బత్కమ్మ పండుగని వుదరగొడ్తున్నరు గానీ వూల్లల్ల దీన్ని సద్దుల పండుగంటరు. యిప్పుడు వూల్లల్ల సర్కారు బత్కమ్మంటున్నరు. యిది బత్కమ్మ సీజన్, సద్దుల బత్కమ్మ సీజన్. యీ వారం రోజులు బత్కమ్మల మోతలే టీవీల్నిండా, పత్రికల నిండా. వూరి సెమట ఆడవాల్ల సేతులు దాటి దొర్సానులకు సుట్టుకాముడైంది. పొలిటికల్ ఈవెంట్ మేనేజ్‌మెంటయింది. యింకా చెప్పాలంటే మగ పొలిటికల్ ఈవెంట్ మేనేజర్లు ఆడిస్తున్నయి. అందికే పల్లెలు, పట్నాలు, డిల్లి దాటి ప్రపంచ దేశాలల్లకి పాకిపోయింది గానీ తెలంగాణ వాడ ఆడవాల్లకి అంటరాని చందమామే బత్కమ్మ.
బత్కమ్మ పండగంటే పూల పండుగ, సెరువులు నిండిని నీల్ల పండుగ, పచ్చట పంటల పండుగ, సీటి సీరెల పండుగ, కొత్త కోకల పండుగ, సిల్కు రైకెల పండుగ, ఆడ చెమట చుక్కల పాటల పండుగ, పూల బత్కమ్మలతోని తిననీకి, పంచిపెట్టనీకి తెచ్చుకునే సద్దుల బత్కమ్మ పండుగ. టోటల్‌గా ఆడోల్ల సంబురాలు అంబరాల అంచులు దాటే పండుగంటరు. అయితే యీ పూల సంబురాలు, బత్కమ్మ సంబురాలు వూరి చెమట మహిళల కాడికే ఆగిపోయినయి. వాడ ఆడవాల్లకు యీ సంబురాలు, పూల పేర్పులు, పండుగ నిషేధాలున్నయి. వాల్లు సద్దుల రోజున సెరువుకాడికి బొయి వూరి ఆడోల్ల పాటల్ని, ఆటల్ని, వాల్ల సీరెల్ని, రైకెల్ని సూసి వాల్లు దెచ్చిన సద్దుల పలారం యింటికి తెచ్చుకొని తిని, మద్యరాత్రి దాకా ఆడోల్లంత ఒక్కకాడ జేరి తనివి తీర పాటలు బాడుకొని, అల్సిపోయేదాక ఆడుకుంటరు యెన్నెల యెలుగుల. యిది వాడల్ల జరిగే బత్కమ్మ పండుగ.
అయితే బత్కమ్మ, సద్దుల పండుగ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ అవసరంగా వూరు వాడని కలిపి ఆడించినా, తెలంగాణ వచ్చినంక అదే కలయిక కొనసాగలే. మల్లా యెప్పటిసిప్ప యెనుగుల్నే వున్నది. బైటికొచ్చి బత్కమ్మాడని దొర్సాండ్లు, కోమటి, బాపని ఆడవాల్లు బత్కమ్మనాడడం చిన్నతనం, అది శూద్ర కులాల ఆడోల్లది మనది కాదనే చిన్న చూపుండేది. తెలంగాణ ఉద్యమంతో వీల్లంత బత్కమ్మాడుతుండ్రు. ఒక్క పాట రాకున్నా చప్పట్లు లయబద్దంగా కొట్టరాకున్నా, రికార్డు పాటలతో బత్కమ్మ పండుగని కాయితం పూలతో కత నడిపిస్తున్నరు. కాని ఉద్యమంలో కల్సి ఆడిన వూరి, వాడ ఆడవాల్లు వేరయినా వాడల ఆడవాల్ల బత్కమ్మల మీద నిషేధాలు తొలగలే. వాల్లు బత్కమ్మలని చెరువులోకి తీసుకరావొద్దనీ, సెరువుకిందాడుకొమ్మనీ, సెరువు కొమ్ముకు మాతో సమానంగా ఆడుకోవద్దని జరిగే కొట్లాటలు, కొట్టిన కేసులు పత్రికలకు రావు. సంచార జాతి మహిళలు, ఆదివాసీ, ఎస్సీ కులాల మహిళలు బత్కమ్మ కావల్నే వున్నయి.
