పడిలేచిన కెరటం – భూమిక పాతికేళ్ళ ప్రస్థానం

25 సంవత్సరాలుగా భూమికతోపాటు నడిచిన, నడుస్తున్న ఆత్మీయ పాఠకులందరికీ రజతోత్సవ అభినందనలు!

ఈ ప్రత్యేక సంపాదకీయం రాయడానికి కూర్చోగానే ఎన్నో ఆలోచనలు నా మనసునిండా ముప్పిరిగొన్నాయి. ఇరవై అయిదు సంవత్సరాల అనుభవాలు… ఎన్నిటి గురించి రాయను? ఎలా రాయను? నేనంటూ నేనని తోసుకొస్తున్న అనుభవ పరంపరను ఎలా పక్కకి నెట్టేయను? ఎలా ప్రయారటైజ్‌ చేసుకోను? భారతీయ సమాజం మీద తన తొలి పాదం మోపిన ప్రపంచీకరణ నేపధ్యంలోంచి, ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన స్త్రీ వాద ఉద్యమ ప్రభావంలోంచి పురుడు పోసుకున్న పసికందు; పసిప్రాయం, బాల్యం, కౌమారం అన్నీ దాటేసి ఈ రోజు 25 ఏళ్ళ ప్రౌఢగా, నిటారుగా నిలబడి, నిలువెత్తు ధైర్యంగా, బాధితుల పక్షాన నూటికి నూరు శాతం నిలబడ్డ ధీర భూమిక. తొలి అడుగులు కొన్నిసార్లు తడబడినా, కొందరివల్ల సంక్షోభాలు తలెత్తినా, అన్నీ దాటుకుని ఈ రోజు నిలకడగా, నిబ్బరంగా నిలబడింది భూమిక. దీనికి కారణం పాఠకులే. మీరంతా అనేకసార్లు, అనేక సందర్భాల్లో అండగా నిలబడడం వల్ల భూమిక ఈ రోజు ఈ స్థాయిలో నిలబడింది.

పత్రికలు పుట్టడం, గిట్టడం చాలా వేగంగా జరిగిపోతున్న నేపధ్యంలోంచి చూసినపుడు ఒక స్త్రీ వాద పత్రిక, ఒక ప్రత్యామ్నాయ పత్రిక, ఆర్థికంగా ఎలాంటి అండ, దండలు లేని పత్రిక ఇరవై అయిదు సంవత్సరాలు నిలబడిందంటే… అదీ ఎక్కడా రాజీపడకుండా నడుస్తోందంటే… ఇది పత్రికా ప్రపంచంలో ఓ అద్భుతం. ‘మానుషి’లాంటి జాతీయ స్థాయి పత్రిక పంథాను మార్చుకుని కూడా మనుగడలో లేకుండా పోయింది. తొలి సంచికలో ప్రకటించుకున్న ఉద్దేశ్యాలు, లక్ష్యాలు తు.చ. తప్పకుండా పాటిస్తూనే భూమికను కొనసాగించగలగడం నాకు చాలా గర్వకారణం. ఎలాంటి జర్నలిజం డిగ్రీలు లేని నేను 25 సంవత్సరాలపాటు అవిచ్ఛిన్నంగా భూమిక సంపాదకురాలిగా ఉండగలగడం నా జీవితంలో నేను సాధించిన ఒక చిరువిజయం.

