ఇంటిపని… ద్రవ్యీకరణ – సింగరాజు రమాదేవి

ఇటీవల దేశమంతటా సంచలనం కలిగించిన పదం ‘డీమానిటైజేషన్‌’. అకస్మాత్తుగా అమలైన పెద్ద నోట్ల రద్దు సామాన్య జనాన్ని ఎంత ఇబ్బందులకు గురి చేసిందో…చిరు వ్యాపారులకు ఎంత నష్టం కలిగించిందో… ఎంత మంది కార్మికుల పొట్ట కొట్టిందో మనందరికీ తెలుసు.

అయితే ఇప్పుడు మనం చర్చించబోయే విషయం సరిగ్గా దానికి వ్యతిరేకమైన పదం అయిన ‘మానిటైజేషన్‌’ గురించి. దీనినే మనం తెలుగులో ద్రవ్యీకరణ అంటాం. అయితే ఇది డబ్బుల ద్రవ్యీకరణ కాదు ఇంటిపని యొక్క ద్రవ్యీకరణ.

ఒక ఇంటిని సక్రమంగా నడపాలంటే ఎన్నో పనులు జరగాల్సి ఉంటుంది. ఇంటి శుభ్రత, వంటపని, పిల్లల సంరక్షణ, పెంపకం, వృద్ధులను, రోగులను చూసుకోవటం వంటివి… ఇంకా ఎన్నో పనులు ఈ క్రమంలో అవసరమౌతాయి. ఇవన్నీ సాధారణంగా అన్ని ఇళ్ళల్లో మహిళలే చేస్తారు. కానీ ఈ పనికి వారికి ఎటువంటి ఆదాయం ఉండదు, ఏ గుర్తింపూ ఉండదు. ఇంటి చాకిరీ అంతా వారిదే కాబట్టి, ఇంట్లో తీసుకునే నిర్ణయాలపై ఆమెకు అధికారం ఉంటుందా అంటే అదీ లేదు. అంటే ఇది పూర్తిగా ఆదాయం, ప్రతిఫలం, గుర్తింపు లేని పని. తరతరాలుగా డిమానిటైజ్‌ చేయబడ్డ పని.

అసలు దీనంతటినీ ‘పని’ అనటమే కొంతమందికి దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఆడవాళ్ళకు తమ కుటుంబంపై ఉండే ప్రేమానురాగాల అభివ్యక్తిగా ఈ పనిని వీరు పరిగణిస్తారు. అందుకే దానికి ఎటువంటి ప్రతిఫలం ఆశించకూడదని వీరి భావన! ఆడవాళ్ళు ఎంత నిస్వార్థంగా, ఎంత అంకిత భావంతో ఈ పనులు చేస్తే వారు అంత మంచివారు. నిజానికి మన సమాజంలో స్త్రీత్వం ఈ పనుల ఆధారంగానే నిర్వచించబడుతుంది.

అయితే మీరు అనుకోవచ్చు. సమాజం ఒక మగవాడిపై కూడా పనిచేసి కుటుంబాన్ని పోషించాలనే ఒత్తిడిని తెస్తుంది కదా అని. నిజమే! కానీ మగవారు చేసే పనులకు వారు ఆదాయం పొందుతున్నారు. కుటుంబంలో పెద్దగా, అధికారాన్ని పొందుతున్నారు. సమాజం వారికి ఆర్థిక స్వాతంత్య్రం, కుటుంబ విషయాలలో నిర్ణయాధికార స్వేచ్ఛ మరియు సంఘంలో హోదా కల్పిస్తోంది.

కానీ ఒక స్త్రీ చేసే పనులను పనిగానే భావించట్లేదు. సాధారణంగా మనం ఒక గృహిణి యొక్క భర్తనో, పిల్లలనో… మీ అమ్మ ఏం చేస్తుందని అడిగితే వారు వెంటనే చెప్పే సమాధానం ‘ఏం చెయ్యదు’ అని. పొద్దున్నే అందరికంటే ముందు లేచి ఇల్లూ, వాకిలీ శుభ్రం చేసి, గిన్నెలు కడిగి, బట్టలు ఉతికి,

నీళ్ళు నింపి, రెండు పూటలకు వంట చేసి, లంచ్‌ ప్యాక్‌ చేసి ఇచ్చి, మళ్ళీ అందరూ ఇంటికి తిరిగి వచ్చే సమయానికి వేడిగా భోజనం తయారు చేసి ఉంచే గృహిణి… ఏమీ చెయ్యదు అనటం ఎంత అనాలోచితం… ఎంత అన్యాయం!

