చాలా తెలివైనది తాను. మొదటిసారే మెడిసిన్ సీటు కొట్టేస్తాననుకుంది. రాలేదు. డొనేషన్లు కట్టి చదివించేంత స్థితిలో తల్లిదండ్రులు లేరు. తనకన్నా తక్కువ తెలివైన వాళ్ళు సీటు తెచ్చుకునో, డొనేషన్లు కట్టో మెడికల్ కాలేజీలో చేరితే… తాను చేరలేకపోయినందుకు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించింది.
నిజంగా సుష్మ అప్పుడు రాకపోయుంటే అంత పనీ జరిగేదేమో! ఏ మాటైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుందది. ‘‘మెడిసిన్ సీట్ రావాలంటే తెలివి తేటలొక్కటే సరిపోవు. హార్డ్ వర్క్ కూడా చెయ్యాలి. లాంగ్ టర్మ్ చెయ్. మనసు పెట్టి చదువు, సీట్ తెచ్చుకో,’’ అని ధైర్యం చెప్పాక మనసు కాస్త కుదుటపడి, లాంగ్ టర్మ్ లో జాయిన్ అయింది. అక్కడందరూ తనలాంటి వాళ్లే. మెడిసిన్ లో సీటు తెచ్చుకోవాలనుకుంటున్నవాళ్లే.
రోజులు గడుస్తున్న కొద్దీ… చదివిందే మరలా, మరలా చదవడం బోరనిపిస్తుంటే, నెమ్మది నెమ్మదిగా, తర్వాత ఏమిటనే విషయంలో ఆలోచనలు మారుతున్నాయి. ‘‘అబ్బా ఎన్నిసార్లు చదువుతాం?’’
‘‘ఇప్పుడు మెడిసిన్ కన్నా బయోటెక్నాలజీకి మంచి ఆప్షన్స్ వున్నాయట తెలుసా?’’
‘‘ఈసారి సీటు రాకపోతే డిగ్రీలో జాయినై సివిల్స్‌కి ప్రిపేరవుతాను’’.
‘‘జీవితాన్ని ఎంజాయ్ చెయ్యకుండా, పది పదిహేనేళ్లు, మెడిసిన్ యెవడు చదువుతాడే బాబు? నేనైతే చస్తే చదవను. ఏదో మా పేరెంట్స్ బ్రతిమలాడారని గాని…’’ ఇలా రకరకాల అభిప్రాయాలు భోజనాల వేళ. ఈసారీ సీటు రాలేదు. మొదటిసారంత బాధనిపించలేదు. చాలా ఆప్షన్స్ వున్నాయన్న ధైర్యం. డిగ్రీలో జాయినయింది. అక్కడ కూడా… ‘‘పెళ్లి సంబంధాలొచ్చినప్పుడు, డిగ్రీ చేశానంటే దర్జాగా వుంటుందని జాయినయ్యానంటూ’’ కొందరు. ‘‘ఇప్పుడు కాకపోతే యింకెప్పుడు ఎంజాయ్ చేస్తామంటూ’’ కొందరు. ‘‘మెడిసిన్లో సీటు రాలేదు. ఇక్కడైనా బాగా చదువుకోవాలని’’ కొందరు. వీళ్లల్లో కూడా కాలం గడుస్తున్న కొద్దీ, చదువులో సీరియస్ నెస్ తగ్గిపోతుంది.
