భూమిక సంపాదకులు, హైదరాబాద్
అమ్మా,
ధైర్యంగా జరిపిన పోరాటంలో సావిత్రీబాయి ఝాన్సీ లక్ష్మీబాయికి ఏ మాత్రం తీసిపోదని జనవరి భూమిక వలనే తెలుసుకున్నాను. ఓల్గా కథ పురుషాధిక్యాంధకారానికొక చెంపపెట్టు. స్త్రీ స్వాతంత్య్రానికొక ఆశీస్సు, మార్గదర్శి, అంకుశం.
నేను ఫెమినిస్టును కాదు, మార్క్సిస్టునూ కాదు. కేవలం మానవ ప్రగతి కాంక్షించే సగటు మనిషిని.
– వి.ఎ.కె. రంగారావు, చెన్నై.
…………….
ఎడిటర్ గారికి,
చరిత్రని ఎంతో కొంత పాక్షికంగా చూడడంవల్లే ప్రజా సమూహాలు, వారి వారసులు ప్రభుత్వాలు, ప్రజలకు దగ్గరవ్వలేకపోయారు అనడానికి ‘సావిత్రి’ ఒక మంచి ఉదాహరణ. 18వ శతాబ్ధి అర్థ భాగంలోనే ఒక వనిత తనకున్న స్థితిగతులను బేరీజు వేసుకుంటూ ఒకవైపు భర్తను, భర్తలోని సామాజిక ఉద్యమాల ఆచరణను అర్థం చేసుకుంటూ, తన మిత్రునికి (భర్తకు) సమ ఉజ్జీగా రాణించడం, చరిత్రలో చాలా అరుదైన వాస్తవాన్ని చేసి చూపించారు.
ఈ చరిత్రను అన్ని ఉద్యమాలు అర్థం చేసుకోవడంలో వెనుకంజ వేసిన ఫలితమే నేడు స్త్రీల పట్ల ఈ దాగుడు మూతల అవస్థలు. చరిత్రలోని సామాజిక శక్తుల మత్తు వదలాలంటే ఇప్పుడు కూడ ‘ఫూలే’ ఆచరణ అప్పటికన్నా ఎక్కువ అవసరం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం.! నేను ఈ మధ్య ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నా. గతంలోని ఆచరణ నుండి ఇప్పుడు ఒక సావిత్రి బాయి ఉంటే ఏమి చేసేదా అని. అలా మనం ప్రజలను తీర్చిదిద్దాలి అనుకుంటున్న సందర్భంలోనే భూమిక జనవరి సంచిక చదవడం నిజంగా నాలో ఒక గుణాత్మకమైన మార్పే!
భూమికలో వచ్చిన కథ, పుస్తక సమీక్ష, ఒక సామాజిక ఆర్థిక విశ్లేషకులయిన ”హరా” గారిని చూసి వారి నుంచి మనం స్వీకరించి ఆచరించదగిన విషయాలు ఏంటి అని చెప్పే విధంగా చాలా బాధ్యతాయుతంగా రాశారు అందరు విశ్లేషకులు. ఇకముందు భూమికకు చెప్పాల్సింది ఏమీ లేదేమో, మనం నేర్చుకోవాల్సిందే ఉంటుంది అనే విధంగా తీర్చిదిద్ది ఉమ్మడి విజయం అంటే ఏంటో చూపించారు. మిమ్మల్ని చూసి మేం చేస్తున్న పనులను, ఆచరణను కూడా ప్రశ్నించుకునే విధంగా ప్రతి రచనా తన తాత్వికతను, ఆచరణలో వచ్చే వైరుధ్యాలను బేరీజు వేస్తూ, ఏ ప్రలోభాలకు లొంగలేదు అనేకంటే ఇందులో వ్రాసిన రచయిత్రులు ఆచరణలో, చదవడంలో ఒకరికొకరు పోటీపడి పాఠకులుగా మాకు ఒక షడ్రసోపేతమైన భోజనాన్ని అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు.
‘మా అక్క ముక్కుపుల్ల గీన్నే పోయింది’ అనే శీర్షికతో సుభద్రక్క వ్రాస్తున్న వ్యాసాలు నాకు ఎందుకో కొంత సందేహాలను కూడా కలిగించేవి. బహుజన నాయకత్వం, పార్లమెంటరీ రాజకీయాలు, అంబేద్కర్ ఆచరణలో నుంచి చూసినా ఇప్పటి తరం నాయకుల్లో అంబేద్కర్‌లా చరిత్రను అర్థం చేసుకునేవారెవరైనా ఉన్నారా అనిపించేది. ‘గీలోట్ల కరువుల మన్నువడ’ రచన మాత్రం నన్ను ఆలోచించేలా చేసింది. చిన్న పనులు దొరికితే చేసుకుని బతికే భార్యా భర్తల మధ్య గీలోట్ల కళ్ళెం ఏ పతాకస్థాయిని చూపిస్తుందో, వాళ్ళ మాటలతో తను ఎంతో మమేకమై అంత జాగ్రత్తగా వ్రాయటం నేటి రచయిత్రులందరికీ ఒక దిక్చూచిగా ఉంది. ఉదా|| ఒక అమ్మాయి రెండు కట్టెలు పాతి వాటిని ఒక తీగతో కలిపి దాని మీద నడుస్తున్నప్పుడు తనను తాను ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేసుకుంటుందో అంత జాగ్రత్తగా ఆ రచనలోని సంభాషణలు ఉన్నాయి. ఇప్పటి పరిస్థితులకు కూడా సరిగ్గా సరిపోయేలా నోట్ల రద్దు గురించి వివరించారు.
