నా దగ్గర ఒక ఆయుధం ఉంది. అది భూమిక. యుద్ధంలో ఇబ్బందులు ఎదురైతే నా ఆయుధం నాకు ధైర్యాన్నిస్తుంది. నా రక్షణ కవచం. నేను నా ఆయుధాన్ని వాడొచ్చు, వాడకపోవచ్చు. కానీ నాతో అది ఉండడం నాకు భద్రతనిస్తుంది. అదే నా రక్షణ కూడా. ప్రస్తుత సమాజంలో భూమిక మన ఆడవారి ఆయుధం.
‘మనకేంటబ్బా మనకు భూమిక ఉంది కదా’ అంటారు నా స్నేహితురాళ్ళు. ఈ మాట అన్న వెంటనే అందరి ముఖాలపై అప్రయత్నంగా ఒక చిరునవ్వు వెలుగుతుంది. ఆ మాట అక్షరాలా నిజం. కథలు వగైరా రాస్తుంటే, ఎప్పుడోకప్పుడు డైరెక్టుగానో, ఇన్‌డైరెక్టుగానో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక్కసారిగా నిరాశ పుడుతుంది. అప్పుడు భూమిక గుర్తొస్తుంది. ‘నాకెందుకు భయం, భూమిక ఉంది కదా’ అనుకుంటాము మేము. అనుకున్న ప్రతిసారీ భూమిక గొప్పదనం తెలుస్తుంది.
ఉన్నట్టుండి ఒక స్నేహితురాలు గుంటూరు నుంచి ఫోన్ చేస్తుంది, లేకపోతే చండీగఢ్‌లో కజిన్ ఫోన్ చేస్తాడు. ఎవరెవరివో కేసులు, కట్నం కోసం వేధింపులు, కుటుంబంలో అమ్మాయిల మీద ఇంట్లో మగవాళ్ళ లైంగిక దాడులు, పైశాచికత్వం ముదిరి కాళ్ళమీద వేణ్ణీళ్ళు కుమ్మరిస్తాడు ఒకడు. ఇటువంటి విషయాలు విన్న వెంటనే నాకు ఫోన్ చేస్తారు. భూమిక వెంటనే స్పందిస్తుంది. భూమిక లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏమయ్యేది అని ఆలోచించినప్పుడల్లా వెన్నులోంచి వణుకు పుట్టుకు వస్తుంది.
చంచల్‌గూడా జైలులో భూమిక చేసే పనులు చూసినా, షీ టీమ్స్ కౌన్సిలర్ల నిబద్ధతని చూసినా భూమికలో నాకొక చిన్న చోటు
ఉండడం గర్వంగా అనిపిస్తుంది.
పాతిక సంవత్సరాలు గడిచినా నిరాటంకంగా భూమిక పత్రిక రావడం భూమిక నిబద్ధతకు తార్కాణం. కానీ చందాదారులకే కా సామాన్య ప్రజలకు కూడా ఈ పత్రిక అందితే ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భూమిక కుటుంబమంతా యువ రచయితలను, కార్టూనిస్టులను ఇంకా తీసుకురాగలగాలి.
– అపర్ణ తోట, హైదరాబాద్