ఆమెకు తెలంగాణా పుట్టినిల్లు, పల్నాడు మెట్టినిల్లు. ఆమెధీర. కేవలం ఒక రైతు కుటుంబ ఆడబిడ్డ. ఎలాంటి రాజకీయ, రాచరిక వారసత్వంలేని సాధారణ మహిళ. అందునా కుటుంబ సభ్యులనందరినీ కోల్పోయిన ఒంటరి. పసుపు కుంకుమలు చేజారిన వైధవ్య జీవితం. వీటన్నింటినీ అధిగమించి, విశాల దృక్కోణం, కృషి, పట్టుదలతో ప్రజలకు అత్యంత చేరువై, రాచకుటుంబ ఆశీస్సులతో మహామంత్రిణిగా ఎదిగిన వైనం అబ్బుర పరుస్తుంది. ఇదేదో ఇటీవలి ఆధునిక కాలపు సంఘటన అనుకుంటే పొరపాటే అవుతుంది. మధ్య యుగాలలో, వనిత వంటింటికి పరిమితమైన కాలంలో, ఐచ్ఛిక సహగమనం పాటిస్తున్న రోజుల్లో, 12 వ శతాబ్ధంలోనే అజేయమైన ప్రతిభతో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఆమె జీవన కథనం మహిళా లోకానికి మహాద్భుత దిక్సూచి. ఆమే పలనాటి నాయకురాలు నాగమ్మ. ఆమెకు పూర్వంగానీ, ఆమె సమకాలంలోనూ, ఆమె అనంతరం నేటి వరకూ ఆమెకు మినహా నాయకురాలు అనే కీర్తి కిరీటం మరొక మహిళకు దక్కకపోవటం విశేషం. ఈ కాలంలోనైతే ఆమెకు నోబుల్ శాంతి బహుమతి నిచ్చి ప్రపంచమంతా వేనోళ్ళ కొనియాడేది. ఎందుకంటే ఆమె సైన్యాలు, శతృసైన్యాలు యుద్ధభూమికి చేరుకుని, యుద్ధానికి సన్నద్ధమైన ఒక విపత్కర ఉద్రిక్త పరిస్థితుల నుండి మొత్తం వాతావరణాన్ని శాంతి వనం వైపు నడిపించిన ధీశాలి ఆమె. అందుకే నేను నాయకురాలిని శాంతి దూత అంటాను. ఎక్కుపెట్టిన విల్లు, సారించిన నారి, పొదిలో రణావేశంతో దూసుకు రాబోతున్న శరం, ఒర నుండి రక్తదాహంతో తొంగి చూస్తున్న కుంతం, మ్రోగడానికి సిద్ధమైన యుద్ధభేరీలు అన్నింటిని బుజ్జగించి, శాంతిపరిచి యుద్ధరహిత సమాజానికి బాటలు వేసిన ధీరవనిత. శతృ వర్గీయుల గొంతెమ్మ కోర్కెలన్నీ సఫలం చేస్తామనే హామీలతో శాంతి మంత్రం జపించిన మానవి. తెగిపడ బోతున్న శిరములు, ప్రాణ నష్టం అన్నింటినీ భవిష్యత్‌లోకి వెళ్ళి దర్శించి, సమరం దూకుడుకు కళ్ళెం వేసి శాంతి స్థాపన చేసిన మాతృమూర్తి నాగమ్మ. 12వ శతాబ్దిలో పల్నాడును ఏలిన హైహయ రాజవంశజుడు అనుగురాజు ఇచ్చిన వరాన్ని ఆసరా చేసుకుని ఆయన కుమారుడు నలగామరాజు పాలనలో ఏడు ఘడియలు మంత్రి పదవి చేగొని రాజ ఖజానాను దోచుకున్న గజదొంగలను పట్టి రాజ సంపదనంతా తిరిగి ఆస్థాన ధనాగారానికి చేర్చిన శౌర్యవంతురాలు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఈ సంఘటనతో తెలుగు లోకంలోనే ఆమె తిరుగులేని తొలి మహామంత్రిణిగా స్థానాన్ని పదిలపరుచుకుంది. సమర్థవంతమైన పాలనతో పాలకునికి, ప్రజలకు అభిమాన నాయకిగా వారి హృదయాలలో సుస్థిర స్థానాన్ని సాధించుకుంది. త్రాగునీటికి, సాగునీటికి, చెరువులు, కుంటలు