అందరి మాటలూ వింటుంటే తనలో కూడా నెమ్మది నెమ్మదిగా చదువు మీద శ్రద్ధ తగ్గిపోతూ… జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలనే తాపత్రయం పెరిగిపోతూ… చాలామంది అర్ధరాత్రి వరకూ పార్టీలని ఎంజాయ్ చేస్తూ, నవ్వుతూ తుళ్లుతూ ఉంటే… వారిలా ఉండాలని… తనలోని ఏదో… అడ్డు చెప్తుంటే… వారిలా ఎంజాయ్ చెయ్యలేక… తనమీద తనకే కోపం, చిరాకు. కాని అప్పుడప్పుడూ, పేపర్లలో పడే… ‘పుట్టినరోజు వేడుకలకని వెళ్లి, అత్యాచారానికి గురైన యువతులు’, ‘ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు’, ‘వీడియోలు తీసి బెదిరిస్తున్న యువకులు’- ఇటువంటి వార్తలను వింటున్నప్పుడు… తను చేస్తున్నది కరెక్టేనని… ఇలా విరుద్ధ భావాలతో… అర్ధరాత్రి కార్లలో దిగే వాళ్లను చూసి ఒక పక్క భయం. ఇంకొక ప్రక్క జీవితాన్ని ఎంజాయ్ చెయ్యడంలో వాళ్లే కరెక్టేమోనని… వాళ్లలా వుండలేక, అలా వుండాలనే కోరికను ఆపుకోలేక… ఒకవేళ ఏమైనా జరిగితే, అప్పుడెలా? ఆడ, మగ కలిస్తే యేమీ జరగదా? జరిగే అవకాశం ఉన్నప్పుడు వాళ్లంతా ఫ్రీగా యెలా తిరుగుతున్నారు? ఏమైనా వాడుతున్నారా? ఒక్కసారి కలిసినా జరిగే అవకాశముందా? అన్నటువంటి ప్రశ్నలు మెదడును తొలిచేస్తున్నాయి. ఎవరిని అడగగలదు? అడిగితే నిజం చెప్తారా?
అందుకని మెడిసిన్ చదువుతున్న సుష్మ దగ్గరికి వచ్చింది. వచ్చిందే కాని సుష్మకి అనుమానం రాకుండా యెలా అడగాలి? ‘‘ఏమిటే అంత డీప్‌గా ఆలోచిస్తున్నావు? ఏమైనా ప్రేమాయణంలో పడ్డావా?’’ సూటిగా అడిగేసింది సుష్మ. ‘‘అదేం లేదు. చిన్న సందేహం. ఆడ, మగ ఒక్కసారి కలిస్తే గర్భం వచ్చే అవకాశముంటుందా?’’ అన్న లావణ్యను సందేహంగా చూసింది సుష్మ. సుష్మ ముఖ కవళికలు చూశాక, ఇటువంటి ప్రశ్నలు ఒకరినొకరు ఎందుకడగరో అర్థమైంది. స్నేహితురాలే తననంత అనుమానంగా చూస్తుంటే… వేరే ఎవరైనా అయితే? దిద్దుబాటు చర్యగా ‘‘నువ్వనుకుంటున్నదేమీ కాదు. మా ఊర్లో, మొదటి రాత్రి జరిగాక, మిలటరీకి వెళ్లిపోయిన భర్త, ఆరునెలల తర్వాత వచ్చి, గర్భవతిగా ఉన్న భార్యను చూసి, భార్య క్యారెక్టరుని అనుమానిస్తే, తనేమీ తప్పు చెయ్యలేదని భార్య… అలా గొడవలు జరుగుతుంటే… విషయం తెలుసుకుందామని…’’ తనది కట్టు కథని సుష్మ గ్రహించిందా? ‘‘ఈ సృష్టి చాలా అద్భుతం. ఒక్క అండం కోసం కొన్ని వేల శుక్రకణాలు పోటీ పడతాయి. అందులో ఒక్కటి మాత్రమే విజయం సాధిస్తుంది. ఆ ఒక్క శుక్రకణం అండాన్ని చేరితే చాలు, పిండమై శిశువుగా రూపుదిద్దుకుంటుంది. స్త్రీ పురుషులు కొన్ని వందలసార్లు కలిసినా ఆ అండం, శుక్రకణం తారసపడకపోవచ్చు. అవి తారసపడిన ఆ ఒక్క క్షణం చాలు, శిశువుకు జన్మనివ్వటానికి. అద్భుతం కదా!’’ తన్మయత్వంగా అంటూ అసలు ‘‘నీకో విషయం చెప్పనా’’ అని ఆగిపోయి ‘‘వద్దులే! నీకింకా పెళ్లి కాలేదు కదా!’’ అనేసింది సుష్మ.
