వలస రాయలసీమలో మహిళా చైతన్యం – ఘట్టమరాజు

విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు (1509-1530) ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో చాలా భాగాన్ని తిరుగు లేకుండా పాలించి, ఒరిస్సాలోని గజపతుల్ని జయించి, సామంతుల్నిగా చేసుకున్నా, బహుమనీ సుల్తానులకు పక్కలో భల్లెమై కూర్చొన్నా, ఆ సాహితీ సమరాంగణ చక్రవర్తి అధీనంలో వున్న బళ్లారి, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు మాత్రమే ‘రాయలసీమ’అన్న పేరు ప్రసిద్ధం కావటం విచిత్రం.

భాషా రాష్ట్రాల ఆధారంగా రాష్ట్ర విభజన జరగడంతో బళ్లారి జిల్లా మైసూరు రాష్ట్రంలో కలిసి పోయింది. 1953 దాకా బళ్లారి జిల్లా రాయలసీమ అవిభాజ్య అంగంగానే వుండిరది. ఈస్టు ఇండియా కంపెనీ పాలనకాలంలో ఈ ఐదు జిల్లాలు ‘దత్తమండలాలు’ (సీడెడ్‌ డిస్ట్రిక్ట్స్‌)గానే చలామణి అయ్యాయి. అనంతపురంలోని నేటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా కాలం దాకా సి.డి. కాలేజీ (సీడెడ్‌ డిస్ట్రిక్ట్స్‌ కాలేజి) గానే పిలువబడిరది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమను రత్నాల సీమగా సాహిత్య చరిత్రకారులు వర్ణించారే కాని, వాస్తవంగా అది ఆయన పరిపాలనావధికే పరిమితం.
‘అంతూ ఇంతూ కుంతీ కొడుకులకు రాజ్యం దక్కలేదు’ (హాగూహీగూ కుంతీ మక్కళిగె రాజ్యవిల్ల) అన్న సామెత అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో వినపడే సామెత, ‘‘గలగలా గోదావరి కదిలి పోతుంటేను/బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి’’ అని తెలుగుతల్లి మెడలో మల్లెపూదండ – వేసిన రాయలసీమ కవి శంకరంబాడి సుందరాచారి చెప్పిన మాటలు కోస్తా జిల్లాలకే వర్తిస్తాయి. కాని రాయలసీమకు వర్తించవు. రాయలసీమలో వున్న పెన్నానది – పినాకిని నది-జన్మకో శివరాత్రి అన్నట్లు ఎన్నేళ్లకో గాని నిండేది కాదు. ఎప్పుడో ఓసారి నిండితే, వరదలు వచ్చి మనుషులూ కొట్టుకు పోతారు, పసరాలూ ప్రాణాలు పోగొట్టుకొంటాయి. అందుకనే సీమలో ఈ పినాకినీ నదిని ‘పీనుగుల పెన్న’ అని కూడా పిలుస్తారు. ఇంతకీ చెప్పవచ్చింది ఏమిటంటే రాయలసీమ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడ్డ ప్రాంతం అని నొక్కి చెప్పడమే. ఈ వెనుకబాటు తనానికి గల కొన్ని కారణాల్ని ప్రఖ్యాత విమర్శకులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారిలా పేర్కొన్నారు. ‘‘ఆంగ్లేయుల దొరతనములో ఈ సీమ యెన్ని విధముల ఎండవచ్చునో అన్ని విధములను ఎండినది, ఎంటింపబడినది. ప్రజల పరవశత, అధికారుల అలక్ష్యము, ఇరుగుపొరుగుల వారి స్వార్థపరత, వీనికి తోడు దైవము దయతప్పుట ఇన్ని కలిసి నేటి రాయలసీమ రూపుగొన్నది. మరి ఆంధ్రులే అధికారము అవకాశము గలిగినప్పుడు గూడ ఈ సీమ యోగక్షేమములను గమనిపలేదు సరిగదా, మీదు మిక్కిలి ఇది రాళ్ళసీమయని అరణ్యమని, ఇక్కడివారికి చదువుసంతలు’ లేవని, వారు అనాగరకులని పరిహాసమును, ఆక్షేపమును జేసినవారును కొందరుండిరి. నేడును లేకపోలేదు. (విద్వాన్‌ విశ్వం గారి ఖండకావ్యం ‘పెన్నేటి పాట’ (1956)కు పీఠిక)
రాయలసీమ అభివృద్ధి చెందక పోవడానికి ఇన్ని ప్రబలకారణా లుండగా అక్కడి ప్రజల్లో చైతన్యం ఎలా వుంటుంది? జడత్వమే, అమాయకత్వమే, అజ్ఞానమే వాళ్లల్లో గూడుకట్టుకొని వుంటాయి కదా? రాయలసీమ లోని పురుషుల్లోనే చైతన్యం లోపించినప్పుడు, ఇక స్త్రీలల్లో దాన్ని ఎలా చూడగలం?