తవ్వించింది. వాగులకు అడ్డుకట్టలు వేయించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి, మంచి పాలనాదక్షురాలుగా పేరుగాంచింది. మతసామరస్యంతో తను శైవురాలు అయినప్పటికీ పల్నాడులోని వైష్ణవాలయాలను అభివృద్ధి పరిచింది. ప్రజారంజకమైన పాలనతో ప్రజలందరి అభిమానాన్ని చూరగొని, వారికి ఆత్మబంధువుగా మారింది. పొరుగు రాజ్య పాలకులతో ఆమె అత్యంత శ్లాఘనీయమైన మిత్ర సంబంధాలను ఏర్పరచుకుని పల్నాడు రాజ్యాన్ని బలోపేతం చేసిన కార్యశీలి. పల్నాటి యుద్ధంలో అనేకమంది పొరుగు రాజ్యాధినేతలు తమ తమ సైనిక బలగాలతో అందించిన సహకారాన్ని గమనించినపుడు నాయకురాలి అజేయమైన స్నేహసంబంధాలు వెల్లడౌతాయి. ఆనాడే ఐదు భాషలు నేర్చుకున్న బహు భాషా నేర్పరి. సంగీతంలో ప్రావీణ్యురాలు. గుర్రపుస్వారీలో, ఖడ్గ యుద్ధంలో ఆరితేరిన అతివ నాగమ్మ. నూరు మంది మేధావుల మేధస్సు, నూరు మంది యోధుల సాహసం, నూరుమంది వీరుల శౌర్యం మూర్తీభవిస్తే నాయకురాలు నాగమ్మ అనడంలో సందేహం లేదు. ఆమె మహిళా రాజకీయాలకు తల్లివేరు. ఆమే మధ్యయుగాల మహిళా ధిక్కారస్వరం. అచంచల విశ్వాసం, మొక్కవోని ధైర్యం, అపారమైన స్వయంకృషి ఆమెను శిఖర సమానం చేశాయి. ఒక వ్యవసాయక రైతు కుటుంబం నుండి వచ్చి అసాధారణ స్థానానికి చేరిన ఆమె వ్యక్తిత్వం చెరిగిపోని చారిత్రక చిహ్నం. దేశాంతర్గత విద్రోహశక్తుల ఆటలు కట్టించి రాజ్యాన్ని సమైక్య పరచడానికి నిరంతరం చేసిన కృషి రాచరిక రాజకీయాలలో ఒక అద్భుత ఘట్టం. మంత్రి పదవిలోకి రాక మునుపే మంచి తీర్పరిగా, పెద్దమనిషిగా పల్నాడు కితాబు అందుకుంది. ఆకలి గొన్నవారికి ఆమె గృహం ఒక అక్షయ పాత్ర. గొప్ప వితరణ శీలి పల్నాటి యుద్ధానంతరం విరాగిగా జన్మస్థలమైన కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం, ఆర్వేల్లి గ్రామం వెళ్తూ తన యావత్ సంపదనంతా పేద ప్రజలకు పంచిపెట్టిన దానశీలి నాగమ్మ. అనన్యసామాన్యమైన సుగుణాలు, ధర్మనిరతి, మానవీయ విలువలు కలిగిన మానవతామూర్తి నాయకురాలును ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకోవడం ఒక సామాజిక బాధ్యత. ఉత్తమ నాయకత్వ లక్షణాలు, సుపరిపాలనా నేతృత్వం, సత్సీలనా జీవితం, నిండైన మానవత్వం కలిగిన నాయకురాలు నాగమ్మను సరిగా అర్థం చేసుకుని చరిత్రకు న్యాయం చేద్దాం. ప్రత్యర్థుల కుట్రలను ఛేదించుకుని నైతిక విలువలతో తన మంత్రి స్థానాన్ని, రాజ్యాన్ని కాపాడుకున్న నీతివంతమైన ఆమె జీవిత గమ్యాన్ని ఆదర్శంగా చేసుకుందాం. ఆర్వెల్లిలోని దేవాలయంలో నిత్య పూజలందుకుంటున్న నాయకురాలిని మనమూ స్మరిద్దాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags