ముందుగా ఈ పుస్తకాన్ని నేను సమీక్షకు ఎంచుకోవడానికి కారణం ఇందులోని కథను మనుషులకు కూడా అప్లై చేసుకుని ఆలోచిస్తే కష్టాలు ఎదురైనప్పుడు యుక్తితో సమస్యల నుండి బయటపడాలి అంతే తప్ప నీరుకారి పోకూడదు అనే భావన.
కథ విషయానికి వస్తే ఢిల్లీలోని పెద్ద పోస్టాఫీసులో కొన్ని ఎలుకలు నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తూ
ఉండేవి. ఆఫీసు సమయంలో కలుగుల్లో ఉంటూ ఆఫీసు మూసివేసిన తర్వాత చెత్తబుట్టల్లోని పదార్థాలను తింటుండేవి. అయితే ఆ కుటుంబంలోని ఒక్క ‘చింకూ’ అనే ఎలుక మాత్రం తన అల్లరి చేష్టలతో ఆఫీసు సమయంలో కూడా బయటకు వచ్చి పనిచేసుకుంటున్న గుమస్తాల ప్యాంట్లలోకి దూరి వారిని ఆటపట్టిస్తుండేది. తల్లి వద్దని చెప్తూ నీవు ఇలా చేస్తే బోనులో పడతావు అన్నా వినిపించుకునేది కాదు. లేదమ్మా నేను బోనులో పడను అంటూ తల్లికి ధైర్యం చెప్పేవాడు చింకూ. ఒకసారి చలి తీవ్రంగా ఉంది. చింకూ కలుగు నుంచి బయటకు వచ్చి అక్కడి చెత్త బుట్టలోని ఆహార పదార్థాలు తిన్నాడు. ఇంకేముంది హాయిగా నిద్ర ముంచుకు వచ్చింది. కలుగులో బాగా చలిగా ఉంది, ఏదైనా ఉత్తరాల సంచిలో నిద్రపోతాను అనుకున్నాడు చింటూ.
ఒక సంచిలో దూరి నిద్రపోయాడు. ఎంతగా అంటే తల్లి, తండ్రి పిలిచినా కూడా వినిపించనంతగా! తెల్లారింది. గుమస్తాలు వచ్చారు. సంచులను వాహనంలో విమానాశ్రయానికి చేర్చారు. అవి సరాసరి లండన్‌లోని పెద్ద పోస్టాఫీసుకి చేరుకున్నాయి. అక్కడ
ఉత్తరాలను బైటికి వంచినప్పుడు మన చింకూ బయటకు వచ్చి ఆ గుమస్తా కాళ్ళ మధ్య నుండి బయటపడి అలమర కింద నక్కాడు. చుట్టూ కలియజూసిన చింకూకి తాను వేరే చోట ఉన్నట్లు అర్థమయ్యింది. ఉద్యోగస్థులందరూ వెళ్ళిపోయాక గది ఖాళీ అయ్యింది. చింకూకి బాగా ఆకలిగా ఉంది. అంతేకాక బాగా చలిగా కూడా ఉంది. అతనికి ఏమీ అర్థంకాక ఏడవసాగాడు. అప్పుడు మరొక అలమర కింద ఉన్న ఒక తెల్ల ఎలుక పిల్ల ‘మిస్సమ్మ’ ఇదంతా గమనిస్తూ చింకూ వద్దకు వెళ్ళి అతన్ని పరిచయం చేసుకుని, ధైర్యం చెప్పి అతన్ని ఆ క్లిష్ట పరిస్థితుల నుండి తప్పిస్తుంది. అదే దీనికి క్లైమాక్స్.
మిస్సమ్మ తన తెలివితో చింకూ వచ్చిన బ్యాగ్‌ను గుర్తుపట్టి అతన్ని తిరిగి తన దేశానికి పంపిస్తుంది.
ఈ కథలు చిన్న పిల్లల మనస్సులో ముద్రపడి వాళ్ళు పెద్దయ్యాక ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు బేలగా మారిపోకుండా ఒక్కసారి మనం చదివిన కథలో చిన్న చిన్న పాత్రలే ఎంతో తెలివితో ప్రవర్తించి పెద్ద పాత్రలకు బుద్ధి చెప్తున్నప్పుడు మనం ఎందుకు ఎటువంటి పరిస్థితినైనా ఎదిరించి ముందకు పోకూడదు అని ఆలోచించేలా ప్రోత్సహిస్తాయి. అందుకే బాల సాహిత్యం పిల్లలకు తల్లిలాంటి మేలు చేస్తుంది.
పిల్లలనే కాదు ఒక్కోసారి పెద్దలకు కూడా ఈ సాహితీ వాసనతో పెద్ద పుస్తకాలను చదవడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. అందరం అన్ని రకాల రచనలను ప్రోత్సహించి చదివి, అందులోని సారాన్ని, చదవని వారికి కూడా అర్థమయ్యేలా చెప్పడానికి మౌఖిక సాహిత్యంగా మలుచుకోవచ్చు. పుస్తకాన్ని మనకి దగ్గర చేసేవి చిత్రాలు. వాటిని చూడగానే కథకన్నా ముందు మనల్ని ఆకర్షించి కథ చదివేలా పురిగొల్పుతాయి.
ఈ పుస్తకంలోని చిత్రాలు కథకు సమాంతరంగా ఉండి మనల్ని ఆలోచింపచేస్తాయి.
చివరగా ఒక్క మాట సిబిటి వారి లోగోను కూడా పుస్తకాలతోనే సిబిటిగా చూపించి దానిపైన ”సున్నా”లా చుట్టి అది మెదడుగా అర్థం వచ్చేలా అర్థవంతంగా ఉంది.
పిల్లలను ఇటువంటి పుస్తకాలు కార్టూన్ నెట్వర్క్లా ఆకర్షించి చదివిస్తాయి. వాళ్ళ మెదళ్ళలో ఒక తార్కిక దృష్టి వైపు బీజాలు నాటడంలో పుస్తకాల పాత్ర కీలకమైనది. అనువాద రచయిత కె.సురేష్ గారి శైలి చాలా సరళంగా ఉంటూ కథకు ప్రాంతీయతను సమకూర్చింది. పిల్లలతో ఆసక్తిగా చదివించేలా ఉంది.