ఈ ముఖ్యమైన విషయం గురించి, అటు సాహిత్య, చరిత్ర కారులు కాని, ఇటు సాంఘిక, రాజకీయ చరిత్రకారులు కాని స్పర్శించనప్పుడు యువవిద్వాంసులైన డా.షేఖ్‌ మహబూబ్బాషా‘ వలస రాయలసీమలో మహిళా చైతన్యం’ అనే లోతైన అధ్యయనం, నిశితమైన అనుశీలన, శక్తిమంతమైన భాష, స్పష్టమైన శైలి ప్రదర్శించే పుస్తకం రాశారు.
‘వలస రాయలసీమలో మహిళా చైతన్యం’ అనే సుదీర్ఘ వ్యాసం మొదట హైదరాబాద్‌ నుండి ఎన్‌. వేణుగోపాల్‌ సంపాదకత్వంలో వెలువడే ‘వీక్షణం’ మాసపత్రికలో 2021 జనవరి నుండి ఏప్రిలు దాకా నాలుగు నెలలపాటు ధారావాహికంగా వెలువడిరది. ప్రబుద్ధ పాఠకుల ప్రీతివిశ్వాసాల్ని చూరగొన్న ఈవ్యాసాన్ని ‘వీక్షణం’ డిసెంబరు 2021లో పుస్తకరూపంలో ప్రచురించడం గమనార్హం.
షేక్‌ మహబూబ్‌ భాషా ఢల్లీిలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి 2000లో యమ్‌.ఏ. చరిత్ర పట్టా విజయవంతంగా సాధించారు. ఆయన ‘ఆంధ్రప్రదేశ్‌’లో మహిళా చైతన్యానికి దోహదం చేసిన తెలుగు మహిళా పత్రిక ‘గృహలక్ష్మి’ (1928-42) అనే అంశంపై పరిశోధన సాగించి 2002లో జె.నె.యూ నుంచి యం.ఫిల్‌. డిగ్రీ సంపాదించారు. తర్వాత ‘‘తెలుగు పత్రికల్లో (1902-60) వినిపించిన మహిళా స్వరాలు’’ అనే అంశం మీద దిగ్గజ విద్వాంసులైన ఆచార్య ఇందీవర్‌ కామ్టేకర్‌, ఆచార్య ఆర్‌. మహాలక్ష్మి గార్ల పర్యవేక్షణలో శ్రమించి 2016లో ప్రసిద్దమైన జె.ఎన్‌.యూ నుంచే పిహెచ్‌.డి. పట్టా స్వీకరించారు. రాయలసీమ కోస్తా ప్రాంతాలతో పోలిస్తే ఆర్థికంగా, సాంఘికంగా వెనుక పడినంతగా సాంస్కృతిక రంగంలో వెనుకంజ వేయలేదన్న సంగతిని మనం మరువరాదు. తీరాంధ్రుల్లో చాలామంది రాయలసీమ చరిత్ర సంస్కృతుల్ని నిరాదరించినా, రాయలసీమ వాసుల మాటా మంతీని వెక్కిరించినా కొంతమందైనా సంస్కారవంతులు కొనియాడిన, గుర్తించి, గౌరవించిన సందర్భాలు లేకపోలేదు. సర్కారు ప్రాంతాల్లో పుట్టిపెరిగినా, అనంతపురం ప్రభుత్వ కళాశాలలో కొంతకాలం తెలుగు శాఖాధిపతిగా పనిచేసిన డా. నండూరి రామకృష్ణమాచార్యులు రాయలసీమతో మమేకమై మనసారా రాసిన ఈ మాటలు ఎంతో విలువైనవి –
‘‘క్షామము దాపురించి పలుసారులు చచ్చెను. జంతు సంతతుల్‌
వేమరు చచ్చినారు ప్రజ వేనకువేలు చరిత్ర లోపలన్‌
క్షామము లెన్నివచ్చిన రసజ్ఞత మాత్రము చావలేదు జ్ఞా