కాని నాకు బత్కమ్మను చూస్తే… బత్కమ్మ పండుగంటే… నా చిన్నప్పుడు జరిగిన ఒక అవమానం దుక్కయాదులు, నదులుగా నా నరాల్ని యిప్పటికీ మెలేస్తనే వుంటయి. మానని ఒక పుండు సెలేస్తనే వుంటది. ఆనందాలు, అవమానాలు కలెగలిసిన కలెబడిన కలతలు గడ్డకట్టిన కన్నీల్లు ఘనీభవించలే. కులాల విలువలు హెచ్చు తగ్గులు తెలువని పసితనం. పూలంటే పిచ్చి. కొత్త బట్టలంటే మహా పిచ్చి. పాటలంటే ప్రాణం. తెల్లారకముందే పూలవేటకు బొయేది యెంగిలి పూలు యేసిన రోజు కాంచి, కార్కపూలు, గోరంట పూలు, కట్ల పూలు, గుమ్మడి పూలు, రుద్రాక్ష పూలు, బీర పూలు తెచ్చుకొని జమజేసుకుని పెట్టుకొనేది. కాని యింట్లవద్దు బిడ్డ, వద్దు బిడ్డా గిప్పుడెందుకు పండుగ సద్దుల పండుగ రోజు ఆడుకుందువు తియ్ అని ఆపేది. అది బెల్లంపల్లి కోలేరియా. అంత బీసీ, ఎస్సీలే కులానికొకరుంటరా బస్తీల. పల్లెటూల్ల నుంచి బొగ్గు బాయిలకు బత్కనీకి వస్తరు. వస్తూ పూల పండుగంటే మస్తు మస్తు యిష్టముండె. పూలు ఎక్కడెక్కడ ఏమేం పూలు దొర్లుతయి, ఎవరెవరింట్ల ఏమేం పూలున్నయి, అడివికి బొయి ఏం పూలు దెచ్చుకోవచ్చు అనే పరిశోదనుండేది. నెల రోజుల ముందునుంచే బత్కమ్మ యెప్పుడొస్తదా పూలను కండ్లినిండ చూసుకునుడు, రంగురంగుల పూలను పేర్చుకునే కాంబినేషన్ నేర్సుకున్న, మా అక్కలతోని, అవ్వతోని మంచి మంచి పాటలు నేర్సుకున్న పాడనీకి. ఆ పాటలు నేనింకా మర్సిపోలే… ”యిత్తవా వో రాజ ఉయ్యాలో పెద్ద బిడ్డానన్న ఉయ్యాలో, పెద్ద బిడ్డానిత్తె ఉయ్యాలో పేరుకెవ్వరు లేరు ఉయ్యాలో” ”మూడువేల గందం సెక్కా వోరాస గుమ్మడి తాను నాకు బంపుటేందీ వోరాస గుమ్మడి” లాంటివి యింకా చాలా పాటలు బత్కమ్మలు బాయిలేసినటు ఆ నీ పాటల్నెయ్యలే. మా బస్తీల నా దోస్తులు ఆడుతుంటే… వాల్లు కూడా ఆడుకుందాము రా అంటే కొత్త లంగ జాకీటు తొడుక్కుని మంచిగ తలనిండ సమరు బెట్టుకొని మా అక్కతోని రెండు జెడలేయించుకొని రిబ్బండు కట్టుకొని, కాటికె, బొట్టు పెట్టిచ్చుకొని, సిబ్బిల యెవ్వరు తెచ్చుకోని పూలను నా బత్కమ్మనే ప్రత్యేకంగా రంగురంగులుగా తంగేడు, గునుగు, కట్ల, బీర, గుమ్మడి, గోరంట పూలతో సూపర్‌గా పేర్చుకొని మా దోస్తులతో మహారాణిలాగ పట్టరాని సంతోషంతో ఆడోల్లు ఆడేకాడికి బొయి బత్కమ్మ బెట్టబోతే ‘ఏయ్ పందిపిల్లా… పెట్టకు పెట్టకు, మీకు బత్కమ్మ లేదు పో… పిల్లా పో” అని మా దోస్తుల అమ్మలు తిట్టి యెల్లగొట్టినప్పుడు యింటికొచ్చి పండి పొర్లాడిన యేడుపులు యెదమీది పచ్చిపుండ్లే…