వాటి వెంట పరుగులు తీస్తోంది నేటి యువతరం. ఈ వ్యామోహం వలన కుటుంబాలు ఎలా విచ్చిన్నమవుతాయో చెప్పిన కథ రత్నమాలగారిది.
అతి తక్కువ కాలంలోనే లక్షలు సంపాదించాలనే ఆరాటంతో రోజుకో వ్యాపారం చేస్తూ, వాటిలో లాభాలు రాకపోతే మరొకటి మొదలు పెడ్తూ తల్లులను అప్పుల పాలు చేసే కొడుకు కె.సుభాషిణి రాసిన ”రమాదేవి కొడుకు” (చినుకు మాస పత్రిక, 2014) లో కనిపిస్తాడు. నామిని” మూలింటామె ”నవల కూడా యిలాంటి అంశం మీద వచ్చినదే. కాకపోతే యిక్కడ కొడుకు బదులు కోడలు పాత్ర వుంటుంది. బూదెమ్మ దిగులుతో మరణిస్తే, మూలింటామె ఆత్మహత్య చేసుకుంటుంది.” ”రమాదేవి కొడుకు” కథలో రమాదేవి కొడుకు చేసే వ్యాపారాల మీద నమ్మకం కొల్పోయి చివరి నిమిషంలో జాగ్రత్తపడి యింటిని మిగుల్చుకో గలుగుతుంది. ఈ ముగ్గురు స్త్రీలు కూడా భర్తలు చనిపోయిన తర్వాత సంసారాలను పైకి తెచ్చిన వాళ్ళే కావడం ఒక సారూప్యం.
– కె. సుభాషిణి, కర్నూలు.