నామృత వృష్టికిన్‌ కొరత నందని రాయలసీమ లోపలన్‌’’
ఈ ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలలు పట్టణ ప్రాంతాల్లోనూ, పల్లెప్రదేశాల్లోనూ విద్యాప్రసారం చాలా తక్కువగా వుండిరది. అలాంటప్పుడు ఇంటి నాలుగ్గోడలకే పరిమితమైన ఇల్లాండ్రకూ, కన్యలకూ, ఆడపిల్లలకూ చదువు సంధ్యలూ చాలా తక్కువే. అక్షర జ్ఞానమే లేకపోతే. అతివల్లో చైతన్యం వచ్చేదేలా? అజ్ఞానాంధకారంలో మగ్గిపోతున్న రాయలసీమలోని మహిళల్లో జాగృతి ఎలా కలిగిందో, ఎవరివల్ల కలిగిందో. ఎప్పుడు కలిగిందో అమ్మమ్మలనాటి కథల్ని తవ్వితలకెత్తే ఘనప్రయత్నం చేశారు డా. షేఖ్‌ మహబూబ్‌ బాషా.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 20వశతాబ్దపు ప్రారంభంలో ఆంధ్ర స్త్రీల్ని ఒక గొడుగు కిందకు తెచ్చి, వాళ్ల సమస్యల్ని గుర్తించి, పరిష్కారమార్గాలు వెదికి, వాళ్ల అభ్యుదయం కోసం సమిష్టిగా పోరాడాలని నిశ్చయించుకొన్న మహిళలు కొందరు 1910 జూన్‌ 2వ తేదీన గుంటూరులో ప్రథమ ఆంధ్ర మహిళా మహాసభ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మహాసభ 14వ వార్షిక సదస్సు 1939 డిసెంబరు 16-17 తేదీల్లో రాయలసీమలోని కడప పట్టణంలో జరిగింది. ఆ మహాసభ అహ్వాన సంఘ అధ్యక్షురాలి హోదాలో కడప రామసుబ్బమ్మ చేసిన ప్రారంభోపన్యాసం భూమికగాడా. షేఖ్‌ మహబూబ్బాషా ఈ సుదీర్ఘ వ్యాసాన్ని రాశారు. అధ్యక్షోపన్యాసం కావించిన ప్రఖ్యాత సంఘసేవకురాలు శ్రీమతి బేగం అమీరుద్దీన్‌ గారి అభిప్రాయాల్ని లోతుగా పరిశీలించి డా. షేఖ్‌ మహబూబ్‌ బాషా సిద్ధపంచిన ప్రబుద్ధ పరిశోధనా వ్యాసమే ‘వలస రాయలసీమలో మహిళా చైతన్యం’.
‘ఈపుస్తకంలో తీరాంధ్ర ప్రాంతాల్లో మహిళాచైతన్యం విస్తృతంగా వ్యాపించినా, ఆ దిశలో రాయలసీమ ఏమాత్రం వెనుకపడ లేదని వ్యాసకర్త సాధికారంగా నిరూపించారు. రాయలసీమలో మహిళా చైతన్యం కోస్తా ప్రాంతాలంత ఉధృతంగా కాకున్నా చాలా చోట్లు మెలమెల్లగా నైనా విస్తరించిందన్న విషయాన్ని పేర్కొన్న చరిత్రకారులైన డా. పి. యానాదిరాజు, డా. వై. వైకుంఠం, డా.జి. రమాదేవి, ఏ. రామాంజులురెడ్డి పరిశోధనలు గమనార్హాలు. అయితే డా.షేఖ్‌ మహబూబ్‌ బాషా తెలుగు మహిళా పత్రికలు రాయలసీమలో స్త్రీ చైతన్యాన్ని రగిలించి, పెంపొందించాయో ఈ పుస్తకంలో తేటతెల్లం చేశారు.
