ఆదిలాబాద్… అడవుల జిల్లా… అద్భుతమైన ఆదివాసీల జిల్లా…
ఇరువైఏళ్ళ క్రిందటి మాట. మొట్టమొదటి సారి వెళ్తున్నానేమో… మనసు, ఒళ్ళుకూడా ఉరకలేస్తోంది. పచ్చటి అడవులు నిట్టనిలువుగా పెరిగిన టేకు చెట్లు, ఆకాశాని కెదిగిన ఇప్ప, మద్ది, మామిడి, చింతచెట్లు… గుబుర్లుగా పెరిగిన బీడీ ఆకుల పొదలు… కొమ్మల్నిండా ఎర్రటిపళ్ళతో పెద్ద పెద్ద మేడిచెట్లు… వాటితో పోటిపడుతున్నట్లున్న పెద్దరేగి చెట్లు, పచ్చటి అడవికి రంగులద్ది నట్లున్న పసుపు రంగు రేలపూల గుత్తులు, ఎర్రటి అగ్నిజ్వాలల్లాంటి మోదుగపూలు… ఇంకా… కుంకుడు, ఉసిరి, అవిశ… పేర్లు తెలియని ఎన్నో చెట్లతో నిండిన అడవి గుండా వెళ్తోంటే ఆనందం అణువణువు చిమ్ముతోంది.
మధ్యమధ్యలో ఎర్రటి పెంకు టిళ్ళతో ఒద్దికగా ఒదిగినట్లున్న ఆదీవాసీల గూడెంలు. వాటికి దగ్గర్లో మందలుగా ఎదురౌతున్న పశువులు, పచ్చిక బయళ్ళలో కనిపిస్తున్న గొర్రెలు, వాటితో పాటు అర్ధంకాని బాషలో పాటలు పాడుతున్న పిల్లలు. వారికి తోడుగా తెల్లటి పంచెల్లో పెద్దలు. మరాఠా పద్ధతిలో గోచీ పెట్టి చీరలు కట్టి, చెవులకి, ముక్కుకి మెరుస్తున్న రాళ్లతో ముత్యాలతో కూడిన ఆభరణాలు, కొప్పుల్లో తురిమిన తంగెడిపూలతో, బిడియంగా, రివటల్లా ఉన్న గోండు స్త్రీలు… అందమైన జీవన దృశ్యం కళ్లెదుట ఆవిష్కృతమై… మాటలు మరిచి పోయి, కళ్ళప్పగించి చూస్తూ అపురూపమైన ఆ దృశ్యాలని గుండెంతా నింపేసుకున్నా!
కెరమెరి మరో 8 కిలోమీటర్లుం దని చెప్తున్న మైలురాయి… ఎదురుగా అంత దూరాన చేతులు సాచి ఆహ్వానిస్తున్నట్లున్న గుమ్మాటాల్లాంటి ఎత్తైన కొండలు. పచ్చగా మెరిసిపోతున్నాయి. దగ్గరవుతున్న కొద్దీ రంగులు మారుతున్నట్లుంది… రకరకాల వృక్షాలు, చెట్లు, పూలతో… ఆ కొండ పాదాల్లో ఉన్న గూడెంలో ఆగగానే ‘బాయి… చొక్కడ్మంతిట్…’ అంటూ ఆనందం, ప్రేమ నిండిన పలకరింపుతో స్త్రీలంతా పోగై పోయారు. రకరకాల వయసుల వారు ‘రామ్ రామ్… బాయి’ అంటూ వచ్చి కూర్చున్నారు. గోండు, మరాఠి, తెలుగు, హిందీ… నానా బాషల సంగమంలా… ఎన్నో విషయాలు – స్త్రీలకి సంబంధించినవి, వ్యవసాయంలో, వృత్తి పనుల్లో, సంప్రదాయాల్లో, ఇంటి పనుల్లో స్త్రీలు వారి జీవనాన్ని గురించి ఎన్నో మాట్లాడుకున్నాం. వీరంతా అడవిపైనా, అడవితల్లిచ్చే వనరులపైన ఆధారపడి తర తరాలుగా అడవిని కాపాడుకుంటూ అడవినే ఆశ్రయించుకుని జీవిస్తున్న గోండు, ప్రధాన్, కొల్లామ్ తెగల ఆదీవాసీలు.
