సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక ఆరోపణలు రావడం, దానిపై వచ్చిన భిన్న స్పందనలు, విచారణ ప్రక్రియ జరిగిన తీరు, దాని ముగింపు అన్నీ… అనేక రకాల ప్రశ్నలు, సందేహాలు రేకెత్తించాయి. చరిత్రలో మొదటిసారి ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. గత ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు, ఆశ్రిత పక్షపాతం వంటివి జరిగాయి.
ఆరోపణలను ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పంపించింది. మీడియాలో వచ్చింది. వెంటనే ప్రధాన న్యాయమూర్తి తాను ఇంకో ఇద్దరు న్యాయమూర్తులతో కలిసి ఒక బెంచి (?) ఏర్పాటు చేశారు. ఇది ఏమిటో, ఎలా ఏర్పాటయిందో తెలీదు కానీ ఈ బృందం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలు పెద్ద కుట్ర అని, ఆ కుట్ర మొత్తం సుప్రీంకోర్టు విశ్వసనీయత దెబ్బ తీయడానికి అత్యున్నత అధికార స్థాయిలో జరిగిందని ప్రకటించారు. ”తన కేసులో తానే న్యాయమూర్తిగా ఉండకూడదనే” న్యాయానికి సంబంధించిన ప్రాథమిక సూత్రం గోగోయి విస్మరించారు. దీపక్ మిశ్రా తన కేసులో తాను కూడా ధర్మాసనంలో ఉండడం గురించి, ప్రజాస్వామ్య పారదర్శక ప్రక్రియలు మార్గదర్శక సాంప్రదాయాలు దీపక్ మిశ్రా అనుసరించడం లేదని బహిరంగంగా ప్రకటించిన వారిలో గొగోయి కూడా ఉన్నారు. తనదాకా వచ్చేసరికి అదే బాట పట్టారు.
ఏ విచారణా లేకుండా ఆమె ఆరోపణలు కుట్రపూరితం అనీ, నిరాధారం అనీ ఈ బృందం, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లే కాదు ఆమెకు అండగా నిలవాల్సిన సుప్రీంకోర్టు, ఉద్యోగుల సంఘం కూడా ప్రకటించేశాయి. ఆర్థిక మంత్రి ఏకంగా సుప్రీంకోర్టుకు మద్దతు పలికారు. మీడియాపై (ఏ చట్టం లేదు దీనిపై) సుప్రీంకోర్టు తానే ”మీర్జాకర్” తీర్పుకు భిన్నంగా ఆంక్షలు విధించింది. ఇవి నేరుగా లేకున్నా మీడియా నోరు మూయించే పని జరిగింది.
గొగోయిపై ఆయన అధికార పక్షానికి వ్యతిరేకం కాబట్టి, ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు రాజ్యాంగానికి ప్రధాన కాపలాదారుగా ఉంటూ పౌరహక్కులను కాపాడే తీర్పులను ఇస్తున్నది కాబట్టి ఈ మతోన్మాద ప్రభుత్వం కుట్ర చేయదనేం లేదు. కుట్రచేసి బహిరంగంగా మద్దతు ప్రకటించదనీ లేదు. దానికి అనేక నాల్కలున్నాయి. అయితే ఈ కుట్రను కుట్రగా నిరూపించే అవకాశం పూర్తిగా గల వ్యక్తే గొగోయి. సుప్రీంకోర్టులోకి చొరబడిన మతానుకూల శక్తుల ప్రమేయం లేకుండా ఇటువంటి కుట్ర జరగదు. అటువంటప్పుడు దాన్ని బహిర్గతం చేసే విచారణ, న్యాయ ప్రక్రియల్ని పూర్తిగా పారదర్శకంగా, చట్టబద్ధంగా సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం జరపడం ద్వారానే దాన్ని ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. అది మాత్రమే సుప్రీంకోర్టు విశ్వసనీయతను కాపాడుతుంది.
