‘భూమిక’…ఈ పేరు వినగానే మహిళలకు రక్షణ కవచం, పురుషులకు సింహస్వప్నం అని అనిపిస్తుంది. నేను మొదటిసారి సత్యవతి గారిని కలిసినపుడు ఆమె సమక్షంలో మనసులో ఏదో తెలియని ధైర్యం, మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగాయి. ఈమె ఎవరు? ఈమెలో ఏదో పవర్ ఉంది అనుకున్నాను. ‘భూమిక’ పత్రిక నడిపిస్తున్నారని తెలుసు కానీ ‘హెల్ప్‌లైన్’ సంగతి అప్పటికి అంతగా తెలియదు. మర్నాడు ఎవరో ఒక మహిళ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉందని ఆమె ఉత్తర భారతదేశంలోని ఏదో ఒక ప్రదేశం నుంచి ఆర్మీలో పనిచేసే ఆమె భర్తను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిందని, కానీ అతను ఆమెను కలవడానికి కూడా ఇష్టపడలేదన్న సమాచారం తెలిసి సత్యవతి గారు, ప్రశాంతి గారు రాత్రి పది గంటలకు హుటాహుటిన రైల్వేస్టేషన్‌కు బయల్దేరి వెళ్ళారు. వారితోపాటు నేను కూడా వెళ్ళాను. స్టేషన్ మాస్టర్‌తో మాట్లాడి ఆమెను విశ్రాంతి గదిలో కూర్చోబెట్టి, ఆమెకు ధైర్యం చెప్పి, ఆమె ఊరిలో ఉన్న మహిళా సంఘం సభ్యురాలితో మాట్లాడి ఆమె తన ఊరుకి జాగ్రత్తగా చేరేలా చర్యలు చేపట్టడం కళ్ళారా చూసి అసలు సంబంధమే లేని ఒక స్త్రీ కోసం ఈమె ఇంత రాత్రి పూట వచ్చి ఎంత తపన పడుతున్నారో కదా! అని చాలా గొప్పగా అనిపించింది.
ఢిల్లీలో ఉండే నేను హైదరాబాద్ వెళ్ళినపుడు రెండుసార్లు సత్యవతిగారు, ప్రశాంతి గార్లతో కలిసి చంచల్‌గూడ మహిళా జైలుకి వెళ్ళినపుడు వారు అక్కడి మహిళలకు ధైర్యం చెబుతున్న తీరు, వారి కుటుంబాల కోసం ఆరాటపడుతున్న తీరు చూసి చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. తర్వాత్తర్వాత హెల్ప్‌లైన్ చేస్తున్న సేవలు తెలుసుకున్న నేను దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నది ‘భూమిక హెల్ప్‌లైన్’ ఒక్కటే అని తెలిసి ఆశ్చర్యంగా, అద్భుతంగా, సగర్వంగా ఫీలయ్యాను. పత్రిక ద్వారా పరోక్షంగా, ‘హెల్ప్‌లైన్’ ద్వారా ప్రత్యక్షంగా మహిళలకు అండగా నిలబడుతున్న ‘భూమిక’కు హ్యాట్సాఫ్. భూమిక పత్రికకు డీటీపీ చేసే అవకాశం రావడం నా అదృష్టం. తద్వారా సముద్రంలో నీటిబొట్టులాగా నేనూ ‘భూమిక’ టీంలో ఉన్నాననే భావన అనిర్వచనీయం.
తెలుగు పత్రికారంగంలో, సాహితీ లోకంలో, మహిళల కోసం చేస్తున్న కృషిలో ”భూమిక”ది ఒక ప్రత్యేకమైన స్థానం.
పాతికేళ్ళ మైలు రాళ్ళను దాటుకుని, అదే ఊపుతో మున్ముందుకు పరుగు పరుగున సాగుతున్న ‘భూమిక’ బృందానికి, సంపాదక వర్గానికి ముఖ్యంగా సత్యవతి గారికి అభినందనలు.
– ఆర్. ప్రవీణ, న్యూ దిల్లీ