ఓ అమ్మాయీ…
పుట్టాక మెత్తటి పక్క మీద నిద్రపుచ్చగలిగే బ్రతుకుల కన్నా
ఒక్క చుక్క పాలు ఇవ్వలేని ఎండిన గుండెలున్న
తల్లులే ఎక్కువైన ఈ లోకంలో
అసలెందుకు పుట్టాలని ఒక్క నిమిషం ఆలోచించు
ఓ అమ్మాయీ…
అన్నదమ్ముల బ్రతుకులతో నిన్ను తూకమేసి
చదువులని లెక్కలేసి చూసి గుండెల మీద కుంపటిగా
నిన్ను ఖరీదు కట్టే అమ్మానాన్నల కడుపున
అసలెందుకు పుట్టాలని ఒక్క నిమిషం ఆలోచించు
ఓ అమ్మాయీ…
నీ నవ్వులు నువ్వు నవ్వుతుంటే అసూయ పడి
నిన్ను నిన్నుగా ఆమోదించలేని ఈ సమాజంలో
అసలెందుకు పుట్టాలని ఒక్క నిమిషం ఆలోచించు
ఓ అమ్మాయీ…
అడుగు బయట పెట్టగానే నీ నడకలకి పేరు పెడుతూ
తలపైకెత్తితే చాలు పొగరు నెత్తికెక్కిందని వంకలు పెడుతూ
పాత నియమాల సుద్దులు చెపుతూ నిన్ను దాస్యం చేయమనే ఈ ధర్మంలో
అసలెందుకు పుట్టాలని ఒక్క నిమిషం ఆలోచించు
ఓ అమ్మాయీ…
నీ వంపు సొంపులని తప్ప మనిషిగా నిన్ను చూడలేని
నువ్వెన్నడూ ఆడదానిగా తప్ప అమ్మగా తోచని
ఈ కిరాతక కీచక భారత పర్వంలో
అసలెందుకు పుట్టాలని ఒక్క నిమిషం ఆలోచించు
వద్దు… పుట్టవద్దు!
అక్కడే ఆగిపో…
కాదు… చచ్చిపో…
ఆ ఉమ్మ నీటిలోనే…
అమ్మ గర్భంలోనే…
మనిషి నుదుటి మీద మరణశాసనాన్ని లిఖిస్తూ!