స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం
One Billion Rising- స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం అనేది స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక ప్రపంచ వ్యాప్త ఉద్యమం. ప్రముఖ రంగస్థల నటి, రచయిత్రి మరియు సామాజిక కార్యకర్త ‘ఈవ్ ఎన్‌స్లర్’ 1985 ఫిబ్రవరి 14 నాడు న్యూయార్క్ నగరంలో V.Day అనే సంస్థను స్థాపించి స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ‘స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసలు తప్పనిసరిగా ఆగాలి’ అనేది V.Day లక్ష్యం. తమ సంస్థ 15వ వార్షికోత్సవం అయిన ఫిబ్రవరి 14నాడు ూOne Billion Rising -స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం అనే ప్రపంచ వ్యాప్త ఉద్యమం చేపట్టాలని ఈవ్ ఎన్‌స్లర్ తలపెట్టారు. దక్షిణాసియాలో ఈ కార్యక్ర మానికి ‘సంగట్’ సంస్థ కో-ఆర్డినేటివ్‌గా వ్యవహ రిస్తుంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో అస్మిత ఈ ఉద్యమానికి మద్దతు తెల్పుతూ 2013 ఫిబ్రవరి 14 నాడు ఒన్‌బిలియన్ రైసింగ్ క్యాంపెయిన్ చేపట్టాలని నిర్ణయించింది.
ఉద్దేశ్యం : ఈ ప్రపంచంలో నివసిస్తున్న 7బిలియన్ల మంది ప్రజలలో సగం మంది మహిళలున్నారు. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒక మహిళ తన జీవిత కాలంలో దెబ్బలు తినడం లేదా రేప్‌కు గురవడం జరుగుతోంది. అంటే ఈ ప్రపంచంలో నివసిస్తున్న వందకోట్ల మందికి పైగా స్త్రీలు తమ రోజువారీ జీవితాలలో హింసను అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ హింసను అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, సామాజిక కార్యకర్తలందరూ కలిసి కట్టుగా పోరాడాల్సివుంది. అందుకే ప్రముఖ సామాజిక కార్యకర్త కమలాభసీన్ మాట్లాడుతూ – ‘మన ఇళ్ళల్లో మన సమాజంలో మన మధ్యనే తిష్ట వేసుకున్న ఈ హింసను రూపుమాపడానికి ఒక సామాజిక సునామీ ఏర్పడాల్సిన అవసరమెంతైనా వుంది. కనుకనే OBR ఈ హింసను తుడిచి పెట్టడానికి ఆ సామాజిక సునామీ రూపంలో ఒక శక్తివంతమైన ఆయుధంగా రాబోతుంది’ అన్నారు. అలాగే స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సామాజిక కార్యకర్తలు, సంస్థలు, ప్రతి సం|| నవంబర్ 25 – డిశెంబర్ 10వరకు 16రోజుల పాటు “Sixteen Days of Activism”’ పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.
One Billion Rising – స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం అనేది, ఒక ఉద్యమం. ఈ కాంపైన్ అందరికోసం, అందరిని కలుపుకుంటూ సాగుతుంది. 2013 సంవత్సరంలో అస్మిత ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, మహిళా ప్రజాసంఘాల భాగస్వామ్యంలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం పేరుతో ఫిబ్రవరి 14న హైదరాబాదులోని నెక్లెస్ రోడ్‌లో ర్యాలీ, బహిరంగ సభ జరిగాయి. 2000 మంది మహిళలు, పురుషులు, బాలికలు, బాలురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జలవిహార్ నుండి ఊరేగింపుగా అందరూ పీపుల్స్ ప్లాజా వరకు నడిచారు. ఆ తర్వాత అక్కడ బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది.
2014 లో చెప్పుకోదగ్గ స్థాయిలో ూOne Billion Rising కార్యక్రమం జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా జరిగే ఈ కార్యక్రమాన్ని, మార్చి 8 స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం వున్నది. 2015 OBR ని మహిళా సంఘాల, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించాలని భూమిక భావించింది. ఫిబ్రవరి 14 రెండో శనివారం కావడంతో ఫిబ్రవరి 26న ఈ కార్యక్రమం చెయ్యాలని తొలిరోజు సమావేశంలో అందరూ నిర్ణయించారు.
26 తేదీన బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో జరిగే One Billion Rising కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గోని, స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా గొంతు విప్పాల్సిందిగా పిలుపునిస్తున్నాం.
స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా మేల్కొనండి
ప్రతిఘటించండి – నర్తించండి