స్త్రీ వాద కవిత్వం – ఆధునిక దృక్పథం డా|| వేలూరి శ్రీదేవి

”మగడు వేల్పన పాత మాటది ప్రాణమిత్రుడ నీకు” ఆధునిక నవయుగ వైతాళికుడు గురజాడ అన్న మాటలు ఆచరణలోకి రావాలని మనందరం కోరుకుందాం.

ద్రావిడుల కాలంలో, తొలి ఆర్యుల కాలంలో కూడా సమాజంలో స్త్రీ, పురుషులకు సమాన ప్రాధాన్యత లభించినట్లే సాహిత్య ఆధారాలు, సాంస్కృతిక అవశేషాలు చెపుతున్నాయి. వేదాధ్యయనంలో స్త్రీ, పురుషులు సహ-పాఠకులుగా విద్యాభ్యాసం కొనసాగించినట్లు, పరిపాలనా చట్రంలో స్త్రీలు కూడా తమ వంతు పాత్ర పోషించినట్లు మనకు తెలుస్తున్నది. ఆ తరువాత మలి ఆర్యుల కాలం నుండి స్త్రీ ప్రాధాన్యత క్రమ క్రమంగా తగ్గుతూ పురుషుడి ప్రాధాన్యత పెరిగి పితృస్వామ్య వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. అక్కడి నుండి స్త్రీని భోగవస్తువుగా మరియు కుటుంబ భారాన్ని మోసే వనితగా కుటుంబానికే పరిమితం చేయడంతో పాటు సమాజానికి దూరం చేశారు. అలా సమాజంలో స్త్రీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మెలగాల్సి వచ్చింది. ఆ తరువాత కొంతకాలం పురుషుడు స్త్రీకి అధికారాలు, సమానత్వం ఇస్తున్నట్లుగా నటిస్తూనే తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు.

సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతల కారణంగా పితృస్వామ్య వ్యవస్థ బలపడిపోయి స్త్రీలు వివక్షకు, అణిచివేతకు, పీడనకు గురౌతున్నారు. ఈ విధమైన స్త్రీల జీవితాలను, అనుభవాలను కవితా వస్తువుగా తీసుకుని రాసే కవిత్వమే స్త్రీ వాద కవిత్వంగా నిర్థారించబడింది.

స్త్రీ వాదం వర్గవిముక్తి జరగనిదే శ్రమ విముక్తి జరగదని, శ్రమ విముక్తి మాత్రమే స్త్రీ విముక్తికి బాటలు వేయగలదని నమ్మింది. తరతరాలుగా స్త్రీలపైనే రుద్దిన ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం లాంటి దాస్యాల నుంచి బయటపడి కుటుంబ, రాజ్య, సామాజిక హింసల నుండి విముక్తి చెంది ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సమానత్వంతో హృదయం నిండా స్వేచ్ఛాగాలిని పీల్చుకొని పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలు అసమానతలను ప్రశ్నించడానికి ఉదయించింది. స్త్రీ వాదం స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షిస్తుందే కానీ స్త్రీని అమ్మోరుగా పూజించడంగాను, అంగడి సరుకుగా అనుభవించడం గాను చేస్తున్న నేటి వ్యవస్థను సమర్థించదు. ఈనాడు దాదాపు అన్ని సంబంధాలలోనూ, అన్ని రంగాల్లోనూ భార్యా, భర్తల మధ్య, సోదర సోదరీమణుల మధ్య, తండ్రీ కూతుళ్ళ మధ్య, కొడుకు వృద్ధ తల్లుల మధ్య, సహోద్యోగుల మధ్య, యువతీ యువకుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య ఉన్నది ప్రధానంగా రాజు-బానిస (అధికారి-నౌకరు) సంబంధాలే. ముఖ్యంగా ఈ అసమానతలను, దౌష్ట్యాన్ని స్త్రీ వాదం ప్రశ్నిస్తుంది. స్త్రీ వాదం స్త్రీ, పురుషులను వేరు చేయదు, సామాజికంగా, ఆర్థికంగా, లైంగికంగా స్త్రీలను దోపిడీ నుంచి విముక్తి చేస్తుంది.

