చౌరస్తాలో నిలబడ్డ బిడ్డా!
నాలుగు దారులూ కాక
ఏ దారిలో వెళ్ళిపోయావో!
ఓటమి
గెలుపునకు మెట్టు అని తెలియదా!
ఆ మాత్రానికే
అంత నిరాశ అయితే ఎలా!
చిన్నా!
పదిహేడేండ్ల మమకారాలను
పదినిముషాల్లో తుంచి పారేశావ్!
అమ్మానాన్నల కలల దీపానివి
ఆ కళ్ళల్లో చీకటి నింపే
పాపానికి ఒడిగట్టావ్!
అడ్డంకులెన్నో దాటి
సుదీర్ఘప్రయాణం చేసే
చీమ మనకాదర్శం.
పడిలేచే సముద్రకెరటం
మనకాచరణీయం.
అంతెందుకు…
అంత పెద్ద తుఫాను
అంతలోనే దిశ మార్చుకోలేదా!
అయితే
పోట్రాయే ఎదురొచ్చిందా…
ఏడు వచ్చేలుగా మార్చెయ్!
ఇంటర్మీడియట్ పెద్దలారా!
సున్నితత్వం కోల్పోయిన
యాంత్రిక అధికారులారా!
మీ ఎదుట ఉన్నవి
ఒట్టి కాగితాలు కావు
పచ్చ పచ్చని జీవితాలు.
తప్పు ఎవరిదని కాదు
ఎన్ని ప్రాణాలు రాలిపోతున్నయో!
ఇప్పుడందరం
కట్టగట్టుకొని ఏడుద్దామా!
నువ్వంటే నువ్వేనని
దుమ్మెత్తి పోసుకుందామా!
ఏం లాభం…
ఆ తల్లుల కన్నీళ్ళు
మనల్ని ముంచెయ్యక తప్పదు.