2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన థీవ్‌ు : 2025 వ సంవత్సరానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవానికి లింగ సమానత్వాన్ని సాధించడానికి వేగంగా చర్యలను చేపట్టండి (Accelerate Action) అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సమిష్టిగా పనిచేయమని ఐక్యరాజ్యసమితి నిర్ధేశించింది.
‘‘స్త్రీవాదం అంటే స్త్రీలను బలవంతులను చేయడం గురించి కాదు. మహిళలు ఇప్పటికే బలంగా ఉన్నారు. ప్రపంచం ఆ బలాన్ని గ్రహించే విధానాన్ని అర్ధం చేయించాలి’’ అని అంటుంది జి.డి. ఆండర్సన్.
A scene from the United Nations Fourth World Conference on Women in Beijing, China on 5 September 1995. Photo: UN Photo/Zheng Yan Hui
2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన థీమ్: ఈ 2025 మార్చి 8 కి ‘‘బాలికలు – మహిళలందరికీ: హక్కులు, సమానత్వం. సాధికారత’’ అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని పిలుపిచ్చింది.’’ (For All women and girls: Rights. Equality. Empowerment)
బీజింగ్ సదస్సు లక్ష్యాలు: ఈ 2025 సంవత్సరం మహిళలకు చాలా కీలకమైనది. ఎందుకంటే ఇది బీజింగ్‌లో జరిగిన నాల్గవ ప్రపంచ మహిళల సమావేశంలో 189 ప్రభుత్వాలు అంగీకరించిన ‘‘బీజింగ్ డిక్లరేషన్ అండ్ యాక్షన్ ప్లాట్‌ఫామ్’’ (Beijing Declaration and Platform for Action) 30వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా బాలికల, మహిళల హక్కుల కోసం అత్యంత ప్రగతిశీలమైనదిగా, విస్తృతంగా ఆమోదించబడినదిగా ఒక గొప్ప బ్లూప్రింట్‌గా మిగిలిపోయింది. విద్య, ఆరోగ్యం, శాంతి, మీడియా, రాజకీయ భాగస్వామ్యం, ఆర్థిక సాధికారతలను సాధించడమే గాక బాలికలు, మహిళలపై లైంగిక హింసను తొలగించడం వంటి స్త్రీల జీవితాల్లోని కీలకమైన రంగాలను ప్రభావితం చేసే విధానాలు, కార్యక్రమాలు, పెట్టుబడులను ఈ వేదిక మార్గనిర్దేశం చేస్తుంది. పర్యావరణం, డిజిటల్ టెక్నాలజీల శక్తి చుట్టూ ఆవిర్భభవిస్తున్న ప్రాధాన్యతలతో పాటు ఈ సమస్యలను పరిష్కరించడం అత్యవసరం. ఇవిగాక 2030 నాటికి ఐక్యరాజ్యసమితి సాధించి తీరవలసినవిగా నిర్దేశించుకున్న లక్ష్యాలున్నాయి!
ప్రపంచవ్యాప్తంగా మహిళల సుస్థిరాభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించుకున్న 17 లక్ష్యాలు
ఐక్యరాజ్యసమితి మహిళల సుస్థిరాభివృద్ధి కోసం 2030 నాటికి సాధించి తీరవలసిన 17 స్థిరమైన లక్ష్యాలను (Sustainable Development Goals) నిర్దేశించుకుంది. అందుకు ఆచరించవలసిన కొన్ని కార్యక్రమాలను, చర్చించవలసిన అంశాల జాబితాను ప్రపంచ నాయకులు 2015లోనే ఆమోదించారు. 2030నాటికి ప్రపంచ దేశాలన్నీ పాటించి, ఖచ్చితంగా సాధించవలసిన లక్ష్యాల ఆదేశాలతో రోడ్ మ్యాప్‌ను కూడా రూపొందించారు! ఇవన్నీ సాధించడానికి కేవలం 5 సంవత్సరాల సమయమే మాత్రం మిగిలి ఉంది. మరి ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను, అవి ఎంతవరకు అమలయ్యాయో తెలుసుకుందాం!
1.పేదరిక నిర్మూలన (No Poverty): పేదరిక నిర్మూలన విషయానికొస్తే నానాటికీ దారిద్య్రం పెరుగుతుందే తప్ప ఇసుమంత కూడా తగ్గడం లేదు. ఇప్పడున్న సామాజిక రక్షణ నిబంధనలు ఏమాత్రం సరిపోవు. 55% నవజాత శిశువులున్న తల్లులకి ఏమాత్రం ప్రసూతి నగదు ప్రయోజనాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా, 15 ఏళ్లలోపున్న ప్రతి 5 మంది బాలికల్లో ఒకరు తీవ్ర పేదరికంలో పెరుగుతూ, పోషకాహారలేమితో మరణాలబారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితే చెప్పింది. స్త్రీల పేదరికం, అసమానతలను పరిష్కరించడానికి స్త్రీవాద సంస్థలు కొన్ని నాయకత్వం వహించి పని చేస్తున్నాయి. అయినప్పటికీ, వారు మొత్తం అధికారిక అభివృద్ధి సహాయంలో 0.13 శాతాన్ని పొందుతూ ఎక్కువ ఖాళీగానే ఉంటున్నారు.
2. సంపూర్ణంగా ఆకలి నిర్మూలన(Zero Hunger): కోవిడ్ మహమ్మారి, భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు, వాతావరణ విపత్తులు, ఆర్థిక సంక్షోభం కారణంగా 2020 నుండి అదనంగా 75 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి నెట్టబడ్డారు. ఇది 2030 నాటికి 342 మిలియన్ల మంది మహిళలు, బాలికలు దారిద్య్ర రేఖకు దిగువన ఉండేలా చేస్తుంది. భరించలేని పేదరికం వల్ల ఎన్నో దేశాలలో ప్రజలు ఆకలికి కుంగి, కృశించి మరణాల బారిన పడుతున్నారు. మహిళలు నాయకత్వం వహించే చిన్నతరహా రైతు కుటుంబాలు, పురుషుల నేతృత్వంలోని వారికంటే సగటున 30% తక్కువ సంపాదిస్తారు. వెంటాడి, వేధించే దారిద్య్రంతో కన్నబిడ్డల ఆకలి తీర్చే దారిలేక తల్లులు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవడం చాలా అవసరమని ఐక్యరాజ్యసమితి భావిస్తుంది.
3. మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, సంక్షేమం (Good Health and Well being): కోవిడ్ మహమ్మారి మొదటి సంవత్సరంలో 1.4 మిలియన్ల మహిళలు గర్భవతులయ్యారని నివేదించింది గానీ ఆడవాళ్ళ ఆరోగ్యం, శ్రేయస్సు, సంక్షేమం గురించి ఐక్యరాజ్యసమితి అయినా పట్టించుకుందో లేదో సమాచారం లేదు. వాళ్ళందరూ ఏమయ్యారన్న సంగతి మనకి తెలియదు.
