మహాశ్వేతను మొదటిసారి చూసినపుడు, ఆమె మాటలు విన్నప్పుడు నేను ఎలా స్పందించానో, ఎలాంటి సంచలనం నాలో కలిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. విదేశంలో ఉన్నపుడు ఆమె మరణ వార్త వినాల్సి రావడం చాలా దు:ఖం కలిగిస్తోంది. చాలాకాలంగా ఆమె ఆరోగ్యం బాగాలేదనే వార్తలు వింటున్నాను. మే నెల నుంచి ఆమె ఆస్పత్రిలోనే ఉంది. 90 సంవత్సరాల వయసులో ఆస్పత్రికి వెళ్ళి అడ్మిట్ అయిన వాళ్ళు వెనక్కు ఇంటికి తిరిగి వచ్చేది తక్కువే. ఈ మధ్యనే ప్రశాంతి, నేను మాట్లాడుకుంటున్నపుడు, ”భూమికలో మహాశ్వేత గురించి రాయాలి.. చాలా మెటీరియల్ సేకరించి పెట్టుకున్నాను. ఆమె జీవించి ఉన్నప్పుడే రాయాలి. ఎప్పటికి రాస్తానో” అన్నాను. కమలాదాస్, ఇందిరా గోస్వామిల గురించి రాసినపుడే మహాశ్వేత గురించి రాయాలని చాలా అనిపించింది. కానీ రాయలేదు. ఇప్పుడు మహాశ్వేత లేదు.
1991లో అనుకుంటాను. అప్పటికి భూమిక ప్రారంభం కాలేదు. ‘అన్వేషి’తో కలగలసి నడుస్తున్న రోజులు. అన్వేషి నిర్వహించే అన్ని మీటింగులకు హాజరై జ్ఞానాన్ని ద్రోలుకుంటున్న సందర్భం. గొప్ప గొప్ప వ్యక్తిత్వాలతో విలసిల్లే మానవీయ మూర్తులెందరో అన్వేషికి వచ్చేవారు. మేథాపాట్కర్, మహాశ్వేత లాంటి వారిని చూడగలగడం, వినగలగడం ‘అన్వేషి’ ద్వారానే సాధ్యమయ్యాయి. ఎవరిని గుర్తు చేసుకుంటే జీవితంలో బెదురు, భయం లేకుండా పోతాయో… ఎవరిని కలిసి మాట్లాడితే గుండెల్లో చైతన్యం ఉప్పొంగుతుందో అలాంటి వాళ్ళను దగ్గరగా చూడగలగడం… ముఖ్యంగా వారు బతికిన కాలంలోనే బతికి ఉండగల గడం… అలాంటి క్షణాలు అనుభవంలోకి వస్తేనే కానీ అర్థం కాదు. అలాంటి అపురూప, అపూర్వ అనుభవం నాకు దొరికింది. రెండున్నర దశాబ్దాలు జారిపోయినా ఆ రోజు ‘అన్వేషి’లో మహాశ్వేత మీటింగ్ నాకు స్పష్టంగా గుర్తుంది. మీటింగ్ తర్వాత పడక కుర్చీలాంటి కుర్చీలో ఆమె కూర్చుంది. మేమంతా ఆమె చుట్టూ చేరాం. ఆమెతో దిగిన ఫోటో ఏమైపోయిందో… దొరికితే బాగుండు.
ఆమె మాటలు సూటిగా, వాడిగా ఉంటాయి. కొన్నిసార్లు హాస్యస్ఫోరకంగా ఉంటాయి. ‘ఎమోషనల్ బ్లాక్మెయిల్’ అనే పదాన్ని మహాశ్వేత నోటివెంటే విన్నాను. అంటే ఏమిటి? స్త్రీలు ఎమోషనల్‌గా ఉంటారని కదా ప్రచారం. ఈ ఎమోషన్స్‌తోనే కదా పురుష ప్రపంచం, కుటుంబం, సమాజం ఆడుకుంటుంది. ఎమోషన్స్‌ని అడ్డం పెట్టుకుని భర్తలు ఎల్లవేళలా భార్యల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. చిత్రమేమిటంటే అది బ్లాక్మెయిల్ లాగా ఉండదు. దానిని ప్రేమ అని పిలుస్తారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ని కరక్టుగా అర్థం చేసుకునే స్త్రీలు … దాన్నుంచి తప్పించుకుని స్వేచ్ఛవైపు అడుగులేయగలుగుతారు అంటూ ఆమె చెప్పింది. విన్నప్పుడు మొదట నాకు అర్థం కాలేదు. మెల్లమెల్లగా దాని లోతు అర్థమైనప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అంతర్గతంగా ఆమె ప్రభావానికి లోనయ్యాను.