ఒక మార్చి 8 కథ చదువుతుంటే ఇంతకే అయిపోయిందా అనిపించింది. డబ్బుకి, స్వేచ్ఛకి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎంత జాగ్రత్తగా కథ ద్వారా ఒడిసిపట్టుకుందో కథా రచయిత్రి. మరల ఈ కథ కొనసాగింపుని వచ్చే మార్చి 8 కి కథ-2గా వ్రాయాలని మనం కోరుకోవాలి. ఈ కథా వస్తువు ముందు మందు జరగబోయే సంఘటనలకు ఒక కొత్త కోణాన్ని ఇస్తాయనడంలో ఏ విధమైన సందేహానికి తావులేదు. అందుకే ఓల్గా గారికి అంతర్జాతీయ శ్రామిక, దళిత, మస్లిం మహిళా దినోత్సవ అభినందనలు.
ఇక పుస్తక సమీక్ష కోసం ఒక పుస్తకం నెలన్నర చదివిన అపర్ణ తోట గారిని అభినందించకపోతే ఈ నా ఉత్తరానికి అర్థం
ఉండదేమో అనిపిస్తుంది. ఎక్కడ మొదలుపెట్టి ఏం చెప్పాలో అంతా చెప్పేసారు. పాఠకులకు, సాహీతీకారులకు మనం తప్పిపోతున్న సందర్భాలను చెప్పకనే చెప్పారు. ఇప్పటి నుండైనా పుస్తక సమీక్ష చదివితే కండ్ల వెంట బొటబొటా నీళ్ళు కారేలా ఆస్వాదించడం అని కొత్త అర్థంతో తేల్చి చెప్పినందుకు హృదయపూర్వక నమస్కారాలు. అందరం బుక్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై హార్ట్ అనుకునేలా ముందు ముందు అనేక పుస్తకాలు సమీక్షంచాలని కోరుకుంటూ…
– కలన, హైదరాబాద్.
…………….
భూమిక సంపాదకులకు,
జనవరి, 2017 సంచికలో ఓల్గా గారు రాసిన ఓ మార్చి 8 కథ నచ్చింది. సమాజంలో కొంత మార్పు వచ్చినప్పటికీ, ఇంకా కొంత మంది ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. కాని ఈ కథ చదివాక ఇంకా కొంతమందిలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను. అయితే ఈ కథలో ఆమె మారినట్టు తన స్నేహితురాలకే కాక మిగతా వారితో కూడా తన మార్పుని షేర్ చేసుకుంటే బాగుండేదనిపించింది. అలాగే ఆమె భర్తలో కూడా మార్పు వచ్చినట్టుగా ఉంటే ఇంకా బాగుండేదనిపించింది. సమాజంలో అలాంటి మగవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అతని మార్పు ఇంకొంతమంది మగవాళ్ళలో మార్పు తెచ్చేది అనిపించింది.
– శ్రీలలిత, కర్నూల్.
…………….
భూమిక సంపాదకులకు నమస్కారం,
జనవరి సంచికలో పచ్చి పసుపు కొమ్ము కాలమ్ ‘పిడికెడు బియ్యం – ఆకలి మాయం’ ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతిసారి ప్రశాంతి గారు చాలా సహజత్వానికి దగ్గరగా, చదివే పాఠకులను చదువుతున్నట్లుగా కాకుండా అదంతా మన కళ్ళకు కట్టినట్లు దానిని చూస్తున్నట్లు ఉంటుంది. మీరు రాసే కాలమ్ మీ అనుభవాలు ఎంతో మధురమైనవి. చాలా చాలా బాగా ఉంటుంది. ప్రతి నెల ఈ కాలమ్ చదివినాకే మరొక టాపిక్ చదువుతాను. ప్రత్యేకంగా ప్రశాంతి గారికి నా అభినందనలు.
– యుగంధర్, హైదరాబాద్.
…………….
ఎడిటర్‌కి
పుస్తకాల పండుగలో భూమిక పాల్గొనటం అందులో మేము కూడా పాలు పంచుకునే అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ 10 రోజుల వేడుకలో రోజూ చాలా మంది రచయితలను కలుసుకోవడం, మా మేడమ్ రాసిన ‘ఆనందార్ణవం’, ‘విపశ్యన’ పుస్తకాల ఆవిష్కరణ, భూమిక హెల్ప్‌లైన్ గురించి వివరించడం కొత్త అనుభూతినిచ్చింది. భూమికలో ప్రచురితమైన పుస్తకాల పండుగ రిపోర్టు చదువుతుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహమొచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన మా సత్యవతి, ప్రశాంతి గార్లకు ధన్యవాదాలు. – భూమిక టీమ్
…………….