తెలుగులో ఫెమినిస్ట్‌ దృక్పథంతో ఒక పత్రికను తీసుకురావాలనే చర్చలు అన్వేషిలో 1992 నుండే (బహుశా అంతకు ముందు కూడా) మొదలయ్యాయి. తొలి సమావేశం ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి ‘ఉమన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా’ సహసంపాదకురాలు డా|| సూసి తారు ఇంట్లో సీఫెల్‌లో జరిగినపుడు కె.లలిత, వీణా శతృఘ్న, రమా మెల్కోటే, సజయ ఇంకా ఎంతోమంది హాజరయ్యారు. నేను బిడియంగా ఓ మూల కూర్చుని చర్చల్ని గమనించిన గుర్తు. చర్చలు చాలావరకు ఇంగ్లీషులో జరగడంతో నేను మౌనంగా కూర్చునేదాన్ని. అప్పటికి ఇంగ్లీషులో మాట్లాడడం నాకు చాలా కష్టం. అలాంటి సమావేశాలు చాలా జరిగాయి. ఎప్పటినుండి మొదలుపెట్టాలి? పత్రికకు ఏం పేరు పెట్టాలి? ఏం ప్రింట్‌ చెయ్యాలి? ఇలాంటి చర్చల మధ్యలోంచి ‘భూమిక’ అనే పేరు ఖాయమైంది. మూడు నెలలకొకసారి పత్రికను తేవాలి. జనవరి-మార్చి 1993న తొలి సంచిక రావాలి. సంపాదకురాలిగా కొండవీటి సత్యవతి ఉండాలి… ఇవి తీర్మానాలు. నేను సంపాదకురాలిగా ఉండాలనే సూచన ఎవరినుంచి వచ్చిందో, నేను ఎందుకు అంగీకరించానో నాకు గుర్తు రావడం లేదు. ఎందుకంటే అప్పటికి నేను పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో ఉద్యోగిగా ఉన్నాను. నేను సాహిత్యం తప్ప జర్నలిజం చదవలేదు. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌కి నా పేరుమీదే ‘టైటిల్‌’ కోసం అప్లై చేశాను. ‘భూమిక’ స్త్రీ వాద పత్రిక టైటిల్‌ మంజూరైంది. తొలి సంచిక 1993 జనవరిలో రిలీజ్‌ అయ్యింది.

ఉస్మానియా యూనివర్శిటీలోని ఒక భవనంలో ‘అన్వేషి’ ఆఫీసు ఉండేది. అక్కడే ఒక చిన్న రూమ్‌ భూమికకు ఇచ్చారు. సౌకర్యాలన్నీ అన్వేషివే. సంపాదకవర్గంలోని కొంతమందిమి చర్చించి మెటీరియల్‌ సెలక్ట్‌ చేసేవాళ్ళం. నేను, సజయ ఎక్కడెక్కడో తిరుగుతూ, డిటిపి, లేఅవుట్‌, కవర్‌ పేజీ చేయించేవాళ్ళం. ప్రింటింగ్‌ వేరే చోట జరిగేది. పుస్తకాల కట్టల్ని భుజాల మీద పెట్టుకుని ఓయూ పోస్టీఫీస్‌కెళ్ళి పోస్ట్‌ చేసేవాళ్ళం. ప్రతి సంచిక ప్రింట్‌ అయ్యి వచ్చిన తర్వాత సమీక్ష జరిగేది. చాలాసార్లు చాలా ఎమోషనల్‌గా ఆరోపణలు, ప్రత్యారోపణలు, దు:ఖాలు అన్నీ ఉండేవి. బుక్‌ బయటికొచ్చినా ఇదొక యాతనగా ఉండేది. అన్వేషిలో ఖాళీ చేసి కొంతకాలం డా||జి.భారతి (ఇప్పుడు లేరు) గారింట్లో, తార్నాకకి భూమిక ఆఫీసు మార్చాం. అక్కడా ఎక్కువ రోజులు లేదు. ఎంతకాలం ఇలా ఎవరో ఒకరి మీద ఆధారపడాలి? భూమిక కోసం ఆఫీసు తీసుకోవాలని చర్చించి బాగ్‌లింగంపల్లికి మారిపోయాం. భూమికకు ఓ అస్తిత్వం, తనదంటూ ఒక కార్యాలయం ఏర్పడ్డాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండడం వల్ల ఒక గదిని వేరేవాళ్ళకు అద్దెకిచ్చాం. మొత్తానికి భూమిక తనకంటూ ఏర్పడిన స్థానంలో కుదురుకుంది. పత్రిక మూడు నెలలకొకసారి బదులు రెండు నెలలకొకసారి తీసుకు రావాలని నిర్ణయించుకున్నాం.

