ఇంకో ఘటన
ఉత్తర ప్రదేశ్‌లో
తెలంగాణ రాజధాని భాగ్యనగర్‌లో
జరిగిన దిశారెడ్డి గాయం పచ్చితనం
ఇంకా ఆరనేలేదు
పనిదానిపై అత్యాచారం… హత్య
మొదట్లో ఎవరిమీదైనా ఏదైనా
ఇలాంటి ఘటన కాగానే
పుంఖాను పుంఖాలుగా వ్యతిరేకతలు
దేశమంతా ఆందోళనలు, నిరసనలు
ఇప్పుడు
మన చర్మం బాగా దొడ్డయింది
స్పర్శా జ్ఞానం లేకుండా పోయింది
గిచ్చినా గుచ్చినా కూడా
కనీసం తెలుస్తలేదు
తన్నినా, గుద్దినా
సల్లంగ సేతులు తలకింద పెట్టుకుని
పండుడు అలవాటయింది
నిద్ర పట్టకపోయినా పట్టినట్టు నటించుడు
అలవాటయింది.
ఏడోళ్ళము ఆడనే ముడుసుకుంటున్నాం.
ఇట్లయితే
నాలుక కోసుడు, వెన్నెముక విరగ్గొట్టుడే కాదు
ఇంకా ఎన్నో ఘోరాలవుతాయి.
అయినయి కదా… ఏమన్నా ఆగినయా
హద్దు అదుపు ఏమన్నా ఉందా
ఆగడాల ఆపుదల, కనీసం తగ్గుదల
అయినా ఉందా…
లేదు కదా…
మహిళా ప్రజా సంఘాలంటారా
పాపం ముక్కుతూ మూల్గుతున్నాయి.
వాటి శక్తి సరిపోవటం లేదు
పుంజుకునే దారి లేదు.
ప్రజలకు దారీ తెన్ను కూడా లేకుండా ఉంది.
ఏ దుర్మార్గులు ఎక్కడికి ఎలా
వస్తారో… ఏ దౌర్జన్యం చేస్తారో
ఎవరికీ తెలియదు, తెలియటం లేదు
ఏమీ తెలియనివ్వడం లేదు.
ఎవరూ బాధ్యత తీసుకోవటం లేదు.
కాలయాపన, భయపెట్టడం
తాయిలాలు, ఆశలు…
ఎన్ని కేసులయినా మాఫీ.
అధికారాల చాటున అమానుషాలు
మానవత్వమున్నది మానవ జాతి
అంటారు కానీ
కరుడుకట్టిన మానవాధములే కదా
ఇవన్నీ జేసేది
కర్కశులైన కామాంధులే కదా
కసిగా పువ్వులను నేలరాల్చి నలిపేసేది
ఏమో… ఏమో
ఏమి చేయాలో తెలియటం లేదు
కవిత్వం రాసి, నిరసనదెల్పి
చేతులు దులుపుకుంటున్నామేమో
అని సిగ్గుగా అన్పిస్తుంది.
ఇంకా ఇంకా దిగజారిపోతున్న
ఈ ప్రజాస్వామ్య విలువల వ్యవస్థలో
న్యాయం కోసం
సముద్రంలో మనం
చేతులు పెట్టి వెతుకుతున్నామేమో…
ఇదీ లేకపోతే…