వారితో కలిసి గుసాడి నృత్యం, మక్క ఘట్క, చిక్కుడు గింజల పప్పు, కుసుమ గింజల పొడి, ఉడకబెట్టిన చుక్కల కందులు, పట్టు తేనెతో జొన్నరొట్టెలు… వాగుల్లో స్నానా లు, నీరులేక వీలుకానపుడు ఒక్క మగ్గు నీళ్ళతో దంతధావనం, ముఖం కడుక్కో వటం. నిర్మా నుష్యపు మధ్యాహ్నాలు కాలి బాటల్లో నడిచొ స్తుంటే ఎలుగ్గొడ్లు నుంచి పారిపోవడా నికి పడ్డ తంటాలు, అప్పుడప్పుడూ అడవికి అడ్డంగా పరిగెత్తించే పెద్ద తేనెటీగలు… కెరమెరి ఘాట్ రోడ్లో ఎప్పు డెళ్లినా తప్పకుండా ఎదురొచ్చే కుందేళ్ళ గుంపులు, నెమళ్ళ గుంపులు… వాటి నృత్యాలు…
పదేళ్ళపాటు సాగింది అద్భుతమైన అపురూపమైన ఈ అనుభవం. పదోన్నతితో పెరిగిన పనుల ఒత్తిళ్ళతో మూడేళ్ళ గ్యాప్ తరువాత మరపురాని అనుభవాలు నెమరేసు కుంటూ కెరమెరి దిక్కుగా మళ్ళీ ప్రయాణం… మూసుకున్న కళ్ళవెనుక తిరుగుతున్న ఆ జీవన దృశ్యాలు పెద్ద గుంతలో పడి లేచిన జీప్ కుదుపుకి బ్రేక్ పడింది. ఎదురుగా అదే మైలురాయి… కానీ కళ్ళెదుట దృశ్యం గుండెల్లో గునపంలా గుచ్చుకుంది. గుమ్మటాల్లా ఉండే కెరమెరి కొండలు గొరిగేసినట్లున్నాయి. వృక్షాలు, చెట్లు, గుబుర్లతో ఉండాల్సిన ఆ కొండలు అరిగిపోయి చిన్నవైపోయినట్లు న్నాయ్. కళ్ళతో నీళ్ళూరుతుంటే గూడెం దగ్గర జీప్‌లోంచి దిగాను. అదే ప్రేమతో, తరగని ఆనందంతో ఆప్యాయంగా కౌగిలించుకుం టున్న దీపాబాయి, కౌసల్యా బాయి, కమలా బాయి, దృపదబాయి, కుంతి బాయి… కానీ నాలో దుఃఖం పెల్లుబుకుతోంది. ‘రామ్ రామ్… బాయి’ అంటున్నా కళ్ళన్నీ ఆ గుట్టలపైనే. ఆగలేక ‘ఏంటిదంతా, ఏమయ్యింది… అడవేది’ అని అడుగుతుంటే ‘ఇంకెక్కడ అడ్వి అక్కా… మాకు యొవసాయం నేర్పించిన్రు కదా! రిజర్వాయర్ పన్లల్ల కూలీలైనం కదా! ఇక మాకు అడ్వితో ఏం పని…!’ అన్న దృపదబాయి గొంతులో ఎంతో నిష్టూరం. ‘పేపర్లల్లో చదివిన… కెరమెరి కొండల్లో పోడు వ్యవసాయం చేసుకోడానికి ఒక్కో కుటుంబానికి కొంత భూమి ఇచ్చారని… కానీ ఇలా ఊహించ లేదు…’ అంటుంటేనే ఏదో నిరసనతో గొంతు వణికింది. తమాయించుకుని ‘వాటర్ షెడ్ పనులు చేస్తున్రా’ అన్న పేలవమైన నా ప్రశ్నకి ‘అగో, నీరంతా రిజర్వాయర్ల చిక్కిం దిగా… ఇంకెందుకు గవ్వన్నీ’ అన్న మరో నిష్టూరం దూసుకొచ్చింది రిజర్వాయర్ వైపుగా చూపిస్తూ…
అడవి కొట్టేసి, టేకు, కలపంతా పట్టుకుపోయాక భూములు పంచిచ్చినా మేఘాలు ఆకర్షింపబడక, వర్షం రానందున… వచ్చినా చిన్న వర్షానికే మట్టిని కూడా లాక్కుపోతున్న నీటిని ఆపడం వీలుకాక… జొన్నలు కూడా పండక… రేషన్ బియ్యం తినటం అలవాటు చేసుకున్నామని; ఇప్పపూలు, బీడీ ఆకులు లేక ఎండాకాలం ఎల్లట్లేదని; కుంకుడు కాయలు, ఉసిరి కాయలు, చింతపండు, తేనె లేక కలపేతర అటవీ ఉత్పాదనల కొనుగోలు కేంద్రాలు తెరవట్లేదని; పశువులకి మేత లేక అమ్మేసు కున్నామని; మీరు నేర్పిన పెరటి మొక్కల పెంపకం వల్ల కూరగాయలు కొంచమైనా ఇళ్ళ దగ్గరే పండించుకుంటున్నామని, వాటినే ఎలుగ్గొడ్లు, కోతులు ఉండనివ్వట్లేదని; చిన్న జీవాల్ని పెంచుదామంటే నక్కలు, అడవి జంతువులు ఊళ్ళ మీద పడుతున్నాయని, ఇలాగైనా బతుకుతున్నామని, బతకలేమ నుకున్నవాళ్ళు వలసపోయారని చెప్తోంటే… నరనరాన సెగలుగక్కుతోంది.
తమమానాన తాము బతుకుతున్న ఈ అడవి బిడ్డలు అడవి తల్లికి దూరమై ఆనాధల్లా ఉన్నామంటుంటే… ‘దుర్మార్గులైన అన్న’ల్ని తుడిచేస్తామంటూ ఒకవైపూ, ‘ప్రాజెక్ట్‌లు కట్టి మిమ్మల్ని ఉద్దరిస్తామ’ంటూ మరోవైపూ అడవుల్ని మాయం చేస్తున్న పాలకుల ‘అభివృద్ధి’ జరుగుతోందేమో కానీ… అమాయకులైన, స్వచ్ఛ మనస్కులైన ఆదీవాసీల అభివృద్ధి మాత్రం ఎండమావే! వాళ్ళడగని, ఒద్దంటున్న అభివృద్ధీ ఒక అభివృద్ధేనా? ఇది ఆదివాసీల హక్కుల కాలరాత కాదా…?