కాలానుగుణంగా కాలాల్లో మార్పులు సహజమైనవి. కాలంతో పాటు సమాజంలో కూడా భిన్నమైన మార్పులు చోటు చేసుకోవడం సహజమే. ఏ కులమైనా, మతమైనా, సమాజమైనా వెలుగు బాటలో నడవాలంటే కాలానుగుణంగా మార్పులు తప్పనిసరి. అంతకన్నా ముందు సంస్కరణలు తప్పనిసరి. చరిత్రను పరిశీలించి చూస్తే నాటినుంచి నేటివరకు ఏ మతంలోనైతే అభ్యున్నతిగా సంస్కరణలు చోటు చేసుకున్నాయో ఆ మతాలు చైతన్యవంతంగా సాగుతున్నాయి. నేడు మతంలో అయితేనేమి, సమాజంలో అయితేనేమి చోటు చేసుకోలేక మతాలతో పాటు సమాజం కూడా కొట్టుమిట్టాడుతూ తచ్చాడుతున్నాయి. దీనికి ఏ మతం మినహాయింపు లేదు. కానీ భారతదేశంలోని ముస్లింలు మిగతా మతాల వారికన్నా రాజకీయ, విద్య, వైద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో వెనుకబడి ఉన్నారు. దీనికి ప్రత్యక్ష కారణం వారి పేదరికమైతే, పరోక్ష కారణం కొన్ని మతాచారాలు భారత ముస్లింలతో దోబూచులాడుతున్నాయి.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే ముస్లిం మత పెద్దలు పెళ్ళి, విడాకులు, ఆచార సంప్రదాయాలు, వారసత్వం వంటి అంశాలలో తమ సొంత సివిల్ కోడ్‌ను పాటిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ మతాలలోని మానవీయ విలువలతో పోల్చుకుంటే ఇస్లాం మతంలోని మానవీయ విలువలు కొద్దివరకు ఉన్నతమైనవి. అయితే స్వమతంలోని కొన్ని ఆచార సంప్రదాయాలు ముస్లింలను వెనక్కు నెట్టుతున్నాయి. అయితే వీటిలో ప్రధానంగా మొదట చెప్పుకోదగ్గ విషయం ‘తలాఖ్’. తలాఖ్ అంటే విడాకులు అని అర్థం. ఈ తలాఖ్ ఇచ్చే పద్ధతి రెండు రకాలు. ఒకటి భర్త భార్యకు ఇచ్చే విడాకుల్ని తలాఖ్ అంటారు (దేశంలో 95శాతం మంది భర్తలు భార్యలకు విడాకులిస్తున్నారు). రెండవది భార్య భర్తకు విడాకులివ్వడాన్ని ఖులా అంటారు (దేశంలో 5 శాతం మంది భార్యలు మాత్రమే భర్తలకు విడాకులిస్తున్నారు). ఇటువంటి కొన్ని ఆచార సంప్రదాయాల వలన మిగతా మతాల స్త్రీల కంటే ముస్లిం స్త్రీలు మరింత వెనుకబడి ఉన్నారు. అయితే భర్త విడాకులు ఇచ్చినంత సులువుగా, భార్య విడాకులను ఇవ్వలేదు. ఎందుకంటే వారు చిన్నతనం నుంచి పెళ్ళీడుకు వచ్చేవరకూ తల్లి దండ్రుల సమక్షంలో పెరగడం ఒక కారణమైతే, పెళ్ళి తర్వాత భర్త సంరక్షణలో ఉండడం మరొక కారణం. అందువలన ముస్లిం స్త్రీలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నందువలన పురుషుడు కోరినంత సులువుగా స్త్రీ విడాకులను కోరలేదు.