దేశవ్యాప్తంగా వచ్చిన స్త్రీ వాద ఉద్యమాలు ఎటువంటి ఆశయంతో వచ్చాయో డా|| రావి ప్రేమలత చెపుతూ ”స్త్రీ సమాజంలో పురుషుడితో సమానంగా కలిసి జీవించడం, స్త్రీ దృక్పథంతో కూడా ప్రపంచాన్ని, సాహిత్యాన్ని పరిశీలించడం, తమ శరీరాలపై, తమ జీవితాలపై అధికారాన్ని కలిగి ఉండడం స్త్రీలోని వ్యక్తిత్వాన్ని, సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించడం, స్త్రీ నిర్వహిస్తున్న ఇంటి పనికి కూడా విలువనివ్వడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలనే ఆశయంతో స్త్రీ వాద ఉద్యమాలు బయలుదేరాయి”. ఇదే క్రమంలో స్త్రీ గురించి పితృస్వామ్య సమాజం ఇచ్చిన నిర్వచనాలను తిరస్కరించి స్త్రీలు తమను తాము సరికొత్తగా నిర్వచించుకోవాలని స్త్రీ వాదం ప్రతిపాదిస్తుంది.

తెలుగులో స్త్రీ వాద సాహిత్యం 1970వ దశకంలో రూపుదిద్దుకున్నదని తెలుస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక సామాజిక ఉద్యమంగా మొదలై 200 సంవత్సరాలు దాటింది. ఫ్రాన్స్‌, రష్యా, చైనా, అమెరికా, ప్యారిస్‌ వంటి దేశాలలో స్త్రీలు ఓటుహక్కు, విద్యాహక్కు, ఎన్నికల్లో పోటీచేసే హక్కు, గర్భస్రావం హక్కు మొదలైన వాటిని పోరాటాల ద్వారానే సాధించారు. ఈ రకమైన స్త్రీ వాద ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, హక్కుల పోరాటంగా ప్రారంభమై క్రమంగా బలపడి అనేక అంశాలను చర్చకు పెట్టింది. ఇందులో భాగంగా అనేకమంది స్త్రీ వాదులు తమదైన కోణంలో స్త్రీవాద కవిత్వాన్ని సమాజం మీదకు సంధించారు.

స్త్రీ సాధికారికత కోసం, సమానత్వపు హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో, పడుతున్న ఆరాటంలో భాగంగా అనేకమంది కవులు, కవయిత్రులు తమ గళాలకు, కలాలకు పదును పెట్టారు. ఈ క్రమంలో పార్వతి రచించిన ”సిగ్గు సిగ్గు” కవిత కుటుంబంలో స్త్రీ మోస్తున్న భారం ఏ ప్రాణి, జంతువు కూడా మోయలేదని చెపుతుంది.

”ఛ ఏం బతుకిది

ఇంతకంటే జంతువు జన్మ నయమని….

….కృతఘ్నులున్న చోట

బతకనంటే బతకలేనంది” అంటూ సాగిన ఈ కవితలో స్త్రీ జీవితం గొంగళి పురుగు కంటే హీనంగా, స్తబ్దతే జీవంగా కలిగిన వ్యక్తిగా, కుటుంబ బరువు, బాధ్యతలు మోయడంలో గాడిద కూడా మోయడానికి భయపడే బరువులను మోస్తున్న అబలగా, విశ్వాసంలో కుక్కను మించిన ప్రాణిలా సాగినప్పటికీ పాలు త్రాగి విషం కక్కే సర్పాల లాంటి కృతఘ్నులైన పురుషుల మధ్య బతకలేనంటూ వాపోతున్నది.

పెళ్ళవగానే స్త్రీకి వంశం, పేరు, అభిరుచులు, ఆలోచనలు మారాలంటుంది పితృస్వామ్య సమాజం. భర్తతో అత్తగారింట్లో అడుగు పెట్టిన స్త్రీని అందరూ ఆదరించి, ఆప్యాయంగా చూడాల్సింది పోయి ఆమెను మానసికంగా, భౌతికంగా, శారీరకంగా బాధపెట్టడం, అది తమ హక్కు, అధికారమని ఆమెను చెప్పుచేతల్లో ఉంచుకోవాలని ప్రయత్నించడం విడ్డూరమేమీ కాదు. ముఖ్యంగా భర్త ఒక స్నేహితుడిగా వ్యవహరించి ఆమెకు తన గౌరవం ఇవ్వాలనే ఆలోచన లేకపోవడం వల్లనే మొగుడంటే ఒక హింసకుడని, ఒక రాక్షసుడనే భావన స్త్రీకి కలుగుతోంది.

