ఈ ఆదివాసీల సంస్కారం అనితరసాధ్యం – కొండవీటి సత్యవతి

రంపచోడవం దగ్గరలో అదొక ఆదివాసీ గ్రామం. చుట్టూ కొండలతో, పచ్చటి చెట్లతో అడవి మధ్యలో ఉన్న గ్రామం. గత ఆరు నెలల నుండి ఈ గ్రామాల్లో పనిచేయడం మొదలు పెట్టాం. మహిళలతో తరచుగా సమావేశాలు పెడుతున్నాం. ఆ రోజు కూడా మహిళలతో మాట్లాడాలని ఉదయమే ఆ గ్రామం చేరుకున్నాం. పనులు తొందరగా పూర్తి చేసుకుని ఒక్కొక్కరూ రాసాగారు.

ముఫై మంది మహిళలు వచ్చారు. అందరూ గుండ్రంగా కూర్చున్నారు ఒకరికి ఒకరు కనిపించేలా. గ్రామంలో సమస్యల గురించి, మహిళలు ఎదుర్కొంటున్న అంశాల గురించి చర్చ మొదలు పెట్టగానే వెంటనే ఎవ్వరూ మాట్లాడలేదు. సమావేశ స్థలానికి కొంచెం దూరంగా కొంతమంది మగ వాళ్ళు కుతూహలంగా చూస్తూ నిలబడ్డారు. మీటింగ్‌లో కూర్చున్న వాళ్ళు వాళ్ళ వైపే చూస్తూ మాట్లాడడానికి సంకోచిస్తున్నట్టు అర్ధమై మీరు కూడా వచ్చి కూర్చోండి అని పిలవగానే క్షణాల్లో అందరూ మాయమైపోయారు.
బలవంతంగా మీటింగ్‌లో కూర్చోబెడతామని భయపడినట్టున్నారు. అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు అంతేనండి మీటింగ్‌లో కూర్చోరు. ఏం మాట్లాడుకుంటున్నామా అని ఆరా తీస్తారు అంది ఓ పెద్దామె. కూర్చున్న అందర్నీ వాళ్ళ వివరాలు చెప్పమని అడిగాం. వాళ్ళు ఏమి పని చేస్తారు, భర్త ఏం పనిచేస్తారు, పిల్లలెంతమంది, చదువుకుంటున్నారా లాంటి వివరాలు చెప్పమని అడిగాం. అలాగే గ్రామంలో అంగన్వాడీ సెంటర్‌ ఉందా, టీచర్‌ ఉన్నారా, పిల్లలు అంగన్వాడి సెంటర్‌కి వెళుతున్నారా లాంటి ప్రశ్నలు కూడా అడిగి వివరాలు చెప్పమన్నాం.
ఒక్కొక్కరూ చెప్పసాగారు. పిల్లలెంతమంది, ఏమి చదువుతున్నారు అని చెపుతున్నారు. మధ్యలో కల్పించుకుని గ్రామంలో, కుటుంబాల్లో ఎలాంటి సమస్యలున్నాయి అని అడిగితే అన్ని చోట్లా ఉండేవే మా ఊళ్ళోను ఉంటాయి. భార్యా భర్తల గొడవలు మామూలే. గొడవలైనప్పుడు లేదా భర్త కొట్టినప్పుడు ఏమి చేస్తారు. పోలీస్‌ స్టేషన్‌కి వెళతారా? అంటే మేము పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళం. మా ఊరి పెద్దలే అన్నీ చూస్తారు అంది ఒకామే. అలా ఏమి కాదు అవసరమైతే పోలీస్‌ స్టేషన్‌కి వెళతాం. ఒకసారి వెళ్ళాం అంది ఇంకొకామె.
రంపచోడవరం గవర్నమెంట్‌ ఆసుపత్రి తెలుసు కదా అక్కడ మేము మహిళల సహాయం కోసం నడుపుతున్న సెంటర్‌ ఉంది తెలుసా మీకు. మొన్ననే రమాదేవి మేడం చెప్పింది. అంతకు ముందు మాకు తెలియదు అంది ఒకావిడ. ఇప్పుడు పోలీస్‌ స్టేషన్‌లో కూడా మా సెంటర్‌ ఉంది. ఇదిగో ఈమె పేరు లక్ష్మి పోలీస్‌ స్టేషన్‌ సెంటర్‌లో ఉంటుంది. ఎపుడైనా అవరమైతే పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి లక్ష్మితో మాట్లాడొచ్చు. ఆసుపత్రిలోను, పోలీస్‌ స్టేషన్‌లోను ఈమెనే ఉంటుంది. బాగుంది మేడం ఈ సారి మాకు అవసరమైతే వెళతాం అంది ఒకామె సంతోషంగా. సరే మిగిలిన వాళ్ళు కూడా వివరాలు చెబుతారా అన్నాను.
‘‘నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కూతురు పెళ్ళి చేసాను. ఒక కొడుకు చదువుకుంటున్నాడు ఇంకో కొడుకు వెళ్ళిపోయాడు.’’
‘‘వెళ్ళిపోయాడా ఎక్కడికెళ్ళిపోయాడు’’ అని అడిగాను.
అన్నలతో కలిసాడేమో అనుకున్నాను.
‘‘వెళ్ళిపోయాడంతే’’ అందామె
ఎక్కడికెళ్ళిపోయాడో నాకు అర్ధమవ్వలేదు.
‘‘ఇల్లొదిలి వెళ్ళిపోయాడు’’
‘‘ఎందుకు మీ మీద కోపమొచ్చిందా’’ అన్నాను నవ్వుతూ
‘‘కాదమ్మా ఆడు అమ్మాయి అయిపోయాడు’’
నేను ఉలిక్కిపడ్డాను. ఆశ్చర్యంగా చూసాను.
‘‘ఆడు నాకు కొడుకుగానే పుట్టాడు. మధ్యలో నేను అమ్మాయిని అనడం మొదలుపెట్టాడు. నా కూతురు డ్రెస్సులేసుకుని చూపించాడు ఒకసారి. మొదట నాకు అర్థమవ్వలేదు. అమ్మా నేను అబ్బాయిగా పుట్టిన అమ్మాయిని నాకు అబ్బాయిగా
ఉండడం ఇష్టం లేదు’’ అనేవాడు. మొదట్లో చాలా బాధపడేదాన్ని. అందరూ ఏమనుకుంటారో అని భయపడేదాన్ని. ఊర్లో ఏమంటారో, నా కోడుకు ఏమై పోతాడో అని దిగులు పడేదాన్ని.
‘‘అవునమ్మా మాకు తెలిసినప్పుడు మేమూ బాధపడ్డాం’’
అబ్బాయిగా పుట్టి అమ్మాయంటాడేమిటి అని తిట్టే వాళ్ళం. కానీ మెల్లగా అర్ధం చేసుకున్నాం. ఇంట్లోంచి వెళ్ళిపోయినా అపుడపుడూ వచ్చి వాళ్ళ అమ్మని చూసుకుంటాడు. డబ్బులు తెచ్చి ఇస్తాడు’’ అన్నారు మిగిలిన వారంతా. మొదట్లో ఊళ్ళో అందరూ విచిత్రంగా చూసినా మెల్లగా అర్ధం చేసుకుని వాడిని ఊళ్ళోనే ఉండమని చెప్పారు. కానీ వాడే ఒప్పుకోలేదు. రాజమండ్రిలో తనలాంటి
వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని వాళ్ళతో కలిసి ఉంటేనే తనకి బావుంటుదని చెప్పాడు. అపుడపుడూ వస్తూ ఉంటాడు అన్నారు వాళ్ళు. వాళ్ళ మాటలు వింటున్న నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఈ మారు మూల ఆదివాసీ గ్రామం ట్రాన్స్‌ జెండర్‌ మహిళ పట్ల చూపించిన సంస్కారవంతమైన ఆచరణ అబ్బురమనిపించింది.
