కొన్ని సార్లు
నువ్వు
నాతోనే
వున్నావనుకుంటా.
బహూశా
మరీ రద్దీ అయి
కుదరని రోజులలాగే
వీలుపడలేదేమో
మమ్మల్ని చూసేందుకు
అనుకుంటా.
కానీ ఎక్కువ సార్లు
నిష్ఠుర నిజం
పొత్తికడుపులో
పేగులు మెలిపెడుతోంది
నాకు తెలుసు
నువ్వు తిరిగి రావు
ఇక ఎన్నటికీ.
మధనపడుతూ
వణికిపోతూ
సోలిపోతూ
వాంతి వస్తోంది నాకు
కానీ ఏం క్కుతుంది
నా ఖాళీ కడుపు?
తక్కిన అంతటలాగే.
నీ చివరి పది క్షణాలు
తలుపుకొస్తే
వేకువలో వేదన
నిద్దురలో పీడకల.
నీ గొంతు మూగబోయేందుకు
పట్టింది పదే క్షణాలట!
ఖాకీలంటారు.
కానీ నన్ను ఊహించనీ
ఆ చివరి నీ పది క్షణాలనీ!
హంతకుడు
నిస్సందేహంగా ఓ పిరికిపందే!
హెల్మెట్‌లో తలదాచుకుని
నీవైపు దూసుకొస్తే..
”ఏంటిరా?
ఏం చేస్తున్నావురా… నా కొడకా?”
తొలి తూటా వేటు!
”రేయ్! బాస్టర్డ్!
ఎవర్రా నువ్వు?
నా కామ్రేడ్ కాదు
నా రక్త బంధువు కాదు
కచ్చితంగా నా వాడు కాదు!!
నీ చెడ్డీ పొడవయ్యిందని
నువ్వు పెద్దయ్యావని
అనుకుంటున్నావా?
నువ్వు ఇప్పుడు
ప్యాంటు వేసుకుంటున్నావా?
దమ్ముంటే రా… రా…
అంతం చెయ్యరా నన్ను… చూద్దాం!
ఎంత ధైర్యం నీకు?
నేను అనంతాన్ని!!”
క్షణాలు పదే.
తూటాలు
పదేపదేపదే…
మొత్తం మూడు.
నువ్వు ఇక లేవు.
ఈషా, అమ్మా లేదా నేనో
నీ తలపుల్లో మెరిసామా?
మరి
ఆ ప్రేమా?
ఆ చింతా?
ఆ అక్కరా?
నిను
కిలకిలమనే చిట్టి గువ్వ నుంచి
గర్జించే ఆడపులిలా తీర్చిన
నీ కామ్రేడ్ల తలపులయినా
నీలోన మెదిలాయా?
ఆ చివరి తూటా
దూసుకుపోయేలోపు
అదే అన్నీ ఆపేసే లోపు.
రక్తపు మడుగులో
కుప్పకూలి నువ్వు.
కానీ
నీది ముగింపా?
ఇక్కడా, అక్కడా, అంతటా
మరొక్క దీక్షగా మరింత దిటవుగా
నీపోరు కొనసాగింపు
వేలాది మంది ఊరేగింపు
నీ రాలిన ప్రతి రక్తపు చుక్క
చొచ్చుకు మొలిచే నిరసన మొక్క!
ఇంతకీ
గొంతులేని వారి కోసం
నీలా పెదవి విప్పితే
నాదీ నీ గతేనా?
నేను మౌనంగా వుంటే
లేనట్టేనా?
ఈ తలంపే
నన్ను
మరీ మరీ
గందరగోళపెడుతోంది
యిప్పుడు.