4.నాణ్యమైన విద్య (Quality Education): కోవిడ్‌కి ముందు సెకండరీ స్కూళ్ళలో చేరిన వివిధ దేశాల శరణార్థి శిబిరాల్లోని బాలికల్లో సగంమంది తిరిగి పాఠశాలలకు వెళ్లలేదు. పేదదేశాల ప్రజలు తిండీ, బట్టా, గూడూ లేక అలమటిస్తుంటే బిడ్డల్ని పాఠశాలలకు పంపించే పరిస్థితులెక్కడుంటాయి?
5. లింగ సమానత్వం (Gender Equality): లింగ సమానత్వం అతిపెద్ద మానవ హక్కుల సవాలుగా మిగిలిపోయింది. దాదాపు 50% దేశాల్లో మహిళలకు కొన్ని ఉద్యోగాల్లో, పరిశ్రమల్లో కేవలం మహిళలైనందుకే పని చేయకుండా ఆంక్షలు విధించారు. ఈ లక్ష్యం నెరవేరడం దాదాపు సున్నా అని ఐక్యరాజ్యసమితి నివేదించింది. మహిళలపై పెట్టుబడి పెట్టడం అనేది మానవ హక్కుల ఆవశ్యకతే గాకుండా సమగ్ర సమాజాల నిర్మాణానికి మూలస్తంభంగా నిలుస్తుంది. తాజా గ్లోబల్ అంచనా ప్రకారం సుదీర్ఘమైన గమ్యం చేరవలసే ఉందని చెప్పడం అంతులేని నిరాశకు గురిచేస్తుంది. ఇప్పటికే సమయం మించిపోయింది, అయినప్పటికీ స్త్రీల పురోగతి మనందరికీ మేలు చేస్తుంది కాబట్టి లింగ సమానత్వం సాధించడానికి ప్రతి ఒక్కరూ పని చేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిస్తుంది.
6. పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం (Clean Water and Sanitation): పరిశుభ్రమైన నీటి నిర్వహణ, పారిశుధ్యం విషయాలలో కేవలం 26% దేశాలు మాత్రమే చురుకుగా పనిచేస్తున్నాయి.
7. సరసమైన ధరలు – స్వచ్ఛమైన శక్తి (Affordable and clean energy): స్వచ్ఛమైన శక్తిని చౌకగా లభించేలా చూడాలనే లక్ష్యం ప్రపంచంలోని మూడు వంతుల దేశాలలో ఇంకా నెర వేర్చవలసే ఉంది.
8. ఆర్థికాభివృద్ధిని పెంచే మంచి ఉత్పత్తి పనులు (Decent work and Economic Growth): 2020లో ఉపాధి పొందిన 54 మిలియన్ల మహిళలు తమ పనులనుండి తొలగించబడ్డారు. అతి తక్కువ వేతనాలిచ్చే శ్రామికశక్తికి ఇప్పుడు నుండి 45 మిలియన్ల మహిళలు పెరిగారు. పేదరికం, అసమానతలు, పర్యావరణ క్షీణతను ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మరింత తీవ్రతరం చేస్తుంది. మహిళలు, అట్టడుగు వర్గాలను అసమానంగా ప్రభావితం చేస్తుంది. ప్రత్యామ్నాయ ఆర్థిక నమూనాల కోసం గ్రీన్ ఎకానమీ వైపు దృష్టి పెట్టాలని మహిళల శక్తియుక్తులను విస్తరించే సంరక్షణ సమాజాన్ని అభివృద్ధిచేసే దిశగా మళ్లాలని ప్రతిపాదించింది.
9. పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు (Industry, Innovation and Infrastructure)): ప్రపంచవ్యాప్తంగా కేవలం 4% మహిళలు మాత్రమే కోవిడ్ 19 చికిత్సలు పొందారని క్లినికల్ అధ్యయనాల వారి పరిశోధనలో వెల్లడిరచారు.
10. అసమానతలను తగ్గించే చర్యలు చేపట్టడం (Reduced inequalities): కోవిడ్ వలసల సమయంలో శ్రామిక ప్రజలు వారి వారి సొంత ఊళ్ళకు ప్రయాణించేటప్పుడు మధ్య దారుల్లో 19% మంది పురుషులతో పోల్చి చూస్తే, 53% మంది మహిళలు అత్యంత భయానకమైన హింసను ఎదుర్కొన్నారని ఐక్యరాజ్యసమితి నివేదించింది. వారి రక్షణ కోసం ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు ఏమాత్రం సరిపోవుని ఐక్యరాజ్యసమితి చెప్పింది.
11. స్థిరమైన నగరాలు, కమ్యూనిటీ నివాసాలు Sustainable cities and Communities): సుస్థిరమైన అభివృద్ధిని సాధించగల నగరాలను, కమ్యూనిటీ సంఘాలను స్థాపించడానికి ప్రయత్నించాలి.
12. బాధ్యతాయుతమైన వినియోగాలు, ఉత్పత్తులు (Responsible consumption and production),
13. వాతావరణ చర్యలు (Climate action)
14. నీటి క్రింద జీవితం (Life below Water),
15. భూమి మీద జీవితం (Life on land) – ఈ నాలుగు సమస్యలకు పరిష్కారాలుగా అంతర్జాతీయ మహాసముద్ర, విజ్ఞాన సమావేశాలలో స్పీకర్లలో కేవలం 29% మంది మహిళలు మాత్రమే వివిధ విషయాల గురించి మాట్లాడగలుగుతున్నారని ఐక్యరాజ్యసమితి చెప్పింది.
16.శాంతి, న్యాయం, బలమైన సంస్థలు (Peace, Justice and strong Institutions): మహిళల అసమాన నిర్ణయాధికారం ప్రతిస్థాయిలో అభివృద్ధిని దెబ్బతీస్తుంది. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, మానవ హక్కులకు సంబంధించిన ప్రభుత్వ కమిటీలలో కేవలం 18% మంది మహిళలు మాత్రమే అధ్యక్షత వహిస్తున్నారు.
17. లక్ష్యాల కోసం భాగస్వామ్యాలు (Partnerships for the Goals): వాతావరణ చర్యలతో సహా సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఆ యా దేశాల కట్టుబాట్లలో మహిళలకు తగినంత ప్రాధాన్యత లేదు. శీతోష్ణస్థితి లక్ష్యాలకు జాతీయంగా నిర్ణయించబడిన సహకారాల పనికోసం 190 దేశాలలో 64 దేశాలలో మాత్రమే మహిళలను కేటాయించారు.
ఆయా దేశాధినేతలు వాస్తవాలను వెలుగులోకి రానివ్వరు కాబట్టి ప్రతి లక్ష్యానికి సంబంధించిన నిజాలు వేరుగా ఉంటాయి! లింగ సమానత్వం, మహిళా సాధికారత సాధించడం అనే ప్రధానమైన లక్ష్యాలలో మిగిలిన 17 లక్ష్యాలూ ఒకదానితో ఒకటి అంతర్భాగంగా ఉంటాయి. బాలికల, మహిళల హక్కులను నిర్ధారించి, అన్ని లక్ష్యాలలో చేర్చడంద్వారా న్యాయం చేయగలుగుతామన్నారు. అందరికీ పని కల్పించడం ద్వారా మాత్రమే ఆర్థిక వ్యవస్థలను బలోపేతంచేసి భవిష్యత్తు తరాలకు మన భాగస్వామ్య వాతావరణాన్ని నిలబెట్టగలుగుతామని ఐక్యరాజ్యసమితి తేల్చిచెప్పింది.