కానీ సమాజమే కాదు, ప్రభుత్వం కూడా ఇలాగే భావిస్తోంది. అందుకే 2011 జనాభా లెక్కల్లో గృహిణులను, ఉత్పాదకత లేని వర్గంలో… అంటే బిచ్చగాళ్ళ పక్కన చేర్చారు.

నిజానికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రణాళిక 1995 ప్రకారం… ప్రపంచంలోని అన్ని దేశాల మహిళలు, పురుషుల కన్నా ఎక్కువ గంటలు పనిచేస్తారని, కొన్ని సందర్భాలలో వారే కుటుంబ పోషకులని పేర్కొన్నారు. అయితే ఆదాయంలో సింహభాగం మాత్రం పురుషులే పొందుతారని, దేశ ఆర్థిక వ్యవస్థను పరిపృష్టం చేసే ఖ్యాతి కూడా వారికే దక్కుతుందని చెప్పారు.

అయితే తొంభైవ దశకానికి – ఇప్పటికీ సాంకేతికంగా ఇన్ని మార్పులు వచ్చినా మహిళల పని గంటలు తగ్గలేదు సరికదా, పెరిగాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. మహిళలు సగటున వారానికి పదిహేడు గంటలు ఇంటి పనిలో గడుపుతుండగా, ఐదుగురిలో ఒక పురుషుడు ఏ ఇంటి పనీ చేయమని చెప్పారు. మిగిలిన పురుషులు వారానికి అయిదు గంటలు మాత్రం చేస్తున్నారు.

ఇంటిలోనే కాక, ఇక బయట ఉద్యోగం చేసే మహిళల విషయానికి వస్తే… వీరి పరిస్థితి ఇంకా దారుణం. వీరికి బయట పనితో పాటు ఇంటి పని కూడా ఏ మాత్రం తప్పట్లేదు.

జాతీయ ఆదాయపు లెక్కల్లోకి ఇంటి పనిని తీసుకోవాలనే ఆలోచన 1920ల్లోనే ఆర్థిక నిపుణులకు కలిగింది. ప్రతిఫలం లేని ఇంటి పనుల ద్వారా సృజించబడే సంపద గణాంకాలలోకి చేరకపోతే అవి అసంపూర్తిగా ఉంటాయని కొందరు వాదించారు. ఇంటి పని ద్రవ్యీకరణ చర్చ, పరిశోధన అప్పుడే మొదలయ్యాయి. ఆర్థిక విశ్లేషకులు, సామాజిక శాస్త్రవేత్తలు కూడా కుటుంబాలలో వనరుల పెంపకం, కుటుంబ సభ్యుల ఒక్కొక్కరి వస్తు వినియోగ అవకాశాలు, సంక్షేమ అవకాశాలు… ఇవన్నీ సరిగ్గా తెలుసుకోవాలంటే జీతం పొందే పనినే కాక, ఏ జీతం పొందని పనిని కూడా పరిగణించాలని అన్నారు.

మరి అలా ఆ పనిని పరిగణించాలంటే, ముందుగా దానికి విలువ కట్టాల్సి ఉంటుంది. దీనికి ప్రస్తుతం రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి… ఒక స్త్రీ ఇంట్లో చేసే ప్రతి ఒక్క పనికి, బయట మార్కెట్లో ఎంత రేటు ఉందో ఆ ప్రకారం లెక్క కట్టటం.

రెండు… ఆ స్త్రీ ఇంటి పనిలో గడిపే సమయాన్ని బయట ఉద్యోగం చేయడానికి వెచ్చిస్తే, తన సామర్ధ్యంతో ఎంత సంపాదించగలదో అంతగా వెల కట్టడం.