తెలుగులో ఎన్నో గొప్ప పుస్తకాలను చదవగలగడానికి అవకాశం కల్పించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన మహాశ్వేత పుస్తకాలు ఎవరిదీ అడవి, రాకాసికోన, ఒక తల్లి… చదవడం గొప్ప అనుభవం. ఎన్నో విదేశీ భాషల్లోంచి, వివిధ దేశీయ భాషల్లోంచి ఎంపిక చేసి, అనువాదాలు చేయించి నాలాంటి వాళ్ళకు అనుభవంలోకి తెచ్చి, ఎదగడానికి, జీవితాన్ని చైతన్యీకరించుకోవడానికి వెసులుబాటు కల్పించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్‌కు ఎంత రుణపడి ఉన్నానో… మహాశ్వేత రాసిన ఎవరిదీ అడవి చదివి ఎంత ఉత్తేజం పొందానో… ఎలా రాయను??? గుక్కపట్టి గుండెలు బాదుకుంటూ ఏడ్చే రుడాలి, పొడారిపోయిన గాజుకళ్ళతో కొడుకు శవాన్ని 1084 నెంబరుగా మాత్రమే చూసే ఒక తల్లి, వీళ్ళంతా మహాశ్వేత పాత్రలు… మన కళ్ళముందుకొచ్చి నిలబడే నిక్కచ్చి వాస్తవాలు. ఝాన్సీరాణి వీరత్వం గురించి రాయడానికి ఆయా ప్రాంతాలన్నీ తిరుగాడిన మహాశ్వేత ధీరత్వం గురించి నేను రాయగలనా? మహారాణి ఝాన్సీ గురించి మహాశ్వేత రాసిన ‘ఝాన్సీ రాణి’ (The Queen of Jhansi) 1956లో వచ్చింది. ఆ తర్వాత ఎన్నో పుస్తకాలను ఆమె రాసింది.
మహాశ్వేత 1926లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో పుట్టింది. తల్లిదండ్రులు సాహితీ ప్రపంచానికి చెందినవారు. తండ్రి మనీష్ ఘటక్ ప్రముఖ కవి, నవలాకారుడు. తల్లి ధరిత్రీదేవి సాహిత్యంలోనే కాదు సామాజిక సేవతో సంబంధం నిలుపుకున్న వ్యక్తి. బాబాయి రిత్విక్ ఘటక్ గొప్ప సినిమా దర్శకుడు. ఆమె సోదరులు- శంకర్ చౌధురి ప్రముఖ శిల్పకారుడు, సచిన్ చౌధురి ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వ్యవస్థాపక సంపాదకుడు. వివిధ రంగాలలో ప్రముఖులైన వ్యక్తులున్న కుటుంబంలో పుట్టి, పెరిగిన మహాశ్వేత దేశ విభజన తర్వాత ఢాకా నుండి పశ్చిమ బెంగాల్‌కు తరలి వచ్చేశారు. రవీంద్రనాధ్ ఠాకూర్ విశ్వ భారత యూనివర్శిటీలో బి.ఎ. (ఆనర్స్), కలకత్తా యూనివర్శిటీలో ఎం.ఎ. ఇంగ్లీషు చదివింది. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్‌ను స్థాపించిన ప్రముఖ నాటక కర్త బిజోన్ భట్టాచార్యను పెళ్ళి చేసుకుంది. 1948లో నబురూన్ భట్టాచార్య పుట్టాడు. మహాశ్వేత వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1959లో భర్త నుంచి విడాకులు తీసుకుంది.
మొదటి పెళ్ళి నుండి బయటపడి అసిత్ను రెండోసారి పెళ్ళి చేసుకుంది. అసిత్‌తో కలిసి చాలా ప్రయోగాలు చేసింది. బెంగాల్‌లోని గిరిజన ప్రాంతాలకు వెళ్ళినపుడు ఆమెకు గిరిజనులతో, గిరిజనుల కోసం పనిచెయ్యాలనే బలమైన కోరిక కలిగింది. చాలాసార్లు ఆ ప్రాంతాల్లో నివాసం ఉండిపోయేది. గిరిజన సమూహాలకు జరుగుతున్న అన్యాయాలపై రాయాలనే నిశ్చయానికి వచ్చింది. ఎన్నో వ్యాసాలు రాసింది. తన రచనల్లోకి గిరిజన సమస్యలను విలీనం చేస్తూ చాలా రచనలు చేసింది మహాశ్వేత.
1975లో అసిత్‌తో విడిపోయింది. అతనితో విడిపోయిన తర్వాత తనెలా ఫీలయిందో ఒక ఇంటర్వ్యూలో చెబుతుంది. ”అతని నుంచి విడిపోయాను. నా ఇంట్లో నేనొక్కదాన్నే ఉండడంలోని స్వేచ్ఛ నాకు అర్ధమైంది. నా ఇల్లు, నా గది, నా బాత్రూమ్, నా రాత బల్ల….అబ్బ! ఎంత హాయి. నేనెవ్వరికీ పూచీ ఉండాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తాను, ఎక్కడికెళ్తాను, ఏం తింటాను, ఎలా ఉంటాను…అంతా నా ఇష్టం… ఎవ్వరి అనుమతులూ అక్కరలేదు. ఎంతటి స్వాతంత్య్రమిది. ఎలాంటి గొప్ప రిలీఫ్ ఇది. ఒంటరిగా బతకడం కష్టమే… కానీ దొరికిన స్వేచ్ఛముందు ఒంటరితనం ఎక్కువ బాధించలేదు” అని చెబుతుంది. స్వేచ్ఛా విహంగంలా బతుకుతున్న కాలంలోనే మహాశ్వేత ఎక్కువ రాసింది. 1977-80ల మధ్య ముఖ్యమైన ఆమె పుస్తకాలు బయటికొచ్చాయి.