నగరాల్లో ఎంతోమంది ఇలాంటి వాళ్ళని తల్లిదండ్రులు ఇళ్లల్లోంచి వెళ్లగొట్టిన కధలెన్నో చూసాను, చదివాను. వాళ్ళని ఎన్నో విధాల హింసించిన సంఘటనలూ తెలుసు. అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళనూ, అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా భావించుకుని వాళ్ళనూ కుటుంబాలు బయటకు గెంటేయడం వల్లనే వారంతా భిక్షాటన, సెక్స్‌ వర్క్‌ మాత్రమే చేసుకుంటూ ఎన్నో అవమానాలను, తీవ్రమైన హింసనూ ఎదుర్కొంటున్న వాళ్ళ గురించి ఎన్నో సమావేశాల్లో విన్నాను. ట్రాన్స్‌ జెండర్‌ మహిళల గురించి ఇంత చక్కగా అర్ధం చేసుకుని కుటుంబంలోనే ఉండమని భరోసా ఇచ్చిన ఆ తల్లికి నమస్కారం చేయాలనిపించింది. నేను వెంటనే లేచి చప్పట్లు కొడుతూ అందరినీ గట్టిగా చప్పట్లు కొట్టమన్నాను.
మొదట వాళ్ళకి అర్ధమవ్వలేదు. అపుడు చెప్పాను మైదాన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వారి బిడ్డలెవరన్నా ఇలా ప్రవర్తిస్తే ఇళ్లల్లోంచి వెళ్ళగొడతారని, చాలా హింసిస్తారని నాకు తెలిసిన విషయాలను చెప్పి ఈ తల్లి చాలా గొప్ప వ్యక్తిత్వం కలవారని, మీరంతా చాలా బాగా అర్ధం చేసుకుని వాళ్ళకి సపోర్ట్‌గా నిలబడినందుకు మీకందరికీ చప్పట్లు అంటూ చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మారుమోగించాం. ఆ చప్పుళ్ళకి కొంతమంది మగవాళ్లు, పిల్లలు ఇళ్లల్లోంచి బయటకొచ్చి చూసారు. వాళ్ళని పిలిచాం. పిల్లలు వచ్చారు కానీ మగవాళ్ళు రాలేదు.
ఆనాటి అనుభవం నాకు చాలా పాఠాలు నేర్పింది. సమాజంలో ఎంతో వివక్షకు, అణిచివేతకు గురౌతున్న ట్రాన్స్‌ జెండర్‌ కమ్యూనిటీ గురించి ఱఅషశ్రీబంఱఙవ గా మనలోకి తీసుకోవడం గురించి ఈ ఆదివాసీ మహిళలు చెప్పిన గొప్ప పాఠం ఆ రోజు నేను నేర్చుకున్నాను. అలాగే ముకుంద మాల గురించి ఇక్కడ తప్పకుండా రాయాలి. తన కొడుకు తనని తాను ట్రాన్స్‌ మహిళగా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఎందరో తల్లుల్లాగా కొడుకును ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకోలేదు. అతడు/ఆమె ను గుండెల్లోకి తీసుకుని ఆదరించి అన్నిరకాలుగా సపోర్ట్‌ చేసారు.తల్లితండ్రులు పూర్తిగా అర్థం చేసుకుని ఎంకరేజ్‌ చేయడం వల్లనే ఆమె ఈరోజు అమెరికాలో పిహెచ్‌డి చేయగలిగిన స్ధాయికి చేరగలిగింది.
భిన్నమైన ఐడెంటిటీలతో ఉండే వ్యక్తులను తల్లిదండ్రులు, సమాజం అర్థం చేసుకుని ఇతర పిల్లల్లాగే ప్రేమించి ఆదరించ గలిగితే అలాంటి పిల్లలు రోడ్ల మీద అడుక్కునే దయనీయమైన స్థితిలో, విపరీతమైన హింసను ఎదుర్కొంటూ సెక్స్‌ వర్కర్లుగా బతికే దారుణమైన పరిస్థితుల్లోకి జారిపోకుండా ఆత్మ విశ్వాసంతో, ఆత్మగౌరవం తో బతకగలిగే వారు.
ఈ ఆదివాసీ గ్రామంలో జరిగిన ఈ సమావేశంలో ఆదివాసీ ప్రజల ముఖ్యంగా మహిళల సంస్కారం నన్ను అబ్బుర పరిచింది.ఆత్మీయంగా అనిపించింది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.