ఆర్ధిక సంక్షోభాలు, ఆరోగ్య సంరక్షణ లోపాలు, వాతావరణంలో రోజురోజుకీ చోటు చేసుకుంటున్న మార్పులు, మహిళలపై హింస, ఇంధనం, ఆహార ధరల పెరుగుదలలు, యుద్ధ సంఘర్షణల కాఠిన్యం మహిళలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మహిళల విషయంలో మన కాలంలోని కొన్ని ముఖ్యమైన సవాళ్ళను ఎదుర్కోవడానికి లింగ సమానత్వ హక్కును నెరవేర్చాలని, దానినే ఉత్తమ లక్ష్యంగా ఎంచుకున్నామని ఐక్యరాజ్యసమితి 2015లోనే పేర్కొంది.
మహిళలకు సమస్యలను పరిష్కరించే ఆలోచనలు, నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. లింగవివక్ష వల్ల వారు ఎదుర్కొంటున్న వెనుకబాటుతనం మొత్తం ప్రపంచాభివృద్ధిని కూడా గణనీయంగా వెనక్కి నెట్టివేస్తుందని కూడా ఐక్యరాజ్యసమితి గమనించింది. అందువల్ల 2025లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఐక్యరాజ్యసమితి ‘‘బాలికలు – మహిళలందరికీ: హక్కులు, సమానత్వం. సాధికారత’’ అనే నినాదమిచ్చింది. కాబట్టి స్త్రీ-పురుష సమానత్వం సాధించగలిగితే మిగిలినవన్నీ వాటికి అనుబంధంగా సాధించగలుగుతారని ఐక్యరాజ్యసమితి భావిస్తుంది. మరి అది సాధ్యమేనా?
ఐక్యరాజ్యసమితి లక్ష్యాలన్నీ చాలా ఆశాజనకంగానే ఉన్నాయి. ఇవి తెలుసుకుంటున్నప్పుడు బోలెడు సందేహాలు వస్తాయి. మహిళల హక్కులను మానవ హక్కులుగా గుర్తించదలచుకుంటే పాలస్తీనాలో మహిళల్ని, ముఖ్యంగా సంతానోత్పత్తి వయసులో ఉన్న యువతుల్ని, పదేళ్ళకి పైబడిన బాలికల్ని, పసిపిల్లల్ని వేలాదిగా నిర్దాక్షిణ్యంగా చంపుతుంటే ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోలేకపోయింది? అనే ఆలోచన వెంటనే వస్తుంది. ప్రతి మనిషికీ ఉండే హక్కులు వారికి వర్తించవా? అనే అనుమానాలొస్తాయి.
మన సందేహాలకు సమాధానం ఆక్స్‌ఫామ్ నివేదికలో దొరుకుతుంది. 2024, జనవరి 14న దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక సదస్సు జరిగింది. ఆ సందర్భంలో ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తన నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఐదుగురి సంపద 2020 నుంచి రెట్టింపుకి పైగా పెరిగింది. ఇప్పుడిరకా ప్రతిక్షణం అంతులేకుండా పెరిగిపోతుంది. అదే సమయంలో 4.8 బిలియన్ల మంది (480 కోట్లు-అంటే జనాభాలో 60%) కటిక పేదరికంలో కూరుకుపోయారు. ప్రపంచంలోని ప్రతిఒక్కరూ పేదరికం నుంచి విముక్తమవ్వాలంటే 229 సంవత్సరాలు పడుతుందని ఆక్స్‌ఫామ్ అంచనా వేసింది. ‘‘ఈ అంతరాలను మేము గమనిస్తున్నాం. కోవిడ్, ద్రవ్యోల్బణం, యుద్ధాలు వంటి ప్రతికూల పరిణామాలతో కోట్లాదిమంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు బిలియనీర్ల సంపద అంతులేకుండా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఈ అసమానతలు యాధృచ్చికం కాదు. కార్పొరేట్ సంస్థలు ప్రజలందరి ప్రయోజనాలను ఫణంగా పెట్టి మరింత సంపదను తమకు అందజేయాలని కోరుకుంటున్నాయ’ని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాలన్నీ వాళ్ళకి మద్దతివ్వడంవల్ల ప్రపంచంలోని మూడువంతుల ప్రజల బాధలకు కార్పొరేట్ సంస్థల మితిమీరిన ఆశపోతు, ఆంబోతుతనాలే కారణమని తెలుస్తుంది!
ఐక్యరాజ్యసమితి అధ్యయనాల ప్రకారం, పేదరికంలో నివసిస్తున్న 1.3 బిలియన్ల ప్రజలలో 70% మంది మహిళలు. 40% పేద కుటుంబాలకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో మహిళలు 50 నుండి 80% వాటా కలిగి ఉన్నారు, అయితే వారు ప్రపంచంలోని భూమిలో 10% కంటే తక్కువ కలిగి ఉన్నారు!
మనుషులుగా మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అమలవుతున్నాయా?
ఇక మన భారత్ సంగతికి వస్తే, 1975లో ఐక్యరాజ్యసమితి మహిళలకు చట్టపరమైన రక్షణ, మహిళాభ్యుదయం, అట్టడుగు మహిళలకు నేరుగా మద్దతు, సహాయ సహకారాలందిస్తానని చేసిన ప్రకటనలో భారత్ సంతకం చేసింది. అందువల్ల మనదేశంలో జాతీయ మహిళా కమీషన్, స్త్రీల హక్కులు, రక్షణకి సంబంధించిన కొన్ని చట్టాలు వచ్చాయి! ఇప్పుడా చట్టాలన్నీ చట్టుబండలవుతూ కాగితాల వరకే పరిమితమవుతున్న విధానాన్ని మనందరం చూస్తున్నాం కదా?
దక్షిణాఫ్రికా, డర్బన్‌లో జాతివాదం, జాతి వివక్ష, జాతి వైముఖ్యం, అసహనం వంటి వాటికి వ్యతిరేకంగా జరిగిన ఐక్యరాజ్యసమితి ప్రపంచస్థాయి సదస్సులో, మనదేశంలో ప్రతి సామాజిక సమస్యకూ ‘‘హిందూమతం, బ్రాహ్మణులు, ఆర్యుల కుట్రలు’’ కారణమనే అంశాన్ని కార్యకర్తలు రూపొందించారు. ఇదీ మన వాస్తవపరిస్థితి! కుట్రలన్నీటికీ ఎక్కువగా బలయ్యేది మహిళలే, మరి ముఖ్యంగా పేద, అట్టడుగు, ఆదివాసీ మహిళలే! జాతుల వివక్షలకు ముస్లిం, క్రిస్టియన్ మతాలలోని పేదప్రజాలు. పాలకులకు గిట్టని ప్రతిపక్ష నాయకులూ, ప్రజాస్వామ్యంగా రాజ్యాంగాన్ని అమలు చేయమని అడిగే సామాన్య ప్రజలందరూ కమ్యూనిస్టులూ, అర్బన్ నక్సలైట్లే!