మహాశ్వేత వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు ఆమె అంతరంగంలో పెద్ద ఖాళీని ఏర్పరచినా కానీ ఆమె రచనల్లో వైవిధ్యం ఆమెను గొప్ప భారతీయ రచయితగా నిలబెట్టాయి. ఎవ్వరూ వెళ్ళడానికి సాహసించని ప్రాంతాలకు… గిరిజనులుండే కొండలు, గుట్టలు, అడవుల్లో సాహసంతో, ధైర్యంతో ప్రయాణించి, వారితో కలిసి బతికి వారి సమస్యలను ప్రపంచానికి చాటి చెప్పింది. రచయితల పని రాయడంతోనే కాదు, ఆచరణలోకి కూడా దిగాలని, యాక్టివిస్టులుగా మారాలని, ఉద్యమాలతో మమేకమవ్వాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వాలు అమలు పరచాలని ప్రయత్నించే అభివృద్ధి నమూనాలను ప్రశ్నిస్తూ, పచ్చటి పంట పొలాలను పండించుకునే రైతుల్నుంచి లాక్కుని అతి తక్కువ ధరలకు బడా పారిశ్రామికవేత్తలకు దానం చేసే ప్రభుత్వ విధానాలను బలమైన గొంతుతో ఖండించి, ఆ ఉద్యమాల్లో భాగమైంది మహాశ్వేత. మతం పేరుమీద 2002లో గుజరాత్లో జరిగిన మారణకాండని వ్యతిరేకిస్తూ ఎన్నోసార్లు గుజరాత్ వెళ్ళింది. బాధుతులను కలిసి సంఘీభావం ప్రకటించింది.
భారతదేశంలోని అట్టడుగు, అణగారిన వర్గాల కోసం కలంతోను, గళంతోను, కదంతోను పోరాడిన మహాశ్వేతాదేవి మరణం… (90 సంవత్సరాల వయస్సులో అయినప్పటికీ) భారతీయులందరికీ తీరని లోటు. ఆమె వదిలేసి వెళ్ళిన ఖాళీ నిండాలంటే మరో మహాశ్వేత పుట్టాల్సిందే. సంపాదకీయం పూర్తి చేస్తున్న వేళ హఠాత్తుగా అల్లరి అల్లరిగా నవ్వుతూ తన చిన్నప్పటి అనుభవాలను ఒక డాక్యుమెంటరీలో వర్ణించి చెప్పిన మహాశ్వేత గుర్తుకొస్తోంది. ఆమె మాటలు విని నవ్వి నవ్వి కళ్ళల్లోంచి నీళ్ళొచ్చిన సందర్భం గుర్తొస్తోంది. ముంబైలో పనిచేస్తున్న ‘స్పారో’ అనే సంస్థ 2003లో అనుకుంటాను అన్ని భాషల రచయిత్రులతోను కలిపి ఒక జాతీయ సదస్సు నిర్వహించింది. ముంబైకి సమీపంలోని, మహా సుందరమైన కషీద్ బీచ్‌లో ఐదు రోజులపాటు ఈ జాతీయ రచయిత్రుల సమ్మేళనం జరిగింది. తెలుగు నుంచి నేను, ఘంటసాల నిర్మల హాజరయ్యాం. అప్పుడు చల్లని ఓ సాయంత్రం వేళ మహాశ్వేత మీద ‘స్పారో’ నిర్మించిన డాక్యుమెంటరీ ప్రదర్శించారు. కళ్ళు విప్పార్చుకుని, మనసును దానిమీదే నిలిపి చూసిన ఫిల్మ్ అది. తన చిన్ననాటి ముచ్చట్లను గురించి చెబుతూ… తాను చాలా రకాల వ్యాపారాలను చేశానని, అందులో ముఖ్యమైంది కోతులను పాశ్చాత్య దేశాలకు ఎగుమతి చేసే వ్యాపారమని, తాను కొంత కాలం ఆ పని చేశానని అల్లరిగా నవ్వుతూ చెప్పినప్పుడు మేమందరం గొల్లున నవ్వాం. మహాశ్వేత… ద గ్రేట్ ఇండియన్ రైటర్, లివింగ్ లెజెండ్ కోతుల వ్యాపారం చేశానని, దాని గురించి వివరాలు చెప్పిన తీరు మళ్ళీ గుర్తొచ్చి నా కళ్ళల్లోకి నీళ్ళూరుతున్నాయి. ఆ రోజు హాస్యానికి కన్నీళ్ళొస్తే, ఈ రోజు దు:ఖంతో కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి. మహాశ్వేతా… ఐ మిస్ యూ.. ఐ లవ్ యూ… నీకిదే నా కన్నీటి నివాళి.