బాధితుల మీదే బండలేసే బండబారిన మనుష్యులు – కొండవీటి సత్యవతి

అతుల్‌ సుభాష్‌ అనే టేకి ఆత్మహత్య చాలా దురదృష్టకరం. మన వివాహ వ్యవస్థలో ఉన్న ఎన్నో లోపాలని ఈ సంఘటన బహిర్గతం చేసింది. మన దేశంలో గృహహింస ఏ స్థాయిలో ఉందో ప్రతి క్షణం రిపోర్ట్‌ అవుతున్న గృహ హింస కేసుల తీరును తీరు తెన్నులు గమనిస్తే అర్ధమౌతుంది.

అతుల్‌ సుభాష్‌ ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అనేక దారులున్నాయి. హింసిస్తున్న భార్య నుండి విడిగా ఉండొచ్చు లేదా విడాకులు తీసుకుని ఉంటాడు. ఆమె అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఐ పీ సీ కింద కేసు పెట్టవచ్చు. బహుశా అతను అలాంటి ప్రయత్నాలు చేసి ఉంటాడు. చివరికి భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. వివాహంలో ఎవరు క్రూరంగా ప్రవర్తించినా చట్ట ప్రకారం పరిహారం పొందే హక్కు ఇరువురికీ ఉండాలి. అయితే అతుల్‌ లాంటి కేసులు చాలా అరుదైనవి. నూటికో కోటికో ఒకటి జరగొచ్చు. నిజానికి అలా కూడా జరగకూడదు.
అయితే ఇలాంటి ఒక అరుదైన కేసుని తీసుకుని స్త్రీలందరూ మగవాళ్ళని రాచిరంపాన పెట్టేస్తున్నారు, విపరీతంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు అనే ఆరోపణ సత్యం కాదు. ఎడాపెడా కేసులు పెట్టి భర్తల్ని, అత్తమామల్ని, ఆడబడుచుల్ని జైళ్ళకు పంపించగలిగిన పరిస్థితుల్లో మహిళలు ఉంటే ఇన్ని వేల గృహ హింస కేసులు ఎందుకు నమోదౌతున్నాయి? ప్రభుత్వ లెక్కల ప్రకారమే గృహ హింస కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సఖి వన్‌ స్టాప్‌ సెంటర్లలో, భరోసా సెంటర్‌లలో, సిడిఇడబ్ల్యు కౌన్సిలింగ్‌ సెంటర్లకి ఇంతమంది బాధితులు ఎందుకు వస్తున్నారు. తీవ్రమైన హింసకి గురైనప్పుడు పోలీస్‌ స్టేషలకు వెళ్ళి 498ఏ కింద కేసులెందుకు పెడుతున్నారు. అలాగే సఖి సెంటర్‌లకు వెళ్ళి గృహ హింస నిరోధక చట్టం కింద డి ఐ ఆర్‌లు ఎందుకు వేసుకుంటున్నారు. గృహ హింస నిరోధక చట్టం కింద 60 రోజుల్లో జడ్జిమెంట్‌ రావాలి. వస్తున్నాయా? వేలల్లో కేసులు కోర్టుల్లో పడి ఉన్నాయి. గృహ హింస నిరోధక చట్టం అమలులోకి వచ్చి 20 సంవత్సరాలైంది. చట్టం అమలు మీద ఇప్పటి వరకూ ఎలాంటి సమీక్షలూ జరగలేదు. ఈ సమీక్షలు ఇటు హైకోర్టు గానీ, అటు ప్రభుత్వం కానీ నిర్వహించలేదు. చట్టంలో ఏవైనా సవరణలు చెయ్యాల్సిన అవసరం ఉందా అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఈ చట్టం కింద బాధిత మహిళలకు న్యాయం అందుతున్నదా లేదా అనే అజా పజా లేదు. చట్టం అమలులో ఉన్నప్పటికీ గృహ హింస ప్రమాదకరంగా పెరిగిపోతున్నా ఎవ్వరికీ చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అత్యంత విషాదం.
ఇక సెక్షన్‌ 498ఏ గురించి మాట్లాడుకోవాలి. గృహ హింస కింద కేసు పెట్టే సెక్షన్‌ ఐపిసిలో లేనందున, విపరీతంగా పెరిగిపోతున్న అత్తింట కోడళ్ళ మరణాల నేపధ్యంలో 1983లో ఐపిసి సెక్షన్‌ 498ని సవరించి 498ఏ చట్టం తీసుకొచ్చారు. 498ఏ ఏమి చెబుతుంది. పెళ్ళైన మహిళపై భర్త లేదా అతని కుటుంబ సభ్యులు క్రూరత్వాన్ని ప్రదర్శించినటైతే ఆ కేసును క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. 498ఏ లో ప్రధాన అంశాలు: పెళ్ళైన మహిళను మానసికంగా లేదా శారీరకంగా హింసించడం, ఆమెను ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లోకి నెట్టడం, కట్నం కోసం వేధించడం.