ఆంధ్ర రాష్ట్ర మహిళా మహాసభ ప్రారంభోత్సవ ఉపన్యాసం (16-12-1939)నాడు ఆహ్వాన సంఘ అధ్యక్షురాలిగా కడప రామసుబ్బమ్మగారు దిటవుగా ప్రసంగించారు. ఆమె ప్రస్తావించిన విషయాల్ని ఈవిధంగా ఉల్లేఖించవచ్చు.
1 భారతదేశం పురోగతి సాధించాలంటే బ్రిటిషు ప్రభుత్వం స్త్రీలకు నిర్భంధ ఉచిత విద్యాసౌకర్యాలు కల్పించాలి.
2. మహిళల సర్వతోముఖాభివృద్ధికిగాను ప్రభుత్వం ప్రత్యేక నిధుల్ని కేటాయించాలి.
3. ఆడవాళ్లకు మగాళ్లతో పాటు.సమానంగా హక్కుల్నీ, ఉద్యోగాల్నీ. స్వాతంత్య్రాన్నీ ఏర్పాటు చేయాలి.
చేసిన కడప రామసుబ్బమ్మగారు ప్రభుత్వం వనితాభివృద్ధికి ఉదారంగా ప్రత్యేక నిధుల్ని కేటాయించాలన్న ప్రతిపాదననుడా. షేక్‌ మహబూబ్‌ బాషా ‘‘అప్పటికీ, ఇప్పటికీ కడప నల్లరాయి లాంటి గొప్ప ఆలోచన’’ (పేజి: 31) అని అన్నారు. శ్రీమతి కడప రామసుబ్బమ్మ నేటికి 95 ఏళ్ల కిందటే ఈ మాటఅన్నారంటే. ఆమె ధీశక్తిని మెచ్చుకోవాల్సిందే.
ఢంకా బజాయించి ఈ విధంగా చెప్పారు – ‘‘స్త్రీలకు సాంఘికముగా, ఆర్థికముగా, రాజకీయముగా స్వాతంత్య్ర ముండిన గాని ఏ దేశమును అత్యున్నత పదవి నందజాలదు. స్త్రీల కెక్కువ స్వాతంత్య్ర ముండకూడదను కొందరు స్వార్థపరాయణుల తలంపొక దురూహ. స్త్రీ స్వాతంత్య్రము సర్వతోముఖముగ – సాగుట బట్టి రష్యా దేశమిపుడు అధోగతి పాలైనదని ఎవరు చెప్పగలరు? మొన్నటి వరకు పరదాలలో నుండి స్వాతంత్య్ర భేరి మ్రోగించిన స్త్రీ జన మహిమచే టర్కీ దేశమిపుడు. ప్రపంచమున నొకింత తలయెత్తి తిరుగగల్గినది. స్త్రీ స్వాతంత్య్ర శక్తి మూలముననే కదా, కేవలము – దుర్బలమని యనబడుచుండిన చీనా దేశమిప్పుడు జపాను పశుబలమును నెదుర్కొన గలిగినది. కాన స్త్రీ జన స్వాతంత్య్య్రము సర్వశ్రేయోదాయక మనుట నిర్వివాదాంశము’ (పేజి:33)
కడప రామసుబ్బమ్మగారు కొందరు స్త్రీలు ప్రతిపాదించి, సమర్పించిన విడాకుల బిల్లు పట్ల తమ వ్యతిరేకతను ఇలా వెల్లడిరచారు – ‘‘దుస్సహ ములగు దాంపత్యము లచ్చటచ్చట మన దేశములో నుండకబోవు. కాని పాశ్చాత్య దేశములతో పోల్చి చూచిన వీటిసంఖ్య అత్యల్పము. వీటి నెదుర్కొనుటకై కళంక పూరితమగు దాంపత్య శాంతి భంగమునకు తోడ్పడు విడాకుల చట్టము వంటి దారుణాస్త్ర ప్రయోగము కేవలము కొరివితో తలగోకి కొనినచందమగును.’’ ఈ మాటలు రామసుబ్బమ్మ గారి వెనుక చూపునే చాటుతాయి. కాని స్త్రీల పురోగతికి ఏమాత్రం దోహదకారి కాదు దీన్ని గ్రంథకర్త ‘‘ఆమెలోని డోలాయమాన స్త్రీవాదానికి ప్రబల తార్కాణంగా’’ (పేజి: 4) పేర్కొన్నారు.
