భూమిక సంపాదకులిద్దరికీ అభినందనలు.
జూన్ సంచికలోని ప్రత్యేక వ్యాసం చెంచుల జీవన విధానాన్ని, వారు ఎదుర్కొంటున్న ఇక్కట్లను కళ్ళకు కట్టినట్లుగా చెప్పిన టి.శివాజీగారికి కృతజ్ఞతలు. నా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఆదిలాబాదు, విశాఖ జిల్లాల్లో గిరిజనులు – వారి జీవితాలపై ప్రస్థుత అభివృద్ధి పోకడల ప్రభావం కొంత తెలిసినప్పటికీ నాకు చెంచుల జీవనం పెద్దగా తెలియదు. ఈ వ్యాసం వారి జీవన పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం కల్పించింది. ఈ సంచికలో ప్రచురించిన సమస్య-పరిష్కారం కథ చాలా బాగుంది. సమస్యను పరిష్కరించటానికి తల్లులు పిల్లల మధ్య స్నేహంతో కూడిన బంధం యొక్క అవసరాన్ని తెలియచెప్పారు. ప్రశాంతిగారి బాల్యస్మృతులు దాదాపు అందరివి. ఒకటే అనుమానం నా కూతురికి ఇలాంటి స్మృతులు నేనేమన్నా కల్పించానా? నా పాప ఐపాడ్ వాడడంలోని ప్రతిభను చూసి మురిసిపోతూ ఎలాంటి అనుభూతులను అందించలేని నా పరిస్థితికి కారణమేంటి? ఆలోచిస్తున్నాను. ఉష, హైద్రాబాద్
***
భూమిక సంపాదకులకు,
జూన్ సంచికలోని సంపాదకీయం మహిళలందరినీ ఆలోచింపచేసేలా ఉంది. ప్రభుత్వాలు స్త్రీల కోసం అనేక చట్టాలు తెస్తున్నా వాటిని అమలు చేయడానికి వారికి ధైర్యంలేదు. శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న మహిళలు ఇకనైనా తమ హక్కులను కాపాడుకోవడానికి ఉద్యమించాలి. పట్టణాలలో అప్పుడప్పుడు కనిపించే ఉద్యమాలు పల్లెల్లోని మహిళలకూ చేరాలి. వారికీ సమాన హక్కులపై అవగాహన కల్పించాలి. అటువంటి ప్రయత్నం చేస్తున్న భూమికకు అభినందనలు. – రమేష్, Email
***
భూమిక ఎడిటర్‌కు,
పెళ్ళై సంవత్సరం గడిచిందో లేదో ఏమైనా విశేషమా, ఒకసారి డాక్టర్‌కు చూపించుకోరాదూ, పిల్లలు లేకపోతే ముసలి వయసులో ఎవరు చూస్తారు… అంటూ ప్రతి మహిళకు పలువురి నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతాయి.
అయితే కొంతమంది వారికి సమాధానం చెప్పగలుగుతారు, మరికొంతమంది చెప్పలేక లోలోనే బాధపడుతుంటారు. ఇలా ప్రశ్నించేవారికి సరైన సమాధానం రేవతి ఉపాధ్యాయ రాసిన ”పిల్లలు కనొద్దనుకున్నాను.. పరిపూర్ణ సంతోషంతోనే ఉన్నాను”. స్త్రీలు పిల్లలున్నా, లేకపోయినా సంపూర్ణత్వాన్ని పొందగలరు అంటూ ఆమె రాసింది చదవగానే ఎంత కరక్టుగా రాశారు అనిపించింది. ఆమె మనోభావాలను పి. ప్రశాంతి చాలా చక్కగా అనువదించారు.
– పి. ప్రవీణ, ఈమెయిల్.
***
అమ్మా! పత్రిక అందగానే నేను మొట్టమొదట చదివేది అచ్చమాంబగారి వ్యాసం ఈ నెల అందులో అర్థంకాని విషయమొకటున్నది.
పేజీ 39, మొదట కాలం చివరి పేరా ‘కాలినడకన అమెరికాకు వెళ్ళారు’ అంటే? మీరు తప్పుగా వేశారా? ఆమే తప్పుగా వ్రాసారా? – వి.ఎ.కె. రంగారావు, చెన్నై.
(అచ్చమాంబగారు అలానే వ్రాసారు. ఆమె వ్రాసిన వాటిని యథాతథంగా సరళీకరిస్తున్నాము మేము ఎటువంటి మార్పులూ చేయట్లేదు.)