వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియమైన రజితా! ఎట్లున్నావ్‌ బిడ్డా! షుగర్‌ బాగా ఎక్కువైందని విన్నాను. జాగ్రత్త! ఉద్యమాల్లో ములిగితేలే నువ్వు, శరీరానిదేముంది అనుకుంటావ్‌! కానీ మనం చేయదలచు కున్న పనులకి ఈ శరీర హ్యాంగర్‌ కావాల్సిందే కదా! అందుకని అప్పుడప్పుడూ అవసరమైనప్పడు రిపేర్లు చేసుకుంటూ పోవడమే. నీకింత చెబ్తున్నాన్‌ గానీ, నేనూ నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నా! నీ నిజాయితీ, కార్యదీక్ష, సాహితీ పిపాస, స్నేహశీలత్వం, నీతో స్నేహాన్ని చేయించింది. అందరిలోకి విలక్షణంగా ఉండే నీ ‘డ్రస్‌ కోడ్‌’ కూడా నాకు నచ్చేది. మెడచుట్టూ ఉన్న చున్నీ, నీ కర్తవ్య దీక్షను చెబ్తోందా అన్నట్లనిపించేది. చాలా రాసావు గదూ! మిగతావాళ్ళకు, నీకూ ఉన్న ప్రధానమైన భేదం ఏమిటంటే నువ్వు ఉద్యమ కవయిత్రివి, రచయిత్రివి. ఉద్యమం కోసం, ఉద్యమం లోంచి, ఉద్యమావసరంగా నీ రచనలొచ్చాయి. అందుకే అవి జీవవంతంగా ఉంటాయి. మిగతా విమర్శకులు కొందరు, సాంద్రత, శైలి, అలంకార శోభ లేవంటూ విమర్శిస్తున్నా వాటిని లెక్కచెయ్యవద్దు. అలంకార శోభను కోల్పోయిన ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నదానివి నువ్వు. నీ శక్తే నీ నిమగ్నత. కొన్ని కొన్ని సందర్భాల్లో నీ దృఢ సంకల్పాన్ని, నీ వాగ్ధాటిని చూసి ముచ్చట పడేదాన్ని. అది కూడా నీ మీద ఇష్టం పెరగడానికి కారణమై ఉండొచ్చు. మనం మీటింగ్‌ల్లోనే ఎక్కువగా కలుస్తుండేవాళ్ళం. భూమికలో నీ రచనలు ఎక్కువగానే వస్తుండేవి. రచయిత్రుల సమావేశాల్తో పాటు, మనం కలిసి వెళ్ళిన భూమిక టూర్ల వల్ల కూడా మానసికంగా దగ్గరయ్యాం. నీ జిగిరీ దోస్త్‌ భండారు విజయ కదా? ఎప్పుడూ జంట పక్షుల్లా కలిసే వచ్చి వెళ్తుండేవాళ్ళు. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వస్తే నీ అడ్డా శారదా శ్రీనివాసన్‌, పి.యశోదారెడ్డి, విజయ ఇళ్ళే కదా! అప్పట్నించీ ఇప్పటివరకూ.

రజితా! హనుమకొండలో జయలక్ష్మి, బాలరాజ్‌ల కన్నబిడ్డవైన నీవు, పుట్టుక నీది / చావు నీది / బతుకంతా దేశానిది / అని కాళోజీ అన్నట్లుగా బతుకంతా ఉద్యమాలది అని నీ విషయంలో అనుకోవచ్చు. డిగ్రీ రోజుల్నుంచీ

ఉద్యమాల్లో, ధర్నాల్లో ఆవేశపూరితంగా, ఆగ్రహోద్విగ్న జ్వాలలతో పాల్గొనడమే కాక, దేశానికేదన్నా చెయ్యాలన్న తపన, స్త్రీల సమస్యలను పరిష్కరించే దిశగా నీ పయనం. అందుకే 1969లో తెలంగాణ ఉద్యమ జ్వాలలో నువ్వూ మమేకమయ్యావు. పాట నీ స్వర పేటిక వింది. నీ కవితలు కూడా పాట రూపాన్ని ధరిస్తుంటాయి. 84లో అనుకుంటా నీ తొలి కవితా సంపుటి ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’ తీసుకొచ్చావు. స్త్రీల సమస్యలకు సంబంధించినవే ఎక్కువున్నాయి అందులో. ‘పబ్లిక్‌ ఆడ్‌’లో ఎం.ఏ చేసి కాకతీయ యూనివర్శిటీలో అధ్యాపకేతర ఉద్యోగిగా కూడా పనిచేశావు కదూ! తెలంగాణా విప్లవోద్యమంలో

