మహిళా మణులు మట్టిలో మాణిక్యాలంటారు – ”ఎక్కడ స్త్రీలు పూజించబడితే అక్కడ దేవతలు దీవిస్తారని స్త్రీలను గౌరవిస్తే సిరి సంపదలు తాండవిస్తాయని స్త్రీలను పవిత్రంగా పూజించే ఈ భారతావనిలో పొగడ్తలనే పోరెక్కువగా ఉంది. అన్ని రంగాలలోనూ స్త్రీలదే పై చెయ్యి హలం పట్టి పొలం దున్నినా, కలం పట్టి సాహిత్యం పండించినా ఎందులోనూ తీసిపోరు. ఆటోల నుంచి విమానం వరకు నడపడం, యుద్ధ నౌకల్లో, విన్యాసాలలో అంతరిక్షంలోకి దూసుకుపోగల సత్తా చూపిస్తున్నారు. పర్వతారోహణ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో పేరు సంపాదించుకొంటున్నారు. మహిళ చేయలేని పనంటూ లేదు. అన్ని రంగాలలో ముందడుగే.
అయినా వివక్షత స్త్రీల పట్ల తగ్గలేదు. ఎత్తుకు ఎదిగేకొద్దీ ఒదిగి పొమ్మంటూ అణచి వేస్తున్నారు.
స్త్రీ నాటి నుండి నేటి వరకూ నింగిలో, నేలలో సగమై భర్త జీవితంలో సగభాగమైన మహిళ తల్లిగా, చెల్లిగా, భార్యగా, బిడ్డగా రూపాంతరం చెందుతున్నది. అన్నిటిలోనూ నేనంటూ ముందడుగు వేస్తుంది. సూర్యుడి కన్నా ముందే లేచి ఇంటి పని, వంట పని, పిల్లల్ని రెడీ చేసి, భర్తని ఆఫీసుకు, పిల్లల్ని స్కూల్‌కి పంపించాక ఆదరా బాదరాగా గడియారం వేపు చూసి బాక్స్ సర్దుకొని ఆటోలు, సిటీ బస్‌లు పట్టుకొని ఆఫీసుకు వెళ్ళాక ఆలస్యమైనందుకు ఆఫీసర్ చేతిలో చివాట్లు తప్పవు. ఫైళ్ళతో, కంప్యూటర్లతో కుస్తీ పట్టి త్వరగా ఇల్లు చేరుకోవాలని ఉంటుంది.
రష్‌గా ఉన్న బస్‌లో వేలాడుతూ నిలబడితే పక్క నుంచి వెనక నుంచి చూసే వెకిలి చూపులు. కావాలని తూలుతూ మీద పడటం, వెకిలి వేషాలు వేసే వెధవలు అక్కడా, ఇక్కడా తాకుతూ ఏమీ ఎరగనట్లుండే పెద్ద మనుషుల వాలకం భరిస్తూ అవమానాలతో ఎలాగో ఇల్లు చేరితే అప్పటికే ఇంట్లో ఓ సంగ్రామం మొదలవుతుంది.
ఇంట్లో అత్త మామలు పెద్ద వాళ్ళుంటే వాళ్ళకి సేవలు చేయాలి. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనే గాని ఇల్లు గడవని రోజులు. పిల్లల భవిష్యత్ కోసం నిరంతరం యంత్రంలా కష్టపడి ఇంటికి వస్తే కాస్తంత ఓదార్పుకూడా లభించదు. పైగా సూటిపోటి మాటలొకటి! మహిళా సాధికారత పేరుకేగాని ఎక్కడా అధికారికంగా చూడడం లేదు. బ్యాంకుల్లోనూ, కాలేజీల్లోనూ,
స్కూళ్లు, ఆఫీసులు, ఆర్.టి.సి. బస్‌ల్లో సైతం కండక్టర్‌గా, చివరికి ఆటోలు కూడా నడుపుతున్నారు. ఆర్థికంగా గృహిణి, ఇంటికి తోడ్పడుతున్నదే అని ఆలోచించకుండా చిన్న చూపు చూసి, అసభ్యకరంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసం?