కొన్ని సందర్భాల్లో భర్తంటే స్వేచ్ఛాహరుడనే మాట రుజువవుతున్నది. ఇదే భావాన్ని సావిత్రి ‘బందిపోట్లు’ కవితలో…

”పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తాన”ని

పంతులు గారన్నప్పుడే భయమేసింది….

….మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే

మమ్మల్ని విభజించి పాలిస్తోందని”.

భర్త అంటే భరించేవాడు కాదని, సర్వం హరించేవాడని, పెళ్ళంటే స్త్రీకి రక్ష కాదని ఒక శిక్ష అనే భావాన్ని ఈ కవిత ద్వారా తెలుసుకోవచ్చు. భార్య తన సహచరి అని, తనతో జీవితం కలిసి బ్రతకాలని తనింటికొచ్చిందన్న విషయాన్ని ప్రతిసారి గుర్తు చేయాల్సిన పనిలేదు.

స్త్రీ వాద కవిత్వంలో స్త్రీల గాయాలు గేయాలుగా, శోకాలు శ్లోకాలుగా, ఆక్రందనలు పద్యాలుగా, ఛీత్కారాలు, ఈసడింపులు, గర్జనలు హైకూలు, నానీలుగా కనబడతాయి. స్త్రీవాద కవిత్వం ఒక పక్క పితృస్వామ్య వ్యవస్థలోని ఆధిపత్య ధోరణిని వ్యతిరేకిస్తూనే స్త్రీ అస్తిత్వాన్ని, సమానత్వాన్ని సమర్ధిస్తూ సాగుతున్నది. నడుస్తున్న వ్యవస్థ స్త్రీగా పుట్టడమే శాపమని భావించేలా చేస్తున్నదని, అందువల్ల స్త్రీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నదన్న భావాన్ని శ్రీమతి తన కవితలో ఇలా…

”నేనమ్మలో ఉన్నప్పుడు

నేను కావాలని అమ్మ కోరుకుంటున్నట్లు….

….నిన్న నా చదువు నిషిద్ధం

నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధమే” (నీలిమేఘాలు, నిషిద్ధ స్వప్నం పు.92)

గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చేత దెబ్బలు తినడం, పుట్టిన తరువాత మనస్ఫూర్తిగా నవ్వడం కనుమరుగై ఆ తరువాత ఆడపిల్లకు చదువెందుకు అని చదువును అటకెక్కించడం చివరకు జీవితమే నిషిద్ధమై పోతున్నది అని ఆక్రోశించే ఒక అబల యొక్క దీనత్వాన్ని, దైన్యత్వాన్ని, నిస్సహాయతను, ”నిషిద్ధ స్వప్నం” తెలుపుతున్నది. ఈ క్రమంలో స్త్రీ ఉనికే నిషిద్ధమని చెపుతున్న తీరులో ఇలానే రేపు (రాబోయే కాలం) కూడా జరిగితే, స్త్రీ అస్తిత్వం ప్రశ్నార్థకమే. అందుకే స్త్రీ ప్రశ్నించాలి, పోరాడాలి. వ్యక్తిగా సమస్యపై తుదికంటా పోరాడితే రేపు ఏర్పడే సమానత్వ వ్వవస్థను సమాజానికి అందించిన వాళ్ళమవుతాం.

ఈ నేపథ్యంలో స్త్రీలు తమను తాము తెలుసుకోవాలని, పితృస్వామ్య వ్యవస్థలోని లింగ వివక్ష వైఖరిని తేల్చుకోవాలని ఆశించారు. వివాహం, మాతృత్వం వంటి వారి వైయుక్తిక జీవితాలకి వారే శాసనకర్తలు కావాలని నిర్ణయించుకున్నారు. ఆ భావాలను వసంత కన్నాభిరాన్‌ ‘అస్మిత’లో…

”స్త్రీగా ఉండడమంటే ఏమిటో

నేనెప్పుడు తెలుసుకున్నాను…..