ఈ రెండు పద్ధతుల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. అసలు ప్రేమానురాగాలతో చేసే ఈ పనులకు వెల కట్టడం ఏమిటి అది అసాధ్యం అనేవాళ్ళూ ఉన్నారు.

కానీ ఒక్క భారతదేశంలో ఉన్న 30 కోట్ల మంది మహిళలు చేసే ఇంటి పనిని, సేవలను డబ్బు రూపంలో విలువ కడితే అది 29 ట్రిలియన్‌ రూపాయలు అవుతుంది. అంటే అది మన స్థూల జాతీయ ఉత్పత్తిలో 60 శాతం ఉంటుంది.

ఇంటి పని ద్రవ్యీకరణను కొన్ని యూరోపియన్‌ దేశాలలో ఇలా కాకుండా వేరే పద్ధతులలో అమలు చేస్తున్నారు. స్వీడన్‌లో ఇంటి పనులకు బయట మనుషులను పెట్టి వారికి జీతం ఇచ్చి చేయించటాన్ని ప్రోత్సహిస్తారు. అలా పెట్టుకున్న కుటుంబాలకు ఆదాయపు పన్ను రాయితీలు కల్పిస్తారు. జర్మనీలో టాక్స్‌ స్ప్లిట్టింగ్‌ లేదా పన్ను విభజన అవకాశం ఉంది. అంటే భర్త తన ఆదాయంలో కొంత భాగాన్ని తన భార్య ఆదాయంగా బదిలీ చెయ్యొచ్చు, తద్వారా పన్ను రాయితీ పొందొచ్చు.

ఫిన్లాండ్‌, నార్వే దేశాలు కూడా మహిళలను బయట ఉద్యోగాలకు ప్రోత్సహించటం మరియు సంప్రదాయికంగా మహిళలే చేస్తూ వస్తున్న పనులను మార్కెట్లో ఉపాధి కల్పనకు వాడటం… ఉదాహరణకుః కొత్త ఉపాధులైన కిచెన్‌ మేనేజర్‌, బేబీ సిట్టర్‌ వంటి వాటి కల్పన చేస్తున్నారు.

మన దేశంలో కూడా 2014లో మద్రాసు హైకోర్టు జడ్జి అయిన విమల ప్రమాదవశాత్తు మరణానికి గురైన ఒక గృహిణికి నష్టపరిహారం కేసులో, ఆ కుటుంబానికి లక్ష నష్టపరిహారాన్ని 6.8 లక్షలకు పెంచుతూ, ఆదాయం లేకపోయినా ఒక గృహిణి తన కుటుంబం కోసం చేసే సేవలు చాలా విలువైనవని అన్నారు.

ఇంటి పని ద్రవ్యీకరణ అనేది ఏ మేరకు సాధ్యం, శాస్త్రీయం అనే అంశాలు ఇంకా చర్చించతగ్గవే అయినా అసలు నేడు ఇంటి పనిని కేవలం ఒక మహిళ యొక్క బాధ్యతగానే కాక, అందరి బాధ్యతగా గుర్తించడం, మగవారు ఈ పని చేయకూడదు, ఇది కింది స్థాయి పని అనే ఆలోచనా ధోరణిని నిర్మూలించటం, సంస్కృతిపరంగా ఇల్లు చక్కదిద్దుకోవటంలోనే ఇల్లాలి సామర్ధ్యం అంతా దాగుందనే ఒత్తిడిని ఆమెపై తగ్గించి అందరూ పనిని పట్టించుకోవటం.. ఆమె పనిలో సహాయపడుతున్నట్లు కాక, పనిని నిజంగా పంచుకోవటం అన్నది చేస్తే స్త్రీలు ఇంటికే పరిమితం కాక బయట ఉద్యోగాలు చేసుకుంటూ తమ చదువుకు, సామర్ధ్యాలకు గుర్తింపు పొందుతూ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్ష భాగస్వాములవుతారు. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న మహిళలపై ఒత్తిడి తగ్గుతుంది. అదే మన ప్రస్తుత అవసరం!

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.