ఇలా చేద్దాం అనుకుని చేసేవి కొన్ని, అలా జరిగిపోయేవి అనేకం. అలా జరిగిపోవడం హాయిగా ఉన్నంతకాలం అది ఎట్లా జరిగిందబ్బా అని ఆలోచించం. భూమిక ఉందని కనీసం 20 ఏళ్ళుగా తెలుసు. అప్పుడప్పుడూ చదువుతూ ఈ స్త్రీలు చాలా తీవ్రంగా వాదిస్తున్నారని తెలుసు. నేను సాంస్కృతిక రంగంలో ఉన్నాను కాబట్టి కేవలం స్త్రీగా ఆలోచించడం కొంచెం తక్కువే. మహిళా ఉద్యమంలో 30 ఏళ్ళ వరకు అనుభవం ఉంది. కలిసి పనిచేసి అన్నీ ఒంటబట్టినా కొంచెం వ్యవధి ఉంచుకున్నా. కానీ నాకేమంత ప్రమేయం లేకుండానే పీకల్లోతు దిగబడే స్థితి వచ్చింది. అప్పుడే భూమిక సత్యవతి గారికి తోడు ప్రశాంతి కూడా చేరడం… ఐక్య కార్యాచరణ చేయడం, ఒకదాని తర్వాత ఒకటిగా దగ్గరితనం పెంచాయి.
అంగీకరించే అంశాలపై ఎవరితోనయినా కలిసి పనిచేయాలనుకున్నాక, అనేక సంఘాల ఆత్మీయత ఉన్నా సభ్యత్వం లేకపోవడం వల్ల అన్నీ నావే అయ్యాయి. భూమిక మరింత ఎక్కువగా నన్ను లోపలికి లాక్కుంటోంది అనే అనుమానం వచ్చినపుడల్లా… నా టచ్ మి నాట్ పాలసీ ఏమయ్యిందా అనుకుంటాను. సత్యవతి గారు నాకో పాత జ్ఞాపకం కొత్తగా ఏర్పడినట్లు ఉంటారు. మోటూరి ఉదయం గారిలాగా ఎమోషనల్‌గా, పట్టిన పట్టు విడవకపోవడం, వదలకుండా రాస్తూనే ఉండడం… ఏదయినా ఘోరం జరిగింది అనగానే ఆవిడక్కూడా కన్నీళ్ళు వచ్చి ఆందోళనతో ఉండేది ఈవిడలాగే… ఇంకా అనేకం చెప్పుకుంటూ పోతే… మొదట ”నాటకం”లో మహిళా కార్యకర్త పాత్ర ఇచ్చింది మొదలు కళారంగం ఉంచుకో గానీ మహిళా రంగానికి రా అని నాతో తగాదాలు పెట్టుకుని ఈ ఉద్యమానికి నన్ను లాక్కు వచ్చింది మొదట ఉదయం గారే. ఆవిడతో పాటు తిరుగుతూ ఉండేదాన్ని. సత్యవతిగారు వస్తావా దేవీ అంటే అదే జ్ఞాపకం తిరిగి వస్తుంది. ఒక షశీఎటశీత్‌ీ ఉంటుంది. మన బాధ్యత ఆవిడ తీసేసుకుంటుంది.
మహిళా సమస్యలపై మహిళలతో కళాబృందం చేయాలనే కల ఉదయం గారితో మొదలై సత్యవతిగారి దగ్గర ఆగి ఉంది ప్రస్తుతం. సత్యవతి గారికి అన్ని కళారూపాలు ఇష్టం, స్త్రీల కాన్సెప్ట్ రాస్తే మరీ ఇష్టం. చిన్నపిల్ల తత్వం అందరిలో అంతో, ఇంతో
ఉంటుంది. కానీ ఉదయం గారు, సత్యవతి గార్లలో అది కొంచెం ఎక్కువే ఉండడం వలన ప్రతిస్పందనలు అనేక స్థాయిలో ఉంటాయి. దానివలన వారికి కష్టమూ ఎక్కువే, సుఖమూ ఎక్కువే. చూసేవాళ్ళకి, అదీ వాళ్ళని దగ్గర్నుంచి చూసేవాళ్ళకి అది సహజంగా కన్పించి హమ్మయ్య ఇంకా అందరూ బిగుసుకుపోలేదన్న భావన ఆనందాన్నిస్తుంది.
ఏ మహిళా సంఘం ఆఫీసుకు వెళ్ళినా ఇంటికొచ్చినట్టుగానే ఉంటుంది కానీ, భూమిక ఆఫీసుకి వెళ్ళగానే కన్పించే పుస్తకాలు రావల్సిన చోటుకి వచ్చినట్టుగా అన్పించేలా చేస్తాయి. పుస్తకాలు, మొక్కలు, పిల్లలు ఇదే క్రమంలో పిచ్చి ఉండటం కూడా తొందరగా కల్సిపోవడానికి కారణం అయ్యుండాలి.
ఉద్యమాలు, అవగాహనలు ఏ స్థాయిలో ఎంత ఉధృతంగా నడిచినా అన్నింటికీ మధ్యన ఉండే మానవ సంబంధాల కోణం చాలా ముఖ్యం. ఒకే దారిలో నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా దగ్గరవుతాం, అర్థం చేసుకుంటాం. మంచీ, చెడూ, బలహీనతలూ… అన్నీ కలిసి ఉన్నప్పుడు అంతా మంచే. విభేదాలు ఏర్పడితే అప్పుడు కూడా ఆ తూకం చెదరనీయని హుందాతనం వ్యక్తుల మధ్య అవసరం. ప్రవర్తనల్లో ఉండే తేడాలు, టెంపర్‌మెంట్స్ అవగాహన ఉంటే సరిచేసుకోవచ్చు, సరిపెట్టుకోవచ్చు. ఓ పెద్ద లక్ష్యం పెట్టుకుని నడుస్తున్నాం అనుకుంటున్న మనం అల్పమయిన ఘటనల్తో అగాధాలు ఏర్పరచుకోవడం ఈ ”వ్యక్తి”గత వ్యవహారాల స్థాయి దాటడానికి ఇంకెంతో ఎదగాలి అన్పిస్తుంటుంది.
పాతికేళ్ళు ఒకే పత్రికను అంటిపెట్టుకుని నడిపించడానికి ”చాలా” కావాలి. దాన్ని సజీవంగా, ఆసక్తికరంగా
ఉంచడం ఒక్కరే చేయలేరు కానీ ఒక్కరు నిట్టాడుగా నిలబడితే ఇల్లు నిలబడుతుంది. భూమిక ఇల్లు నుండి మండువా లోగిళ్ళలాగా అనేక గోడలు నిట్టాళ్ళతో ఎదగాలి. భూమిక తన ఆద్యుల్ని, పునాదుల్ని స్మరించుకుంటూనే ఉండాలి. ”భూమిక” పత్రిక నుండి కార్యాచరణ వైపు సాగుతున్న వేగం కొనసాగాలి.
ఆత్మీయ భాగస్వామ్యపు అభినందనలతో… – దేవి, హైదరాబాద్