శిక్ష: ఈ నేరానికి మూడేళ్ళ వరకు జైలు శిక్ష జరిమానా విధించవచ్చు. ఇది అరెస్టు చేయదగిన నేరం (పోలీసులు ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్‌ చేయవచ్చు). ఇది నాన్‌ బెయిలబుల్‌ నేరం (కోర్టు అనుమతి లేకుండా బెయిల్‌ మంజూరు కాదు).
1980లలో విపరీతంగా పెరిగిన వరకట్న మరణాల నేపధ్యంలో 498ఏ చట్టమొచ్చింది. ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చి 42 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఎంత మందికి శిక్షలు పడ్డాయో లెక్కలున్నాయా? ఎంతమంది మహిళలు గృహ హింసకు బలై ప్రాణాలు కోల్పోయారో గణాంకాలున్నాయా? నిజానికి 498ఏ చాలా కఠినమైన సెక్షన్‌గానే రూపొందించారు. మొదట్లో అరెస్టులుండేవి. ఈ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారనే విష ప్రచారం వల్ల చాలామంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. పెరుగుతున్న హింస గురించి, వరకట్న మరణాల గురించి ఎవ్వరూ మాట్లాడరు కానీ ఈ చట్టాన్ని ఉపయోగించి హింసిస్తున్న భర్తల మీద కేసులు పెడితే దుర్వినియోగం అంటూ గగ్గోలు మొదలవ్వడం, న్యాయ వ్యవస్థ కూడా ఈ ప్రచారాన్ని నమ్మడంతో 2014లో సుప్రీం కోర్టు అర్నేష్‌ కుమార్‌ కేసులో 498ఏ మీద కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. పోలీసులు విచారణ లేకుండా తక్షణం అరెస్ట్‌ చెయ్యకూడదు. ముఖ్యంగా పెద్ద వయస్సున్న అత్త మామలపై నేరం నిజమా కాదా అని పూర్తిగా దర్యాప్తు చేయాలి. ముందుగా 41 ఏ సి ఆర్‌ పి సీ నోటీస్‌ ఇవ్వాలి. (విచారణకు పిలిపించాలి). అవసరమైతేనే అరెస్ట్‌ చెయ్యాలి.
ప్రస్తుత పరిస్థితి: అత్త మామలకు నేరానికి సంబంధించి ప్రత్యక్ష ప్రమేయం ఉంటేనే అరెస్ట్‌ అవుతారు. తక్షణం అరెస్ట్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ముందుగా విచారణ జరిపి ఆధారాలు ఉంటేనే చర్యలు తీసుకుంటారు. బెయిల్‌ కోసం హైకోర్టు లేదా సెషన్స్‌ కోర్టును ఆశ్రయించవచ్చు. ఓ నాలుగైదు సంవత్సరాల క్రితం సుప్రీం కోర్టు మరింత ముందుకెళ్ళి జిల్లా న్యాయ ఆధారిటీ ఆధ్వర్యంలో ‘‘ఫామిలీ వెల్ఫేర్‌ కమిటీలను’’ ఏర్పాటు చేసి 498ఏ కేసుల్లో కౌన్సిలింగులివ్వాలని కొన్ని నియమాలు రూపొందించింది. ఆ సమయంలో మహిళలు ఎంత క్రూరమైన హింసను కుటుంబాల్లో ఎదుర్కొంటున్నప్పటికీ 498ఏ కేసులు ఫైల్‌ చేయకుండా పోలీసులు తమ దగ్గరకొచ్చిన బాధితులను ఈ ఫామిలీ వెల్ఫేర్‌ కమిటీకు పంపించేవారు. ఆ కమిటీల చుట్టూ తిరగలేక ఎంతో మంది బాధిత మహిళలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కుటుంబంలోనే హింస ఉంది నాకు న్యాయం చెయ్యండి అని బాధిత మహిళ మొత్తుకుంటే కుటుంబ సంక్షేమ కమిటీల దగ్గరకెళ్ళండని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పడమంత అన్యాయం ఇంకేమైనా ఉంటుందా.