కాని గొగోయి తనపై వచ్చిన ఆరోపణలు మొత్తం సుప్రీంకోర్టుపై కుట్రగా ప్రకటించడం అంటే తనను, సుప్రీంకోర్టును ఒక్కటిగా చేయడం ఎట్టి పరిస్థితుల్లో సరైంది కాదు. ప్రధాన మంత్రయినా, సుప్రీంకోర్టు జడ్జయినా వాళ్ళూ రక్తమాంసాలున్న మనుషులే, అతీతులు కాదు. కాబట్టే ఏ ఒక్కరూ చట్టానికి, రాజ్యాంగానికి లోబడే ఉండాలి. గొగోయి తన కేసులో తానే జడ్జిల బృందంలో ఉండడం, తర్వాత మధ్యలో వెళ్ళిపోవడం వంటి ప్రవర్తన తన ప్రతిష్టనూ, సుప్రీంకోర్టు విశ్వసనీయతనూ కూడా తానే దెబ్బతీశారు.
న్యాయమూర్తులపై వచ్చిన ఆరోపణల విచారణపై ప్రధాన న్యాయమూర్తి సంతకం చేయాలి. ఆయనపైనే వస్తే ఏం చేయాలో ఎక్కడా స్పష్టత లేదు. 1995లో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై, ఆయన పుస్తకానికి అత్యధిక పారితోషికం లభించిందనే ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. చెడు ప్రవర్తనకూ, నిందార్హమయిన (పదవి తీసేయాల్సిన) ప్రవర్తనకూ మధ్య తేడాను గుర్తిస్తూ న్యాయమూర్తులపై ఆరోపణలన్నీ పార్లమెంటుకు పోనవసరం లేదని భావించింది. 1997లో జస్టిస్ జె.ఎస్.వర్మ ప్రధాన న్యాయమూర్తి కాగానే ”న్యాయమూర్తులు అనుసరించాల్సిన విలువలపై మార్గదర్శకాలు అందరికీ పంపారు. ఐదుగురు న్యాయమూర్తుల కమిటీ నివేదిక ఆధారంగా 1999లో పూర్తిస్థాయి ధర్మాసనం అంతర్గత ప్రక్రియ (ఱఅష్ట్రశీబరవ జూతీశీషవసబతీవ)ను ఆమోదించింది. దీన్ని 2014లోనే బహిరంగపర్చారు.
దీని ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు వస్తే, వేరే హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులిద్దరు, ఒకవేరే హైకోర్టు న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ముగ్గురితో కూడిన కమిటీ విచారణ చేపడుతుంది. ముందుగా ఒక ఆరోపణ రాగానే, ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తి (అది న్యాయ చట్ట సంబంధింతమయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా నేరుగా ఇవ్వొచ్చు) ప్రాథమిక పరిశీలన చేస్తారు. లేదా ఒక బృందం దానిపై అంతర్గత విచారణ జరిపి దాని తీవ్రతను బట్టి ఏం చేయాలో నిర్ధాయిస్తారు. దానిపై ఫిర్యాదుదారుకి సంతృప్తి లేకపోతే ప్రధాన న్యాయమూర్తికి తన అభిప్రాయాలతో సహా ఆ పరిశీలన పంపి మరింత విచారణ కోరవచ్చు. సుప్రీంకోర్టు జడ్జిలపై ఆరోపణలను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించి ముగ్గురు సీనియర్ న్యాయమూర్తుల కమిటీ నియమిస్తారు. ఇలా మొత్తం మార్గదర్శకాలున్నా ఎక్కువ భాగం అంతర్గతంగా జరగడం, వారి విచక్షణాధికారానికి వదిలేయడం వల్ల ఖచ్చితమయిన వ్యవస్థాగత సూత్రాలు లేకుండా పోయాయి.
అంతర్గత విచారణ కమిటీ వేయటంలో ప్రధానంగా నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు వేరే న్యాయస్థానాల జడ్జీలను వేయమనడం అవసరమయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనపై ఆరోపణలు వచ్చినపుడు తాను అంతర్గత విచారణ కమిటీని నియమించే అధికారర సీనియర్ న్యాయమూర్తుల బృందానికి అప్పగించవచ్చు. ఆ బృందానికి మహిళా న్యాయమూర్తి అధ్యక్షత వహించాలి… అదీ సుప్రీంకోర్టు తీర్పే. నిష్పక్షపాత విచారణ కోసం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులను కమిటీలో తీసుకోవచ్చు. ఈ సందర్భం చాలా అనూహ్యం కాబట్టి దీనిని పురస్కరించుకుని పకడ్బందీ న్యాయ ప్రక్రియ నియమాలు రూపొందించి ఉండవచ్చు. ”న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగిందని తెలియాలి, న్యాయం పొందామని బాధితులు భావించాలి” అని సుప్రీంకోర్టు పేర్కొన్న వ్యాఖ్యలు ఈ కేసులో ఎక్కడా కనబడలేదు.
