పొద్దన్నా పొడవనీరు
కొత్తబిచ్చగాళ్ళు
సొల్లువాగుళ్ళకు సిద్ధమై
బయల్దేరుతారు ప్రబుద్ధులు
రాలిపోతున్న తాళపత్రాల్లోంచి
కాలం చెల్లిన ముచ్చట్లనేరుకొచ్చి
ప్రాణం పోస్తూ… తరిస్తుంటారు
మా నట్టింటి పెట్టె సకిలించే
ఈ అశాస్త్రీయ జోరీగల హోరుకి
నా చెవులు నెత్తుటి కాలువలయి
రోమాలు నిక్కబొడుచు కుంటాయ్..!
ఇంతకీ…
నా జీవితాన్ని శాసించ వాడెవడూ…!?
ఆ కుత్సిత కుతంత్ర భావజాలం మీ మీద రుద్దేదెందుకు..!?
ముక్కుమూసుకుని పాదాలమీద మోకరిల్లాలట
పాతివ్రత్య ధర్మాలంటూ
వాడి పైత్యాన్నంతా రంగరించి
నా నెత్తిన పులిమేందుకు ఎన్ని పన్నాగాలో..!
పొద్దున్నే…
రంగులూ రాసులూ అంకెలూ ఉంగరాలూ అంటూ
రంకెలేస్తాడొకడు
గ్రహ దోషాలూ శని పీడల హరింపచేస్తానంటూ
ప్రేలాపనలతో వెర్రినటనలింకొకడివి…
మరైతే…
సరిహద్దున సైనికుడి
పహారా ఎందుకు…
తుపాకీ ఎందుకు…!!?
వీడి అష్టోత్తర పారాయణం ఉండగా…
నిజమే!
పుట్టుకతో కాదు
పుట్టక ముందునుంచే కొందరు వృద్ధులు
అడివి మనిషికన్నా అటేటు బుద్ధులు
వీడి పక్షపాత పంకిలానికి
పంగనామాల పూతలతో అవతరిస్తాడు.
వాడి
భయకంపిత హావ భావ వాగ్ధాటికి
నివ్వెరపోయి నిజమేననుకొన్న గొర్రెలు
ఎప్పటిలాగే
బురద బొందలోకి
మహద్భాగ్యమనుకొని జారుతాయి
ఇప్పుడు వాడు తిరోగమనానికి…
తొవ్వలేస్తున్నందుకు వెర్రినవ్వులతో
వెన్ను చరుచుకుంటాడు…!!