ప్రాంతీయ స్థాయి నుంచి స్త్రీల సమస్యలకు స్పందిస్తూ, ఉద్యమిస్తూ, జాతీయస్థాయి ఉద్యమాలతో సంఘీభావం ప్రకటిస్తూ, ఐక్య సంఘటిత కోసం అంతర్జాతీయ మహిళా ఉద్యమాల తాత్వికతను అర్థం చేసుకొంటూ, మహిళా ఉద్యమం ఈనాడు ఎంతగానో పురోగమించింది. అయినా స్త్రీలపై హింస కొనసాగుతూనే ఉంది. ప్రపంచ మహిళలందరూ ”వన్ బిలియన్ రైజింగ్” అని ముక్త కంఠంతో పలుకుతున్న సందర్భాల నుంచి స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజావళి గళం విప్పాలన్న ఆకాంక్ష మార్చి 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అసలైన స్ఫూర్తిని తనదిగా చేసుకొని మహిళా ఉద్యమం అర్థవంతంగా అభివృద్ధి చెందిందని ఆశించినా ఫలితం మాత్రం శూన్యం.
2005 మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉమ్మడి కనీస కార్యక్రమం మహిళలకు సంబంధించి చట్టసభలో మూడవ వంతు రిజర్వేషన్ కొరకు చట్టం తెస్తామని, గృహ హింస, లింగ వివక్షలకు వ్యతిరేకంగా చట్టం చేస్తామని, ఇళ్ళు, భూముల వంటి ఆస్తులపైన సమాన యాజమాన్య హక్కును కలిగించేలా ఇచ్చిన హామీలు అమలు చేయమని మహిళా సంఘాలు నిరంతరం వత్తిడి చేస్తూనే ఉన్నాయి.
చట్టాల మాట అటుంచినా ఆత్మ రక్షణేది? పసిపిల్ల నుంచి పండు ముదుసలి దాకా అత్యాచారాలు, ఆ పైన హత్యలు చేసి
ఆనవాళ్ళు లేకుండా దహనం చేయటం, గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లల్ని అవసరాల కోసం మభ్యపెట్టి లొంగదీసుకోవటం, కాలేజీల్లో విద్యను బోధించే గురువులే ప్రేమ పాఠాలు వల్లె వేయటం, ర్యాగింగ్‌లతో అమ్మాయిల్ని ఏడ్పించి వేధించి, చివరికి ఆత్మహత్యకు పాలుపడేలా చేయటం… ఇదేనా స్త్రీలకు రక్షణ? విడాకుల పేరుతో వివాహ వ్యవస్థను అవమానించటం, పెళ్ళయిన కొద్దికాలానికే అపనిందలు, అభాండాలు మోపి కించపరచటం. అది సాధికారత అంటారా?
స్త్రీలను గౌరవించాలి. లైంగిక వేధింపులు మానుకోవాలి. వరకట్న వేధింపులు అసలే ఉండకూడదు. ఇంట్లో ఆడవాళ్ళంటే గౌరవ భావం కలగాలి. టీనేజీ వ్యక్తులపై ర్యాగింగ్‌లకు పాల్పడ కూడదు. స్త్రీని వ్యాపార ప్రకటనల కోసం విలాస వస్తువుగా చూడరాదు. వివాహ వ్యవస్థ పైన నమ్మకం ఉంచాలి. పిల్లల్ని కనిపెంచే యంత్రంలా చూడకూడదు. ఇంటిని దిద్దుకొని, సమాజంలో ఉద్యోగం చేసే స్త్రీలపై చిన్నచూపు పనికి రాదు. సభల్లో స్త్రీకి ప్రత్యేక గౌరవం చూపాలి. అన్ని రంగాలలో ముందడుగు వేస్తున్న స్త్రీని కాలరాచి అణచివేయటం దుర్మార్గం. రాజకీయాలలో ఎంతో మంది స్త్రీలు చాకచక్యంగా రాజ్యాల నేలుతున్నారు. స్త్రీ శక్తి స్వరూపిణి ఆగ్రహిస్తే రాజ్యాలే కదిలిపోతాయి.
వినమ్రతతో పెరిగి ఉన్నా అవసరం అనుకొంటే రాణి రుద్రమ్మలా, ఝాన్సీ లక్షి ్మలా, ఇందిరా గాంధీలా విరుచుకుపడ గలదు.
ఎటుచూసినా అత్యాచారాలతో, హత్యలతో అవమానా లతో క్రిందికి పడదోయటం మహిళా సాధికారత అంటారా? అన్ని రంగాలలో విజయం సాధిస్తున్నా ఎక్కడుంది మహిళా సాధికారత?