మహిళా ఉద్యమాల గత చరిత్ర గురించి చెప్పాలంటే పెట్టుబడిదారీ యుగంలో ప్రపంచంలో స్త్రీలకు సంబంధించి అంతర్జాతీయంగా చెప్పుకోదగిన వాటిలో ప్రధానమైనది మహిళా ఉద్యమం పుట్టుక. మానవ చరిత్రలో మొట్టమొదటిసారి శతాబ్దాల అణచివేతనుంచి విముక్తికోసం దిక్కులు పిక్కటిల్లేలా మహిళలు నినదించారు. సాధారణమైన శ్రామిక మహిళలు వందేళ్ళకు పైబడి అసాధారణమైన త్యాగాలకూ, కష్టనష్టాలకూ ఓర్చుకుని పోరాడిన కృషి ఫలితంగా ‘‘అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం’’గా స్థిరపడిరది.
ఉన్నత, ధనిక వర్గాల స్త్రీలు ‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’’ అంటూ అందాలపోటీలు, ముగ్గుల పోటీలు, సంగీత కచేరీలు, డి జె డాన్సులు, సన్మానాలు, ముగ్గుల పోటీలు, పూజలు మొదలైన నానా రకాల ఉత్సవాలకూ పరిమితం చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవపు అసలు స్ఫూర్తిని పల్చన చెయ్యడానికి ప్రయత్నిస్తుంటారు. వీటి వెనకాల పాలకుల మద్దతు ఉంటుంది. ఈ అశాస్త్రీయమైన అవగాహనపట్ల ప్రజాస్వామిక విలువలకోసం పరితపించే మనుషులందరూ, ముఖ్యంగా సంఘటిత, అసంఘటిత రంగాలలోని ఉద్యోగినులూ, శ్రామిక స్త్రీలూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చ్ 8 ఒక పోరాటదినమనే విషయాన్నీ, దాని చరిత్రనీ ప్రజాస్వామికంగా ఆలోచించే ప్రతి మహిళా తెలుసుకుని తీరాలి. ‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’’- ‘‘అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం’’, ఈ రెండిటికీ స్పష్టమైన తేడా ఉంది. మనం జరుపుకునేది స్పష్టమైన శ్రమజీవుల ‘‘పోరాట దినం’’. పాలకుల మద్దతుదార్లు జరుపుకునేది పట్టుచీరల గరగరలు, పిండి వంటలు, పాయసాలతో పండగలకు ఎంజాయ్ చేస్తాం చూడండి – అలాంటి హంగామా. ఈ రెండూ ఒక్కటి కానే కాదు!
పారిశ్రామికీకరణతో తలెత్తిన సంక్షోభం సమాజంలో గొప్ప కుదుపులకు కారణమైంది. ప్రాచీనయుగం, మధ్య యుగాల్లో ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలందరూ కట్టు బానిసలే! ద్వితీయ శ్రేణి పౌరులే! 1800 ప్రాంతాల్లో కడుపుకి తిండీ, కంటికి నిద్రా, ఒంటికి బట్టా తలదాచుకోవడానికి గూడూ లేక దుర్భరమైన పరిస్థితుల్లో మగ్గిపోయేవారు. మహిళలకు ఏ హక్కులూ లేని కాలమది. పిల్లలతో సహా పనిస్థలంలో 16 గంటల నుండి 18 గంటల వరకూ గంటల తరబడి పని చేసేవారు. వెట్టి చాకిరీ, అతి తక్కువ వేతనాలు, స్త్రీ-పురుష అసమానత్వం మొదలైన కారణాలతో నరక యాతనలు పడుతున్న మహిళలు గత్యంతరం లేని పరిస్థితుల్లో మార్పు కోసం గొంతెత్తడం మొదలెట్టారు.
మహిళా పోరాటాల నేపధ్యం
పోరాటాల గతంలోకి వెళితే 1820లో ఇంగ్లండ్‌లో ‘‘టైలరింగ్ మహిళల పోరాటం’’ చరిత్రలో మొదటిది. ఈ పోరాటం ఎన్నో దేశాల్లో ఎందరో మహిళలకు స్పూర్తినిచ్చింది.
ఆ రోజుల్లో ఇటలీ, పోలండ్, మెక్సికో, రష్యా మొదలైన చుట్టుపక్కల దేశాల ప్రజలు జీవిక కోసం అమెరికాకు వలస వచ్చేవారు. అలా వచ్చినవారిలో మహిళా కార్మికులు నూలు మిల్లులలో పని చేసేవారు. సోషలిస్టు పార్టీ ప్రేరణతో 1900 సంవత్సరంలో చికాగోలో మహిళలు ‘‘అంతర్జాతీయ దుస్తుల తయారీ మహిళా శ్రామికుల యూనియన్’’ స్థాపించుకున్నారు. ఈ యూనియన్ సారధ్యంలో మహిళలు గడ్డ కట్టుకుపోయే చలిలో నెలల తరబడి ఫ్యాక్టరీల ముందు ఆకలే కాదు, అవమానాలే కాదు, ఎన్నో చెప్పరాని నరక యాతనల కోర్చుకుని పికెటింగులు, సమ్మెలు చేశారు. లాఠీ దెబ్బలు తిని జైళ్ళకు వెళ్ళారు. సమాజం నుంచి హీనమైన, అవమానకరమైన, నిందారోపణలను ఎదుర్కొన్నారు. అయినా సరే, పట్టు వదలకుండా దృఢదీక్షతో వీరోచిత పోరాటాల బాటను వేసి ముందు తరాలకు వెలుగు దారులు పరిచారు. కొన్ని అపజయాలెదురైనప్పటికీ ఈ ఉద్యమ స్పూర్తితో 1908లో 15000 మంది మహిళలు తక్కువ పని గంటల కోసం, ఓటు హక్కు కోసం, మెరుగైన జీతాల కోసం న్యూయార్క్ నగర వీధులలో బ్రహ్మాండమైన కవాతు నిర్వహించారు. 1909లో అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ ఆదేశం మేరకు మొట్టమొదటి ‘‘నేషనల్ ఉమెన్స్ డే’’ను ఫిబ్రవరి 28న జరుపుకున్నారు.
