ప్రసూతి సౌకర్య హక్కుల చట్టం గర్భవతులైన మరియు బాలింతలైన ఉద్యోగినులకు, శ్రామికులకు గర్భస్థ సమయంలో మరియు ప్రసవించిన తరువాత కొన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వంపైన, ప్రైవేటు, యాజమాన్యాలపైన బాధ్యతలను చట్టబద్ధంగా ఉంచడమైనది. చట్టబద్ధమైన బాధ్యతను నిర్వహించనట్లయితే ఆ చట్టం శిక్షను కూడా నిర్దేశిస్తుంది.
ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు పూర్తి జీతభత్యాలను ఇస్తూ 180 రోజుల ప్రసూతి సెలవులు లభిస్తాయి.
– ఇతర శ్రామిక, పనిచేయు మహిళలకు 12 వారాల సెలవులను జీతంతో ఇవ్వాలి.
– ఈ చట్టం అవివాహితలైన మహిళలకు కూడా వర్తిస్తుంది.
– ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న మహిళలకి ఇద్దరు సంతానం వరకు మాత్రమే అర్హులు.
– ఈ మొత్తం సెలవు దినాలలో కొన్నింటిని ప్రసవానికి ముందు మరియు మిగతా వాటిని ప్రసవానికి తరువాత వాడుకోవచ్చు. లేదా అన్నింటిని ఒకేసారి కాన్పు తరువాత వాడుకొనుటకు వీలుంది.
– ఈ చట్టం మహిళలను ప్రసవానికి ఆరు వారాల ముందు ఉద్యోగాలలో పని చేయించడం శిక్షార్హమైన నేరంగా గుర్తించింది.
– పరిశ్రమలుగాని మరి ఏ ఇతర పని ప్రదేశంలో గాని గర్భవతులకు మరియు బాలింతలకు సరియైన సౌకర్యములు కల్పించనట్లయితే నెలకు రూ.250లు అట్టి స్త్రీలకు చెల్లించవలసి వుంటుంది.
– అదే విధంగా ఈ చట్టం ప్రకారం ప్రసవానికి నెల రోజుల ముందు అట్టి మహిళా ఉద్యోగులకు మరియు శ్రామికులకు అధిక శ్రమతో కూడిన పని చెప్పరాదు.
– ఎవరైనా శ్రామిక మహిళ గర్భస్రావానికి గురైనట్లయితే తనకు 45 రోజుల సెలవులను జీతంతో సమానంగా తీసుకొను హక్కు ఈ చట్టం కల్పించింది.
– గర్భస్రావం విషయంలో ప్రభుత్వ ఉద్యోగినులైతే తమ సర్వీసులో ఒక్కసారి మాత్రమే ఈ 45 రోజుల సెలవు మరియు జీతానికి అర్హులు.
ఒక మహిళ ప్రసవం తరువాత ఉద్యోగంలో చేరినట్లయితే శిశువుకు 15 నెలల వయసు వచ్చే వరకు రోజూ రెండు సార్లు శిశువు పాలకై ఉద్యోగం నుండి విశ్రాంతి ఇవ్వవలసి వుంటుంది.
పైన తెలిపిన సౌకర్యాలను ఉపయోగించుకోవాలంటే ఒక సంవత్సరకాలంలో కనీసం 80 పనిదినములు ప్రసవానికి ముందు పని చేసి ఉండాలి. తను గర్భవతినన్న విషయాన్ని ఆ మహిళ యాజమాన్యానికి నోటీసు ద్వారా తెలియజేయాలి. సదరు యాజమాన్యం వారు నోటీసు అందిన 48 గంటల లోపు ప్రసూతి తర్వాత వచ్చు 6 వారాల వేతనం ఆమెకు ఇవ్వవలెను. ఈ సౌకర్యం ప్రసవంలో బిడ్డ మరణించి పుట్టినా లేదా బిడ్డ పుట్టిన తర్వాత మరణించినా కూడా పొందవచ్చును. ప్రసవ సమయంలో స్త్రీ మరణించినా కూడా పొందవచ్చును. ప్రసవ సమయంలో స్త్రీ మరణించినా కూడా ఆ స్త్రీ వారసులకు 6 వారాల వేతనం యాజమాన్యం వారు మంజూరు చేయవలసి వుంటుంది. ఒకవేళ స్త్రీ సెలవు పెట్టి వేరే దగ్గర పనిచేసినచో ఈ సౌకర్యమునకు ఆమె అర్హురాలు కాదు.