లైంగిక ఆరోపణల సందర్భంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలో కనీసం సగంపైగా మహిళలు (అయిదుగురిలో)
ఉండాలనడానికి కారణం ఫిర్యాదుదారు సౌకర్యం కోసమే. ఆ సూత్రం సుప్రీంకోర్టుకి ఎందుకు వర్తించదు? సుప్రీంకోర్టు చట్టానికి అతీతమా? పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టం ఈ కోర్టుకి ఎందుకు వర్తించదు? ”విశాఖ” తీర్పును సుప్రీంకోర్టు ఎందుకు అమలు చేయలేదు? మొత్తం సుప్రీంకోర్టు ఉద్యోగులు, పరిపాలనపై పూర్తి అధికారం గల ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలపై సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందుకు రాగలరు? మొదటినుండి ఈ కేసు రెండు పూర్తి అసమాన బలాల మధ్య యుద్ధం. ఒక ప్రక్కన సుప్రీంకోర్టు సాధారణ ఉద్యోగిని, మరోవైపు సర్వాధికారాలు గల ప్రధాన న్యాయమూర్తి. ఈ అసమాన బలాలను బట్టయినా నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి, సాక్ష్యాలు పరిశీలించి విచారించే ప్రక్రియలన్నీ పారదర్శకంగా, చట్టబద్ధంగా జరగాలి.
”స్వేచ్ఛ కోసం సాగే చరిత్ర అంతా ప్రధానంగా సుస్వాగత ప్రక్రియల పరిరక్షణే. జడ్జీలు రాజుగారి భార్యలాగ అనుమానానికి అతీతంగా ఉండాలి” అని 1986లో చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలో ఒక సభ్యుడిని తొలగించాల్సిన సందర్భంలో సుప్రీంకోర్టే పేర్కొంది. ఆ సంస్థ నుండి ముగ్గురు సభ్యులను కమిటీలో ఉండడానికి అనుమతించింది. కానీ ఈ కేసులో ఇటువంటి పారదర్శకత పాటించలేదు.
ఒకటి ఈ కేసులో లైంగిక ఆరోపణలు కాగా, రెండవది ఆ కుటుంబం పట్ల జరిగిన కక్ష సాధింపు చర్యలు. ఆమెను సుప్రీంకోర్టు ఉద్యోగం నుండి తొలగించడం, ఆమె భర్త, బావను పోలీసు ఉద్యోగాల నుండి తొలగించి చెడు నడతపై విచారణ జరపడం, ఆమెపై, భర్తపై అభియోగాలు మోపి అరెస్టు చేయడం ద్వారా ఎటూ దారిలేక ఆమె ఆరోపణలను బహిర్గతం చేయటం జరిగింది. పై చర్యలన్నీ చట్ట విరుద్ధం, నేరపూరితం.
”వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించాలంటే ప్రభుత్వ అధికారులపై సంస్థాగత పర్యవేక్షణ, అవసర చర్యలూ ఉండడం తప్పనిసరి” అని సుప్రీంకోర్టు 1996 ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు వ్యతిరేక తీర్పులో పేర్కొంది. ఇక్కడ అధికారం గల వ్యక్తులపై పర్యవేక్షణ… విచారణకు ఏమైంది? బాధితురాలిపై కక్ష సాధింపు చర్యలపై విచారణ ఎందుకు జరగలేదు. సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల అంతర్గత కమిటీ విచారణ నుండి బయటకు వచ్చేసిన బాధితురాలు ”అక్కడి వాతావరణం భయపెట్టేదిగా, బెదిరించేదిగా ఉంది. కనీసం ఒక వ్యక్తి లేదా లాయరు తోడు లేక ఒంటరినయ్యాను. నాకు సరిగ్గా వినపడదు కనుక ఏం మాట్లాడుతున్నారో అంతగా అర్థం కాలేదు. నేను చెప్పింది ఇది అని చెప్తున్న విషయాలు కూడా అన్నిసార్లు వినబడలేదు. ఏం రికార్డు చేశారో నాకు తెలియదు. నా స్టేట్మెంట్ కూడా నాకు ఇవ్వలేదు” అని తెలిపింది. అంతేకాదు ”ఈ ఆరోపణల్లో పస లేదు” అని తేల్చిన అంతర్గత కమిటీ ఆ నిర్ధారణకు రావడానికి గల కారణాలు రాసిన నివేదికను ఆరోపణలు ఎదుర్కొన్న ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చారు కానీ బాధితురాలికి ఇవ్వలేదు.
