భూమికకు విఎకె తాతయ్య అభినందన! శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి కాలంలో ‘ఫెమినిజం’ అన్న మాటకింత ప్రచారం లేదు కానీ వారి చిత్ర నాయకులలో కొందరు ఫెమినిస్టు వాదులే. ‘చిన్న కోడలు’లో (1952) ఒక నాయిక (కుమారి) పెళ్ళాడిన తన ప్రియునితో తనిష్టమొచ్చినట్లు ఉంటుంది, సమాజపు సవాళ్ళను లక్ష్య పెట్టక. ‘రేచుక్క’లో (1955) నాన (అంజలి దేవి) తను ప్రేమించిన చినవాడు మరొకరికి మనసిస్తే లబోదిబోమనదు, వారిని కలుపుతుంది.
‘రాజనందిని’ (1958)లో విమల (జి.వరలక్ష్మి) రాకుమారిని తల్లిలా సాకుతుంది. వెనుక నుండి రాజ్య రక్షణకు పాచికలు నడుపుతుంది. పాలకుడు పాలుమాలినప్పుడు ఇది కళారూపాన అమరిన ఫెమినిజం. నా చిన్న తనంలో అమ్మమ్మ తెప్పించే ”గృహలక్ష్మి” చదివేవాణ్ణి. ఆరేళ్ళ నాకు ఆ దృక్పథం కాస్తకాస్త అర్థమయ్యేది. ఆ తరువాత స్త్రీ జనోద్దరణకు అగ్ని కంకణం కట్టుకున్న ఒకేఒక పత్రిక (నా ఎరికలో) ”భూమిక”.
చెప్పిన తన లక్ష్యాలను 98శాతం అమలులో పెడుతున్న పత్రిక. కుండ బద్దలు కొట్టే వ్యాసాలు ప్రచురించడంలో, అమాయకులకు తెలివిని కలిగించడంలో, బాధించిన వారికి చేయిని అందించడంలో వెనుకాడనిది భూమిక. ఆ ఉద్యమానికి వెన్నెముకైన చిరంజీవి సత్యవతి గారికి నా జేజేలు.
చివరిదైనా ముఖ్యమైనది ఒక మాట. కొరవడిన ఆ 2శాతం ఏమిటంటే స్త్రీలను స్త్రీలు పెట్టే బాధలను అంతగా పట్టించుకొకపోవడం. స్త్రీలే స్త్రీలకు శత్రువులనే మాట నిజం చేసే అత్తలు, ఆడబిడ్డలు ఎందరు లేరు? ఒక ప్రఖ్యాత రచయిత్రి తన గడపదాటని ఒక ఇల్లాలిని ‘గౌడుగేద’ అన్నది. ఆమె చేసిన నేరం ఒక పేరొందిన నటుడి భార్య కావడమే. ఇలాంటివి చెరగాలి, రోకట్లో దంచాలి. తిరగల్లో పిండి పిండి చేయాలి. కుమ్ములో పెట్టి మాడ్చాలి భూమిక.
– విఎకె రంగారావు, చెన్నై