1910లో 17 దేశాల ప్రతినిధులు జర్మనీ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన క్లారా జెట్కిన్ నాయకత్వంలో కోపెన్ హేగన్‌లో సమావేశమయ్యరు. ఆయా దేశాల్లోని మహిళల సమస్యలను చర్చించడానికి – డిమాండ్ల సాధన కోసం ప్రతి దేశంలో, ప్రతి సంవత్సరం ఒకే రోజున ప్రపంచ వ్యాప్తంగా ‘‘మహిళా దినం’’ జరుపుకోవాలని క్లారా ప్రతిపాదించారు. వివిధ యూనియన్స్, సోషలిస్ట్ పార్టీలు, ఉమెన్స్ క్లబ్బులకు చెందిన 17 దేశాలకు చెందిన 100 మంది ప్రతినిధులే కాక ఫిన్నిష్ పార్లమెంట్‌కి మొట్టమొదటిగా ఎంపికైన ముగ్గురు ప్రతినిధులు కూడా ఏకగ్రీవంగా క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఆమోదించారు. 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్, జర్మనీలలో మొదటిసారి మార్చ్ 19న ‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’’ జరుపుకున్నారు. ఒక మిలియన్‌కి మించి స్త్రీ-పురుషులు పని హక్కు కోసం, ఓటు హక్కు కోసం, పబ్లిక్ మీటింగులు పెట్టుకునే స్వేచ్చ కోసం, వివక్షని అంతం చెయ్యాలంటూ నినదిస్తూ, ప్రచారం చేస్తూ ఉద్యమించారు. వారం కూడా గడిచీ గడవక ముందే మార్చ్ 25న న్యూయార్క్‌లోని ‘‘ట్రయాంగిల్ స్క్వేర్’’ వద్ద అంతులేని దోపిడీ, పీడనలకు గురౌతున్న 140 మంది శ్రామిక మహిళలు పని ప్రదేశంలో బందీలైపోయి తప్పించుకునే వీలేలేక సజీవంగా అగ్నికి ఆహుతైపోయారు. ఈ భయంకరమైన సంఘటన లేపిన దుమారం మహిళా కార్మికుల లేబర్ లెజిస్లేషన్ మీదా, స్త్రీల పని పరిస్థితుల మీదా ప్రపంచం తన దృష్టిని పెట్టేలా చేసింది. స్త్రీల పని పరిస్థితుల మీదా ప్రపంచం తన దృష్టిని పెట్టేలా చేసింది.
1912లో ఆర్ధిక దోపిడీ (బ్రెడ్) పైనే కాకుండా మహిళలు ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక అణచివేత (రోజెస్) పైన కూడ పోరాడాలని గుర్తించిన స్త్రీలందరూ రొట్టెతో పాటు స్వేచ్చ కూడా కావాలంటూ ‘‘బ్రెడ్ అండ్ రోజెస్’’ (Bread and Roses) ఉద్యమాన్ని నడిపారు. దీనినే లారెన్స్ టెక్స్టైల్ సమ్మె అని కూడా ‘‘బ్రెడ్ అండ్ రోజెస్’’ ఇది 1912లో మసాచుసెట్స్‌లోని లారెన్స్‌లో ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ (Industrial Workers of the World) నేతృత్వంలో ఇటలీ నుంచి వలస వచ్చిన మహిళా శ్రామికులు చేపట్టిన సమ్మె. దీనిని ‘‘మూడు రొట్టెల కోసం సమ్మె’’ అని కూడా అంటారు. ‘‘బ్రెడ్ అండ్ రోజెస్’’ అనే ఒక ప్రసిద్ధ పదబంధాన్ని వాస్తవానికి సమ్మెకు ముందు, డిసెంబర్ 1911లో ‘‘ది అమెరికన్ మ్యాగజైన్’’లో ప్రచురించబడిన జేమ్స్ ఓపెన్‌హీమ్ (James Oppenheim) రాసిన కవిత నుంచి తీసుకుని ర్యాలీ కోసం వాడుకున్నారు. ‘‘శరీరాలతో పాటు హృదయాలు కూడా ఆకలితో ఉంటాయి. మాకు రొట్టె ఇవ్వండి, రొట్టెతో పాటు మాకు గులాబీలు కూడా కావాలి!’’ అని డిమాండ్ చేస్తూ లారెన్స్ నగర వీధుల్ని హోరెత్తించారు. గురి పెట్టబడిన తుపాకీకొనల్లో పదునైన బాకులు బిగించి నిలబడిన భీకరమైన సైన్యానికి ఎదురుగా బెదరని స్థిరచిత్తంతో నిలిచి శాంతియుతంగా పోరాడారు. 40 దేశాల మహిళలు అతి దారుణమైన గడ్డ కట్టే చలిలో రెండు నెలలు జనవరి నుంచి మార్చ్ వరకూ గొప్ప సంకల్ప బలంతో సమ్మె కొనసాగించి 8 గంటల పని హక్కునీ, ‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’’ నీ సాధించారు!
అప్పటినుంచి 1913 వరకూ ఫిబ్రవరి చివరి ఆదివారాన్ని ‘‘నేషనల్ ఉమెన్స్ డే’’ గా జరుపుకునే సాంప్రదాయాన్ని కొనసాగించారు.
Massachusetts militiamen with fixed bayonets surround a group of strikers ‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’’ మార్చి 8 నాడే ఎందుకు జరుపుకుంటున్నాం?
ఆ తరువాత 1917 అక్టోబరు విప్లవంలో కూడు, గూడు, గుడ్డ కోసం జరిగిన చారిత్రక ఉద్యమంలో ‘‘అలగ్జాండ్రా కొల్లాంటాయ్’’ నాయకత్వంలో మహిళలు చురుగ్గా పాల్గొన్నారు. 1917 యుద్ధ సమయంలోనే మహిళలు ‘‘ఆహారం – శాంతి’’ కావాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. రష్యాలో నికోలస్ జార్ 11 నిరంకుశ పాలనను కూల్చివేసి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన సోషలిస్టు సమాజంలో మహిళలకు ఓటు హక్కుతో పాటుగా అనేక రంగాలలో వారికి సమాన అధికారాన్ని కల్పించింది. మహిళలు సమ్మె ప్రారంభించిన రోజు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అత్యధిక దేశాలలో గ్రెగోరియన్ క్యాలెండర్ అమలులో ఉండడంవల్ల మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.
పోరాటాలు-యూనియన్లు పురుష ప్రపంచానికే పరిమితమైన ఆ రోజుల్లో అపజయాలన్నీ వారెదుర్కొని మనకి మాత్రం సౌకర్యాలను సాధించి పెట్టిన ఆ వీర వనితల సాహస పోరాట చరిత్రని మన ముందు తరాలకు అక్షరమక్షరం పొల్లు పోకుండా చేరవేయడానికి ప్రతిజ్ఞ తీసుకునే రోజు మార్చి8. ‘‘అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం’’ అంటే జరిగిన అభివృద్ధిని సమీక్షించుకుని సాధించవలసిన హక్కుల కోసం భవిష్యత్తు కార్యాచరణని చర్చించుకునే రోజు. ప్రపంచ వ్యాప్తంగా మన పోరాటాల ద్వారా ఐక్యరాజ్య సమితి స్త్రీలకు చట్టపరమైన రక్షణ, మహిళాభ్యుదయం, అట్టడుగు మహిళలకు నేరుగా మద్దతు, సహాయ సహకారాలందిస్తానని చెప్పేలా చేయగలిగాం. 1975లో ఐక్యరాజ్యసమితిలో భారత్ సంతకం చేసినందువల్లనే మన దేశంలో జాతీయ మహిళా కమీషన్, స్త్రీల హక్కులు, రక్షణకి సంబంధించి కొన్ని చట్టాలతో పాటు, కుటుంబ హింస చట్టం కూడా వచ్చింది.
