వొట్టిమాటలు కట్టిపెట్టండి – వి.శాంతి ప్రబోధ

లోపలికి వస్తున్న యాదమ్మను చూస్తూ ‘‘ఆరోగ్యం బాగోలేదా?’’ అత్తగారి ప్రశ్న.
మౌనంగా లోపలికి పోయి చేట చీపురుతో వచ్చింది యాదమ్మ. కళ్ళు బాగా ఉబ్బి, నుదుట బొప్పి కనిపిస్తున్నాయి. నడకలో కూడా తేడా ఉంది.

‘‘ఏమైందిు అంటున్న నాకేసి చూస్తున్న ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి.
‘‘ఏం చెప్పనమ్మా.. ఆడ పుట్టుక ఎందుకు పుట్టిన్నో ఏమో.. కొడుకు అడ్డురాకుంటే సచ్చిపోతుంటిు
‘‘నీ మొగుడేనా? ఏమొచ్చిందేు మా అత్తగారు
‘‘ఇగ నాతోని గాదమ్మా.. ఇడుపు కాయి దాలిస్త ‘‘యాదమ్మ
మా అత్తగారు ఏదో చెబుతున్నారు. అవేవీ నా బుర్రకి ఎక్కడం లేదు. ఆలోచనలు ఎటునుంచి ఏటో గిరికీలు కొడుతున్నాయి. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రకటించి 25 ఏళ్లయింది. అయినా చెప్పుకోదగ్గ పురోగతి ఏదీ? యాదమ్మ లాగా అంతకంటే తీవ్రంగానో మహిళలపై హింస, రకరకాల హింస… దేశంలో ఏ మూల చూసినా సర్వ సాధారణ దృశ్యంగా ఉంది. 2022 క్రైమ్‌ రికార్డ్స్‌ ప్రకారం 4,45,256 కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు 1220 కేసులన్నమాట. ఇవి అధికారిక లెక్కలు. ఇప్పుడు యాదమ్మపై ఆమె భర్త చేసిన దాడి లెక్కలోకి రానట్లే వెలుగు చూడని, లెక్కలోకి రాని వాస్తవ హింస ఎంత ఉందో..?
మహిళలపై హింస రోజువారీ జీవితంలో మామూలైపోయింది. చెంపదెబ్బలు కొట్టడం, కొట్టడం, గుద్దడం, నెట్టడం, మెట్లపై నుంచి లేదా గది బయటకు తోసెయ్యడం, తన్నడం, చేతులు మెలితిప్పడం, ఉక్కిరిబిక్కిరి చేయడం మరియు కాల్చడం, కత్తితో పొడవడం వంటివన్నీ శారీరక హింస రూపాలే. కానీ అది హింసగా ఎంతమంది పురుషులు ఒప్పుకుంటారు?
మహిళలపై హింస అంటే కేవలం శారీరక హింస మాత్రమే కాదు. ఇది చాలా విస్తృతమైనది. లైంగిక, భావోద్వేగ, మానసిక మరియు ఆర్థిక దుర్వినియోగాన్ని కలిగి ఉంటుంది. నిజానికి, మానవ హక్కుల ఉల్లంఘనలో ఒకటి మహిళలు, బాలికలపై హింస. ఇది ప్రపంచ వ్యాప్తంగా
ఉంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ముగ్గురిలో ఒకరు తమ జీవితంలో ఒక్కసారైనా శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారు. ఆశ్చర్య మేమంటే అందుకు కారకులు సన్నిహిత కుటుంబ సభ్యులు లేదా భాగస్వామి కావడం. ఇంటా బయటా లైంగిక అత్యాచారం, పనిముట్లతో లైంగిక వేధింపులు, బలవంతంగా అశ్లీల చిత్రాలు చూపించడం, బలవంతంగా వ్యభిచారం చేయించడం వంటివన్నీ లైంగిక హింస రూపాలే.