”తలాఖ్”ను ఇస్లాం అత్యంత అవాంఛనీయ సంఘటనగా పేర్కొంది. విడాకులు దైవానికి సైతం ఏ మాత్రం ఇష్టం లేనిదని మహమ్మద్ ప్రవక్త కూడా బలంగా వక్కాణించి చెప్పడం జరిగింది. వివాహ బంధాన్ని భార్యా భర్తలు జీవితాంతం కాపాడుకుంటూ కొనసాగించాలని ఇస్లాం చాటుతోంది. అయితే అనివార్యమైన పరిస్థితులలో మాత్రమే ఈ విడాకుల్ని ఇస్లాం న్యాయశాస్త్ర చట్టం సమర్థిస్తుంది. అయితే ఇదివరకు విడాకులు ఇచ్చే పరిస్థితి వస్తే తలాఖ్‌ని కోరే భార్యాభర్తల బంధువుల సమక్షంలో ఇచ్చేవారు. అదికూడా వీరిలో ఎవరైనా విడాకులు కోరిన తర్వాత భార్యా భర్తలను విడివిడిగా 90 రోజులపాటు ఉంచి విడాకులిచ్చేవారు. ఈ 90 రోజుల కాల వ్యవధిలో భార్యాభర్తల్లో తిరిగి ఏమైనా మార్పులు చోటుచేసుకుని మళ్ళీ కలిసి జీవించడానికి ఇష్టాన్ని వ్యక్తపరుస్తారని వేచిచూడడం జరిగేది. ఈ కాల వ్యవధిని ”ఇద్దత్” అని పిలుస్తారు. కానీ నేడు కొందరు పురుషులు చొక్కాలు మార్చుకున్నంత సులువుగా తలాఖ్‌ను ఇస్తున్నారు. ఈ తలాఖ్ ఇవ్వడం నేటి సమాజంలో మరింత ఫ్యాషన్ అయ్యింది. వార్తా పత్రికల ద్వారానో, ఫోన్ ద్వారానో, వాట్సాప్ ద్వారానో, ట్విట్టర్ ద్వారానో మూడుసార్లు తలాఖ్-తలాఖ్-తలాఖ్ అని సంభాషిస్తూ, సందేశాలు పంపిస్తూ విడాకులు కోరేవారు లేకపోలేదు. దీనిని ఖాజీలందరూ సమర్ధించడం లేదు. కొందరు ఖాజీలు మాత్రమే వారి స్వార్థ ప్రయోజనాల కోసం సమర్థిస్తున్నారు. మరికొందరు తప్పు అని తెలిసినా ఏమీ మాట్లాడకుండా, ప్రశ్నించకుండా
ఉండేవారు కూడా లేకపోలేదు. అసలు నిజానికి తలాఖ్ అనే పదమే ముస్లింల పవిత్ర గ్రంథమైన ”ఖురాన్”లో భూతద్దం పెట్టి మరీ వెదికినా కన్పించదు. పురుషుడు స్త్రీని తన చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి తెరపైకి తీసుకొచ్చిన పరిణామంగా ముస్లిం స్త్రీలు గొంతెత్తిన దాఖలాలు కూడా కోకొల్లలు.
నేడు కొందరు కొత్త తరం రాజకీయ నాయకులు తలాఖ్‌ను వ్యతిరేకిస్తూ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. వారి స్టేట్‌మెంట్ నిజంగా ఆహ్వానించదగ్గదే. ఆనందించదగిన, ఆలోచించదగిన పరిణామమే. దీన్ని వారు ముస్లింల అభ్యున్నతి కాంక్షిస్తూ చేస్తున్న సందర్భమైతే మెచ్చుకోదగిన అంశమే. దీని వెనుక వారి కపట బుద్ధులుంటే మాత్రం ఆలోచింపక తప్పదు. ముస్లింల మంచి కోరి వస్తే శుభ పరిణామమే. ఇదే అదనుగా తీసుకుని ముస్లిమేతరులు భవిష్యత్తులో ఇస్లాం మతంలోకి జొచ్చుకువచ్చి ప్రతి అంశాన్నీ ప్రశ్నించే సందర్భం వస్తే అసలైన సమస్య ఏర్పడుతుంది. ఏదేమైతేనేమి ఈ పరిణామం మాత్రం ఆహ్వానించదగినదే. కానీ నేడు ముస్లిం మతపెద్దల ఆలోచనల్లో బుద్ధి కొరవడుతోంది. అందుకే పరిస్థితిని ఇతరులు చేయెత్తి చూపించేవరకూ తెచ్చారు. అసలు ఒకరు చేయెత్తి చూపించే స్థితికి దరిచేరకుండా ముస్లింల అభ్యున్నతి కోసం, స్త్రీల మెరుగు కోసం చైతన్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటే ముస్లిం