సాధించిన విజయాలు: రష్యాలో మార్చి8 ని The Heroic Women Worker Day అని పిలుస్తారు. అనేక దేశాల్లో మార్చి 8ని సెలవు దినంగా ప్రకటించారు. జపాన్‌లో ప్రతి ఇంట్లో ఒక ‘‘Mother’s Room’’ ఉంటుంది. అంటే అమ్మకి కొంత స్పేస్ కావాలని గుర్తించేలా చేయగలిగాం. ఫిలిప్పీన్స్‌లో 97% మహిళలు ఉన్నత పదవులు సాధించారు. ఐస్‌లాండ్ మహిళలు 1975, అక్టోబర్ 24న పురుషులతో సమాన హక్కుల కోసం, సమాన వేతనాల కోసం, లింగ సమానత్వం కోసం బ్రహ్మాండమైన సమ్మె చేశారు. 90 శాతం మంది మహిళలు తమ ఉద్యోగాలను, ఇళ్లను వదిలి వీధుల్లో కొచ్చి పెద్ద ఎత్తున నినదించారు. దేశం మొత్తాన్నీ దిగ్బంధనం చేసి చేష్టలుడిగేలా చేశారు. పురుషులు కేవలం చూస్తూ భరించవలసి వచ్చింది. మరుసటి సంవత్సరం, పార్లమెంటు చట్టబద్ధమైన సమాన చెల్లింపును ఆమోదించింది. ఐదు సంవత్సరాల తరువాత ఐస్‌లాండ్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. ఫలితంగా ప్రపంచంలో మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఒక మహిళ ఎన్నికయ్యారు. ఇప్పుడైతే ఐస్‌లాండ్ ప్రపంచంలోని అత్యధిక లింగ సమానత్వం కలిగి ఉంది! ఇదంతా అభివృద్ధి అనుకుంటే ప్రపంచీకరణ దుష్ప్రభావాలు అన్ని దేశాల మహిళల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. రెండడుగులు ముందుకేస్తే అన్ని దేశాల ప్రభుత్వాలు ఢంకా బజాయిస్తాయి గాని ఏడడుగులు వెనక్కి పాతాళానికి కూరుకుపోవడాన్ని మసిపూసి మారేడు కాయ చేస్తాయి. మన ముందు తరాలవారు తమ త్యాగాలతో 8 గంటల పని దినం, వోటు హక్కు, ప్రభుత్వ రంగంలో స్త్రీ-పురుష వివక్ష లేని వేతనాలు – మొదలైన ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఎన్నో హక్కుల్ని సాధించి పెట్టారు. మన పిల్లల హయాంలో కొచ్చే సరికి ఒక్కొక్క హక్కునీ హరించేస్తున్నారు. ఇప్పటి యువతరం వాళ్ళకి వాళ్ళే ప్రాజెక్ట్ లంటూ, డెడ్ లైన్లంటూ అపరిమితంగా గంటలకి గంటలు (ఒక్కోసారి 16 గం., 18 గం. పైబడి కూడా పని చేస్తున్నారు). ‘‘వర్క్ ఫ్రం హోం’’ అంటూ పిల్లలే మురిసిపోతూ ఇంట్లో నుంచి పని చేస్తుంటారు. ఆఫీసులు కల్పించాల్సిన సౌకర్యాల నుంచి తెలివిగా యాజమాన్యాలు తప్పించుకుంటున్నాయని గుర్తించకుండా చేస్తుంది గ్లోబలైజేషన్. చదువుల్లో సామాజిక రంగంలో అంతరిక్షాన్ని అందుకోగలిగిన మహిళలు కుటుంబ హింసలో అధోగతి పాలవుతున్నారు. విమానయానంతో ప్రపంచాన్ని చుట్టివస్తున్నా ఉన్న ఊళ్ళో, సొంత వీధిలోనే, అసలింట్లోనే స్వేచ్చ లేక అలమటిస్తున్నారు.
సమాజంలో మహిళలకు రక్షణ లేని ఈ పరిస్థితిని మనం రోజూ పసిపాపల్ని అత్యాచారాలు చెయ్యడం దగ్గరనుంచి ఎన్నో ఘాతుకాలను గమనిస్తున్నాం. తలచుకుంటే చాలు గుండెలవిసిపోయే నిర్భయ అత్యాచారం, గర్భగుడిలో హత్రాస్ బాలిక అత్యాచారం-హత్య, కోల్కతా డాక్టర్ దారుణమైన హత్య చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని హీనమైన, నీచమైన అత్యాచారాలు కలవరపెడతాయి. ఇటీవల జరిగిన మణిపూర్ మహిళను నడివీధుల్లో నగ్నంగా ఊరేగిస్తూ చేసిన వికృత చేష్టలు ప్రపంచమంతా చూసింది. భారత్ పాలకుల పరువు పోయింది!
జీవితం పట్ల సున్నితమైన భావాలతో, భవిష్యత్తులో ఏవేవో సాధించాలనే అంతులేని ఆశలతో ఉండవలసిన యువకులకి ఇంత కరత్వం, ఇంత దాష్టీకం ఎక్కడనుంచి వచ్చింది? అసలు వాళ్ళకి ఈ హింసల నమూనాలెక్కడ నుంచి వచ్చాయి? అని ఆలోచించి గతంలోకి వెళితే కరడు గట్టిన హిందూత్వంలో కూడా హింసల మూలాలు దొరుకుతాయి. బృహదానంద ఉపనిషత్‌లో యాజ్ఞవల్క్యుడు అనే ఒక నీచ మానవుడు ‘‘బలాత్కారాన్ని పట్టించుకోవలసిన గంభీరమైన విషయం కాదని సెలవిస్తూ యవ్వనంలో
ఉన్న స్త్రీని పురుషులెవరైనా కామకార్యానికి కోరవచ్చు. ఆమె నిరాకరించినప్పుడు తాయిలం-లంచం ద్వారా వశపరచుకోవచ్చు. దానికీ లొంగకుంటే బెత్తంతో, పిడికిళ్ళతో కొట్టి లొంగదీసుకోవచ్చు’’ అని చెప్పాడు. తరతరాల నుంచి మనుస్మృతి మహిళలకు వ్యతిరేకమైన ఇలాంటి దరిద్రగొట్టు వ్యాఖ్యానాలతో ఉంటే, దాన్ని నరనరానా జీర్ణించుకుని తు.చ. తప్పకుండా ఆచరణలో పెట్టేవారు మనదేశంలో చాలా మందే ఉన్నారు. నిర్భయ విషయంలో రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు వస్తాయని తప్పుడు ఆరోపణలు చేసిన హిందూ ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపూ ప్రియశిష్యుడు నరేంద్ర మోడి ఆధ్వర్యంలో 2002లో జరిగిన ‘‘గుజరాత్ మారణకాండ’’ ఆదిపత్య భావజాలానికి పరాకాష్ట. వందలాది ముస్లిం స్త్రీలను నగ్నంగా రోడ్ల మీద పరిగెత్తించారు. భర్తల ఎదుటే కుటుంబ సభ్యులతోనే అత్యాచారాలు చేయించారు. గర్భంలో ఉన్న శిశువుని బయటికి లాగి త్రిశూలం మీద నిలిపారు. 15 ఏళ్ళ వయస్సున్న వందలాది బాలికలను ప్రభుత్వం నియమించిన రౌడీ మూకలు అత్యాచారం చేశారు. కాళ్ళూ – చేతులూ నరికి మంటల్లో వేశారు. ఆ బూడిద మీద మూత్రం పోశారు.