….నేను తెలుసుకున్నది” (నీలిమేఘాలు పు.42)

నీతి, నియమం, నైతికత, సాంప్రదాయం, సంస్కృతి, న్యాయం, ధర్మం అంటూ స్త్రీకి మాత్రమే ఆంక్షలు విధిస్తూ ఒక చట్రంలో బిగించి పురుషుడు మాత్రం అవన్నీ మరచి విశృంఖల స్వేచ్ఛని, అమానవీయ హక్కులను అనుభవిస్తున్నాడు. అందుకే స్త్రీగా తన ఉనికిని కొత్తగా ఏర్పరచుకుంటున్నప్పుడు స్త్రీగా తనను తాను తెలుసుకోవడం, తన జీవితం మీద, తన శరీరం మీద తనకే పూర్తి హక్కులు, నిర్ణయాలు ఉండాలనుకోవడం సహజమనీ, అత్యవసరమనీ, అనివార్యమని తెలుస్తోంది.

”అనేక సందిగ్ధ ఆలోచనల అనంతరం

సవాలక్ష అప్రస్తుత ప్రశ్నలకు

సమకూర్చుకున్న సమాధానాల అనంతరం

నేనొక నిర్ణయానికొచ్చాను….

….మన రక్తమాంస ఫలాల మీద

ఎవరి ఆధిక్యమూ వద్దు” అంటున్న నవస్మృతి కర్త మహజబీన్‌తో మనం ఏకీభవించాల్సిందే. అయితే తనను తాను తెలుసుకున్న స్త్రీ ముందుగా తనను తాను జయించాల్సి ఉందని ”స్వరస్థాపం” లో పాటిబండ్ల రజని –

”నా అంత ఎదిగిందని కాక

నాకే ఎదురాడిందని గద్దించిన నాన్ననీ,

నలభై నిమిషాల ఏకశిక్షణాధిపత్యంలో

నాలుగు నిమిషాలైనా నా వ్యక్తీకరణ కివ్వని మాస్టార్లని క్షమించి,

వర్ణన కోసం పోల్చిన కంఠపు శంఖాన్ని

వక్తనై పూరించాల్సి ఉంది.

నన్ను నేను జయించాల్సి ఉంది” అంటుంది.

ఇందులో ఎదిగిన కూతురు ప్రశ్నించడం ప్రారంభించగానే నా అంత ఎదిగిందని గర్వించడం మాని నాకే ఎదురు తిరుగుతావా అంటూ కోపగించుకునే తండ్రి యొక్క దౌష్ట్యాన్ని, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన శిక్షణా కార్యక్రమం శిక్షగా మారి నాలుగు నిమిషాలు కూడా భావవ్యక్తీకరణకు అవకాశం ఇవ్వని మాస్టార్ల యొక్క దుర్నీతిని క్షమించినా ఒక నేను (స్త్రీ) అబలగా కాకుండా సబలగా మారి కవుల వర్ణనలో శంఖంగా మారిన కంఠంతో యుద్ధభేరి మ్రోగించాల్సిన అవసరముంది.

స్త్రీ తనను, సమాజాన్ని ఆకళింపు చేసుకోవడంలో తద్వారా స్థిరీకరణ చెందే సమయంలో మధనపడుతున్న విషయం మనకు తెలుసు. మధనం హృదయశల్యమే, కానీ మథనం జరిగితేనే కదా మధురమైనా, హాలాహలమైనా బయటికి వచ్చేది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు మొదట హాలాహలమే పుట్టింది. ఆ తర్వాత వెన్నెలను కురిపించే లక్ష్మీదేవి, సర్వదా శుభం కలిగించే కల్పవృక్షం, కోరిన ఈప్సితాలను తీర్చే కామధేనువు, అమరత్వాన్ని ప్రసాదించే అమృతం వచ్చాయి. ఇది పుక్కిటి పురాణమే కావచ్చు, దీన్ని మన స్త్రీల సమస్యలకు అనుసంధానం చేస్తే ఇప్పుడు ఇలా ఈ సదస్సుల ద్వారా స్త్రీ సమస్యా సాధన మధనం జరుగుతున్నది. మథనం జరిగితేనే మధురం లభ్యం, అయితే మధురం (అమృతం) కోసం మనం హాలాహలం కూడా స్వీకరించగలగాలి. 1829 సంవత్సరంలో ప్రత్యేకంగా స్త్రీల కోసం సతీసహగమన చట్టం ప్రారంభమై నేటివరకు నిర్భయ చట్టం వంటి ఎన్నో చట్టాలు అమృత కలశాలుగా వచ్చాయి. కానీ ఆ చట్టాలు ఆశ్రితులకు, పీడితులకు చుట్టాలుగా మారాల్సింది కాస్తా శ్రీమంతులకు, పీడకులకు నేస్తాలవుతున్నాయి. అందుకే చట్టాల పరికల్పన – రూపకల్పన ఆరంభ శూరత్వం కారాదు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ చట్టాల అమలు పటిష్టం చేయడానికి ప్రభుత్వ నిబద్ధత అవశ్యం, అవసరం. అందుకు మనకు చైతన్య స్ఫూర్తి, తిరుగుబాటు అత్యవసరం. ఈ నేపథ్యంలో స్త్రీవాద కవిత్వం తన గళాన్ని సవరించింది. పితృస్వామ్య వ్యవస్థను ప్రశ్నించింది, నిలదీసింది, నిగ్గు తేల్చింది.