మానసికంగా, భావోద్వేగపరంగా మహిళ లపై జరిగే హింస బయటకు కనిపించదు కానీ అది చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. సాధారణ మహిళల కంటే యుక్తవయసులో
ఉన్న బాలికలు, యువతులు, జాతి, ఇతర మైనారిటీలకు చెందిన మహిళలు, ట్రాన్స్‌ వుమెన్‌, వైకల్యం ఉన్న మహిళలు వివిధ రకాల హింసకు మరింత ఎక్కువగా గురవుతున్నారు. ఆధునిక సమాజంలో పెరుగుతున్న సాంకేతికత కూడా మహిళలపై హింసను పెంచుతున్నది. అభ్యంతరకరమైన, అసభ్యకరమైన ఈ మెయిల్‌, వాట్సాప్‌ సందేశాలు లేదా సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌లలో ఆన్‌లైన్‌ హింస పెచ్చరిల్లిపోతున్నది. జనరేషన్‌, మిలీనియల్స్‌ ఎక్కువగా ప్రభావిత మవుతున్నారు.
ప్రజా జీవితంలో ఉండే మహిళా రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యమ కారులు, జర్నలిస్టులు అధిక స్థాయిలో మానసిక భావోద్వేగ హింస, వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. సెక్సిస్ట్‌ వ్యాఖ్యలు, సంజ్ఞలు, చిత్రాలతో చేసే హింస అనేక సందర్భాల్లో మహిళల జీవితాల్లో అనిశ్చితికి దారితీస్తున్నది. ఈ రకమైన హింస వారి వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడం మాత్రమే కాకుండా లింగ సమానత్వం మరియు ప్రజాస్వామ్య భాగస్వా మ్యానికి ఆటంకం కలిగిస్తుంది. ఇక సంక్షుభిత సమయాల్లో, కల్లోల ప్రాంతాల్లో, పర్యావరణ/ వాతావరణ మార్పుల వల్ల వచ్చే భూకంపాలు, కరువుకాటకాలు, వరదలు/ ఉప్పెనలు వంటి సమయాల్లో కూడా మహిళలు లైంగిక, శారీరక, మానసిక, భావోద్వేగ హింసలకు గురవడం చూస్తున్నాం.
ఆర్థిక సంక్షోభాలు, సంఘర్షణలు మరియు వాతావరణ మార్పులతో ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న సంక్షోభాలు మహిళలపై హింసను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇప్పుడు భర్తపై కోపంగా విడాకులిచ్చేస్తానన్న యాదమ్మ రేపు అదే మాట మీద ఉంటుందా? ఉండదు. అతని హింసను క్షమించేస్తుంది. ఆ విధంగా సహించే వైఖరులు కూడా హింసను వ్యవస్థీకృతం చేస్తున్నాయేమో! దానికి తోడు వ్యక్తులు, సంస్థలు, సంఘాలు మహిళపై హింసకు ప్రతి స్పందించే తీరు, చాలా సందర్భాల్లో ఆమెపై జరిగిన హింసను చర్య తీసుకునేంత తీవ్రమైన విషయాలు కాదని భావించడం, అంటే స్త్రీపై హింసను సమర్ధించడమేగా.., అది చట్టబద్ధమే అన్న భావన కలిగిచడమే కదా. అసలు స్త్రీలపై హింసకు కారణాలు ఏమిటి?
స్త్రీ పురుషుల మధ్య శక్తి, వనరుల అసమాన పంపిణీ. ఆ అసమానతలను గుర్తించి ఉద్య మాలు, పోరాటాలు చేసి అనేక చట్టాలు చేసుకున్నాం. అయితే హింస ఆగిందా? ఆగలేదు. ఎందుకని? సాంస్కృతికంగా మన మతాచారాల్లో స్త్రీ స్థానం, చట్టాల్లో ఉన్న లోపాలు, లొసుగుల వల్ల మహిళలపై హింస యదేశ్చగా కొనసాగు తున్నది. దానికి తోడు మహిళలపై హింసను అరికట్టేందుకు అవసరమైన నిధులు ఏటేటా తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, అధికారులు అనధికారులూ పైపై మాటలు కట్టిపెట్టి గట్టి చర్యలు చేపట్టండి. మీరు తలచుకుంటే సమాజంలో మహిళపై జరిగే హింసను అదుపులోకి తేవడం, నివారించడం పెద్ద సమస్య కానే కాదు.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.