97లో నాకు డిప్యూటీ తహసీల్దారుగా ఉద్యోగమొచ్చి నరసాపురం వెళ్ళిపోయాను. యలమంచిలి తాసిల్దార్‌గా ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌ వచ్చినపుడు మాత్రమే భూమిక పనిలో పాలుపంచుకునేదాన్ని. ఆ టైములో సజయ, పి.శైలజ భూమిక పనిలో ఉండేవాళ్ళు. 2000 సంవత్సరంలో నేను హైదరాబాద్‌లో లేని సమయంలో సజయ, శైలజ భూమికను అర్థాంతరంగా, అనాధలాగా వదిలేసి వెళ్ళిపోయారు. వారి మధ్య ఏం జరిగిందో నాకు ఈ రోజుకీ తెలియదు. సజయ రిజైన్‌ చేసింది.

ఒక సామూహిక ప్రయత్నంగా, ఎన్నో ఆశయాలతో మొదలైన పత్రిక ఏడు సంవత్సరాల కాలానికే అందరి చేత వదిలేయబడి, ఆర్థికంగా దిగజారిపోయి దీనంగా నిలబడడం నన్ను కలచివేసింది. చాలా మధనపడి, సంఘర్షణనెదుర్కొని నా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలని నిర్ణయించుకుని 2000లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి భయం భయంగా ఒక్కదాన్ని భూమికను భుజాలమీదకెత్తుకుని గుండెకు పొదుపుకున్నాను. గత 17 సంవత్సరాలుగా ఒక్క చేత్తో భూమికను నడిపిస్తున్నాను. చాలా ఆశ్చర్యంగా అంతవరకు భూమిక వైపు చూడని ఎంతోమంది మిత్రులు, రచయితలు నా చుట్టూ చేరారు. అబ్బూరి ఛాయాదేవి గారిలాంటి ఆత్మీయులు భూమికలో భాగమయ్యారు. ఎంతోమంది విరాళాలిచ్చారు. చందాలు కట్టించారు. తొలిరోజు భయంగా భుజానికెత్తుకున్నాను కానీ చాలా తొందరలోనే ధీమాగా, ధైర్యంగా తీసుకున్నాను. భూమికను ద్వైమాస నుంచి మాస పత్రిక చేశాను. గాడినపడి బాగా నడుస్తున్నది.

2004లో ఓ ఉపద్రవం వచ్చి పడింది. భూమిక (దీష్ట్రశీశీఎఱసa) పేరుతో కరీంనగర్‌లోనో ఎక్కడో వేరే పత్రిక ఉందని వాళ్ళు ఫిర్యాదు చేశారు. కాబట్టి మా టైటిల్‌ కాన్సిల్‌ చేస్తున్నామని, మేము వాళ్ళ ఆర్‌.ఎన్‌.ఐ.కి దరఖాస్తు చేసుకోవాలని తాఖీదు. చాలా టెన్షన్‌ పడ్డాను ఆ దశలో. అప్పటికే భూమిక చాలా ప్రాచుర్యం పొందింది. ‘భూమిక’ టైటిల్‌ పోతే ఎలా? స్త్రీ వాద పత్రిక భూమిక అని దరఖాస్తు చేశాం. అది వచ్చింది. అలా ‘భూమిక’ స్త్రీ వాద పత్రిక కాస్తా ‘స్త్రీ వాద పత్రిక భూమిక’ గా 2005లో మళ్ళీ రిజిస్టర్‌ అయ్యింది. అలా ఆ వివాదం సాఫీగానే సమసిపోయింది.

అప్పటినుండి వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో అంశాలమీద ప్రత్యేక సంచికలు తెచ్చాం. దశాబ్ది ప్రత్యేక సంచిక, ద్వి దశాబ్ది ప్రత్యేక సంచిక తెచ్చి పెద్ద స్థాయిలో ఆవిష్కరించాం. వ్యవసాయ సంక్షోభం, ప్రపంచీకరణ విధ్వంసం, దళిత మహిళ, చేనేత సమస్య, హెచ్‌.ఐ.వి ఎయిడ్స్‌ ప్రత్యేక సంచికలు, పిల్లల ప్రత్యేక సంచిక, రచయిత్రుల ప్రత్యేక సంచిక, తెలంగాణ ప్రత్యేక సంచిక… ఇలా ఎన్నో అంశాలమీద ప్రత్యేక సంచికలు తెచ్చాం. ఆఫీసులో నేను, ప్రసన్న, లక్ష్మి మాత్రమే ఉండేవాళ్ళం. ప్రసన్నకి మాత్రమే జీతముండేది. లక్ష్మి అడ్వర్టైజ్‌మెంట్లు, చందాల కోసం తిరిగేది. పార్ట్‌టైమ్‌గా కొంత జీతముండేది. భూమికలో నుంచి ఈ 25 సంవత్సరాలలో నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఆ రోజుల్లో ప్రసన్న చాలా కష్టపడి పనిచేసేది. అన్ని విధాలుగాను నాకు తోడుగా ఉండేది. ఆమె లేకపోయుంటే నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉండేదాన్ని.