చతీస్ గఢ్, వాబాటి, హర్యానా, మణిపూర్, ఈశాన్య రాష్ట్రాలు, ఖైర్లాంజీ మొ. లైన చోట్ల, గ్రామాల్లో, కోర్టుల్లో, జైళ్ళలో, దేశావ్యాప్తంగా దళిత, ఆదివాసీ స్త్రీలు భూమికోసం, భుక్తి కోసం చేస్తున్న పోరాటాలను ప్రభుత్వం తుడిచి పెట్టేస్తుంది. మన రాష్ట్రంలో వాకపల్లిలో పదకొండు మంది అమాయక గిరిజన యువతులపై గ్రే హౌండ్స్ పోలీసులు అత్యాచారం చేశారు. ఇది స్వయంగా ప్రభుత్వమే చేయించింది. పోరాడే పురుషులైతే హత్య, స్త్రీలైతే-ఆ స్త్రీల మీద ప్రయోగించే దారుణమైన ఆయుధం అత్యాచారమే! మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అని లిప్ సర్వీస్ చేసే ప్రభుత్వం ఆచరణలో ఈ దేశంలో అట్టడుగు ఆదివాసీ మహిళలు ఇంకా మానవ హక్కుల నిర్వచనంలోకి రాలేదని ప్రభుత్వం నోటితో చెప్పకుండా చేతలద్వారా రుజువు చేస్తుంది. ప్రభుత్వాలు, మీడియా మహిళలు చేస్తున్న పోరాటాలను పట్టించుకోవు. కానీ స్త్రీల మీద ఎన్నెన్ని రకాలుగా, ఎంతెంత దారుణంగా భయానక హింసల్ని అమలు చేయవచ్చు అనే విషయాలు మాత్రం బిల్కిస్‌బానో రేప్ దుర్మార్గుల కందడమే కాదు దేశంలోని ప్రతిచోటా దుష్టులు చేస్తున్న లైంగిక దాడుల్లో ఈ నమూనాలు దావానలంలా వ్యాపిస్తున్నాయి!
1991లో ప్రపంచీకరణ తర్వాత సమాజంలో గతంలోలేని గొప్ప మార్పులు వేగంగా వచ్చాయి. నిజానికి ఈ తరం పిల్లల్ని అమ్మా – నాన్నా పెంచడం లేదు. టివి, సినిమా, మీడియా, ఇంటర్నెట్, సెల్ ఫోన్ ఇవన్నీ నిండిన విష సంస్కృతి పిల్లల్ని పెంచుతుంది. కార్పొరేట్ చదువుల పుణ్యమా అని మనిషితో సాటి మనిషి ప్రేమగా, దయగా, అభిమానంగా ఉండాలని చెప్పే సోషల్ సైన్స్, నైతిక విలువల్ని నేర్పే మోరల్ సైన్స్‌లు రద్దై పోయాయి. నీలిచిత్రాల వీడియో క్యాసెట్లతో, డివిడీలతో నగరాలన్నీ నిండిపోయాయి. బ్లూఫిల్ములు ఇబ్బడి ముబ్బడిగా అమ్మకానికి దొరుకుతున్నాయి. సెల్ ఫోన్‌లలో ఎక్కించే వ్యాపారం కూడా ముమ్మరమయింది. ఇక ఇంటర్నెట్ సంగతి సరే సరి! సామ్రాజ్యవాదుల విశృంఖల, విపరీత సెక్స్ సంస్కృతి ఇంటర్నెట్‌లో మురుగు కాలువల్లా జీవితమంతా చూసినా తరగనంతగా ప్రవహిస్తుంది. వెబ్‌లలో మొత్తం కోట్ల సంఖ్యలో నీలి సైట్లున్నాయి. సెకండ్స్‌లో అనేక వేలమంది ఈ సైట్లను వీక్షిస్తున్నారు. ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలను చూడడం వల్ల మానసికంగా శారీరకంగా అనేక సమస్యలు ఎదురవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నేరప్రవృత్తి పెరగడంతో పాటు స్త్రీ – పురుషుల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని మానసికవైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ సంస్థ భారత్‌లో ఎక్కువమంది ప్రధానంగా నెట్ సర్చ్‌లో సెక్స్ చూస్తున్నారని చెప్పింది. ఇరవై ఏళ్ళొచ్చే సరికి పిల్లలు అనివార్యంగా లక్షలకొద్దీ శృంగార సన్నివేశాలు చూసేస్తారు. పాలకులు అన్ని దిక్కుల నుండి గుప్పించే శృంగార పత్రికలు, పుస్తకాలు, రెండర్ధాల మాటలు, పాటలు, పబ్‌లూ, లైవ్ షోలు, రికార్డింగ్ డాన్సులూ ఇలా వరదలా టీనేజర్లనూ, యువతనూ ముంచెత్తుతున్నాయి. పాలకులు ప్రజలకు అలవాటు చేస్తున్న డ్రగ్స్, మద్యం మనిషిలోని విచక్షణ, మానవత్వం మరిచిపోయేలా చేస్తున్నాయి. అన్ని మతాలూ స్త్రీని ఒక భోగ వస్తువుని చేశాయి. జీవితంలో సుఖపడాలంటే రకరకాల వస్తువుల్ని స్వంతం చేసుకోమని మార్కెట్ వెర్రెక్కిస్తుంది. వాటితో పాటు మహిళల్ని కూడా రక్త మాంసాలు, ఆలోచనలున్న ఒక మానవజీవిగా గాక ఒక వస్తువుగా, సరుకుగా చూసే దుర్మార్గమైన పద్ధతి మన జీవనంలోకి వచ్చేసింది!