తన సందేహం దీనికి అర్థమయిందా లేదా? తను అడిగిందేమిటి? ఇది చెప్తున్నదేమిటి? తన సందేహం తీరక చిరాకు పడుతూ ‘‘నీకూ పెళ్లవ్వలేదు కదా!’’ అంటే, ‘‘నాకు పెళ్లవ్వకపోయినా నేను మెడిసిన్ చదువుతున్నాను. నేనన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది’’ కొంటెగా అందది. ఒక్కసారి కలిస్తే గర్భమొచ్చే అవకాశముందా అన్న తన సందేహం తీరలేదు. ‘‘మగవాళ్ళు అర్ధరాత్రి వరకూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆడవాళ్ళకే యేమిటో ఈ ఆంక్షలు?’’ నిట్టూర్చాను. మనమూ వాళ్లలాగే ఎంజాయ్ చెయ్యొచ్చు కదా! అడ్డంకేమిటన్న తన మనసులోని మాట అర్థమైందో యేమో! తనతో పాటు మంచం మీద దొర్లుతున్న సుమ లేచి కూర్చుని, ‘‘ఎందుకంటే, మగవాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి’’ అంటూ ఒక్క ముక్కలో తేల్చేసింది. ప్రెగ్నెన్సీ అన్నమాట వినగానే ఉలిక్కిపడ్డాను. ఆ బ్యాచ్‌లో తిరిగే తన క్లాస్మేట్ ఒకమ్మాయి వారం రోజులు క్లాసుకు రాకపోయేసరికి గుసగుసలు, ఆ అమ్మాయి వచ్చాక అర్థవంతంగా ఒకరినొకరు చూసుకుంటూ కనుబొమలు ఎగరవేయడం… ఆమె ఎదురుగా వాళ్లేమీ అనకపోయినా, యే దృష్టితో ఆమెను చూశారో అర్థమవుతూనే వుంది. అమ్మో! ‘‘ఇంకో విషయం చెప్పనా! ఇలా తిరిగే వాళ్ళకు, సుఖ వ్యాధులు కూడా వస్తాయి. మగవాళ్ళ విషయాన్ని పక్కన పెడితే, ఆ వ్యాధుల నుండి ఆడవాళ్లకు అండవాహికలు మూసుకుపోవడం, తర్వాత పిల్లలు పుట్టేందుకు అడ్డంకులేర్పడడం, అయినా ఇవన్నీ నీకెందుకు? నువ్వు పడుకో. రేపు నాకు పునరుత్పత్తి వ్యవస్థ మీద పరీక్ష వుంది. చదువుకోవాలి’’ అంటూ సంభాషణ ముగించింది సుష్మ.
మరుసటి రోజు విడిపోయే ముందు ‘‘థింక్ బిఫోర్ యు ఎంజాయ్’’ అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే తన మనసులోని ఊగిసలాట అర్థమైందా? ఇకపై తనను క్యారెక్టర్ లేని దానిలా చూస్తుందా? లేకపోతే ఎందుకలా చెప్తుంది? మగవాళ్లకు ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి అన్న మాటలో యెన్నర్ధాలున్నాయి? ఆలోచిస్తే యెన్నో? ఇంటికి రావడం కాస్త లేటయితే కూతుర్లను గట్టిగా గదమాయించే తల్లులు, ఎంత లేటుగా వచ్చినా కొడుకులని యెందుకు గట్టిగా గదమాయించరో అర్థమైంది. మగవాళ్లకు లేని ఆంక్షలు, ఆడవాళ్ళకే ఎందుకన్న తన ప్రశ్నకు సమాధానం దొరికింది. తేడా సృష్టిలోనే ఉంది. కాని, ఆ తేడా వేర్వేరు బాధ్యతలతో, ఇద్దరూ కలిసి సృష్టి చెయ్యడం వరకు మాత్రమే. మిగిలిన విషయాలలో ఇరువురికీ ఒకే రకమైన మేధస్సును ఇచ్చింది. చదువు, ఉద్యోగ అవకాశాల్లో మగవారితో పోటీ పడాలే కాని, యిలా అర్ధరాత్రి వరకు తిరగడానికి కాదన్న విషయం గ్రహించుకున్నాక, మనసుకు చాలా తేలికగా అనిపించింది. నిన్న సుష్మ చెప్పిన యింకొక విషయం కూడా గుర్తుకొచ్చింది ‘‘మగవాళ్లలో ఉండే టెస్టోస్టిరోన్ హార్మోను, వాళ్లల్లో శారీరక ధారుఢ్యానికి కారణమౌతుంది. ఆ విషయంలో పోటీ పడాలంటే ఆడవాళ్లు కరాటే మొదలైన శిక్షణా విద్యలను నేర్చుకుంటేనే అవసరమైనప్పుడు, శారీరకంగా వాళ్లను ఓడిరచగలరంటూ’’ నేర్చుకుంటున్న కొత్త విషయాలను చాలా ఎక్సైటింగ్‌గా చెప్పింది. సుష్మ చెప్పిన ఇంకొక విషయం… నేనెంత తప్పుగా ఆలోచిస్తున్నానో, పర్యవసనాలు యే రకంగా వుండొచ్చో, కళ్ళకు కట్టినట్టు తెలిసింది.
