చీకటి చిక్కబడింది… గాలి చల్లబడింది… కాకి, చిలక, కోడి, గువ్వ, తీతువు… అన్నీ కలిసి సందెపాట పాడీపాడీ గూళ్ళకు చేరి చాలాసేపయింది. అశ్వయుజ మాసపు చవితి చంద్రుడు పడమటి దిక్కుకి చేరిపోయాడు. ఆకాశంలో మేఘాలు నక్షత్రాలతో వీరి వీరి గుమ్మడిపండు ఆడుతున్నట్లుంది. ఒక్కచోట నిలవట్లేదు. జొన్న చేలోని కంకుల మీదుగా గాలి వీచినప్పుడల్లా గంధర్వ వాయిద్యమేదో సన్నగా శృతి చేసినట్లుంది.
వారాంతాలు పట్టణపు గడబిడల నుంచి దూరంగా ప్రశాంతంగా గడపడానికని చేన్లల్లో కట్టుకున్న చిన్న మేడపై ఆరుబయట ఆకాశం క్రింద చాపమీద పడుకున్న శాంతి మనసులో ఆలోచనలు మాత్రం ఆషాఢమాసపు ఈగల రొదలా అంతం లేకుండా సాగుతున్నాయి.
దసరా పండక్కి ఆర్రోజులుంది. నాల్రోజుల్లో బతుకమ్మ పండగ… గత నాల్రోజులుగా పట్నంలోని కాలనీలన్నీ సాయంత్రమయ్యేసరికి హడావిడి పడ్తున్నాయ్! రంగురంగుల పూలతో బతుకమ్మల్ని పేర్చి… వాటితో పోటీపడ్తూ రంగురంగుల పట్టుచీరల్లో ముస్తాబైన ఆడోళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల భార్యలు ఆర్భాటంగా వస్తే వారితో కలిసి మైకుల్లో వినిపించే బతుకమ్మ పాటల రికార్డులకి స్టెప్పులెయ్యటం… సందడి చెయ్యటం… ఎటు చూసినా హోరెత్తిపోతోంది.
ఈ సాయంత్రం ఈ పల్లెలో మాత్రం అటువంటి ఆర్భాటపు ఛాయలేవీ కనపడక పార్వతమ్మనడిగితో ”మా ఊర్లో ఎన్నడూ బతుకమ్మని ఆడలే… మా పల్లెల అందరూ గవుళ్ళు, గొల్లలు… ఇంగ తురుకోళ్ళు కూడా ఉన్నరు. దసరా పండుగ, పీర్ల పండుగ జేస్తం కాని మాకు బతుకమ్మ తెల్వదు. టీవీల్ల, పేపర్లల్ల జూసి ఇప్పడిప్పుడు పోరలు ఆడ్తమంటన్రు గాని… అదంత సర్కారోళ్ళ సప్పుడు, గంతే” అంది. అప్పుడే అక్కడికొచ్చిన అలివేలు అందుకుని ”మా ఊర్లో అందరున్నరు…. గొల్లలు, గవుళ్ళే కాదు… తెనుగోళ్ళు, కోమిట్లు, మాలలు, మాదిగలు, ముస్లింలు, అవుసులోళ్ళు, రెండు రెడ్డీలిళ్ళుగూడున్నయ్… అందరున్నరు గాని ఎన్నడు బతుకమ్మని చేసెరగం. ఈ ఏడే ఊర్లోకి కొత్తగొచ్చిన పట్వారి మనూరికి బతుకమ్మ ఆడనీకి పైసలొచ్చినయ్… అందరాడాలె అంటే మా సంగపోళ్ళందరం పోయినం. రెడ్డీలిండ్లకాన్నించి పెద్ద బతుకమ్మ లొచ్చినయ్. మేమందరం చిన్న బతుకమ్మల్ని పేర్చినం. సౌండ్ బాక్సుల్లో పాట పెట్టిన్రు. అందరం కలిసి నాలుగు సుట్లు సప్పట్లు గొట్టుకుంటు తిరిగినం. చివ్వర్లో బతుకమ్మల్ని ఇడవనీకి