ముందుగా మా ‘భూమిక’ స్త్రీ వాద పత్రిక 25వ పుట్టినరోజు సందర్భంగా హార్థిక అభినందనలు.
నాకు ‘భూమిక’తో 25ఏళ్ల అనుబంధం. 1992 సం. మాస్కో నుంచి పి.జి పూర్తి చేసుకుని వచ్చి హైదరాబాద్‌లో కూలి కోసం వెతుకుతున్న తరుణం… అప్పట్లో సజయ వచ్చి నన్ను కలిసింది. ఆరోజు ఏవో కబుర్లతో గడిచింది. ఆ తర్వాత నేనూ ‘అన్వేషి’ ఆఫీసుకెళ్లడం మొదలుపెట్టా. అప్పుడే ‘చెలిమి’ అనే గ్రూప్‌ని ఏర్పాటు చేసినట్లు గుర్తు. అదే సంవత్సరం ‘భూమిక వుమెన్స్ కలెక్టివ్’ ఏర్పడింది. 1993 జనవరిలో పత్రిక మొదలయ్యింది. మొదట త్రైమాసిక పత్రికగా వచ్చింది. క్రమంగా సక్సెస్ చెంది మాసపత్రికగా రూపుదాల్చింది.
నేను పత్రికలో ‘స్త్రీలు – ఆరోగ్యం’ అంశంపై బహుకొద్ది వ్యాసాలు రాసాను. ఎడిటర్ సత్యవతి నన్ను కాస్త కోప్పడుంటే బావుండేమో… (తప్పంతా నాదేలెండి. పాపం, సత్యవతి మీదెందుకు ఈ నిందలు???) సరే ఏవో కొన్ని కార్టూన్లు కూడ వేసినట్టు గుర్తు. ఒకటి-అర ఆర్టికల్స్ ఎడిటోరియల్స్‌గా ప్రమోట్‌చేసి వేసిన గుర్తు. సో అలా ‘భూమిక’ కలెక్టివ్‌తో కలిసి పనిచేయడం జరిగింది. అంతే కాదు, మేథా పాట్కర్ లాంటి ఉద్యమకారులతో ఇంటర్వ్యూలు, రావు బాలసరస్వతి లాంటి ప్రముఖులతో ముచ్చట్లు, అనేక పర్యాటక ప్రదేశాల సందర్శన-ఇలా ఎన్నో అనుభవాలూ, అనుభూతులూనూ… అసలు భూమిక ఉమెన్స్ కలెక్టీవ్ ఆధ్వర్యంలో అంతమంది స్త్రీలు కలిసి వివిధ ప్రదేశాలు టూర్ చేయడమే ఒక అద్బుతం. ఆ అనుభవాలు చెరిగిపోని తీపిగుర్తులు.
అసలు రచయితగా జన్మనిచ్చి నన్ను నిలబెట్టిన పత్రిక ‘భూమిక’కు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు! మహిళలను ధీమంతులుగ చేసే కార్యక్రమాన్ని నిర్వఘ్నంగా కొనసాగిస్తూ ఎన్నో ఎన్నో పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని కోరుకుంటూ…
– సమతా రోష్ని, హైదరాబాద్