ఉత్తేజం పొందిన నువ్వు సాహిత్య ఆసక్తులను మరింతగా పెంచుకుని పరిశోధన చేయడానికి పూనుకున్నావు. 1982లో ‘స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ’ను ఏర్పాటు చేసిన వారిలో నువ్వు కూడా వ్యవస్థాపక సభ్యురాలివే కదా! ‘ఒక చేత్తో ఉద్యమ జెండా, ఒక చేత్తో కవితా పతాక ఎగరేస్తూ నినాదమై ప్రవహించే పాట రజిత’ అని కాత్యాయనీ విద్మహే గారు కితాబునివ్వడం నాకు నచ్చింది. నాకు గుర్తున్నంతవరకూ 97లో ‘నేనొక నల్లమబ్బునవుతా’, 98లో ‘చెమట చెట్టు’, 2002లో ‘ఉసురు’, 2005లో ‘అనగనగా కాలం’, 2005లోనే ‘దస్తఖత్‌’ (హైకూలు), గోరంతదీపాలు (హైకూలు), 2007లో ‘నన్హే ఓ నన్హే’, 2005లోనే అనుకుంటా ‘ఓ లచ్చవ్వ’ (దీర్ఘ కవిత), 2010లో ‘మార్కెట్‌ స్మార్ట్‌ శ్రీమతి’ రాశావు. మళ్ళీ ఇన్నాళ్ళకు 2016లో ‘నిర్బయాకాశం కింద’ అనే కవిత్వాన్ని తీసుకొచ్చావ్‌. దీనికి అక్టోబర్‌ 2017లో ‘రొట్టమాకు రేవు’ అవార్డును పొందడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. నీతోపాటు సిద్ధార్థ, వాహెద్‌ కూడా పురస్కారాన్ని అందుకుంటున్నారు. ఇప్పటికే నాకు తెలిసి 23 అవార్డులకు పైగా నువ్వు అందుకున్నావు. వాటన్నింటికీ నువ్వు అర్హురాలివి కూడా. సావిత్రీ బాయ్‌ ఫూలే ఫెలోషిప్‌ అవార్డు, సుశీలా నారాయణరెడ్డి అవార్డు లాంటివెన్నో. రజితా! రుద్రమ ప్రచురణలు పేరుతో జిగర్‌, ఉద్విగ్న, ఆకాశపుష్పం, పోలవరం ప్రాణాంతక ప్రయోగం, నిర్భయాకాశం కింద, అక్షరశరధి దాశరధి పుస్తకాలను తీసుకొచ్చావ్‌. 12 పుస్తకాలకు సంపాదకత్వ బాధ్యతల్ని తీసుకున్నావ్‌. కథలు కూడా రాశావ్‌ కదూ! ‘మట్టిబండ’ దానిపేరు. మహిళా, దళిత, సాహిత్య, మానవ హక్కుల

ఉద్యమాలన్నింటిలోనూ పాల్గొన్నావ్‌.

నువ్వే చెప్పుకున్నావొకచోట – ‘సాటి మనిషిగా నేనెప్పుడూ / జనం మనమేనంటూ ప్రజాపోరునే / నాదెప్పుడూ

ఉద్యమాల కదనరంగమే’ అని. ‘1997లో రజిత ప్రజాస్వామిక ఆకాంక్షగా పునరుత్థానం చెందిన ప్రత్యేక తెలంగాణా

ఉద్యమ కాలపు ఆత్మచేతనలో 1969 నాటి ఉద్యమస్ఫూర్తిని సమ్మ్మిళితం చేసుకుని ‘తెలంగాణ రచయితల వేదిక’ నిర్మాణ కార్యకలాపాలలో భాగమైంది. మహిళా

ఉద్యమ అస్తిత్వ చైతన్యం నుండి విస్తరించిన బహుళ అస్తిత్వాల సమభావన నుండి ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ నిర్మాణంలో భాగమైంది’ అని కాత్యాయని విద్మహే గారు అభిప్రాయపడ్డారు. నీకు రాస్తున్న ఈ ఉత్తరంలో ఇంకెంతో రాయాలన్న తపన ఉన్నప్పటికీ, స్థలాభావం వలన ఇంతటితో ఆపేస్తున్నా! మనుషుల కోసం, సమాజ న్యాయం కోసం, పీడితుల పక్షాన పోరాడే నువ్వంటే నాకెంతో గౌరవంతో కూడిన ఇష్టం. ఇన్నాళ్ళకు ఈ ఉత్తరం ద్వారా చెప్పగలుగుతున్నాను. మానవత్వం నిండిన మనిషిగా, ఉద్యమ కార్యశీలిగా నీ జీవిత పయనం కొనసాగడం చాలామందికి ఆదర్శం కావాలి. అక్షర రూపంలో అందరి హృదయాల్లో నువ్వెప్పటికీ నిలిచిపోయి ఉండాలన్నదే ఈ మిత్రురాలి కోరిక. ఉండనా మరి.

నీ శిలాలోలిత…

 

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.