మనదేదో పరమ పవిత్రమైనట్లు పాశ్చాత్య సంస్కృతివల్ల మనవాళ్ళు చెడిపోయారంటాడొకడు. ఆడపిల్లలకు రకరకాల ఆంక్షలు విధిస్తూ మన సంస్కృతి, సనాతన ధర్మం గొప్పవని ఊదరగొట్టే రాజకీయ నాయకులు, గురువులకు స్వామీ వివేకానంద ‘‘అత్యున్నత లక్ష్యాన్ని చేపట్టండి. దాన్ని సాధించేందుకు మీ జీవితాన్నంతా ధారపోయండి’’ అంటూ ఉక్కు సంకల్పంతో, మంచి నడవడికతో యువకులు సమాజంలో తమ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పింది గుర్తురాదు. ఈ హితోక్తులు ఈ దేశంలో దుశ్శాసనులకి చెప్పరు. స్త్రీలను పూజించే దేశమని చెప్పుకునే చోట అమ్మాయిని చూసీ చూడగానే నింద్యంగా, హీనంగా దుర్భాషలాడే సంస్కృతి మన దేశపు యువత నోటివెంట ఎలా వస్తున్నాయి? అనే ఆలోచనలే రావు. ఎంతసేపూ యువకులు ఏంచేసినా సబబే అనే ధోరణిలో ఉంటారు. పూజలొద్దు హీనం గానూ చూడొద్దు మమ్మల్ని మనుషులుగా చూడమని మొత్తుకునే యువతుల మాటలు వినిపించుకోరు. యువకుల ఈ విపరీత ధోరణులు మన ఆధ్యాత్మిక గురువులకు తప్పనిపించడం లేదా? అవమానంతో పశ్చాత్తాప పడవలసింది పోయి బాధితురాలిపై బురద చల్లే వికారపు మాటలు మాట్లాడటానికి సిగ్గు వెయ్యడం లేదా? అశోక్ సింఘాల్, అభిజిత్ ముఖర్జీ, ఆశారాం బాపూ, అసూ ఆజ్మీ, మోహన్ భగవత్, బొత్స మొదలైనవారు తమ కారుకూతలతో బయటికి తెలిసిపోయారు. వీళ్ళు దొరికిన దొంగలు! నిజానికి పురుష లోకంలో అడుగడుగునా ఉన్న దొరకని దొంగల సంగతేమిటి? సామ్రాజ్యవాద సంస్కృతి పశ్చిమదేశాల్లో ముంచెత్తుతున్నప్పటికీ నిరంతర పోరాటాల ద్వారా అక్కడి స్త్రీలు లైంగిక స్వేచ్చను సాధించుకున్నారు. ఆడవాళ్ళు వాళ్ళ పనుల్ని బట్టి రాత్రుళ్ళు భయం లేకుండా తిరుగుతుంటారు. ఉదాహరణకి అమెరికాలో ఐదు నిమిషాలు ఒక స్త్రీ వంక ఏ పురుషుడైనా రెప్ప వెయ్యకుండా చూస్తే చట్టరీత్యా నేరం. జైలుకెళ్ళాలి. యువకులు 18 సంవత్సరాలకు ఒక తోడు వెతుక్కుంటారు. ఇందుకు తలిదండ్రుల నుంచి ప్రోత్సాహం కూడా ఉంటుంది. ఎవరి పార్ట్నర్‌తో వారు ఇష్టమొచ్చినట్లు ఉంటారు. అంతేగాని అసలెవరూ ఇతరుల వైపు కన్నెత్తి కూడా చూడరు. అభిరుచులు కలవకపోతే స్నేహపూర్వకంగానే విడిపోతారు. ఒకరి గతం గురించి మరొకరు నోరెత్తరు. మన దేశంలోలాగా వెకిలి చేష్టలు, కక్షలు పెంచుకుని చేసే యాసిడ్ దాడులు, హత్యలుండవు. వరకట్నాలు, డబ్బు కోసం పీడిరచడాలుండవు. పాశ్చాత్య సంస్కృతి అని అనవసరంగా నోరు పారేసుకునే మన ఆధ్యాత్మిక గురువులందరూ అక్కడి ప్రజలు సాధించిన ఈ సంస్కారం గురించి తెలుసుకోవాలి. మంచి ఎక్కడున్నా కనిపెట్టి ఆచరించవలసిందే! ‘‘మంచి గతమున ‘‘కొంచె’’ మేనోయ్’’ అన్న గురజాడ మాటను స్మరించుకుని మన సంస్కృతి, సనాతన ధర్మం ఎంత గొప్పవైనా ఈ స్పీడ్ యుగానికి పనికిరాని స్త్రీల బానిస మూలాలనన్నిటినీ వదిలెయ్యవలసిందే! ఎక్స్‌పైరీ డేట్ దాటిపోయిన మందులు విషంతో సమానం. చెత్తలో పారేస్తాం కదా, మనం అడుగడుగునా పాటించే ఈ మను సంస్కృతి కూడా అంతే!
‘‘వాడికొకటే ధ్యాస కృారత్వంలో కొత్త పద్ధతులెలా కనిపెట్టాలని నా తపన వేరు అత్యాచారాలనెలా అంతమొందించాలని’’ అని భగత్‌సింగ్ ఎప్పుడో చెప్పారు. ప్రజాస్వామ్యం అనేది లేనిచోట రక్షించాల్సిన పాలకులే సామ్రాజ్య వాదుల దళారీలైన చోట అన్యాయం, అరాచకం, దోపిడి మరిన్ని అత్యాచారాలు పెచ్చుమీరి పోతాయే తప్ప పరిష్కారాలుండవు. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చి పడుతున్న సమస్యలు పాత సమస్యలను మర్చిపోయేటట్లు చేస్తాయి.
స్త్రీలూ-పురుషులూ కలిసి సమాజంలో నైతిక విలువలు పెంపొందించడానికి ప్రయత్నించాలి. అది మన కుటుంబంలో బాలబాలికల్ని సమానంగా పెంచడం నుంచే మొదలవ్వాలి. కాస్త చదువుకుని ఉద్యోగాల్లో కొచ్చిన కుటుంబాల్లో పైకి చూడడానికి అంతా సజావుగానే కనిపిస్తుంది. కానీ కాస్త విమర్శానా దృష్టితో చూస్తే స్త్రీ-పురుషుల మధ్య అసమానతలు అడుగడుగునా కనిపిస్తాయి. అలా చూడాలంటే ముఖ్యంగా మహిళలు శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకోవాలి. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని తమ హక్కులేమిటో తెలుసుకోవాలి. ఆ హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉండాలి…
అత్యాచారాల్లో హింసల వెతలను అనుభవించేది మహిళలే కాబట్టి స్త్రీల జీవితాల వెనక ఉన్న అసలైన బూర్జువా రాజకీయాలను అర్ధం చేసుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తెలుసుకుని సహానుభూతితో స్పందించాలి. మనం ఒంటరిగా లేమని తెలుసుకోవాలి. ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్త్రీల వ్యతిరేక విధానాలకు ప్రపంచ వ్యాప్తంగా మహిళలందరి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చెయ్యాలి. ప్రపంచంలో ఏ మూల జరిగినా ప్రతి స్త్రీ విజయం మరొకరికి ప్రేరణగా ఉండాలి. మనం ఒకరినొకరు ప్రోత్సహించుకున్నప్పుడు మనం చాలా బలంగా ఉంటాం. మంచి ప్రయత్నాలకు అంతర్జాల సహాయం తీసుకోవచ్చు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉండడం ఏమో గానీ ప్రతి గొప్ప మహిళ వెనుక మరొక అద్భుతమైన మహిళ ఉంటుందనే నమ్మకంతో పని చేద్దాం! ప్రతి స్త్రీ ఇప్పడు తనను తాను కొత్తగా పునర్నిర్మించుకుంటుంది. మనం ఐక్యంగా ఉంటే సాధించలేనిదేమీ ఉండదు. ముందుగా స్త్రీ పురుష సమానత్వం మీద దృష్టి పెట్టి పోరాడదాం! స్నేహితులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!