కొన్ని సంవత్సరాల ఈ డ్రామా తర్వాత సుప్రీం కోర్టే ఈ కుటుంబ సంక్షేమ కమిటీలను రద్దు చేసింది. ‘‘మహా పవిత్రమైన’’ మన కుటుంబాల్లో మహిళలు ఎదుర్కొంటున్న గృహింసను రూపుమాపే ప్రయత్నాలేమీ చెయ్యకపోగా బాధిత మహిళల రక్షణ కోసం రూపొంచించిన చట్టాలను సైతం పనికిరానివిగా తయారు చెయ్యడంలో అందరూ అత్యుత్సాహంగా తలో ఒక చెయ్యి వేసి వాటి అమలును ప్రశ్నార్ధం చేసి పెట్టారు. ఎలాంటి కరలూ లేని కాగితం పులి లాంటి 498ఏని భూతంలాగా చూపించి అతుల్‌ లాంటి చెదురుమదురు కేసు జరిగినప్పుడు మహిళల రక్షణ కోసం రూపొందిన అన్నీ చట్టాల మీద దాడి జరగడం, వాటిని రద్దుచెయ్యాలని ఉద్యమాలు నడపడం పరిపాటి అయ్యింది. గృహ హింస చట్టాన్ని జెండర్‌ న్యూట్రల్‌ చెయ్యాలనే డిమాండ్‌ ఎంత హాస్యాస్పదమైందో ఎవరికైనా అర్ధమౌతోందా? ఎవరు ఎవరిని హింసించినా రక్షణ కోసం ఐపిసిీ ఉంది. కొంతమంది భార్యలు భర్తల్ని హింసిస్తుంటే తప్పకుండా చర్యలు తీసుకోవాలి. అమె పైన చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి.
ఇన్ని సంవత్సరాలనుంచీ భార్యా భాధితుల సంఘాలు కానీ, పురుష ఉద్యమాలు కానీ హింసను అనుభవిస్తున్న పురుషులకు ఎందుకు అండగా నిలబడలేకపోతున్నాయి. కనీసం వారి కోసం ఒక హెల్ప్‌లైన్‌ నంబర్‌ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు. మహిళా ఉద్యమాల్లాగానే పురుష ఉద్యమాలు మొదలవ్వాలి. తమ సమస్యలను చర్చించుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలి. అంతే కానీ విపరీతమైన హింసను అనుభవిస్తున్న మహిళల రక్షణ కోసం వచ్చిన చట్టాల మీద దాడి చేయడం కరెక్ట్‌ కాదు. ఈ చట్టాలు అన్నింటిని రద్దు చేయాలని లేదా జెండర్‌ న్యూట్రల్‌ చట్టాలు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ మొదలైంది. ఒక్క దురదృష్టకర సంఘటన, ఒక మరణాన్ని సాకుగా తీసుకొని స్త్రీల రక్షణ కోసం ఉన్న చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేయడం చాలా దారుణం.
సమాజంలో 80% స్త్రీలు ప్రతిరోజూ గృహహింసకు గురవుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఈ సమాజం ఎందుకని నోరు విప్పదు. నిజానికి గృహహింస నిరోధక చట్టం 2005 క్రిమినల్‌ చట్టం కాదు. కేవలం ఒక సివిల్‌ చట్టం. అందులో పోలీసులు, అరెస్టులు, భర్తల్ని జైల్లో పెట్టే ప్రొవిజన్స్‌ ఏమీ లేవు. అలాగే 498ఏ ఈ సెక్షన్‌ కూడా ప్రస్తుతం ఎలాంటి కోరలు లేని కాగితం పులి. అందులో కూడా ఎలాంటి అరెస్టులు, జైల్లో వేయడాలు ఏమీ లేవు. అయినప్పటికీ ఈ చట్టాలు అన్నిటినీ రద్దు చేయాలనే డిమాండ్‌ ఎంతో అజ్ఞానంతో కూడిరది. సమాజంలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా అడపాదడపా జరిగే అతుల్‌ సుభాష్‌ లాంటి కేసుల్ని హైలైట్‌ చేసి మొత్తం స్త్రీల రక్షణ కోసం ఉన్న సమస్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేసే ముందు మీలో ధైర్యం ఉన్నవాళ్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 సఖి సెంటర్లు, 33 మహిళా పోలీస్‌ స్టేషన్లు, భరోసా సెంటర్లు సిడిఈడబ్ల్యూ సెంటర్లు వీటికి వెళ్లి ఒక గంట సమయం గడపండి. అలాగే ఏదైనా ఫ్యామిలీ కోర్టులో కొంత సమయం గడపండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎవరిని హింసిస్తున్నారు. ఎవరు ఎవరిని రోడ్లపాలు చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏమిటంటే స్త్రీలకు ఆస్తి హక్కు చట్టం ఉందంటారు. ఆస్తులు పంచి ఇవ్వరు. అలాగే పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వ్యవహరం. ఆ పెళ్లిలో పెళ్లి సంబంధంలో ఉన్న ఆస్తులను కూడా భార్యకు దక్కకుండా ఎన్ని దుర్మార్గాలు చేస్తారో అందరికి తెలిసిన విషయమే. ఎలాంటి ఆస్తులు ఆమెకు అందనీయకుండా పిల్లల్ని కని ఆమెతోనే వదిలేసే భర్తలు, డైవర్స్‌ తీసుకునే భర్తలు ఎంతోమంది ఉన్నారు. ఇలా వదిలేయబడిన మహిళలు ఎలా బతకాలి అనే ఆలోచన ఈ సమాజానికి ఎప్పుడూ లేదు. ఒంటరి మహిళగా పిల్లలతో సహా కనీసం పుట్టింటి వారి ఆదరణ కూడా లేకుండా ఎలా బతుకుతుంది అనే ఆలోచన ఎవరికీ రాదు. విడిపోయిన భర్త నుంచే మెయింటెనెన్స్‌ ఎన్నో లక్షల మంది మహిళలు ఈరోజు ఫ్యామిలీ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్లాడాల్సిన పరిస్థితుల్లోకి నెట్టేయబడుతున్నారు. ఆమెకి ఎలాంటి వనరులు అందుబాటులో లేకుండా చేసి హింసల్లోంచి బయటకు వచ్చిన భర్త నుంచే మెయింటెనెన్స్‌ అడుక్కునే పరిస్థితి ఎంత దుర్మార్గమైనదో ఎవరూ ఆలోచించరు. ఇలాంటి అంశాల గురించి చర్చించరు. కానీ ఈ సుభాష్‌ ఆత్మహత్య లాంటి సంఘటన జరిగినప్పుడు భార్యా భాధితుల సంఘాలు అంటూ బయలుదేరుతారు. స్త్రీల మీద, చట్టాలు మీద విషం చిమ్మే ప్రచారం మొదలుపెడతారు.
ఎంతో కొంత స్త్రీలకు రక్షణ కల్పించిన 498ఏ క్రిమినల్‌ చట్టాన్ని నాశనం చేసి పెట్టారు. ఎలాంటి తీవ్రమైన సెక్షన్లు లేని గృహ హింస నిరోధక చట్టం మీద ప్రస్తుతం దాడి మొదలుపెట్టారు. ఈ చట్టం కింద వేసిన కేసుల్లో ఎంతమందికి పరిహారాలు వచ్చాయో ఒక స్టడీ చేయండి. డి ఐ ఆర్‌ వేసిన కేసుల స్టేటస్‌ ఏమిటో ఆయా కోర్టులకు ఒకసారి వెళ్లి చూడండి. ఎంతమంది మహిళలకు వాళ్ళు కోరిన రక్షణ గాని, పిల్లల కస్టడీ కానీ, తాను నివసిస్తున్న ఇంట్లో ఉండే హక్కు గాని లభించాయా లేదో చూడండి. అమలులో ఉన్న చట్టాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అనేది ఒకసారి పరిశీలించిన తర్వాత గృహహింస నిరోధక చట్టాన్ని రద్దు చేయండి అని మీ ప్రచారాలను మొదలు పెట్టండి. ఒక మనిషి చనిపోవడం అనేది అన్యాయమే. అతనికి చట్టపరమైనటువంటి రక్షణలు ఉన్నాయి. కానీ అతను ఆత్మహత్యను పరిష్కారంగా ఎంచుకున్నాడు.
మహిళలందరినీ ఒకే గాటన కట్టి వారి మీద అభాండాలు వేసి అందరూ ఇంతే అనే ఒక ఘోరమైన ప్రచారానికి తెర తీయడం చాలా దుర్మార్గం. సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా తందానతానా అంటూ బయలుదేరిన మిగతా అందరూ కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. కళ్ళు తెరిచి కుటుంబాల్లో, సమాజంలో జరుగుతున్న హింసని, వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మీ అసంబద్ధమైన డిమాండ్‌ ఎంత అన్యాయమైందో అర్ధమౌతుంది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.