కాక్కా ముత్తాయ్‌ (కాకిగుడ్లు) – కొండవీటి సత్యవతి

ఇటీవల నేను చూసిన పిల్లల సినిమాలు.. నిజానికి పాతవే. ఇంతకు ముందు నేను చూడలేదు. సినిమాని రిలీజ్‌ అయిన రోజునే చూడాలనే ఉబలాటం నాకు అస్సలు లేదు. మంచి సినిమా ఎప్పుడైనా చూడొచ్చు. నేను చూసిన మూడు సినిమాలు తమిళ సినిమాలే అవ్వడం యాధృచ్ఛికం కాదు. ఒకటి ‘కాక్కా ముత్తాయ్‌’, రెండోది ‘మల్లి’, మూడోది ‘హలో’, చివరి రెండు సినిమాలు సంతోష్‌ శివన్‌వి. కాక్కా ముత్తాయ్‌ దర్శకుడు మణికండన్‌. మొదట ‘కాక్కా ముత్తాయ్‌’ గురించి.

అభూత కల్పనలతో సాగే హ్యారీపాటర్‌కి అలవాటు పడిన పిల్లలు, ఛోటాభీమ్‌, చిన్నికృష్ణుడు లాంటి పురాణ కథల్లో కొట్టుకుపోయే పిల్లల్లోని మానవీయ కోణాలని, వారి సృజనాత్మకతకి అద్దం పట్టే సినిమాలు తెలుగులో దాదాపు లేవనే చెప్పాలి. నాకు తెలియనివి

ఉన్నాయేమో నాకు తెలియదు.

‘కాక్కా ముత్తాయ్‌’ కథ మొత్తం మురికివాడల్లో నివశించే ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ అల్లబడింది. వారి జీవితంలోకి ‘పిజ్జా’ ఎలా ప్రవేశించింది, దాని ప్రభావం వారినెట్లా అల్లకల్లోలం చేసింది అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు. కథలోకి వెళితే… రైలు పట్టాల పక్కనున్న ఒక మురికివాడలో ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తుంటారు. తల్లి, నానమ్మ

ఉంటారు. తండ్రి జైల్లో ఉంటాడు. కుర్రాళ్ళిద్దరూ గూడ్స్‌ రైళ్ళు జారవిడిచే బొగ్గు ముక్కల్ని ఏరుకుంటూ వాటిని అమ్మి తల్లికి డబ్బులిస్తుంటారు. రైల్వేలో పనిచేసే ఒకాయన వీళ్ళకి ఫ్రెండ్‌. బొగ్గు ఏరుకోవడంలో సహాయం చేస్తుంటాడు. ఒకరోజు పిజ్జా సప్లయ్‌ చేసే సేల్స్‌బాయ్‌ ఒకచోట అడ్రస్‌ కోసం వెతుకుతుంటాడు. మన కుర్రాళ్ళు సహాయం చేస్తామని చెప్పి ఒక్కసారి పిజ్జాను చూడనిస్తేనే అడ్రస్‌ చూపిస్తామంటారు. అలాగే చూపించి, అడ్రస్‌ కనుక్కుని వెళుతూ పిజ్జా అడ్వర్టయిజ్‌మెంట్‌ పేపర్‌ ఇచ్చిపోతాడు.

ఆ పేపర్‌ జేబులో పెట్టుకుని ఇంటికెళ్ళేటప్పుడు ఇంటికి టీవీ వచ్చి ఉంటుంది. ఓట్లేసిన వారికి రాజకీయ పార్టీలు టీవీ పంచిన విషయం తెలిసిందే. చిన్న గుడిశె లాంటి ఇంట్లో రెండు టీవీలు వస్తాయి. కనెక్షన్‌ ఇప్పించి టీవీ ముందు కూర్చుంటే పిజ్జా అడ్వర్టయిజ్‌మెంట్‌ వస్తుంది. సుతారంగా విరుచుకుని, తన్మయంగా నోట్లో పెట్టుకునే దృశ్యం కుర్రాళ్ళ మనసుల్లో ముద్రించుకుపోతుంది. ఎలాగైనా పిజ్జా తినాలనే కోరిక వాళ్ళలో మొదలై పెరిగిపోతుంది. సేల్స్‌బాయ్‌ ఇచ్చిన కాగితం బయటకు తీస్తారు. మీరు ఫోన్‌ చేస్తే నేను పట్టుకొస్తానని చెప్పిన విషయం గుర్తొచ్చి ఫోన్‌ చేస్తారు. అడ్రస్‌ అడుగుతాడు డెలివరీ బాయ్‌. రైలు పట్టాల దగ్గర అని చెబుతారు. ఇంటి నంబర్‌తో సహా అడ్రస్‌ చెబితేనే తెస్తానంటాడు. వాళ్ళ నానమ్మ దగ్గరికెళ్ళి అడుగుతారు మన అడ్రస్‌ ఏంటని. మనకి అడ్రసంటూ లేదు ఫలానా మురికివాడ అంటారు అని చెప్తుంది. అడ్రస్‌ లేకుండా పిజ్జా రాదని అర్థమైంది వాళ్ళకి. పిల్లలు పిజ్జా కోసం గోల పెడుతుంటే ”నేను చేస్తానుండండి” అంటూ దోశమీద కూరగాయ ముక్కలేసి కాల్చిస్తే ఛీ ఇది పిజ్జా కాదు అని కోపంగా వెళ్ళిపోతారు పిల్లలు.

