నలభై మంది రచయిత్రులు ఉత్తరాంధ్ర ఉద్యమ ప్రాంతానికి యాత్ర చేసినపుడు, గంగవరం పోర్ట్ నిర్వాసిత కుటుంబాలతో ముఖ్యంగా మహిళల్ని కలిసినపుడు ”మా సముద్రం పోనాదండి బాబో” అంటూ భోరున విలపించారు. మత్స్యకారులైన వారిని సముద్రంలోకి దిగనీయకుండా ఇనపకంచె వేసినప్పుడు ఉద్యమించిన ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపి కోటేసు అనే వ్యక్తిని హత్య చేసారు. ఊరు ఊరంతా వల్లకాడుగా మార్చి, సముద్రంతో జీవితాలను పెనవేసిన వారిని సముద్రం కనబడని ప్రాంతానికి తరిమేసినపుడు ”మా సముద్రం పోనాదండి బాబో” అంటూ దిక్కులు పిక్కటిల్లేటట్టు ఏడ్చారు. పోచంపాడు ప్రాజెక్ట్ నిర్వాసితులు ఇళ్ళు ఖాళీ చేయకముందే నీటిని వదిలేస్తే తమ కళ్ళ ముందే తమ ఇళ్ళు, స్కూలు, భూములలో నీళ్ళు చేరుతుంటే గుండె పగిలిన స్త్రీలు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ముంపుకు గురౌతున్న గ్రామాలలో కూలగొట్టిన ఇళ్ళ మొండి గోడలను దీనంగా చూస్తూ కదలకుండా నించున్న గేదెల్ని, పశువుల్ని చూసినపుడు బయటి నుండి వెళ్ళినవాళ్ళకే కడుపులో పేగులు లుంగ చుట్టుకుపోయినట్లైంది. ఇక వారి మానసిక క్షోభని, భావోద్వేగాన్ని, అభద్రతని ఎవరు అర్థం చేసుకోగలరు? నిలుచున్న భూమితో, నివసిస్తున్న ఇంటిలో, చుట్టూ అల్లుకున్న పర్యావరణంతో అలుముకున్న అనుబంధాన్ని ఎవరు మాత్రం తూకం వేయగలరు? రాజ్యానికి/ప్రభుత్వానికి కావలసింది తాను నిర్వచించుకున్న అభివృద్ధి సూత్రమే కానీ ప్రజల గోడు, గోస కాదు.
ప్రస్తుతం పెద్ద ఎత్తున అన్ని వర్గాల్లోను చర్చ జరుగుతున్న ‘మల్లన్న సాగర్’ ముంపు గ్రామాల అంశాన్ని తీసుకుంటే ”మన ప్రభుత్వం, మన విధానాలు” నినాదంతో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ రెండు సంవత్సరాలలోనే తెలంగాణ ప్రజలకి పరాయిదిగా తయారై, ”మా గ్రామాన్ని ముంచొద్దు… మాకు ప్రత్యామ్నాయం న్యాయంగా ఇవ్వండి” అంటూ ఉద్యమిస్తున్న ప్రజల మీద దమన నీతికి దిగడం, బ్లాక్ మెయిల్‌కి పాల్పడడం చూస్తుంటే బాధగా అనిపిస్తోంది. ”ఆంధ్రపాలకులు చేసుంటే అర్థం చేసుకునేవాళ్ళం… మా సొంత ప్రభుత్వం మమ్మలిన శతృవుల్లా చూడటమేంటని” ఈ గ్రామస్థులు వాపోవడం వెనక వారికి కలిగిన దిగ్భ్రమని అర్థం చేసుకోవాలి. ఉద్యమిస్తున్న వారు చెబుతున్న దానిని సావకాశంగా, సానుకూలంగా వినకుండా అర్థం చేసుకోకుండా వారికి వ్యతిరేకంగా కొందరిని రెచ్చగొట్టి హైదరాబాదు దాకా తీసుకొచ్చి (ఆర్టీసీ కళ్యాణమంటపంలో) మీటింగ్ పెట్టడం, అక్కడ పెట్టిన బ్యానర్లలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల బొమ్మలుండటం గమనిస్తే మల్లన్న సాగర్ ఉద్యమకారుల మీద ప్రభుత్వం ప్రత్యక్ష యుద్ధం ప్రకటించినట్టే కనబడుతోంది. ఈ పరిణామాలు చాలా విచారకరం. నాలుగు గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్న దానిని వినాలి. వారి దుఃఖాన్ని, ఉద్వేగాలను, ఉద్రేకాలను అర్థం చేసుకోవాలి. ‘ముంపు లేకుండా ప్రాజెక్టులెట్టా కడతం’ అనే సమాధానం చాలా నిర్లక్ష్యపూరితమైంది. ఎవరి కోసమో వీళ్ళెందుకు మునగాలి? ప్రతిపాదిత ప్రాజెక్టులవల్ల ఎవరు లాభపడతారో, ఆ ప్రజలెందుకు వీళ్ళని అక్కున చేర్చుకోరు. ”మీరు మా కోసం త్యాగం చేస్తున్నారు… మాకు లాభం చేకూరుస్తున్నారు… మా ప్రయోజనాల్లో మీకూ భాగస్వామ్యం కల్పిస్తాం” అని ఆదరంగా ఆహ్వానిస్తే, సర్వం కోల్పోబోతున్న ప్రజలకు ఎంత ఊరట… ఎంత సాంత్వన. లబ్ది పొందబోతున్న గ్రామాల్లోనే వీళ్ళకి ఇల్లు, పొలం, స్కూళ్ళు, గుళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించి సామరస్యంగా అర్థం చేయిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు… ప్రభుత్వాలకు సహకరిస్తారు కానీ ఆ ప్రయత్నాలు చెయ్యకుండా వారి భావోద్వేగాలని ఖాతరు చెయ్యకుండా బలప్రయోగం చెయ్యడం భావ్యం కాదు.
అసలు నిర్వాసిత్వంలోని కాఠిన్యం, దుఃఖం, నిర్వేదం దానిని అనుభవిస్తే కాని అర్థం కాదు. తమ కళ్ళముందే తమ జీవితాలతో పెనవేసిన ఇల్లు, వాకిలీ, చెట్టూ, పుట్టా, గుడి, గోపురం జలసమాధి అవ్వడం… ఆ ఉత్పాతాన్ని చూడాల్సి రావడం ఎంత గుండె కోతో అనుభవిస్తున్న వాళ్ళకే తెలుసు. ముందే మహా దుఃఖంలో ఉన్న వాళ్ళ జీవితాలతో చెడుగుడు ఆడడం మహా దుర్మార్గం. వాళ్ళు కోల్పోబోతున్న సమస్తాన్నీ సగౌరవంగా, సవినయంగా వారికి అందించి, వారి త్యాగాన్ని గుర్తించాల్సింది పోయి, ‘మీరేమైనా అవ్వండి, ఎంతైనా
ఉద్యమించండి మాకు లెక్కలేదు. మీ వెనక ఎవరో వుండి ఆడిస్తున్నారు. మేము ఈ ప్రాజెక్టు కట్టి తీరతాం. అడ్డుకుంటున్నారంటే మీరు ”అభివృద్ధి” నిరోధకులు’ అంటూ అపహాస్యధోరణిలో మండిపడటం అమానవీయం.
‘అభివృద్ధి’ పేరుతో ప్రభుత్వాలు చేపట్టిన ప్రతి ప్రాజెక్టు వెనక ఈ చీకటి కోణం ఉంటుంది. ముంపు, నిర్వాసితత్వం లేకుండా, లేదా తక్కువ స్థాయిలో ఉండే లాగా ఎలాంటి ప్రయత్నాలు చెయ్యకుండా ‘ప్రాజక్టులు కట్టాలంటే ముంచాల్సిందే కదా! ఎవరో ఒకరు త్యాగం చెయ్యాల్సిందే కదా’ అనేది అడ్డగోలు వాదన. ప్రజలు చెప్పే ప్రత్యామ్నాయాలను కానీ, నిపుణులు వెలిబుచ్చే అభిప్రాయాలను కానీ గౌరవించే సంస్క ృతి లేని బ్యూరోక్రసీ తాము గీసిందే గీత… తాము రాసిందే రాత అన్న చందాన పిడివాదంతో వాదించడంవల్ల సమస్య మరింత జటిలమౌతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే విధాన నిర్ణేతలు ప్రభుత్వాధికారులు కాదు. ప్రజాభిప్రాయానికి, వారి ఆలోచనలకు విలువ ఇచ్చి తీరాలి. ప్రజలకన్నా తామే అధికులమని విర్రవీగే బ్యూరోక్రసీ చెప్పిందే గొప్పదనే అపోహలో ప్రభుత్వాన్ని నడిపించే
వాళ్ళుంటారు. రాజకీయ పార్టీలు దీనికి అతీతం కాదు.