ఆంధ్రరాష్ట్ర మహిళా మహాసభ 14వ వార్షిక సదస్సులో అధ్యక్షోపన్యాసం చేసిన బేగం అమీరుద్దీన్‌గారు స్త్రీ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలనీ, స్త్రీ వయోజన విద్య అత్యవసరమనీ, బహుభార్యాత్వ విధానాన్ని రూపుమాపటానికి స్త్రీలు కంకణం కట్టుకోవాలనీ ప్రబోధించారు. బాల్య, వృద్ధ వివాహాల్ని నిరసించారు. ఆడపిల్లలకు 16 ఏళ్లు వచ్చే దాకా పెళ్లి చేయకూడదన్నారు. బాల్య వివాహాలపై బ్రిటిషు ప్రభుత్వం చేసిన శారదా చట్టం గురించి గ్రామీణా ప్రదేశాల్లో ఎక్కువగా ప్రచారం చేయటం అవసరమన్నారు. వితంతువుల స్థితి కష్టతరంగా వున్నా, పేద విధవల స్థితి మరీ దారుణంగా వుందనీ, వితంతు శరణాలయాలు తామరతంపరగా నెలకొల్పబడాలనీ చెప్పారు. బేగం అమీరుద్దీన్‌ సాహిబాగారు పట్టణాల్లోనూ, తాలూకా కేంద్రాల్లోనూ ప్రసూతి గృహాల్ని నిర్మించాలనీ దీనికి గాను ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా కృషి చేయాలన్నారు. హిందూ ముస్లింలు ద్వేషాన్ని మాని సోదరభావంతో మెలిగితేనే సంఘం ప్రగతి సాధిస్తుందనీ చెప్పారు. బేగం అమీరుద్దీన్‌గారు ఉర్దూలో ప్రసంగిస్తూ మహమ్మదీయ స్త్రీలకు పురుషులు నిష్కారణంగా ఇచ్చే తలాక్‌ విధానం ప్రాణ సంకటమైనదని అన్నారు. కడపలో రెండు రోజుల పాటు జరిగిన ఆంధ్ర మహిళా మహాసభ 14వ వార్షిక సమావేశంలో చాలా మంది స్త్రీలు వివిధ విషయాలపై చక్కని ఉపన్యాసాలిచ్చారు. ఈ సభలకు హిందూ స్త్రీలతో పాటు మహమ్మదీయ, క్రైస్తవ మహిళలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో పాల్గొనటం విశేషం.
డా. షేఖ్‌ మహబూబ్బాషా రాసిన ‘వలస రాయలసీమలో మహిళా చైతన్యం’ 37పేజీల పెద్ద వ్యాసం, పోతే, అంత్యసూచికలు 22 పేజీలు. మూల వ్యాసంలో రచయిత ఎంత విలువైన సామగ్రిని పాఠకులకు అందించారో, అంతకంటే అమూల్యమైన విషయ వివరణల్ని వ్యాసం చివర్లో మన ముందుంచారు. డా. బాషా గారు ‘అంత్యసూచికలు’ లో ఉల్లేఖించిన తెలుగు మహిళా చైతన్యం, ఆంధ్రుల సాంఘిక చరిత్రలోని వివిధ అంశాలపై వెలువడ్డ ఇంగ్లీషు పరిశోధనా గ్రంథాలు కొన్నింటినైనాతెలుగులోకి అనువదించాల్సిన అవసరం చాలా వుంది. చరిత్ర పరిశోధన పకడ్బందీగా వుండాలంటే ఈ చిన్ని పుస్తకం కొండంత ఉపయోగపడుతుంది.
(వలస రాయలసీమలో మహిళా చైతన్యం. రచయిత: డా. షేఖ్‌ మహబూబ్‌ బాషా. ఫోన్‌ :9160579706, ప్రతులకు: వీక్షణం. మైత్రీ రెసిడెన్సీ. 3-6-394, స్ట్రీట్‌ నం-3, హిమాయత్‌ నగర్‌, హైదరాబాద్‌-500029. – ప్రముఖ పుస్తక కేంద్రాలు)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.