నీకో విషయం చెప్పనా అంటూ సుష్మ చెప్పినది, ‘‘నాకు క్రిందటి వారం ఐసీటీసి పోస్టింగ్స్. అంటే హెచ్‌ఐవి సోకిందేమో అన్న అనుమానంతో వున్న వాళ్లకక్కడ, కాన్ఫిడెన్షియల్‌గా టెస్ట్ చేసి, సరైన సలహాలను యిస్తారు. అవసరమైతే చికిత్స కూడా అందిస్తారు. అక్కడ కౌన్సిలింగ్ కోసం వచ్చిన వాళ్ళను చూస్తే జాలితోపాటు, భయం కూడా వేసింది. చదువుకునే వయసులో జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలన్న తాపత్రయంతో, జీవితాలను యెలా బలి చేసుకుంటున్నారోనన్న విషయం అవగతమయింది. హెచ్‌ఐవి సోకిందనగానే, మానసికంగా కృంగిపోయి, పిచ్చి పట్టినట్టు ప్రవర్తించే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు… వాళ్ళ రియాక్షన్స్ చూశాక, పగవాడికి కూడా యిటువంటి బాధ రాకూడదనిపించింది. హెచ్‌ఐవి నెగిటివ్ వచ్చినా, వేరే వ్యాధులు వచ్చాయి, వాటికి చికిత్స తీసుకోవాలని కౌన్సిలర్స్ చెప్పినప్పుడు, ఆ విద్యార్థుల మనోభావాలు చూస్తుంటే భయమేస్తుంది. ఎంతో ఎత్తులో వున్నామని భావించేవాళ్లు ఒక్కసారిగా పాతాళానికి కూరుకు పోవాల్సి వస్తే యెలావుంటుందో, అలా వుంటుంది వాళ్ళ మానసిక స్థితి? ఎంత కౌన్సిలింగ్ యిచ్చినా తిరిగి వాళ్ళు మామూలుగా అందరిలా వుండగలరా అంటే సందేహమే! అని. ఆ మాటలు విన్నాకనన్నా స్థితిలో ఊహించుకుంటేనే భయంతో వణికిపోయాను.
సుష్మ చెప్పిన ఇంకో విషయం కూడా నన్ను ఆలోచించేలా చేసింది. ‘‘పేపర్లలో చదువుతున్న, పుట్టినరోజు వేడుకల పేరుతో అర్ధరాత్రి ఏకాంత ప్రదేశాలలో మద్యం సేవిస్తూ, చెయ్యకూడని పనులు చేస్తూ హైస్కూల్ పిల్లలు… తెలిసీ తెలియని వయసులో వేసిన చిన్న తప్పుటడుగులకు జీవితాంతం బాధపడాల్సి వస్తుందనే విషయం ఆ పిల్లలకు తెలిస్తే, అటువంటి సరదాలకు ఒడిగట్టరు కదా అని! అందుకే పిల్లలందరికీ, సరదాల వెనక పొంచివుండే భయంకర నిజాలు తెలియజేస్తే, పత్రికలలో యిటువంటి వార్తలొచ్చే అవకాశముండదు కదా, అందుకే హైస్కూల్ పిల్లలకి కౌన్సిలింగ్ యిస్తే యిటువంటి వార్తలు పేపర్లలో చూడం కదా అనిపిస్తుంది. అందుకే, మేము కొంతమందిమి, మా ప్రొఫెసర్ ఆధ్వర్యంలో వాలంటీర్సుగా, పాఠశాలలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం. వచ్చేవారం నేను మన హైస్కూలుకే వెళ్తున్నాను. నేను నేర్చుకుంటున్న విషయాలను, నేను చదువుకున్న స్కూల్లో చెప్పడమనే ఆలోచనే నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. నువ్వూ వస్తావా? అని అడిగింది. కౌన్సిలింగ్ ఇవ్వడానికి కాదు, తీసుకోవడానికి నేను కూడా ఎటెండ్ అవ్వాలి.