ఫలానా ప్రాజెక్టు మాకొద్దు అని ప్రజలు వ్యతిరేకిస్తే… ఎందుకు వద్దంటున్నారో వారు చెప్పేది విని తీరాలి… వారికి అర్థం చేయించాలి… ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాత్రమే అక్కడ శాశ్వతంగా ఉంటారు. ప్రభుత్వాధికారులు కాదు. ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పార్టీలు కాదు. అక్కడి ప్రజలు ఒక విజన్‌తో, ముందు చూపుతో మాట్లాడతారు. వాటిల్లోని మంచి చెడ్డల్ని విశ్లేషించి వారికి నచ్చచెప్పగలగాలి. గ్రామమంతా పాల్గొనేట్టు గ్రామ సభలు నిర్వహించి చర్చలు నిర్వహించాలి. ఆయా ప్రాజెక్టుల లాభనష్టాలు సాధ్యాసాధ్యాలు, ప్రయోజనాలు, త్యాగాలు చెయ్యాల్సిన అవసరాలు, నష్టపోయిన వారికివ్వబోయే పరిహారాలు… వీటన్నింటినీ కూలంకషంగా, పారదర్శకంగా చర్చించినపుడు ఇపుడొస్తున్నంత వ్యతిరేకత రాకపోవచ్చు. ప్రజలు సానుకూలంగా స్పందించొచ్చు. మరి ఆ అవకాశం, భాగస్వామ్యం ప్రజలకిస్తున్నారా? ప్రజల నుండి దాచిపెట్టి, మభ్యపెట్టడం వల్లనే వారి అనుమానాలు పెరిగిపోతున్నాయి. వారిలో ఉద్రేకాలూ పెరిగిపోతాయి. చివరికి అది ఉద్యమరూపం తీసుకుంటుంది. ప్రజలమీద అణిచివేతకి దారి తీస్తుంది. ఒక్కోసారి ‘కోటేసు’ లాంటి వ్యక్తుల మరణానికి కారణమౌతుంది. సోంపేటలో తిరగబడినట్టు ప్రజలు తీవ్ర స్థాయిలో తిరగబడి మొత్తం ప్రాజెక్టుకే అడ్డుపడి, ఆపేయించొచ్చు.
ముంపంటే ఏమిటో, అది ఎలా వుంటుందో నర్మదా నిర్వాసితులు, కూడంకళం నిర్వాసితులు, నాగార్జునసాగర్, శ్రీశైలం నిర్వాసితులు అనుభవిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా వారి గాయాలు మానలేదు. గంగవరంలో సముద్రాన్ని కోల్పోయిన మత్స్యకారులు సముద్రం కోసం ఏడుస్తూనే వుంటారు… పోలవరం పూర్తయితే ఏర్పడే మహా ముంపులో వందలాది గ్రామాలు గిరిజనం గుండె ఘోష, పెను విషాదం కొన్ని తరాల వరకు సాగుతుంది. ముక్కూ ముఖం తెలియని ఎవ్వరి కోసమో తమకు సంబంధంలేని ప్రాంతాలను సస్యశ్యామలం చెయ్యడం కోసమో, గొంతెండి పోతున్న ఎవ్వరికో మంచినీళ్ళివ్వడం కోసమో ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది ప్రజలు తమ సర్వస్వం పోగొట్టుకుని త్యాగాలు చేస్తూనే ఉన్నారు. ‘అభివృద్ధి’ పేరుతో కొందరిని ముంచి, నిర్వాసితుల్ని చేసి ఇంకెవరికో ప్రయోజనం చేస్తానని చెబుతుంది ప్రభుత్వం. నిజానికి ప్రభుత్వాలు నిలబడాల్సింది నిర్వాసితుల పక్షాన. అప్పనంగా ప్రయోజనాలను అందుకుంటున్న వారి పక్షాన కాదు. లబ్దిదారుల సరసన సగౌరవంగా నిర్వాసితులను నిలబెట్టడమే సహజ న్యాయం. అప్పుడు కదా నిర్వాసితుల త్యాగం గుర్తించినట్లవుతుంది!