ఆ సాయంత్రం రైల్వే ఫ్రెండ్‌ దగ్గరికెళ్ళి చెబుతారు. ఆయన చాలా ఉదారంగా బొగ్గు నిల్వ ఉండే గది తాళం తీసి మీకు కావలసిన బొగ్గు తీసుకెళ్ళమంటాడు. ఇంక చూస్కోండి. పిల్లలు బస్తాలు బస్తాలు మోసుకెళ్ళి షాప్‌లో అమ్మి డబ్బు జమ చేసుకుంటారు. రోజూ లెక్కలేస్తూ ఉంటారు. సిటీకి బస్సెక్కి వెళ్ళి పిజ్జా తినాలంటే ఇద్దరికీ ఎంత ఖర్చవుతుందో లెక్కలేసి, డబ్బులు సరిపోతాయని భావించి బస్సెక్కి పిజ్జా షాప్‌కి వస్తారు. మురికి బట్టలు, తైల సంస్కారంలేని పీచులాంటి జుట్టు, కాళ్ళకు చవకబారు చెప్పులు చూసి పిజ్జా షాప్‌ ముందుండే సెక్యూరిటీ మనిషి పిల్లలిద్దరినీ అరుస్తూ తోసేస్తాడు. వాళ్ళు చాలా డీలాపడి వెనక్కి వచ్చేస్తారు. మంచి బట్టలేసుకుంటే కానీ పిజ్జా షాప్‌లోనికి వెళ్లనివ్వరని అర్థమవుతుంది. అక్కడే ఉన్న పానీపూరీ బండి దగ్గర నిలబడి షాప్‌ వైపే చూస్తూ ఉంటారు. ఈలోగా షాప్‌లో నుంచి ఇద్దరు పిల్లలు తండ్రితో కలిసి బయటకొస్తారు. పానీపూరీ బండి దగ్గర ఆగి పానీపూరీ కొనివ్వమని తండ్రిని అడుగుతారు. అవి అపరిశుభ్రంగా ఉంటాయని, అలా బండ్లమీద అమ్మే వస్తువులు తినకూడదని, ఇప్పుడేగా పిజ్జా తిన్నారు అని కోప్పడతాడు. పిల్లలు మారాం చేస్తుంటారు. తండ్రి ఫోన్‌ మర్చిపోయానని లోపలికెళ్ళినపుడు మన చిన్న హీరోలు మీకు పానీపూరీ కొనిపెడతాం, మీ బట్టలు మాకిస్తారా అంటే వాళ్ళ బట్టలిచ్చేసి, వీళ్ళ బట్టలు తగిలించుకుని పానీపూరీ తింటుంటారు. తండ్రి వచ్చి చూసి వాళ్ళని బాగా తిడతాడు. మన వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయి బస్సెక్కి ఇంటికొస్తారు. వాళ్ళు వేసుకున్న బట్టలు చూసి వాళ్ళ చుట్టుపక్కల పిల్లలు వెంటపడతారు. కొత్త బట్టలెక్కడివి అని అడుగుతుంటారు. కొనుక్కున్నామని, మర్నాడు పిజ్జా తినడానికి సిటీకి వెళుతున్నామని చెబుతారు.

మర్నాడు పిల్లల గ్యాంగ్‌తో సహా పిజ్జా షాప్‌కి వస్తారు. పిల్లలందరూ గోడ వెనుక దాక్కుంటే వీళ్ళిద్దరూ చాలా ధీమాగా షాప్‌కి వెళ్తారు. సెక్యూరిటీ మనిషి ఆపి, వాళ్ళ ముఖాలు చూసి తిడుతుంటాడు. మంచి బట్టలేసుకుని వచ్చాం కదా లోపలికి వెళ్ళనియ్యి అంటారు. ఈలోగా షాప్‌ యజమాని బయటికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. సెక్యూరిటీ మనిషి అంతా చెప్తాడు. యజమాని ఆ పిల్లల్ని కొట్టి బైటికి గెంటేస్తాడు. పిల్లలిద్దరూ చాలా అవమానపడి కళ్ళ నీళ్ళతో అక్కడినుండి వెళ్ళిపోతారు. మిగతా పిల్లలు వీళ్ళని ఏడిపిస్తారు. ఈ దుఃఖంలో ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్నమ్మ చనిపోయి ఉంటుంది. వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. పాడె కట్టడానికి కూడా పైసల్లేవు, ఏం చెయ్యాలి అని ఏడుస్తుంటుంది. పిల్లలు పిజ్జా కోసం దాచుకున్న డబ్బులు వాళ్ళమ్మకిచ్చేస్తారు. దీంతో కార్యక్రమం పూర్తి చేస్తుందామె. మళ్ళీ రైలు పట్టాలమీదికి బొగ్గులేరుకోవడానికి వెళతారు.