చెర్వుకి పోయినం. ఆడ నీళ్ళే లేకున్నయ్. కాలం కాక, వానల్లేక ఈ యేడు సెర్లో నీళ్ళే లెవ్వు. కిందిదాక పోయి ఆడున్న కొన్ని నీళ్ళల్ల బతుకమ్మల్ని ఇడిసినం. అటుకులు, బెల్లం పంచిన్రు. మల్ల గురువారం నాడు సద్దుల బతుకమ్మ ఉంది… ఆడనీకి అందర్రావాలని సెప్పిన్రు. మేం బతుకమ్మ ఆట్టం ఇదే మొదలు… ఏమైతదో ఏమో…” అసంతృప్తిగా ఒక రకమైన బెరుకుతో అంది. శాంతి ఆశ్చర్యంగా ”అంటే సర్కారోళ్ళ కోసం బతుకమ్మని ఆడిన్రా మీకు లేకపోయినా” అనగానే చెన్నమ్మ అందుకుని ”కవితమ్మ దేశదేశాలకి పోయి బతుకమ్మ ఆడి ఆడున్నోళ్ళందర్నీ ఆడిపించొస్తాంటే…ఈ గడ్డని పుట్టినం మరి మేం ఆడకుంటెట్ల… ఇది మాకు కొత్త సాంప్రదా యమయ్యింది… కొత్త పొద్దు లెక్క” అంది. ఆ ముగ్గురి మాటల్లో ఒలికిన భావాల్ని అర్థం చేసుకోడానికి చూసినకొద్దీ శాంతి మనసులో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న మహబూబ్‌నగర్‌లో ఇలాగే… ‘మేం బొడ్డెమ్మ ఆడ్తంగాని… ఈ పొద్దు బతుకమ్మ ఆడకుంటె జరిగేలా లేదు… ఏం చెయ్యం… ఆ కూపన్ నచ్చినా నచ్చకున్నా చీరలు కట్టాలె, బతుకమ్మ ఆట నేర్వాలె… కొత్త కోడలుకి అత్తింటి సేద్యం అలవాటు గావలసిందే…’ అని నిష్టూరంగా అన్న దేవమ్మ, ‘చీరెల మాటెత్తకు… మగ్గాలున్నోల్లంతా బత్కమ్మ చీరలు నేసి బతుకులు పండిచ్చుకో వచ్చనుకున్నారు… కానీ మోసపోయినామని ఆల్లంతా లబలబలాడ్తున్నారు’ అన్న నాగమ్మ గుర్తొచ్చారు.
అంటే, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఇతర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకి, మిగితా ప్రాంతాల్లోని కొన్ని వర్గాలకే పరిమితమైన ‘బతుకమ్మ’ని తెలంగాణ రాష్ట్ర పండగగా చేసి అందరి నెత్తిన రుద్దుతున్న తీరు… ‘పుణ్య స్త్రీ’లంతా పాపభీతితో ‘బతుకమ్మ’ని ఆడాల్సొచ్చిన వైనం… బలవంతపు బ్రాహ్మణత్వం సామెతలా ఉందనేగా! పండక్కి చేనేత చీరలకోసం ఆశగా ఎదురుచూస్తే… సూరత్ సిల్క్ చీరలు అందుకుని భంగపడ్డ మహిళలు ఆ చీరల్ని తగలబెట్టి వారి ఆక్రోశాన్ని వెలిబుచ్చగలిగారు కాని, తెలంగాణ ఆడపడుచులు ‘దేవత’ పేర్న తంగెడి పూలు, గునుగు పూల బదులు ప్లాస్టిక్ పూలనైనా పేర్చి బతుకమ్మ ఆడాల్సిందే కాని… ‘ఇది మాది కాదు, మేం పీర్లనెత్తుతం’ అనే ధైర్యం మాత్రం లేదు! మరి కాదన్నందుకు ‘పాపం’ తగిల్తే!! బతుకమ్మ ఆడాలంటే మరి ‘బతికుండా’లిగా!!!