సుధ తన ”లొంగుబాటు సంగీతాన్ని కాను” కవితలో…

”లొంగుబాటు సంగీతాన్ని వినిపించినన్నాళ్ళు

నేను నీ సహచరిని….

….నీకు పోయేది ఆధిపత్యమే

దొరికేది అమూల్యమైన సాహచర్యం” (నీలిమేఘాలు-144)

కుటుంబంలో ఎదురు ప్రశ్నించనంత వరకు పురుషుడు సహచరివి, సహధర్మచారిణివి, అర్థాంగివి, దేవతవి అంటూ ఆకాశానికి ఎత్తేస్తాడు. తనపై జరుగుతున్న అసమానతలపై, అత్యాచారాలపై గళం విప్పితే కంట్లో నలుసని, చెప్పులో రాయివని, నికృష్ట జీవానివని, దయ్యానివి అంటూ అథఃపాతాళానికి తొక్కేస్తున్నాడు. అయితే పురుషుడు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏమిటంటే శాంతాన్ని చేతగానితనంలా, మాతృత్వాన్ని బలహీనతగా భావించి నమ్మకద్రోహం చేయాలని తలిస్తే సంగీతం నిశ్శబ్దంగా ఉండదని, విముక్తికై పోరాడుతుందని అందులో పురుషుడి బూటకపు అస్తిత్వం కనుమరుగవుతుందనే నిజాన్ని గుర్తించి మా నినాదాన్ని ఆచరించు. దానికి ప్రతిగా నీకు డాంబికమైన ఆధిపత్యం పోతే అమూల్యమయిన సాహచర్యం లభిస్తుంది అంటూ హితబోధ చేస్తుంది.

స్త్రీవాదం స్త్రీలను కనుసన్నల్లో ఉంచుకోవడం కాదు కళ్ళల్లో, హృదయంలో పెట్టుకుని కాపాడాలని చెప్తున్నది. మరబొమ్మగా ఆడించవద్దని, మనసులో ప్రతిష్టించుకొమ్మని కోరుకుంటోంది. జయ తన కవితలో ఇలా…

”నేను బొమ్మను కాదు

నువ్వు రంగులు పులిమితే నవ్వడానికి

నేను బొమ్మను కాదు

నువ్వు విసిరేస్తే పగిలిపోవడానికి

బొమ్మలా నిశ్చలంగా ఉండడానికి

నీ కుంచెలోంచి జాలువారలేదు” (పరివ్యాప్త – నాకు గోడలున్నాయి పు.17)

నీవు ఉండమన్నట్లు ఉండడానికి, రంగులు పులిమితే నవ్వడానికి, నర్తించమంటే నాట్యమాడడానికి, విసిరేస్తే పగిలిపోవడానికి, వదిలేస్తే విడిపోవడానికి, అగ్నివర్షం కురిపిస్తే కాలిపోవడానికి, కీ ఇస్తే నడవడానికి నేను మరబొమ్మను కాను. నీ కుంచెలో నుంచి జారిన కాన్వాసును కాను. జడపదార్థం అసలే కాదు. నిత్య చైతన్య స్రవంతిని. ఆ విషయాన్ని గుర్తెరిగితే నీకు శాంతి, మనఃశ్శాంతి, ప్రశాంతి లేదా తాండవం, విలయతాండవం, ప్రళయ తాండవమే అని గర్జిస్తుంది.