సమాజంతోపాటు మతం కూడా కలకాలం మనగలగుతుంది. మనిషికి జీవించే హక్కు ఎంత ముఖ్యమో, స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం. ఇదీ ఏ మతమైనా వ్యక్తుల హక్కుల్ని, స్వేచ్ఛను గౌరవించాల్సిందే, ఆచరించాల్సిందే. ముస్లిం మత పెద్దలు, ముల్లాలు, ఖాజీలు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ముస్లిం స్త్రీలు అభివృద్ధి చెందకుండా ముస్లిం సమాజం అభివృద్ధి కాజాలదు. అసలు దేశ రాజధాని దిల్లీలో 2016 జూన్ 1న తలాఖ్ పద్ధతికి తలాఖ్ చెప్పాల్సిందేనని 50 వేల మంది ముస్లిం స్త్రీలు సంతకాల సేకరణతో ఉద్యమం చేశారంటే వారు ఎంత అణచివేతకు లోనైతే ఇలా చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. వారు ఆ ఉద్యమాన్ని మతాన్ని ధిక్కరించడం కోసం చేయలేదు. వారిలో దాగి ఉన్న బాధని, గొంతులో దిగమింగుకున్నా దుఃఖాన్ని గుర్తించి కన్నీళ్ళు తుడవడానికి ప్రయత్నిస్తారని ఆశించి రోడ్డెక్కాల్సిన స్థితి చేకూరింది. ప్రతి మతంలోనూ స్త్రీని చాలా తక్కువచేసే ధోరణి ఉంది. ఇస్లాం మతంలో కూడా లేదని కాదు. వాస్తవానికి మిగతా స్త్రీలకన్నా ముస్లిం స్త్రీల అణచివేత ఎక్కువ. ఆడవారు అనుకోకండి. వారు మనకు అమ్మ, అక్క చెల్లెళ్ళే. వారి సహనాన్ని చేతకానితనంగా భావించకండి. ప్రతి మతంలో స్త్రీలు, పురుషుని చేతిలో నానా మాటలు పడుతున్నారు. వారు పురుషుడ్ని నమ్ముతున్నారు కాబట్టే మగాడి పరిస్థితి ఇలా ఉంది. లేదంటే మగాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అసలు ఏ మతమైనా సంస్కరణలు స్వీకరిస్తేనే కదా బతికి బట్టకట్టేది.
గాయపడిన వారికే తెలుసు ఆ గాయపు బాధ. ఈ తలాఖ్ వలన పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ నష్టపోతున్నారు. స్త్రీలు విడాకులు పొందిన తర్వాత చుట్టూరా ఉన్న సమాజం పెట్టే సూటిపోటి మాటలకు వారు పడే నరకయాతనలు మాటల్లో వర్ణించలేనివి. ఒకవేళ వారికి పిల్లలుంటే విడాకులు పొందిన తర్వాత వారి జీవితమే ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న దాఖలాలు రోజురోజుకూ కోకొల్లలుగా చోటుచేసుకుంటున్నాయి. ఇలా తలాఖ్ బారిన పడిన వారి కళ్ళల్లో దాగిన కన్నీళ్ళను గానీ, ఆమె మనసును గానీ, ఆమె మేధోశక్తిని గానీ ఓ సారి గుర్తించండి. అసలు వారి కళ్ళల్లోంచి ఎన్ని అశ్రు బిందువులు నేలరాలుతున్నాయో ఏనాడైనా గుర్తించారా? వారి బాధల్ని గుర్తించి, వాటిని పంచుకుని వారి ఉన్నతికి బాటలు వేస్తేనే సమాజంలో ముస్లిం స్త్రీకి తగిన గౌరవం ఉంటుంది. ఎవరి లోపాలను వారు సరిదిద్దుకుంటేనే మంచిగా ప్రకాశిస్తారు. అది వ్యక్తయినా, మతమైనా! ఇస్లాం మతంలోని దాగున్న లోపాలన్నింటినీ మత పెద్దలు దీర్ఘదృష్టితో సంస్కరిస్తే ఇస్లాం మతం శాశ్వతంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా! ముస్లిం స్త్రీలు అభివృద్ధి చెందకుండా భారత ముస్లింలు అభివృద్ధి చెందలేరు. నిజాలు ఎప్పటికీ పచ్చిగానే ఉంటాయి.