పిజ్జా షాప్‌లో జరిగిన గొడవని వాళ్లతో వెళ్ళిన ఒక కుర్రాడు వీడియో తీసి బస్తీ నాయకుడికి చూపిస్తాడు. ఆ వీడియోతో షాప్‌ యజమానిని బ్లాక్‌మెయిల్‌ చేయబోయి తన ఫ్రెండ్‌ అప్పటికే ఒక టీవీ ఛానల్‌కి అమ్మేయడంవల్ల భంగ పడతాడు. పిజ్జాషాప్‌లో పిల్లల్ని కొట్టి తోసేసిన సంఘటన అన్ని ఛానల్స్‌లో ప్రసారమవుతుంది. పోలీసులు రంగప్రవేశం చేయడం, తల్లిని, పిల్లల్ని షాప్‌కి తీసుకురావడం… శిక్షను తప్పించుకోవడానికి ప్లాన్‌ వేసి పిల్లల్ని సాదరంగా షాప్‌లోనికి తీసుకెళ్ళి వాళ్ళముందు రకరకాల పిజ్జాలు పెడతారు. ఓ ముక్క తుంపి నోట్లో పెట్టుకుని ఛీ ఇదేం బాగోలేదు, మన నానమ్మ చేసిన దోశ పిజ్జానే బాగుంది అనుకుని షాప్‌లోనుంచి బయటికి రావడంతో సినిమా ముగుస్తుంది.

ప్రపంచీకరణ తెచ్చిన వస్తు వినిమయ సంస్కృతి, ఆహారపుటలవాట్లు, శీతల పానీయాలు 24 గంటలూ బుర్రను తినేసే వాణిజ్య ప్రకటనలతో వందలాది ఛానళ్ళు మనిషిని తమ బ్రతుకు తమను బ్రతకనీయకుండా మీడియా నిర్దేశిత బ్రతుకుల గురించి అద్భుతంగా చెప్పిన సినిమా. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం కూడు, గూడు, గుడ్డ లేకపోయినా టీవీలను మాత్రం పంచిన తమిళ రాజకీయ నేపథ్యం. ఒక టీవీకి చోటు లేని గుడిసెకి రెండు టీవీలు, నిత్యం సీరియళ్ళు, వ్యాపార ప్రకటనలు.

టీవీలో పిజ్జా వాణిజ్య ప్రకటనకి పిల్లల నోట్లో నీళ్ళూరుతుంటాయి. అవి తినాలనిపిస్తుంది. కోట్ల రూపాయలు తీసుకుని కూల్‌డ్రింక్స్‌ ప్రకటనల్లో కనిపించే సినిమా హీరోలు అవి ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పరు. తాగండి తాగండి అంటూ రెచ్చగొడతారు.

మురికివాడల్లో బ్రతుకుతున్న పిల్లలు పిజ్జా కోసం దొంగలవుతారు. టీవీలో వచ్చే ప్రకటన వాళ్ళని నిలవనీయదు. అన్నీ మర్చిపోయి ఎలాగోలా డబ్బు సంపాదించాలి, పిజ్జా తినాలి అంతే. నగరాల్లో పెద్ద పెద్ద మాల్స్‌లోకి వెళ్ళాలంటే మంచి దుస్తులు, చెప్పులు వేసుకెళ్ళాలి. అవన్నీ మీ కోసం కాదు అనే హెచ్చరిక అంతర్లీనంగా ఉంటుంది. ది సో కాల్డ్‌ ”గేటెడ్‌ కమ్యూనిటీలు” అక్కడుండే కల్చర్‌ ఒక వర్గం వీరిని ఆ చుట్టుపక్కలకు రానీయకుండా రక్షణ వలయాలు ఏర్పాటు చేసుకుంటారు. మురికి బట్టలతో వస్తే డబ్బులున్నప్పటికీ పెద్ద షాపుల్లోకి, హోటళ్ళలోకి వీరిని రానీయని క్రూరత్వం. డాబుసరి ప్రదర్శనతో పిల్లలు, పెద్దలు అని చూడకుండా అవమానించే అమానవీయ సంస్కృతి. మురికివాడల జీవిత చిత్రణ, అక్కడ బ్రతికే పిల్లల జీవితాలు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోయినా, టీవీలు పంచిన స్వార్థ రాజకీయం, మనవి కాని తినుబండారాలు, శీతల పానీయాల మీద వెర్రి క్రేజ్‌ పెంచే పనికిమాలిన వ్యాపార ప్రకటనలు పిల్లల మనసుల్ని ఎలా కలుషితం చేస్తాయో దర్శకుడు హృద్యంగా తెరకెక్కించాడు. పిజ్జా కోసం పిల్లలు పడే తాపత్రయం కంటనీరు పెట్టిస్తుంది. ‘నీ చెత్త పిజ్జా కన్నా మా దోశ మిన్న’ అని చివర్లో పిల్లలతో చెప్పించడం దర్శకుని ఆలోచనల్ని చక్కగా ఆవిష్కరించింది.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.