హేతుబద్ధత లేకపోడం, ప్రక్రియలు పాటించకపోవడం అనే అంశాల ఆధారంగా పునర్విచారణ జరపొచ్చు. ప్రధాన న్యాయమూర్తిపై ఏ మాత్రం అనుమానం వచ్చినా తిరిగి విచారణ జరిపి పెద్దరికం నిలబెట్టుకోవచ్చు. కానీ ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం… న్యాయమూర్తులకు చెందుతుందా? అది బాధితులకు కూడా చెందుతుందా అనేది తేల్చవలసిన ప్రశ్న. బాధితులు ఇది మా కోర్టు కూడా అని అనలేదంటే న్యాయం జరగలేదనే అర్థం.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసి యుద్ధ నేరాల విచారణ న్యూఎంబర్గ్లో జరిగింది. అనేక న్యాయ సమస్యలపై నిస్ణాతుడు, హిట్లర్ ప్రభుత్వంలో న్యాయ శాఖామంత్రిపై విచారణకు మిత్ర దేశాల నుండి ఒక రిటైర్డ్ జడ్జి కూడా ధర్మాసనంలో ఉన్నారు. మిత్రదేశాల సైన్యం, ప్రపంచమంతా అతన్ని శిక్షించాలని కోరుతోంది. కానీ ఆ జడ్జి పక్షపాతం ఉండకూడదంటాడు. ముద్దాయి తన తోటివారు, న్యాయవాది అభీష్టానికి విరుద్ధంగా నిజాయితీగా వాస్తవాలు చెబుతాడు. ”ఈ కేసులో సత్యాసత్యాలు ఎలా ఉన్నా దేశ ప్రయోజనాలను దృష్టిలో
ఉంచుకుని ముద్దాయికి శిక్ష విధించాలని ముందే నిర్ణయించుకుని అలాగే తీర్పునిచ్చాను. సాక్ష్యాధారాలు పరిగణించలేదు. అప్పటికి దేశ భవిష్యత్తుకి అది అవసరం అని నమ్మాను. కానీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో జరిగిన ఊచకోత గురించి నాకేం తెలీదు” అని చెబుతాడు. అతనికి శిక్ష పడుతుంది. ఆ జడ్జిని ఒకసారి కలవాలని ముద్దాయి హిట్లర్ న్యాయ మంత్రి కోరతాడు. జైలులో కలిసిన జడ్జిని ”నన్ను మీరయినా నమ్మండి. ఊచకోతల గురించి నాకేం తెలీదు” అని ప్రాధేయపడతాడు. ఆ జడ్జి ”తెలిసి ఉండకపోవచ్చు. కానీ న్యాయమూర్తిగా ఒక నిర్దోషికి శిక్ష విధించినప్పుడే నీవు ఆ ఊచకోతల అనుమతి పత్రంపై సంతకం చేశావు” అని జవాబిస్తాడు.
రంజన్ గొగోయి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న అత్యున్నత న్యాయస్థానం ఈ విచారణ జరిపిన తీరు… విచారణ నిర్ధారణలు, విశాఖ తీర్పు, పని ప్రదేశాల లైంగిక వేధింపుల చట్టాల ముగింపుకే కాదు…అధికారం, డబ్బు, పదవిపై బలహీనులు ఓడిపోతారనే ప్రకటనపై కూడా అంతిమ సంతకం చేసి ఉండవచ్చు.