శరీర నిర్మాణ పరంగా స్త్రీ కన్నా పురుషుడు శారీరకంగా బలవంతుడు. ఆ ఒక్క బలంతోనే పురుషుడు స్త్రీని అన్ని రకాలుగా అణచివేతకు గురిచేస్తున్నాడు. కానీ శారీరక బలంకంటే మానసిక బలం చాలా గొప్పది. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్‌, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి అహింస అనే ఆయుధంతో స్వాతంత్య్రాన్ని తెచ్చిన గాంధీజీ శారీరకంగా ఎలాంటివారో మనకు తెలుసు. అందుకే శారీరక బలం అనేది మానసిక బలం ముందు తృణప్రాయం. అందుకే సుకుమారమైన దేహంగల స్త్రీ అవసరమైనప్పుడు ఛేదించ వీలుగాని వజ్ర మనస్సును ప్రదర్శించాలి. అప్పుడే ఈ రాతలు చేతలు అవుతాయి. ఆరంభ శూరులుగా మిగలకుండా అసాధ్యురాళ్ళుగా చరిత్రలో నిలిచిపోతాం.

”ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి

నీ యుద్ధం నువ్వే గెలవాలి

నీ రక్తంతో నీ మాలిగతో

నీ కత్తీ డాలూ నువ్వే చేసుకోవాలి…..

……ఓడినా సరే

ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి

నీ కోసం వాళ్ళు యుద్ధం గెలిచారో

నిలువునా మునిగిపోతావు

ఎప్పటికీ ఓడిపోతావు”

నొప్పి నీదైతే ఎలుగెత్తే గొంతు కూడా నీదే కావాలి. అణగదొక్కబడుతున్న జీవనం నీదైతే ఎగిసిపడే కెరటం నీవే కావాలి. బాధ నీది, భయం నీది, బాధ్యత నీది, తిరిగి వచ్చే బంతివి నువ్వవ్వాలి. వివక్ష నీపై అయినపుడు దానిపై తిరగబడే బాణం నీవే కావాలి. అందుకే నీ యుద్ధం నీవే చేయాలి. నీ యుద్ధం నీవే గెలవాలి. ఓడినా సరే సమర సమిధగా నీవే మిగలాలి. అలా కాకుండా నీ కోసం వేరెవరైనా (పురుషుడు) యుద్ధం చేయడానికి నీవు అవకాశమిచ్చావో నీవు నిలువుగా మునిగిపోతావు, ఓడినా ఓడిపోతావు, గెలిచినా ఓడిపోతావు. నీ రక్త మాంసాలను కత్తి డాలుగా చేసుకొని పోరాటం చేయాలి. గెలిస్తే విజయమే నీ కలల సాకారం. ఓడితే నీ ప్రయత్నమే మరొక ప్రయత్నానికి నాంది.

వర్గ విముక్తి జరగనిదే శ్రమ విముక్తి జరగదు. శ్రమ విముక్తి మాత్రమే స్త్రీ విముక్తికి బాటలు వేయగలదు. తరతరాలుగా స్త్రీలపైనే రుద్దిన ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం వంటి సమస్త దాస్యాల నుండి బయటపడి కుటుంబ, రాజ్య, సామాజిక హింసల నుండి విముక్తి చెంది ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వంతో హృదయం నిండా స్వేచ్ఛా గాలిని నింపుకొని సంతృప్తిగా చిరుమందహాసం చేయగలిగే అవకాశం స్త్రీకి లభించాలి.

అలాంటి స్త్రీలు నేటి ప్రపంచంలో వారి అస్తిత్వం కోసం పోరాటం చేయక తప్పదనే పరిస్థితులు వచ్చాయి,. ఆ పోరాటంలో తొలి అడుగు నీదైతే, నీతోపాటు అడుగులు వేయడానికి మేమంతా ఉన్నాం అంటూ ఈ రెండు రోజుల సెమినార్‌ సాక్షిగా ఇక్కడున్న ఇంతమంది నిలుస్తారు.

నీవు బిందువుగా ప్రస్థానం సాగిస్తే

నీ వెనక సింధువుగా మారడానికి

కోటి గొంతుకలు సిద్ధంగా ఉంటాయి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.