2006 వరకు నాకు పత్రిక పని మాత్రమే ఉండేది. 2006లో ఆక్స్‌ఫామ్‌ సపోర్ట్‌తో భూమిక హెల్ప్‌లైన్‌ ప్రారంభమైంది. అప్పటినుండి నా పని పరిధి బాగా విస్తరించిపోయింది. హెల్ప్‌లైన్‌ కేసులు, మీటింగులు, ట్రైనింగులు, పోలీసులతో కలిసి పని చేయడం మొదలయ్యాయి. 2006లో గృహ హింస నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. చట్టం అమలు కోసం మహిళా శిశు అభివృద్ధి శాఖతో కలిసి పని చేయడం కూడా మొదలైంది. ఒక పక్క నెలనెలా భూమిక తీసుకురావాల్సిన టైట్‌ షెడ్యూల్‌ ప్రోగ్రామ్‌, మరో పక్క హెల్ప్‌లైన్‌ చుట్టూ చేయాల్సిన పనులు. ఇన్ని కార్యక్రమాల మధ్య కూడా ఏ రోజూ భూమిక పత్రికని నిర్లక్ష్యం చేయలేదు. ఏ ఒక్క నెలా భూమిక రాకుండా లేదు. నిరంతరంగా పత్రిక నడుస్తూనే ఉంది.

భూమిక నిరంతరాయంగా నడవడంతోపాటు హెల్ప్‌లైన్‌ ప్రాచుర్యానికి ఎంతో మేలు చేసింది. సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం ప్రారంభమైన హెల్ప్‌లైన్‌ అట్టడుగు గ్రామీణ స్థాయి మహిళల దాకా చేరడానికి భూమిక పత్రిక వాహిక ఐంది. ప్రతినెల భూమిక కవర్‌ పేజీ మీద హెల్ప్‌లైన్‌ నంబర్‌ ముద్రించడం వల్ల ఇది సాధ్యమైంది. దాదాపు 70 వేల మంది బాధిత మహిళలు హెల్ప్‌లైన్‌కి కాల్‌ చేసి సహాయం పొందగలిగారు. ఎంతోమంది హెల్ప్‌లైన్‌లో వాలంటీర్స్‌గా చేరారు. భూమిక చదివే పాఠకులెందరో భూమిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వాలంటీర్లుగా చేరి ఎందరో బాధితులకు సహకారమందిస్తున్నారు.

1993లో ఒక పత్రికగా మొదలైనప్పటికీ ఈ రోజు భూమిక ఎన్నో కార్యక్రమాల్లో విస్తరించింది. మహిళా పోలీస్‌ స్టేషన్లలో సపోర్ట్‌ సెంటర్లు పెట్టినా, ఉమన్‌ ప్రొటక్షన్‌ సెల్‌ (సిఐడి ఆఫీస్‌)లో స్త్రీల సహాయార్థం సెంటర్‌ నడుపుతున్నా, చంచల్‌ గూడా మహిళా ప్రిజన్‌లో ఖైదీల కోసం జైలు లోపల సహాయ కేంద్రం నడపగలిగినా వీటన్నింటికీ పునాది భూమిక. ఇటీవల కాలంలో ‘షీ టీమ్స్‌’ అపరాధులకు కౌన్సిలింగ్‌ చేసి హైదరాబాద్‌ రోడ్లు మహిళలకు భద్రంగా ఉంచే బృహత్‌ కార్యక్రమంలో కూడా భూమిక భాగస్వామి అయింది.

ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు స్త్రీల పట్ల జెండర్‌ స్పృహతో, సున్నితంగా ప్రవర్తించాలన్న తలంపుతో ఎంతోమందికి జెండర్‌ మీద, అసమానతల మీద అవగాహననిచ్చే అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాం. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, న్యాయమూర్తులు

కూడా ఉన్నారు. స్త్రీల పట్ల, స్త్రీల అంశాల పట్ల జెండర్‌ సెన్సిటివిటీతో వీరంతా ప్రవర్తించాలన్నదే ఈ శిక్షణల ముఖ్యోద్దేశ్యం. అలాగే ఎన్నో పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాం. మొక్క దశలోనే పిల్లల మనసుల్లోకి సున్నితత్వాన్ని, జెండర్‌ స్పృహని కలిగిస్తూ, చట్టాల పట్ల అవగాహన కలిగించాలన్నదే వీటి ముఖ్య ఉద్దేశ్యం. ఎంతో వెనుకబడిన మహబూబ్‌నగర్‌ జిల్లాలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ… ఆయా వ్యవస్థలకు అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం.

ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఈ రోజు భూమిక జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో స్త్రీలపై అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా పనిచేసే అత్యున్నత సంస్థ అనే ట్యాగ్‌లైన్‌తో బహుళ ప్రాచుర్యం పొందింది. పీడిత స్త్రీలు, బాలికల కోసం నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసే సంస్థగా భూమిక అగ్రభాగాన నిలబడింది. ఇలాగే ముందుకు సాగాలని బలంగా కోరుకుంటోంది. సంస్థను నిర్మించిన వారు కనుమరుగైతే ఆ సంస్థ సాధారణంగా కుప్పకూలిపోతుంది. కానీ భూమికకి ఆ పరిస్థితి లేదు.

2015లో మహిళా సమతకు రాజీనామా చేసి భూమికలో చేరిన ప్రశాంతి రాకతో భూమికలో ఒక నూతనాధ్యాయం ప్రారంభమైంది. అసోసియేట్‌ ఎడిటర్‌గా ప్రశాంతి మొత్తం పత్రిక బాధ్యతను భుజాలమీద వేసుకుంది. పత్రికను మరింత ఆకర్షణీయంగా తేవాలనే తపనతో తను పనిచేస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత, ప్రశాంతి రాకతో నాకు కొంత వెసులుబాటు చిక్కింది. ఇద్దరం కలిసి వివిధ ప్రాజెక్టుల్ని, పత్రికను చూసుకోగలుగుతున్నాం. ఇది నాకెంతో సంతోషం కలిగించే విషయం. ప్రశాంతి సారధ్యంలో భూమిక పదికాలాలపాటు కొనసాగాలని నా ప్రగాఢ ఆకాంక్ష.

25 సంవత్సరాలు నిండి, పండగ చేసుకునే వేళ భూమిక పాఠకులందరికీ అభినందనలు… ధన్యవాదాలు! భూమికను మరింత ఆకర్షణీయంగా, ఉత్తమ ప్రణాళికలతో కొనసాగిస్తామని హామీ యిస్తూ….

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to పడిలేచిన కెరటం – భూమిక పాతికేళ్ళ ప్రస్థానం

  1. Anjali says:

    సంపదకులకు నమస్తే. భూమిక పత్రిక 24 సంవత్సరాలు complete చేసుకొని 25 వ సంవత్సరం లోకి వచ్చినందుకు భుమిక సభ్యులందరికీ అభినందనలు. సత్యవతి గారికి ప్రత్యేక అభినందనలు. మీ సంపాదకీయం చదివితే మీరు భుమికను మీ భుజాల మీద వేసుకొని నదిపించడం, మీరు పడిన కష్టం స్పష్టంగా తెలిసింది. మీతో పాటు ఈ ప్రయాణంలో పాలుపంచుకొన్న అందరికి అభినందనలు. ముఖ్యంగా – ప్రసన్న, లక్ష్మి, ప్రశాంతి గార్లకు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. భూమిక కొత్త్త ఔట్ లూక్, చార్టూన్స్ కాలం బాగున్నాయి. భూమిక ఇదే విధంగా ముందుకు వెలుతూ ఇంక ఎంతోమందికి చెరువకావలని, కొత్త యువ రచయితలు భూమిక ద్వారా పరిచయం కావలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. – అంజలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.